close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పేరూరు... ఓ సాంస్కృతిక గ్రామం!

పేరూరు... ఓ సాంస్కృతిక గ్రామం! 

ప్రపంచం రోజురోజుకీ మారిపోతుంది. చేతిలోని సెల్‌ఫోను నుంచి నివసించే పల్లె వరకూ అన్నీ క్షణాల్లో మారిపోతున్నాయి. నిన్న ఉన్నట్లుగా నేడు, నేడు ఉన్నట్లు రేపూ ఉంటుందని చెప్పలేం. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలోని ఓ వూరు మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అలాగే ఉంటుంది. దాని పేరే పేరూరు... ఓ అందమైన సాంస్కృతిక గ్రామం..!

చుట్టూ పచ్చని కొబ్బరితోటలూ వాటి మధ్య పారే పిల్ల కాలువలూ ఆ మధ్యలో కుదురుగా కట్టిన పాతకాలంనాటి పెంకుటిళ్లూ ఎర్ర కంకర రోడ్లూ కాస్త దూరంలోనే గోదావరి పాయలూ ఇంకాస్త ముందుకు వెళితే సాగర జలాలూ... ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కనువిందు చేస్తుంటుంది తూర్పుగోదావరి జిల్లాలోని పేరూరు. క్రీ.శ. 11వ శతాబ్దం నుంచీ తన స్వరూపాన్ని కాస్త కూడా మార్చుకోకుండా పూర్వం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది. దీనికి కారణం ఆ వూరికి ఉన్న చరిత్రే అని చెబుతారు స్థానికులు.

చాళుక్యరాజైన రాజేంద్రచోళుడు, తన కుమార్తె అమ్మంగిదేవిని రాజమహేంద్రవర పాలకుడు రాజరాజనరేంద్రుడికి వివాహం చేసి, అత్తింటికి పంపే సమయంలో చీరసారెలతోబాటు 18 కుటుంబాలకు చెందిన వేదపండితులనూ పంపించాడట. అలా వచ్చినవాళ్లలో కొందరు ఆత్రేయపురం దగ్గర ఉన్న ర్యాలీ దగ్గర స్థిరపడితే, మరికొందరు అంబాజీపేట మండలానికి వెళ్లగా, ఇంకొందరు పేరూరుని ఆవాసంగా చేసుకున్నారట. తమిళనాడులోని పెరియా(పెద్ద)వూరు నుంచి వచ్చినవాళ్లు స్థిరపడినదే పేరూరు అనీ, అందుకే ఇక్కడి బ్రాహ్మల్ని పేరూరు ద్రావిడులు అంటారనీ చెబుతుంటారు.

మహామహులెందరో..!
నాటి పేరూరు- విశ్వేశ్వరుని, గున్నాపంతుల, పేరమ్మ, బుచ్చమ్మ, బండివారి... అని ఐదు అగ్రహారాలుగా ఉండేది. కాలక్రమంలో మిగిలినవి అమలాపురంలో కలిసిపోగా విశ్వేశ్వరుని, బండివారి అగ్రహారాలు మాత్రమే ప్రస్తుత పేరూరులో ఉన్నాయి. విశ్వేశ్వరుని అగ్రహారం మెరక, పల్లపు వీధులతో ప్రధాన గ్రామంలో ఉంది. ఇక్కడ 365 కుటుంబాలు నివసిస్తున్నాయి. వందలాదిమంది నిత్యాగ్నిహోత్రులు, నిత్యానుష్టానపరులు, వేదపండితులు, ఘనాపాఠీలు, శాస్త్రపండితులు... ఇక్కడ ఇప్పటికీ నివసిస్తున్నారు.

పంచ ప్రణాళిక!
ప్రకృతికి ఆటంకం కలగకుండా జీవించాలన్నదే ఆ వూరివారి ఆశయం. అందుకే నాటి అగ్రహారంలో మెరక, పల్లపు వీధులకు రెండు ప్రధాన రహదారుల్నీ; వాటిని విభజిస్తూ చిన్నపాటి అడ్డు దారుల్నీ నిర్మించారు. ఇళ్లన్నీ ఉత్తర-దక్షిణ దిక్కుల్లోనూ; రోడ్లు తూర్పు-పడమర దిక్కుల్లో నిర్మించడంతో గాలీవెలుతురూ చక్కగా ఉంటాయి. రోడ్డుకిరువైపులా ఐదేసి చొప్పున పంచకమనే పద్ధతిలో ఇళ్లు నిర్మించి ఉంటాయి. ప్రస్తుతం ఆ వూళ్లొ ఇంటికి ఒకరు చొప్పున అమెరికాలోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయినప్పటికీ వాళ్లెవరూ తమ ఇళ్లను మార్చి ఆధునికంగా కట్టించాలనుకోలేదు. వాటిని యథాతథంగా ఉంచేందుకే డబ్బును వెచ్చించడం వారి ప్రత్యేకత.

అలాగే భూగర్భజలాల పరిరక్షణ, తద్వారా ఉష్ణతాపం తగ్గుతుందన్న కారణంతోనే వూళ్లొ ఇంతకాలం తారు, సిమెంటు రోడ్లు వేసుకోలేదు(ఈమధ్యే కనీస సౌకర్యాల కల్పన పేరుతో ప్రభుత్వం గ్రామంలోని ప్రధాన రహదారుల్లో సిమెంటు రోడ్లు వేయడం ప్రారంభించింది). తాగడానికి పంచాయితీ నీటిని వాడుకున్నా ఇతర అవసరాలకు నేటికీ నాటి గిలక బావులనే వాడతారు. ప్రతిఇంటిలో ఈశాన్యం దిక్కున ఉన్న బావి దగ్గర ఇంకుడు గుంతను తవ్వారు. వాడిన నీరు మొక్కలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను కొట్టకూడదన్న నియమం పెట్టుకున్నారు.

గ్రామంలో దేవాలయాలకూ లోటు లేదు. వాటిల్లో నిత్యం ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దత్త, పుష్పగిరి, శృంగేరి, కంచి, హరిహర, విరూపాక్ష పీఠాలకు చెందిన ఆయా తరాల పీఠాధిపతులూ ఈ గ్రామంలోని దేవాలయాలను సందర్శించారు. ఈ వూరి విశిష్టతను గుర్తించిన ఎన్టీ రామారావు కూడా అనేకసార్లు ఆ ఆలయాలను సందర్శించారు. ఆ విషయం డైరీలో రాసుకోవడంతో అది చదివిన బాలకృష్ణ కూడా ఆ గ్రామానికి రెండుసార్లు వెళ్లారట. ‘అందుకే కౌశిక గోదావరీ పాయ తీరాన ఉన్న మా వూరంటే మాకెంతో ఇష్టం.

ఈ వూళ్లొ జన్మించడం పూర్వజన్మసుకృతం. ఇక్కడ మరణిస్తే, తదుపరి కార్యక్రమాలకోసం కాశీ కెళ్లాల్సిన అవసరం కూడా లేద’ని స్థానికులైన పేరి విశ్వనాథశర్మ ఎంతో గర్వంగా చెబుతారు. సమాజంలో ఆధునిక పోకడలు ఎన్ని వచ్చినా వారసత్వంగా వస్తోన్న ఇళ్లని కాపాడుకుంటూ తరాలనాటి తమ సంస్కృతిని కొనసాగిస్తోన్న పేరూరు... చెప్పుకోదగ్గ వూరే కదూ!

- విజయ్‌, న్యూస్‌టుడే, అమలాపురం

 

అడవిలో... ఆరోగ్య యాత్ర 

అడవికి వెళ్లండి... నెమ్మదిగా నడవండి... పంచేంద్రియాలనూ చేతనావస్థలో ఉంచండి... మొక్కల వాసనలను గాఢంగా ఆఘ్రాణించండి. పుప్పొడిని స్పృశించండి. ఆకుల రెపరెపలు వినండి. సీతాకోక చిలుకల రంగుల్ని పరిశీలించండి. గొంతువిప్పి పాడుకోండి... మొత్తంగా మైమరచిపోండి.

ఫారెస్ట్‌ థెరపీ అంటారు దీన్ని. జపనీయుల భాషలో షిన్రిన్‌- యొకు. దానికి అర్థం అడవి వాతావరణంలో స్నానించడం. జపాన్‌లో 1980వ దశకంలో మొదలైన ఈ అటవీ చికిత్స అక్కడి వైద్య చికిత్సల్లో ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌ విభాగంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. ఆ పరిశోధనా ఫలితాలను చూసిన నిపుణులు ఇప్పుడు దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనుసరింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అడవిలో ప్రకృతి సౌందర్యం గురించి మనకు తెలుసు. అది చూసి మైమరచే కదా కృష్ణశాస్త్రి ‘ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై ఈ అడవీ దాగిపోనా... ఎటులైనా ఇచటనే ఆగిపోనా...’ అని పాడుకున్నారు. ఒకప్పుడు గ్రామాలను ఆనుకునే అడవులు ఉండేవి. కట్టెలకోసం, వివిధ రకాల అటవీ ఉత్పత్తులకోసం అడవులపై ఆధారపడి జీవించేవాళ్లు. నిర్భయంగా అడవుల్లో తిరిగేవారు. ప్రకృతితో సహజీవనం చేసేవారు. కానీ పట్టణీకరణ పెరిగిన కొద్దీ అడవులకూ మనుషులకూ మధ్య దూరం పెరిగింది. వాటి పట్ల సగటు మనిషి దృక్పథం మారుతూ వచ్చింది. ఇప్పుడు అడవంటే క్రూరమృగాలుంటాయని మనిషికి భయం.

ప్రకృతి వైద్యశాల
జపాన్‌ వాళ్లు మాత్రం అడవిని ప్రకృతి సిద్ధమైన వైద్యశాలగా పరిగణిస్తున్నారు. అందులో ఉండే రకరకాల చెట్లు, వాటి నుంచి వెలువడే వాసనలు, నూనెలు, పుప్పొడి లాంటివి మనిషి మీద ఎంతో ప్రభావం చూపుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. షిన్రిన్‌ యొకు వెనక ఉన్న సూత్రం చాలా సాధారణమైనదే కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. సహజసిద్ధమైన అటవీ వాతావరణంలో పచ్చని ప్రకృతిలో మమేకమై నడుస్తూ ప్రశాంతంగా కాసేపు గడిపితే - అది మనసుకు ఎంతో సాంత్వననిస్తుందనీ మనశ్శరీరాలు పునరుత్తేజం పొందుతాయనీ ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో తిరిగి ఉద్యోగవ్యాపారాలు కొనసాగించవచ్చనీ జపనీయులు చెప్తున్నారు.

వాళ్లు చెప్తున్నదాన్ని బట్టి చూస్తే ఫారెస్ట్‌ బేతింగ్‌ వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. రక్తపోటు తగ్గుతుంది. ఒత్తిడి తగ్గి మనసు తేలికవుతుంది. అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ) లాంటి సమస్యతో బాధపడుతున్నవారిలో కూడా ఏకాగ్రత పెరుగుతుంది. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారూ శస్త్రచికిత్స చేయించుకున్నవారూ ఈ చికిత్స తర్వాత త్వరగా కోలుకుంటారు. నీరసం, నిరుత్సాహం తగ్గి చురుగ్గా తయారవుతారు. మంచి నిద్ర పడుతుంది. క్రమం తప్పకుండా ఈ అడవిలో నడకను సాధన చేస్తే ఇంకా చాలా లాభాలుంటాయి. పంచేంద్రియాలనూ ప్రకృతితో మమేకం చేసినప్పుడు అంతరాత్మ తేజోవంతమవుతుందనీ నిద్రాణంగా ఉన్న నైపుణ్యాలు వెల్లడవుతాయనీ పరిసరాలతో సాన్నిహిత్యం పెంచుకోగలుగుతారనీ నిపుణులు చెప్తున్నారు. దీని వల్ల బంధాలు బలపరచుకుని సంతోషంగా జీవించగలరన్నది వారి పరిశోధనల్లో తేలింది. ఈ పద్ధతి కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదనీ, దాదాపు అన్ని సంస్కృతుల్లోనూ అంతర్లీనంగా అడవులతో మమేకమై జీవించడమనేది ఒకప్పుడు ఉండేదనీ వారు గుర్తుచేస్తున్నారు.

గైడ్‌ల పర్యవేక్షణలో
జపాన్‌లో ఈ ఫారెస్ట్‌ వాక్‌లను నిర్వహించే సంస్థలున్నాయి. నడకకు అనువుగా ఉండే సహజమైన అడవులను నిపుణులు చూసి నిర్ణయిస్తారు. కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలాల్లో ప్రత్యేకంగా అడవులను పెంచుతున్నారు. ఫారెస్ట్‌ వాక్‌లో మార్గదర్శకత్వం వహించడానికి గైడ్‌లుంటారు. శిక్షణ పొందినవారికే గైడ్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. అడవిలోని మెత్తటి కాలిబాటపై నడక (వీలైతే పాదరక్షలు లేకుండా), కాసేపు ధ్యానం, మరికాసేపు బృందచర్చలు... ఇలా సాగుతాయి వారి కార్యక్రమాలు. ఏమాత్రం హడావుడి లేకుండా నెమ్మదిగా ఐదారు కిలోమీటర్లు నడవాలి. అడవిలో రకరకాల చెట్లు దట్టంగా ఉంటాయి. మహావృక్షాలు, పొడవాటిచెట్లు, పొదలు, గుబుర్లు... అన్నిటినీ గమనిస్తూ, ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలి. ఆకుపచ్చదనంలో ఉన్న లెక్కలేని ఛాయల్ని గుర్తిస్తూ ముందుకు సాగాలి. పక్షుల కూజితాలు, కీటకాల రొద, ఆకుల రెపరెపలు వినాలి. ప్రాతః కిరణాలు, పడమటి గాలులు శరీరాన్ని తాకనివ్వాలి. ఒక మోస్తరు వరకూ వర్షం వచ్చినా నడక ఆగదు. తడిసిన చెట్ల అందాలనూ ఆనందించాలిగా మరి! అప్పుడు మరో రకమైన వాతావరణం నెలకొంటుంది. గూళ్లకు చేరిన పక్షి జంటల వెచ్చని కువకువలు, ఆకు చివర్ల నుంచి రాలే నీటి చుక్కల సవ్వళ్లు, ఏ మూలనుంచో విన్పించే కీచురాళ్ల ఈలలు, నీటి చెలమల పక్కన కప్పల బెకబెకలు... ఏ భయాలూ, ఆందోళనలూ లేకుండా ఆ పరిస్థితులను ఆస్వాదించగలిగితే మనసుకు అంతకన్నా హాయినిచ్చేది ఏముంటుంది. ఒక్కరోజు వెళ్లివస్తే కాదు, వరసగా వారానికి ఓరోజు చొప్పున ఏడు వారాలు వెళ్లాలి. మూడో వారం నుంచీ మార్పు అర్థమైపోతుందంటారు నిపుణులు. అదే అటవీ స్నానం ప్రత్యేకత. వెళ్లి చూస్తారా మరి? అయితే ఒక్కమాట. మీరు వెళ్లాలనుకున్న అడవిలో క్రూరమృగాలేవీ ఉండవని రూఢీ చేసుకున్నాకే ఆ ధైర్యం చేయండి. ఒంటరిగా కాక కొందరు స్నేహితులతో కలిసి వెళ్లండి. అయితే వారితో సినిమాల గురించో, క్రికెట్‌ గురించో ముచ్చట్లలో పడిపోక ప్రకృతిని పరికించండి. తప్పకుండా ఫలితం లభిస్తుంది. జపనీయులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా షిన్రిన్‌ యొకు యాత్రలు నిర్వహించేందుకు గైడ్లకు శిక్షణ ఇస్తున్నారు. వీలైతే ఆ శిక్షణ కూడా పొందవచ్చు!


 

ఇది ఆక్సిజన్‌ పార్కు!