close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కలంకారీ... కొత్తదారి..!

కలంకారీ... కొత్తదారి..!

‘బతికి బట్ట కడితే అంతే చాలు’ అంటుంటారు. అయితే అది ఓ మనిషికే పరిమితం. అదే ఓ కళ బతికితే అది బట్ట రూపంలో మరెందరికో బతుకుతెరువుగా మారుతుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే కలంకారీ... అవసానదశకు చేరుకుని మళ్లీ కళకళలాడుతోన్న హస్త కళాచిత్రం. కళాకారుల చేతుల్లో రంగులద్దుకుని, ఫ్యాషన్‌ డిజైనర్ల చేతుల్లో కొత్త రూపును సంతరించుకుని, అంతర్జాతీయ వేదికలమీద వయ్యారాలు పోతూ వస్త్ర ప్రపంచంలోనే సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.

సోకు చూడతరమా..!
భారతీయ ఫ్యాషన్‌ డిజైన్లను పరిశీలిస్తే... రెండు దశాబ్దాల నుంచీ వాటిల్లో కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పల్లెదనం, సంప్రదాయం ఉట్టిపడే భారతీయ చేనేతలతోనూ హస్తకళలతోనూ ప్రయోగాలు చేయడం అప్పటినుంచే మొదలైంది. వాటిల్లో చెప్పుకోదగ్గది కలంకారీ. సవ్యసాచి, శశికాంత్‌ నాయుడు... వంటి వారంతా ఆ వస్త్రంతో కొత్త డిజైన్ల పరంపరను సృష్టిస్తుంటే, వాళ్ల అవసరాలకు దీటుగా ఆయా కళాకారులు సైతం కలంకారీ అందాలకి కొత్త మెరుపులు అద్దుతున్నారు. ఫలితం, వీధులనుంచి ర్యాంపులవరకూ యావత్‌ ఫ్యాషన్‌ ప్రపంచం కలంకారీకి నీరాజనం పడుతోంది.

అచ్చంగా కలంకారీ డిజైన్‌తోనే చేసిన దుస్తులు కొన్ని... అంచుల్లోనూ ప్యాచ్‌వర్కుల రూపంలోనూ డిజైన్‌ చేసేవి మరికొన్ని... ఇతర ఫ్యాబ్రిక్కులతో కలిపి డిజైన్‌ చేస్తున్నవి ఇంకొన్ని... ఇలా ఎందులోనయినా అందంగా ఒదిగిపోవడమే కలంకారీ ప్రత్యేకత. ప్యాంట్లూ, పల్లాజోలూ; చుడీదార్‌లూ అనార్కలీలూ; చీరలూ బ్లౌజులూ... ఇలా ఆధునిక, సంప్రదాయ దుస్తులన్నింటా కలంకారీ కళ కడుతోంది. అదే ఒకప్పుడు- దుప్పట్లూ బ్యాగులూ గోడకు అలంకరించుకునే వర్ణచిత్రాల్లో తప్ప కలంకారీ మరెక్కడా కనిపించేదే కాదు. కానీ నేడు కప్పులూ చెప్పులూ గాజులూ గొలుసులూ... ఇలా ఇందుగలదందు లేదు అన్న తరహాలో అన్నింటా కలంకారీ మెహర్బానీ పెరిగిపోయింది.

అసలేమిటీ కలంకారీ?
కలం అనేది పర్షియన్‌ పదం. అంటే పెన్ను. కారీ అంటే పనితనం. కలంతో వేసే చిత్రం కాబట్టి దీనికి కలంకారీ అనీ, అలా వేసేవాళ్లను కలంకారులూ అనీ పిలిచేవారు. పూర్వం కళాకారులు వూరూరా తిరుగుతూ రామాయణ, మహాభారత కావ్యాలనూ ఇతర పౌరాణిక కథనాలనూ మనసుకు హత్తుకునేలా చెప్పడంలో భాగంగా పుట్టుకొచ్చినదే కలంకారీ కళ. కథకు తగ్గ బొమ్మల్ని కలంతో వేసి వాటికి సహజరంగుల్ని అద్ది వాటి సాయంతో ఆ పురాణాన్ని వినిపించేవారు. మొఘల్‌ చక్రవర్తులు, గోల్కొండ సుల్తానుల కాలంలో ఈ కళకు అపూర్వమైన ఆదరణ ఉండేది. ఇలా వేసే చిత్రపటాల్ని దేవాలయాల్లో అలంకరించేవారు.

కలంకారీ అచ్చంగా తెలుగువారి కళ. పుట్టిల్లు ఆంధ్ర ప్రాంతంలోని మచిలీపట్నమే. పర్షియన్ల రాకతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటివరకూ కలంకారీలో అజంతా కుడ్యచిత్రాలను పోలిన బొమ్మలే ఎక్కువగా కనిపించేవి. ఆ తరవాతే పర్షియన్ల శైలిని ప్రతిబింబించే ఆకులూ పువ్వులూ తోడై కలంకారీ కళకు కొత్తందాలను తీసుకొచ్చాయి. ఆపై బ్రిటిష్‌ విధానాలవల్ల ఈ కళ దాదాపు అంతర్థానమై, పెడనలో వృద్ధిచెందింది. స్వాతంత్య్రానంతరం మళ్లీ బందరులో పునర్జీవితమైంది. సౌలభ్యంకోసం డిజైన్లను అచ్చులుగా రూపొందించుకుని వాటితో ముద్రించి, ఆపై సహజ రంగుల్ని అద్దడం పెడన, బందరు కళాకారుల ప్రత్యేకత. శ్రీకాళహస్తి ప్రాంతంలోని స్వర్ణముఖీ నదీతీరంలోని గ్రామాల్లోని కొన్ని కుటుంబాలు కూడా తరతరాలుగా ఈ కళనే నమ్ముకుని జీవిస్తున్నాయి. అక్కడ పెన్నుతో చిత్రాలను గీసి, రంగులద్దుతారు.

ఎలా చేస్తారు?
ఇదో సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ రంగుల అద్దకంలో 17 దశలుంటాయి. కాటన్‌, మల్బరీ, టస్సర్‌ సిల్కు వంటి వస్త్రాలను తీసుకుని ఒక రోజంతా నీళ్లలోనూ మరోరోజు పేడద్రావణంలో నానబెట్టి, పారే నీటిలో- ప్రధానంగా నదుల్లోనే జాడించి ఆరేస్తారు. దాంతో బట్టకు ఉన్న జిగురంతా పోతుంది. ఆపై కరక్కాయ ద్రావణంలో 20 నిమిషాలు నానబెట్టి, పాలు కలిపిన నీళ్లలో జాడిస్తారు. పాలల్లోని కొవ్వువల్ల బట్టకు రంగులు చక్కగా పడతాయి. బట్టమీద రంగుల డిజైన్లను రెండు దశలుగా ముద్రిస్తారు. మొదటిదశలో ఎరుపు లేదా నలుపు రంగుల్ని మాత్రమే వాడతారు. తరవాత మరగబెట్టిన జాజిఆకుల రసంలో నానబెడితే పాతరంగులమీద కొత్తగా వేసే రంగులు బాగా అతుక్కుంటాయి. రెండోసారి వేసే రంగులకోసం మరో చెక్క బ్లాక్‌ను వాడతారు. డిజైన్‌ వచ్చేవరకూ ఇలా వేస్తూనే ఉంటారు. కాళహస్తిలో అచ్చులకు బదులుగా చింత కొమ్మల్ని కాల్చగా వచ్చిన కొయ్యల్ని పెన్నుగా మలిచి వాటితో డిజైన్‌ గీసి; వెదురుపుల్లకు దూది చుట్టి, ఆపై దారాలతో కట్టి దాన్ని నల్లబెల్లం మరిగించిన నీళ్లలో ముంచి తీసి బ్రష్‌లా చేసుకుని రంగుల్ని అద్దుతారు. రంగులద్దడం పూర్తయ్యాక పటికపొడి ద్రావణంలో జాడించి, సబ్బునీళ్లలో ఉతికి ఆరబెడతారు. అలా కళకళలాడే కలంకారీ ప్రత్యక్షమవుతుంది.

అన్నీ సహజరంగులే..!
కలంకారీలో వాడే రంగులన్నీ సహజమైనవే. తుమ్మజిగురు, కరక్కాయ, నల్లబెల్లం, తుప్పుముక్కలు, దానిమ్మకాయల తొక్కలు... వంటి వాటినుంచి నలుపు, ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ... ఇలా పదిహేనురంగుల వరకూ తయారుచేసుకుంటారు. చేత్తో లేదా బ్లాకులతో రంగులద్దే ప్రక్రియలతో భారీస్థాయిలో కలంకారీ వస్త్రాలను రూపొందించడం కష్టం కావడంతో ఇటీవల స్క్రీన్‌ ప్రింటింగ్‌ లేదా ఇతర పద్ధతుల్లోనూ ముద్రిస్తున్నారు. ఏ పద్ధతిలో తయారైనా కలంకారీ డిజైన్లతో వస్త్రాలను రూపొందించడం డిజైనర్లకూ, వాటిని ధరించడం సెలెబ్రిటీలకూ సంపన్నులకూ ఓ స్టేటస్‌ సింబల్‌గా మారింది. దాంతో కాటన్‌, ఖాదీ, సిల్కు, కోటా... ఇలా అన్ని రకాల బట్టలమీదా కలంకారీ కళ కడుతోంది. అంతర్జాతీయ ఫ్యాషన్‌గా మారి కోట్ల రూపాయల్ని ఆర్జిస్తూ కళాకారుల్ని బతికిస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.