close
రమణి

రమణి
- గొల్లపూడి బాలసుబ్రహ్మణ్యం

ఎన్‌.టి.రామారావుగారికి వీరాభిమాని మా నాన్న. కొడుకు పుడితే కచ్చితంగా తారక రామారావు అనే పేరు పెడదామనుకున్నారట! కానీ నేను పుట్టడంతో కొంత మార్పుచేసి రమణి అని పెట్టారు. కానీ, నాన్న నన్నెప్పుడూ ‘రామా’ అనే పిలుస్తూంటారు.

మామూలు ఆడపిల్లలకంటే నాక్కొంచెం అందం ఎక్కువని అందరూ అంటూంటారు. బాగా గారాబంగా పెరిగినందువల్ల నాకు ఆత్మాభిమానం పాళ్ళూ ఎక్కువే! కానీ లోకులు దాన్ని పొగరు అంటున్నారు. కానీ నేనేమీ సినిమాల్లో, సీరియళ్ళలో హీరోయిన్లలాగా వేషాలేమీ వేయను. రమణి చాలా సింపుల్‌గా ఉంటుంది. అందులోనే అసలందం ఉంది.

సాఫ్ట్‌వేర్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, డాక్టర్‌ లాంటి ఎన్నో కోర్సులున్నా, నాకు పెద్ద ఇంటరెస్ట్‌ లేదు. అందుకే ఎం.కాం. చదివి స్టేట్‌బ్యాంక్‌లో ఉద్యోగం సంపాదించాను. అసలు నా ఉద్దేశ్యంలో ఈ రోజుల్లో గవర్నమెంట్‌ ఉద్యోగాలే ఉత్తమోత్తమం! నేను చేరాను కదా అని చెప్పట్లేదు... మంచి జీతాలు, ఉద్యోగ భద్రత, స్ట్రెస్‌ తక్కువ, పనిలో తక్కువ టెన్షన్‌, రిటైరయ్యాక బోలెడు పెన్షన్‌... ఇంకేం కావాలి? నేనైతే హ్యాపీ!

మొదటి పోస్టింగ్‌ వరంగల్‌లో ఇచ్చారు. పగలంతా బ్యాంక్‌లో పని విపరీతంగా ఉండేది. దాంతో రాత్రి రూమ్‌కెళ్ళి వాలిపోయేదాన్ని. హైదరాబాద్‌లో ఏ బాదరబందీ లేకుండా పెరిగినదాన్నేమో, ఇక్కడికి రాగానే నా జీవితం ‘పని’ అనే పంజరంలో చిక్కుకున్న చిలకలా మారిపోయింది. చూస్తూండగానే ఆర్నెల్లు గడిచిపోయాయి.

ఆరోజు నుంచీ నా జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుందని వూహించలేదు. ఆఫీస్‌ చేరగానే మేనేజర్‌ రామ్మూర్తి తన క్యాబిన్‌లోకి రమ్మని కబురు పంపాడు.

‘‘మే ఐ కమిన్‌ సార్‌...’’ ఆయన క్యాబిన్‌ తలుపు తట్టి అన్నాను.

‘‘రా రమణీ... కూర్చో. ఇతను అవినాష్‌ అని మన బ్రాంచ్‌లో చేరుతున్న ప్రొబేషనరి ఆఫీసరు. మీ సెక్షన్‌లోనే వేస్తున్నాను. ఇకనుంచి నువ్వూ, మీ సెక్షన్‌లోని ఆ మిగతా ముగ్గురూ ఇతనికే రిపోర్ట్‌ చేయాలి. ఇతనికి మీ డిపార్ట్‌మెంట్‌తోపాటు మిగతా బ్రాంచ్‌ అంతా పరిచయం చెయ్యి’’ అని అవినాష్‌ వైపు చూసి... ‘‘తను రమణి అని క్లర్క్‌. చేరి ఆర్నెల్లే అయినా వర్క్‌ త్వరగా నేర్చుకుని సిన్సియర్‌గా పనిచేస్తోంది’’ అని నా గురించి చెప్పాడు.

సన్నటి ముక్కు, తెల్లటి ముఖం, రింగుల జుట్టు... ‘అబ్బో, అబ్బాయి కాస్త ఫర్లేదే’ అనుకున్నా.

‘‘హలో రమణీ... నైస్‌ టు మీట్‌ యూ’’ అని కరచాలనం చేయడంతో ఆ గ్రిప్‌కి నా మనసు స్లిప్‌ అయ్యిందేమో అనిపించింది.

‘‘హలో సార్‌, రండి వెళ్దాం’’ అని అతన్ని బ్రాంచ్‌కి పరిచయం చేశాను. ఆ వయసు అబ్బాయిని ‘సార్‌’ అని పిలవడం బహుశా అదే మొదటిసారి.

* * *

తరవాత మూడు నెలల కాలంలోనే పనిమీద మంచి పట్టు సంపాదించాడు అవినాష్‌. ఒకే డిపార్ట్‌మెంట్‌ కావడంతో చాలా విషయాల్లో నా సహాయం తరచుగా తీసుకునేవాడు. సాధారణంగా నా అంత అందమైన అమ్మాయి సబార్టినేట్‌గా దొరికితే అడ్వాంటేజ్‌ తీసుకుని అడ్వాన్స్‌ అవుదామని చూస్తారు మగాళ్ళు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగట్లేదు. అవినాష్‌ ఎప్పుడూ తన సొంత విషయాల గురించి మాట్లాడడు. నా సొంత విషయాల గురించి అడిగిందీ లేదు. కేవలం ఆఫీసు పనివరకే పరిమితమై ఉండేది మామధ్య సంభాషణ. అందుకేనేమో, అతని మీద మనసు పారేసుకుంది ఈ రమణి. మరి రమణి మనసుపడితే అవినాష్‌ అయినా, అరవింద్‌స్వామి అయినా... పడి తీరాలన్నది నా కాన్సెప్ట్‌.

‘‘ఏమే రమణి, ఏమంటున్నాడు మీ బాస్‌! నీ చుట్టూనే భ్రమిస్తున్నాడు... బుట్టలో వేశావా లేదా?’’ ఒకరోజు ఉన్నట్టుండి అడిగింది కొలీగ్‌ లీల.

‘‘ఇంకా వన్‌వే ట్రాఫిక్కే! అవతల నుంచి ఇంకా ప్రతిస్పందన లేదు. నామటుకు నేను ప్రయత్నిస్తున్నాను’’ అన్నాను.

‘‘నేరుగా ప్రపోజ్‌ చేయలేకపోయావా? పోనీ నేను రాయబారం నడపనా?’’ అడిగింది లీల.

‘‘ప్రపోజా... సరేలే... మొన్నొకరోజు వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగితే తన బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌, ఏటీయం పిన్‌ అడిగినట్టు ఫీలయ్యాడు. అమ్మా, నాన్నా, అన్నా తను. అన్నకి పెళ్ళయ్యింది. అందరూ హైదరాబాద్‌లో ఉంటారు. ఇంతే... ఆ హీరో చెప్పింది’’ నవ్వుతూ అన్నాను.

‘‘ఇలా అయితే కథ ముందుకి సాగినట్టే!’’ నిట్టూరుస్తూ అంది లీల.

‘‘లాభంలేదు, రాబోయే వాలెంటైన్స్‌డే రోజు నేనే ధైర్యం చేసి అడిగేస్తా. సమయం లేదు మిత్రమా... ప్రణయమా... ప్రళయమా...’’ అని నవ్వుతూ అన్నాను సినిమా ఫక్కీలో.

కానీ, జీవితంలో అన్నీ నేననుకున్నట్టు జరగవనీ, ఆ తర్వాత కొన్ని వారాలకే నాకు అవగతమైంది.

‘‘నీకో షాకింగ్‌న్యూస్‌ రమణీ... అవినాష్‌కి పెళ్ళి కుదిరిందట! పైగా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖునే పెళ్ళట! అమ్మాయి హైదరాబాద్‌లో తన పక్కింటి అమ్మాయట! మొత్తానికి ఆ పరువాల పాపాయి నీ ప్రవరాఖ్యుణ్ణి ఎగరేసుకుపోతోంది. ఇందాకే అవినాష్‌, రామ్మూర్తి గారిని సెలవు అడుగుతూంటే విన్నాను. ఇప్పటికైనా నీ ప్రేమ గురించి చెప్పి చూడు. ఆ అమ్మాయిని పీటలమీద వదిలేసి నీ బాట నడిచి, పాట పాడేలా చేస్కో. లేదంటే నీకు జీవితాంతం టాటా చెప్పేస్తాడు’’ నేనేమాత్రం వూహించని కబురందిస్తూ అంది లీల.

నేనొకటనుకుంటే ఇంకొకటి జరగడం ఇదే మొదటిసారి జీవితంలో. నా అహం తీవ్రంగా దెబ్బతింది. నాకు నచ్చని పరిణామం అది.

‘‘మీకు పెళ్ళి కుదిరిందని విన్నాను. కంగ్రాట్స్‌. ఎవరా లక్కీగాళ్‌? ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందా?’’ వివరాలు అడిగాను అవినాష్‌ని.

‘‘మొన్న ఆదివారం ఎంగేజ్‌మెంట్‌ అయింది. తను ‘శోభన’ అని మా నైబర్‌. ఆర్కిటెక్ట్‌. చిన్నప్పట్నుంచీ పరిచయం. చాలా రోజులు పెద్దలు ఒప్పుకోరేమో అని భయం ఉండేది. కానీ పెద్దలే మాట్లాడుకుని సంబంధం ఖాయం చేశారు. అలా సుఖాంతం అయింది మా ప్రేమ కథ’’ వివరించాడు అవినాష్‌.

అలా వివరిస్తున్నప్పుడు అతని కళ్ళల్లో మెరుపు, బుగ్గల్లో సిగ్గు. అతను తన సొంత విషయం గురించి ఇంత వివరంగా మాట్లాడటం ఇదే మొదటిసారి.

అది విన్నాక తనమీద నాకున్న అభిమానాన్ని చెప్పాలనిపించలేదు. కానీ, నా జీవితంలో ఇంతవరకూ చూడని, ఎదురుపడని, పరిచయంలేని ఒక అమ్మాయి మీద కోపం, ద్వేషం, ఉక్రోషం కలుగుతున్నాయి. మంచి వేగంతో ప్రవహిస్తూ కళకళలాడే నదిలా ఉండే నా జీవితం ఒక్కసారిగా ఎండాకాలం చెరువులా మారిన భావన.

‘శోభనకి ఫోన్‌ చేసి నాకూ అవినాష్‌కూ లింక్‌ ఉందని చెప్తే?’

‘పోనీ, ఒక సీక్రెట్‌ లెటర్‌లో అవినాష్‌ క్యారెక్టర్‌ మంచిదికాదని వాళ్ళ అమ్మా నాన్నలకి రాసి పడేస్తే?’

‘ఆఫీసులో నా చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించి, ఇప్పుడింకో అమ్మాయితో పెళ్ళంటున్నాడని గోలచేసి రచ్చకీడిస్తే?’... ఇలా రకరకాల ఆలోచనలు నా బుర్రలో.

ఆరోజు నాకనిపించింది... టీవీ సీరియళ్ళలో చూపించే లేడీ విలన్‌ పాత్రలకీ నా ఆలోచనలకీ చాలా సారూప్యం ఉన్నదని.

* * *

ఆరోజు రానే వచ్చింది. వెళ్ళకూడదనుకుంటూనే వెళ్ళాను అవినాష్‌ పెళ్ళికి. శోభన కూడా దాదాపు నా అంత అందంగానే కనిపించింది. అతిథులతో పెళ్ళి మండపం నిండిపోయింది.

‘‘కంగ్రాట్స్‌, మీ ఇద్దరికీ’’ బొకే ఇస్తూ చెప్పాను. నావైపు చూసింది శోభన నవ్వుతూ. ఆ నవ్వులో నా ఓటమీ తన గెలుపూ కనిపించాయి నాకు.

‘‘సారీ రమణీ, ఇందాకే లీల చెప్పింది... నామీద మీకున్న ఫీలింగ్స్‌ని. మీరు ఇంత సీరియస్‌ ఈ విషయంలో అని నాకెప్పుడూ అనిపించలేదు. నేనెప్పుడూ ఆ దృష్టితో మిమ్మల్ని చూడలేదు. లేదంటే అప్పుడే చెప్పేవాడిని శోభన గురించి. మిమ్మల్ని నొప్పించి ఉంటే మళ్ళీ సారీ’’ అన్నాడు అవినాష్‌.

ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వచ్చేశాను ‘మీ వైవాహిక జీవితం సర్వనాశనం కావాలి... నా ఉసురు తగులుతుంది’ అని మనసులో అనుకుంటూ.

ఆ తరవాత నాలుగురోజులకి రామ్మూర్తిగారి ద్వారా తెలిసింది. హనీమూన్‌కని బయల్దేరిన అవినాష్‌వాళ్ళ కారు యాక్సిడెంట్‌కి గురి అయిందనీ, వాళ్ళిద్దరికీ దెబ్బలు తగిలి ఆస్పత్రిలో చేరారనీ. ఎందుకనో ఆరోజు రాత్రి చాలా హాయిగా నిద్రపట్టింది నాకు.

ఇరవైరోజుల తరవాత ఆఫీసుకి వచ్చాడు అవినాష్‌. ఎడమచేతికి ఇంకా కట్టు ఉంది. బహుశా చెయ్యి ఫ్రాక్చర్‌ అనుకుంటా. కమిలిపోయిన నుదురు, వాడిపోయిన వదనం... ‘పెళ్ళికళ వెలిగిపోతోంది మొహంలో’ మనసులో నవ్వుకుంటూ అనుకున్నాను.

‘‘శోభనగారికి ఎలా ఉంది?’’ అడిగాను.

‘‘కొంచెం ఫర్లేదు. నాకంటే ఎక్కువ తనకే తగిలాయి దెబ్బలు’’ తన గురించి అడక్కుండా నేరుగా వాళ్ళావిడ గురించి అడగటంతో ఆశ్చర్యపోతూ బదులిచ్చాడు అవినాష్‌.

అవినాష్‌లో మునుపటి ఉత్సాహం కనిపించలేదు నాకు. కొంచెం సీరియస్‌గా ఉండటం, ముభావంగా తిరగడం... కాపురం పెట్టకుండా ఒక్కడే ఉంటున్నాడు వరంగల్‌లో. నాకు జాలికంటే ఆనందమే ఎక్కువ కలుగుతోంది. అసలు కారణమేమిటో పూర్తిగా నాకు తెలియకపోయినా రమణిని కాదని తను చేసుకున్న పరిణయం ఇప్పుడు వ్రణమై గుచ్చుకుంటున్నట్టు అనిపించింది నాకు.

ప్రొబేషన్‌ పూర్తయిన అవినాష్‌ని వరంగల్‌ నుంచి కొట్టాయంకి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ‘కొడితే కేరళలో పడ్డాడు కుర్రాడు’ అనుకున్నా. ‘హైదరాబాద్‌ వదిలి వరంగల్‌కే రాని ఈయనగారి భార్య ఇప్పుడు కేరళకేం వెళ్తుందో’ అనుకున్నా.

నా జీవితంలో అవినాష్‌ అనే అధ్యాయం అక్కడితో ముగిసింది అనుకున్నా.

‘ఇంకెప్పుడూ నా జీవితంలో కనిపించకు మిస్టర్‌ అవినాష్‌. ఇలానే కారణం తెలియని దిగులుతో, వాడిపోయిన మొహంతో జీవితం గడిపేయి... నేను నీకంటే అందగాడినీ, ధనవంతుడినీ చేసుకుని హాయిగా గడిపేస్తాను’ కసికొద్దీ అనుకున్నాను.

* * *

అవినాష్‌ వెళ్ళిపోయిన ఎనిమిది నెలలకి నా పెళ్ళి రాకేష్‌తో జరిగింది. తర్వాత హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్‌. తర్వాత ఐదేళ్ళు గడిచిపోయాయి. అంతా బాగా జరుగుతోంది అనుకుంటున్న తరుణంలో ఆర్నెల్లక్రితం రాకేష్‌కి పెరాలసిస్‌ వచ్చి ఎడంవైపు భాగమంతా చచ్చుబడిపోయింది. తను ప్రస్తుతం మంచానికి పరిమితం. తనకి సంబంధించిన అన్ని పనులూ ఎవరైనా చేసిపెట్టాలి. నాకా పనులు చేయడమంటే అసహ్యం. అందుకే ఒక కేర్‌టేకర్‌ని నియమించాం. సడెన్‌గా జీవితం ఆగిపోయిందేమో అనిపిస్తోంది. మునపట్లా బయటకెళ్ళడం లేదు, సరదాలు లేవు, షికార్లు లేవు. ఇక జీవితాంతం ఇంతేనా అని ఆలోచిస్తే చెప్పలేనంత దిగులుగా ఉంది. ఎలాగూ పిల్లలు లేరు కాబట్టి తనకి విడాకులిచ్చి, ఇంకెవర్నయినా పెళ్ళి చేసుకోమన్న పక్క సీటు ఆమని సలహా సబబుగా ఉందని అనిపిస్తోంది. అదే విషయం రాకేష్‌తో అన్నాను. తను ఒప్పుకోలేదు. ఇక లీగల్‌గా విడాకులు కోరాలనుకుంటున్నా.

మెల్లగా... నిద్రకోసం నిద్రమాత్రల మీద ఆధారపడటం అలవాటవుతోంది. బహుశా జీవితంలో ఎదురయ్యే విషయాలనే సినిమాలుగా, టీవీ సీరియళ్ళుగా తీస్తారేమో! నా జీవితం సినిమా కథలా నడుస్తోంది.

‘‘రమణీ, మన బాస్‌ జగన్నాథం గారికి జంగారెడ్డిగూడెం ట్రాన్స్‌ఫర్‌ అయింది, ఆయన ప్లేస్‌లో ఎవరో అవినాష్‌ అని కొట్టాయం నుంచి వస్తున్నారుట’’ అని పక్కసీటు ఆమని అన్నప్పుడు ఆ విషయం రూఢీ అయింది.

ఒక్కసారి కుదిపినట్టయ్యాను. ఏ వ్యక్తినయితే మళ్ళీ జీవితంలో చూడకూడదు అనుకుని మర్చిపోయానో, నేనున్న ప్రస్తుత పరిస్థితులలో మళ్ళీ తను నాకు తారసపడబోతున్నాడు. నా అసహనం మరింత పెరిగింది.

పది రోజుల తరవాత వచ్చాడు అవినాష్‌... గడ్డం, మీసాలు, బలపంరంగు ప్యాంటు మీద క్రీంకలర్‌ షర్ట్‌, టైతో మునపట్లాగే ఆకర్షణీయంగా ఉన్నాడు.

‘‘భలే ఉన్నాడే బాసు...’’ గుసగుసగా నా చెవిలో అంది ఆమని.

‘‘హలో రమణీ... వ్వాట్‌ ఏ సర్‌ప్రైజ్‌... మీరు ఈ బ్రాంచ్‌లో ఉన్నారా? వెరీగుడ్‌’’ అని తనే నా దగ్గరికి వచ్చి పలకరించాడు.

‘‘అవును అవినాష్‌. మీరెలా ఉన్నారు? కొట్టాయం వెళ్ళాక మళ్ళీ టచ్‌లో లేరు’’ ఆమని నావైపు ఆశ్చర్యంగా చూస్తూంటే అన్నాను.

‘‘అయాం ఫైన్‌... మీకు పెళ్ళయిందా? మీవారేం చేస్తుంటారు?’’ ఎప్పుడూలేనిది అవినాష్‌ పర్సనల్‌ విషయాల మీద కల్పించుకుని మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది నాకు.

‘‘మావారు ఇక్కడ ఫుడ్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తారు’’ అని పొడిపొడిగా బదులిచ్చాను.

‘‘శోభనగారెలా ఉన్నారు? మీ పిల్లలేం చదువుతున్నారు?’’ ఎంత వద్దనుకున్నా అడిగాను.

‘‘తను బానే ఉంది... మాకు పిల్లలు లేరు’’ ముభావంగా బదులిచ్చాడు అవినాష్‌.

‘‘మీరేమీ మారలేదు అవినాష్‌... పర్సనల్‌ ప్రశ్నలకి మీరెప్పుడూ క్లుప్త సమాధానాలే’’ అన్నాను. నవ్వి వూరుకున్నాడు తను.

‘‘మీ పెళ్ళయిన తర్వాత మళ్ళీ మిమ్మల్నిద్దర్నీ కలవలేదు. మీ సామానంతా వచ్చి, మీరిక్కడ సెటిలవడానికి టైమ్‌ పడుతుంది. ఈ ఆదివారం మా ఇంటికి భోజనానికి రండి’’ అని ఆహ్వానించాను. శోభన ఎలా ఉందో చూడాలని నా అసలు ఆశయం.

‘‘అయ్యో... మీకెందుకు శ్రమ? పిలిచినందుకు థ్యాంక్స్‌. శోభనకి కొంచెం మొహమాటం ఎక్కువ. పైగా మా ఇద్దరిదీ ఇదే వూరు కదా... మావాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. సో, ప్రాబ్లమేమీ లేదు. తరవాత ఎప్పుడైనా చూద్దాం’’ అన్నాడు అవినాష్‌.

* * *

‘‘ఓహ్‌ రమణీ... మీరా... ఇక్కడా! కమిన్‌ ప్లీజ్‌’’ నన్ను వాళ్ళింట్లో చూసి ఆశ్చర్యంగా ఆహ్వానించాడు అవినాష్‌.

‘‘ఈవైపుగా వెళ్తూ, మీ ఇల్లు కనిపిస్తే పలకరించడానికి వచ్చాను’’ అని అబద్ధం చెప్పాను. అసలు నేను బయలుదేరింది వాళ్ళ కాపురం ఎలా ఉందో, ఆ శోభన ఎంత సుఖపడుతుందో చూసి, నా విడాకుల కోసం లాయర్‌ని కలుద్దామని.

తన తల్లిదండ్రులను పరిచయం చేశాడు అవినాష్‌. ఆ తరవాత హాల్లోకి మెల్లగా వచ్చింది శోభన... చేతికర్రల సహాయంతో. మొహంలో అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. మనిషి కాస్త నీరసంగా కనిపిస్తున్నా... కళ్ళల్లో ఏదో తృప్తీ, ఆనందం కనిపిస్తున్నాయి. నాలో ఏదో తెలియని అసహనం... ‘ఈవిడ కర్రలు పట్టుకు నడుస్తోంది ఎందుకు? బాత్‌రూమ్‌లో జారిపడిందా... ఇంకేమైనా ప్రాబ్లమా?’ అనుకుంటూ ఉండగా నా పక్కకి వచ్చి కూర్చుంది.

‘‘ఎలా ఉన్నారు రమణీ... మిమ్మల్ని చాలాసార్లు తలుచుకుంటూ ఉండేదాన్ని’’ ఆప్యాయంగా పలకరించింది నన్ను.

‘ఈవిడ నన్నెందుకు తలుచుకునేది? మాకు పరిచయమే లేదే! కేవలం పెళ్ళిలో ఒక ఐదు నిమిషాలు చూసుంటుంది నన్ను. మరి ఏ విషయంలో తలుచుకునేది నన్ను?’ నాలో ప్రశ్నల ప్రవాహం. కానీ, వూహించని విధంగా సమాధానాలు అవినాష్‌ దగ్గర్నుంచి వచ్చాయి.

‘‘మేము హనీమూన్‌కి బయల్దేరినప్పుడు జరిగిన ప్రమాదంలో తన వెన్నుపూసకి బలమైన గాయం తగిలి నడుం కింది భాగమంతా చచ్చుబడిపోయింది. అల్లోపతి వైద్యులు ఇక జీవితాంతం అంతేనన్నారు. ఆయుర్వేదంలో పరిష్కారం దొరకొచ్చని కనుక్కున్నాను. రిక్వెస్ట్‌ చేసి కొట్టాయం పోస్టింగ్‌ వేయించుకున్నాను’’ అని అవినాష్‌ చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూండిపోయాను.

‘‘మొదట్లో ఆ వైద్యం మీద నమ్మకం కుదరలేదు. మా పెళ్ళిలో అవినాష్‌ మీతో మాట్లాడుతున్నప్పుడు వెనుకనుంచి విన్నాను. అతనిమీద మీకున్న అభిమానం అర్థమైంది. నేను తనని జీవితాంతం సుఖపెట్టలేనని అర్థమయ్యాక, నావల్ల తన జీవితం నాశనం కాకూడదని నాకు విడాకులివ్వమన్నాను. పైగా మీతో నేనే స్వయంగా మాట్లాడి మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇద్దరికీ పెళ్ళి కుదురుస్తానన్నాను. తను ససేమిరా అన్నాడు. నన్ను పసిపిల్లలా చూసుకున్నారు. నాకోసం జీవితంలో సరదాలన్నీ మానుకున్నారు. ఆఫీసు, ఆయుర్వేదం ఆస్పత్రి, ఇంట్లో నాకు మసాజ్‌ చేయడం, నన్ను అటూ ఇటూ తీసుకెళ్ళడం... మొదటి నాలుగేళ్ళూ అలా గడిచిపోయాయి’’ గతం తలుచుకుంటూ అంది శోభన.

‘‘నా ప్రయత్నం వృథా పోలేదు రమణీ. ఒక ఏడాది నుంచి చాలా ఇంప్రూవ్‌మెంట్‌ కనిపిస్తోంది. మెల్లగా వైద్యానికి స్పందిస్తోంది. చక్రాల కుర్చీకి పరిమితమైన తన జీవితం ఇప్పుడు చేతికర్రల సాయంతో నడిచే వరకూ వచ్చింది. ‘ఇంకో ఏడాదిలో తను మళ్ళీ మామూలు మనిషవుతుంది’ అని డాక్టర్‌ చెప్పారు. తనకి చేయవలసిన మసాజ్‌లన్నీ ఇప్పుడు నాకు తెలుసు. నేనే స్వయంగా చేస్తాను. మనవాళ్ళ మధ్యకి వస్తే ఇంకొంచెం త్వరగా కోలుకుంటుందని ఇక్కడికి వచ్చేశాం’’ నా చేతికి కాఫీ కప్పు అందిస్తూ అన్నాడు అవినాష్‌.

ఛెళ్ళున చెంపదెబ్బ తిన్నట్టయింది నాకు. మనసుపడ్డ వాడి కాపురం మసి కావాలనుకున్నాను... మనువాడినవాడు మంచాన పడితే తెగతెంపులు చేసుకుందామని సిద్ధపడుతున్నాను. ఇంత సంకుచిత భావాలున్న నాకు మేలు చేయాలని నాకసలు పరిచయమేలేని శోభన భావించింది. నా ఆత్మాభిమానం పేరుతో కేవలం నేనే బాగుండాలని కోరుకున్నాను. నాకు నచ్చినట్లు జరగడమే జీవితం అనుకున్నాను. కాదు, పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం మలుచుకోవడమే జీవితమని ఇప్పుడర్థమైంది. త్యాగం, సహనం, సేవలతో కూడిన అభిమానమే అసలైన ప్రేమని నాకు తెలిసొచ్చింది.

‘‘మళ్ళీ వస్తాను’’ అని కాఫీ కప్పు పక్కనబెట్టి వెంటనే అక్కడ్నుంచి బయల్దేరాను... లాయర్‌ దగ్గరికి కాదు, రాకేష్‌ దగ్గరికి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.