close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వెంగమాంబ ఉత్సవాలు చూతమురారండీ...

వెంగమాంబ ఉత్సవాలు చూతమురారండీ...

మానవ రూపంలో పుట్టి, పేరంటాలుగా వెలసి మెట్టప్రాంత వాసుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతోంది నర్రవాడ శ్రీవెంగమాంబ అమ్మవారు. మహిమాన్వితమైన ఆ తల్లికి ఏటా జూన్‌ నెలలో అంగరంగ వైభవంగా జరిపే బ్రహ్మోత్సవాలను చూడాలంటే రెండు కళ్లూ చాలవనే చెప్పాలి. లక్షలమంది హజరై మొక్కులు తీర్చుకునే ఈ వేడుక నేటి నుంచి మరో నాలుగు రోజులపాటు (15వ తేదీ వరకూ) జరగనుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దత్తలూరు మండలం నర్రవాడలో వెలసిన శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయ చరిత్ర ఈనాటిది కాదు. శ్రీ కృష్ణ దేవరాయల కాలం నుంచే ఇక్కడి అమ్మవారికి పూజలు జరుగుతున్నట్లు ఆధారాలున్నాయి. స్థానికులకు ఈ తల్లి అంటే ఎంతో నమ్మకం. అమ్మ ఆలయ చరిత్రను గొప్పగా చెప్పుకుంటారు. నర్రవాడ సమీపంలోని వడ్డిపాలేనికి చెందిన పచ్చవ వెంగమనాయుడు, సాయమ్మలకు వెంగమాంబ జన్మించింది. బాల్యం నుంచే దైవ చింతన కలిగిన ఆమెను నర్రవాడకు చెందిన వేమూరు గురవయ్యకు ఇచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. మెట్టినింటికెళ్లాక అత్తా ఆడబిడ్డలు బాధలు పెట్టినా సహించి, భర్త సోదరుడూ వృద్ధుడూ అంధుడైన బావ ముసలయ్యకు సేవలు చేస్తూ భర్త ప్రేమానురాగాలను పొందింది. భర్త గురవయ్య పశువులు మేపేందుకు రోజూ దగ్గర్లోని దొడ్డగడ్డ అడవికి వెళ్లేవాడు. ఓరోజు వెంగమాంబ కూడా తన స్నేహితురాళ్లతో కలసి అదే ప్రాంతానికి గడ్డికోసం వెళ్లగా కొందరు గజ దొంగలు వారిపైన దాడిచేశారు. అమ్మాయిలందరూ పెద్దగా కేకలు వేసేసరికి దగ్గర్లో ఉన్న గురవయ్య వచ్చి దొంగలతో తలపడి కొంతమందిని హతమార్చాడు. ఇంతలో తప్పించుకున్న ఓ దొంగ ఈటెను విసరగా అది గురవయ్య గుండెల్లోకి దూసుకుపోయింది. గాయపడిన అతడు అదే ఈటెతో దొంగను చంపి, తాను స్పృహ కోల్పోయాడు. వైద్యం చేయించినా మూడురోజుల వరకూ గురవయ్యలో కదలిక కనిపించలేదు. దాంతో వెంగమాంబ భర్తకు మృత్యువు సమీపించక ముందే తాను ముత్తయిదువగా అగ్నిప్రవేశం చెయ్యాలని భావించింది. కొన్ని క్షణాలకే ఆమె భర్త కూడా ప్రాణాలు వదలడంతో గ్రామ పెద్దలు ఆయన దేహాన్ని కూడా గుండం దగ్గరకు తీసుకొచ్చి దహనం చేశారు.

మహిమల తల్లి
తనువు చాలించిన అనంతరం వెంగమాంబ కొందరి కలలో కనిపించి తన మహిమను తెలపడంతో గ్రామస్థులు అగ్నిగుండం దగ్గరకు వెళ్లి చూడగా అందులో అన్నీ దహనమై చీరకొంగు, మంగళ సూత్రాలు మాత్రం అలాగే మిగిలాయట. దాంతో స్థానికులు ఆమెకు గుడి కట్టి పూజలు జరపడంతో పాటు ఏటా జ్యేష్ఠమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం నుంచి గురువారం వరకూ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు.

ఐదురోజుల పండుగ
బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడు లక్షలకు పైనే. వెంగమాంబ పుట్టిన వూరు వడ్డిపాలెంలోని పచ్చవవారి నివాసంలో జరిగే నిలుపు కార్యక్రమంతో మొదటిరోజు ఆదివారం వేడుక ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అక్కడి దేవాలయంలో వెంగమాంబ వంశస్థులూ భక్తులూ పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పసుపు కుంకుమలను వూరేగింపుగా దేవస్థానం వరకూ తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. సంతానం లేని మహిళలు అమ్మవారి ఆలయంలో వరపడితే(తడిబట్టలతో బోర్లా పడుకుని ప్రార్థించడం) సంతానం కలుగుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకంతోనే ఏటా ఉత్సవాల సమయంలో ఆలయంలో వరపడటం ఓ ఆనవాయితీ. రెండోరోజూ, మూడోరోజూ జరిగే గ్రామోత్సవ వేడుకల్లో భాగంగా వెంగమాంబ దంపతుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి గ్రామాల్లో వూరేగిస్తారు. దారి వెంబడి ప్రతి ఇంటి దగ్గరా భక్తులు ఆ తల్లికి కొబ్బరికాయా కానుకలూ సమర్పించుకుంటారు. నాలుగోరోజు అమ్మవారి పసుపు కుంకుమ ఉత్సవం, కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకకు దేవాదాయశాఖ వారు పట్టువస్త్రాలు సమర్పించడం ఓ సంప్రదాయం. ఆరోజు రాత్రి జరిగే ప్రధానోత్సవ(హంసవాహన సేవ) కార్యక్రమం, ఉత్సవమూర్తుల వూరేగింపుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటాయి. అయిదోరోజు గురువారం బండ్ల పొంగళ్లు, ఎడ్ల బండలాగుడు పందేలూ ప్రత్యేక ఆకర్షణలు. వివిధ గ్రామాల నుంచి ఉత్సవాలకు ఎడ్ల బండ్ల మీద వచ్చే భక్తులు పొంగలి వండి బండిలో పెట్టి, దాంతో గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. దాన్నే బండ్ల పొంగళ్ళుగా పిలుస్తారు. ఇక, రెండు ఎడ్లకు బండరాయిని కట్టి పరిగెత్తించే పందేలను చూడ్డానికి ఏటా లక్షలమంది వస్తుంటారు. నెల్లూరు, ఒంగోలు, కడపల నుంచి వెంగమాంబ దేవస్థానానికి చేరుకునేందుకు వివిధ మార్గాల్లో బస్సు సౌకర్యం ఉంది.

- ఓసూరి మురళీకృష్ణ, ఈనాడు, నెల్లూరు డెస్కు
చిత్రాలు: ఎస్‌కే ఖాదర్‌ మస్తాన్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.