close
ఈ తారలు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

ఈ తారలు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..? 

కొందరు తారలు ఒక్క సినిమాలో కనిపించినా చెరిగిపోని ముద్ర వేస్తారు. కొందరు నటీనటులు తెరమరుగై ఏళ్లు గడిచినా అభిమానుల మనసు పొరల్లో నిలిచే ఉంటారు. ఒకప్పటి నటి గిరిజా షెట్టర్‌, సర్వదమన్‌ బెనర్జీ, మంజునాథ్‌, మాధవి, అన్షు, రవళి, మీనాక్షీ శేషాద్రి, రక్షిత... లాంటి తారలు ఆ కోవకు చెందినవారే. ఇంతకీ వాళ్లు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారో తెలుసా...

పీ ఆర్‌ ప్రొఫెషనల్‌... మంజునాథ్‌ 

పాతికేళ్ల కిందట దర్శకుడు కె.విశ్వనాథ్‌ తీసిన ‘స్వాతి కిరణం’ చిత్రంలో హీరో మమ్ముట్టి. కానీ అతని కన్నా ఎక్కువ పేరొచ్చింది ఆ చిత్రంలో గంగాధరం పాత్ర పోషించిన కుర్రాడు మంజునాథ్‌కే. బెంగళూరుకి చెందిన ఈ కుర్రాడు కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాల్లో నటించాడు. 19ఏళ్ల వయసులో చదువుకోసం నటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటూ సొంతంగా పీ ఆర్‌ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నాడు. బెంగళూరు-మైసూర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ ప్రాజెక్టుకూ పనిచేస్తున్నాడు. కర్ణాటకకు చెందిన అథ్లెట్‌ స్వర్ణరేఖను పెళ్లిచేసుకున్న మంజునాథ్‌కి ఓ బాబు కూడా ఉన్నాడు.

ఫ్యాషన్‌ డిజైనర్‌... అన్షు 

కెమేరామెన్‌ కబీర్‌ లాల్‌ ద్వారా దర్శకుడు విజయభాస్కర్‌కి పరిచయమైన అన్షు అంబానీ పదిహేనేళ్ల కిందట విడుదలైన ‘మన్మథుడు’ చిత్రంలో రెండో హీరోయిన్‌గా ఎంపికైంది. తొలిచిత్రం ద్వారానే ఎంతో గుర్తింపు పొందిన అన్షు- ప్రభాస్‌ సరసన ‘రాఘవేంద్ర’ సినిమాలోనూ నటించింది. ఆ తర్వాత ఉన్నట్లుండి తెరమరుగైంది. అయితే, ప్రస్తుతం లండన్‌లో ఆమె నడుపుతున్న డిజైనర్‌ దుస్తుల దుకాణం ‘ఇన్‌స్పిరేషన్‌ కటొర్‌’కు స్థానికంగా ఉన్న భారతీయుల్లో ప్రాచుర్యం రావడంతో అన్షు ఎక్కడుందన్న విషయం తెరమీదికొచ్చింది. లండన్‌లోనే పుట్టి పెరిగిన అన్షు అక్కడే ఉంటున్న సచిన్‌ అనే వ్యాపారిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఈమధ్యే ఆమెకు ఓ పాప కూడా పుట్టింది. ఫ్యాషన్‌ డిజైనర్‌గా సంప్రదాయ భారతీయ దుస్తుల్ని రూపొందించడంతో పాటు బాలీవుడ్‌ తారలు వేసుకున్న దుస్తుల్ని పోలిన డిజైన్లనూ రూపొందించి అమ్ముతోంది అన్షు.

జర్నలిస్ట్‌... గిరిజా షెట్టర్‌

నాగార్జున ‘గీతాంజలి’ సినిమా తెలుగు చిత్రసీమలో ఓ అద్భుతమైన ప్రేమ కావ్యం. ఆ కథే కాదు అందులో హీరోయిన్‌ పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా చాలా ప్రత్యేకం. ఆ పాత్రకు ప్రాణం పోసి సినీ అభిమానుల మదిలో నిలిచిపోయింది నాయిక ‘గిరిజా షెట్టర్‌’. ఆమె పుట్టి పెరిగింది బ్రిటన్‌లోని ఆర్సెట్‌లో. గిరిజ తండ్రి కన్నడిగుడు. తల్లి ఆంగ్లేయురాలు. చదువైపోయాక భరతనాట్యం నేర్చుకోవడానికి భారత్‌ వచ్చింది. ఆ సమయంలో మణిరత్నం గీతాంజలి చిత్రంలో అవకాశం రావడంతో నటించింది. కానీ తర్వాత ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లడంతో నటనకు స్వస్తి చెప్పి పుదుచ్చేరీలోని శ్రీ అరబిందో ఆశ్రమంలో చేరింది. ‘ఇంటెగ్రల్‌ యోగా ఫిలాసఫీ, ఇండియన్‌ స్పిరుచ్యువల్‌ సైకాలజీ’ అంశాలమీద 2003లో కార్డిఫ్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ కూడా అందుకుంది గిరిజ. ప్రస్తుతం లండన్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తోంది. రచయితగా కొన్ని పుస్తకాలూ రాసింది. ఇప్పటికీ తీరిక దొరికితే అరబిందో ఆశ్రమంలో గడిపేందుకు పుదుచ్చేరి వస్తుంటుంది.

డాన్స్‌ టీచర్‌... మీనాక్షీ శేషాద్రి

పద్బాంధవుడు చిత్రంలో చిరంజీవి సరసన నటించిన హీరోయిన్‌ ‘మీనాక్షీ శేషాద్రి’ గుర్తుందా... ఆ సినిమానూ ఆ నటననూ ఎవరు మర్చిపోగలరు..! నిజానికి మీనాక్షి తెలుగులో రెండు సినిమాల్లోనే నటించింది కానీ హిందీలో ఎంతో పేరున్న నటి. వ్యాపారవేత్త అయిన హరీష్‌ మైసూర్‌ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం టెక్సాస్‌లో ఉంటున్న మీనాక్షి ‘చెరిష్‌’ పేరుతో డాన్స్‌ స్కూల్‌ని నడుపుతూ భారతీయ సంప్రదాయ నృత్యాలను నేర్పుతోంది. సినిమాల్లోకి వచ్చేసరికే మీనాక్షికి భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్‌లలో ఎంతో ప్రావీణ్యం ఉంది. వీలైనప్పుడల్లా తన శిష్యులతో కలసి నాట్య ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి వాటిని సేవాకార్యక్రమాలకూ ఉపయోగిస్తోంది. మీనాక్షికి ముగ్గురు పిల్లలు.

ధ్యాన బోధకుడు... సర్వదమన్‌ బెనర్జీ

సిరివెన్నెల సినిమాలో అంధుడైన ఫ్లూటిస్ట్‌గా సర్వదమన్‌ బెనర్జీ పోషించిన పాత్రను ఆ సినిమా చూసినవారెవ్వరూ మర్చిపోలేరు. దూరదర్శన్‌లో వచ్చిన రామానంద్‌ సాగర్‌ ‘కృష్ణ’ సీరియల్‌లో శ్రీ కృష్ణుడిగానూ దేశం మొత్తానికీ ఆయన సుపరిచితుడు. ఉత్తరాదిలో ఇప్పటికీ చాలామంది సర్వదమన్‌ని ‘కృష్ణ’ అనే పిలుస్తారు. విచిత్రం ఏంటంటే ఆ సీరియల్‌లో కృష్ణుడిగా నటించినప్పట్నుంచీ ఆయన పూర్తిగా కృష్ణతత్వంలోకీ ఆధ్యాత్మిక చింతనలోకీ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌లో స్థిరపడి ధ్యాన బోధన చేస్తున్నారు. పేద పిల్లల్ని చదివించే ‘పంఖ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచేస్తూ సొంత ఖర్చులతో కొందరు విద్యార్థులనూ చదివిస్తున్నారు సర్వదమన్‌.

రాజకీయ నాయకురాలు... రక్షిత

ప్రముఖ కన్నడ సినిమాటోగ్రాఫర్‌ బీసీ గౌరీశంకర్‌ కూతురైన రక్షిత ‘ఇడియట్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత నిజం, శివమణి, ఆంధ్రావాలా... లాంటి సినిమాల్లోనూ నటించింది. కన్నడలోనూ చాలా సినిమాలు చేసిన రక్షిత కన్నడ దర్శకుడు ప్రేమ్‌ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. తర్వాత ‘ప్రేమ్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌తో నిర్మాతగా మారి కొన్ని సినిమాలనూ తీసింది. 2012లో కర్ణాటకలోని బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరి, రాజకీయాల్లోకి దిగిన రక్షిత 2014లో భారతీయ జనతా పార్టీలో చేరింది.

వ్యాపారవేత్త... మాధవి

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మాధవి పదిహేడేళ్ల సినీ జీవితంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఒరియా భాషల్లో మూడొందల చిత్రాల్లో నటించింది. 1980ల్లో టాలీవుడ్‌ బాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఆమె కూడా ఒకరు. ఆధ్యాత్మిక గురువు ‘స్వామి రామ’ సూచనమేరకు ఆయన శిష్యుల్లో ఒకడైన రాల్‌ü్ఫశర్మను 1996లో పెళ్లి చేసుకుంది మాధవి. జర్మన్‌ భారతీయ మూలాలున్న తల్లిదండ్రులకు జన్మించిన అతడు అమెరికాలో ఫార్మాస్యూటికల్‌ వ్యాపారి. ప్రస్తుతం మాధవి భర్త, ముగ్గురు కూతుళ్లు టిఫనీ, ప్రిసిల్లా, ఇవ్లిన్‌లతో కలసి న్యూజెర్సీలో ఉంటోంది. కుటుంబ బాధ్యతలతో పాటు భర్త వ్యాపారాన్నీ చూసుకుంటోంది.

గృహిణి... రవళి!

ఆంధ్రప్రదేశ్‌, గుడివాడలో పుట్టిన రవళి తమిళ చిత్రంతో 1992లో తెరంగేట్రం చేసింది. ‘అలీబాబా అరడజను దొంగలు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రవళి ‘పెళ్లి సందడి’ చిత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తర్వాత రాముడొచ్చాడు, శుభాకాంక్షలు... లాంటి సినిమాల్లోనూ తమిళ, కన్నడ సినిమాల్లోనూ మెరిసింది. 2006లో స్టాలిన్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన రవళి తర్వాత పెళ్లి చేసుకుని తెరమరుగైంది. ప్రస్తుతం ఆమె కూతుర్ని పెంచుతూ గృహిణిగా స్థిరపడింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.