close
నా ­వూరూ... నావాళ్ళూ...

నా ­వూరూ... నావాళ్ళూ...
- కన్నెగంటి అనసూయ

మ్మమ్మా... ఏం చేస్తున్నావ్‌! అన్నట్టు ఇప్పుడు శీతాకాలం కదా! బహుశా, తాతయ్య మోకాళ్ళమీద కింద కూర్చుని గులకరాయికి పురికొసతాడు కట్టి అందిస్తుంటే దానిని పొట్లపాదుక్కాసిన పొట్లకాయ పిందెలు వంకర లేకుండా పొడుగ్గా పెరగాలని వాటి తోకలకి ముడేస్తూనో... చిక్కగా అలుముకున్న మంచుపొగలో చిక్కుడుపాదుకి పేను పడితే గమాక్సిన్‌ చల్లుతూనో... లేదంటే తాత భుజాన కావిడేసుకుని పొలాన్నించి తెచ్చిన పాలను పిడకల పొయ్యి మీదుంచి పక్కనే కూర్చుని కొరకంచుతో ఎగదోస్తూనో... అప్పటికే పిడకల పొయ్యిలో కాల్చి పక్కన పెట్టిన తేగ తొక్కలు తీసి రెండు బద్దలుగా చేసి చందమామను తీసేసి, బొడ్డూ కొసలూ విరిచేసి, వేడివేడి ఆవిర్లొస్తున్న చిన్నచిన్న తేగముక్కల్ని ఎండలో కూర్చుని చలి కాగుతున్న తాతకి అందిస్తూనో ఉండి ఉంటావ్‌. అవునా!

అన్నట్టు... తేగలంటే గుర్తొచ్చింది!

తాత పాలకావిడితోపాటు, చెట్టుమీద నుంచి కిందపడ్డ తాటిపండు మొప్పల్లోకి దూర్చి తీసిన తాటినార తాడుని లాగి ముడేసి కావిడికి వేళ్ళాడేసి తెచ్చేవాడు ఈ రోజుల్లోనే కదా అమ్మమ్మా.!

వంటంతా అయిపోయాక, కడిగిన తాటిపండుని చింతనిప్పుల మీద ఉంచి నీ పని నువ్వు చేసుకుంటూ మధ్యమధ్యలో పొయ్యి దగ్గరకొచ్చి తాటిపండుని తిరగేసి, బోర్లేసి నిప్పులమీద కాల్చేదానివి.

అలా కాలుతుంటే పల్చబడ్డ తియ్యటి తాటిరసం పగిలిన తాటితొక్కల్లోంచి జారి బొగ్గులమీద పడితే వచ్చే ఆ కమ్మని వాసన ఎంత బాగుండేదో కదా అమ్మమ్మా.

తాటిపండు ఎప్పుడెప్పుడు తింటానా అనే ఆరాటంలో నిన్ను తొందరపెడుతూ, నీ కొంగు పట్టుకుని నీ వెనకెనకే తిరుగుతున్న నా కంగారు అణచటానికి పన్లన్నీ పక్కనపడేసి పళ్ళెంలో ఉంచిన చల్లారిన తాటిపండు తొక్కల్ని ఒలిచి, టెంకల్ని విడదీసి వేటికవి నున్నగా చేసి తాతకొకటీ నాకొకటీ తినమని ఇచ్చేదానివి... గుర్తుందా..!

‘‘నాకరగదేమోనే?’’ అంటూనే బోసినోటితో తాటిపండుని చీకుతూ దుడ్డు కళ్ళద్దాల్లోంచి నీవైపు చూసి ‘‘నువ్వూ తెచ్చుకో’’ అని తాత నీతో అంటే, ‘‘ఉన్నయ్యే మూడు టెంకెలు... మజ్జానం ఆడు తింటాళ్ళే’’ అనేదానివి, నాకేసి ప్రేమగా చూస్తూ. నాకెంత ఆనందమేసేదో అమ్మమ్మా... ఆ ప్రేమకి!

ఆ ప్రేమకేగా టెంక పట్టుకుని చీకుతూ నీ వెనకెనకే తిరిగేవాణ్ణి. నేనలా కాసేపు తిన్నాక నా దగ్గర్నుంచి తాట్టెంక తీసుకుని పొడవాటి జుట్టున్న తలనిండా నూనె పెట్టి నున్నగా కిందకి సవరచేసినట్టు చేసి ఇచ్చేదానివి.

‘‘రేపు మళ్ళా పడుద్దిలే, నువ్వు తిను’’ అనేవాడు తాత. అయినా, తినేదానివి కాదు. నాకోసం అట్టే పెట్టేదానివి. ఎంత బాగుండేదో అమ్మమ్మా... అలా!

ఆ మర్నాడు తెల్లారగట్ట పాలకావిడేసుకుని పొలమెళ్ళిన తాత, రోజూ వచ్చే సమయానికంటే కాస్తంత ఆలస్యం అయ్యేసరికి ముందురోజు తాటిపండు తిన్నందుకు ఎక్కడ తేడా చేసిందోనని నువ్వెంత కంగారుపడ్డావో గుర్తుందా..?

అయితే, మేమిద్దరం తాట్టెంక తిన్నప్పుడు నువ్వు తినలేదని తాతయ్య నీకోసం మళ్ళీ తాటిపళ్ళు పట్టుకొస్తే, అప్పటి నీ ముసిముసి నవ్వుల్లో సిగ్గు ఇప్పుడు నా కళ్ళముందు కదలాడుతోంది అమ్మమ్మా!

నిన్నే కదా తిన్నాడు. ఇవాళ కూడా తింటే కడుపులో నొప్పొస్తుందంటూ, నువ్వు తినటం మానేసి మరీ, నాకోసం... తాటిగుజ్జు తీసి తాటాకుల చాపమీద పల్చగా పామి తాటితాండ్ర తయారుచేశావ్‌... తాటిరొట్టె కూడా వేశావ్‌.

అంతేనా, అలా మనం తిన్న టెంకలన్నీ తేగల కోసమని దొడ్లో పాతరేసి, ఆ బుర్ర టెంకల్ని కత్తితో మానుకేసి కొట్టి బుర్రగుంజు తీసిస్తే దాన్ని కడిగి నాకు గిన్నెలో వేసిచ్చేదానివి - బలమని.

ఎంత తియ్యగా ఉండేది అమ్మమ్మా... బుర్రగుంజు.

అదొక్కటేనా... ఎప్పుడైనా దేవుడికి కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరినీళ్ళూ, వెన్నపూస కాసినప్పుడు గిన్నెలో అడుగంటిన గోదారి... ఇవన్నీ నాకివ్వటానికే అవన్నీ నువ్వు చేసేదానివేమో అని ఇప్పుడనిపిస్తోంది అమ్మమ్మా!

వేసవికాలంలో సాయంత్రంపూట ఆరుబయట వెన్నెల్లో కొబ్బరిచెట్టు కింద పట్టెమంచం మీద నన్ను పక్కన పడుకోబెట్టుకుని తాతయ్య చెప్పిన పంచతంత్రం కథలు నాకిప్పటికీ గుర్తే అమ్మమ్మా!

అప్పుడప్పుడూ నువ్వు దొడ్లో పిడకలు, పొల్లులో దొర్లించి గోడకి చరుస్తూంటే, నువ్వలా చరిచినప్పుడల్లా నేను చేసిన బుల్లి పిడకల్ని ‘ఐసర్‌బజ్జా’ అంటూ ఒక మూలగా నేనూ గోడకేసి చరిచినప్పుడు నా బుల్లి చేతిల్లోని బలం చాలక గట్టిగా కొట్టలేదేమో అవి కిందకి జారిపడిపోయేవి. ‘అయ్యయ్యో’ అంటూ మళ్ళీ ఆ పేడ ముద్దని చేతుల్లోకి తీసుకుని ముందుకు వంగుని నువ్వెలా చేస్తున్నావో చూస్తూ నేనూ చేస్తూంటే వెనక నుంచి తాతయ్య వచ్చి ‘‘ఆ పిడకలవీ నీకెందుకురా బంగారం... పాదుమీద ఆనపకాయ ముదిరినట్టుంది, కోద్దువుగానీ రా’’ అంటూ నన్ను ఎత్తుకొని హత్తుకున్న ఆ తీపి జ్ఞాపకం నేనెలా మర్చిపోగలను అమ్మమ్మా..?

పాక చూరు దగ్గర తాతయ్య నిలబడి రెండు చేతుల్నీ ఒక దగ్గర చేర్చి గుండ్రని విస్తరాకుల్లాంటి చేతుల మీద నన్ను కూర్చోబెట్టి పాక మీదకి పాకించి నాతో ఆనపకాయ కోయిస్తే, గుండ్రని ఆ కాయ అందం చూస్తూ ‘‘ఆ కాయ నేనే కోశానని’’ ఇరుగూ పొరుగూ పిల్లలందర్నీ పిలిచి మరీ చూపించటం నాకింకా గుర్తే అమ్మమ్మా!

లేలేత ఆనపకాయలో చిలకడదుంప, చిక్కుడుకాయ, ములక్కాయ వేసి నువ్వు వండిన పులుసుకి ఏ రుచి సాటి అమ్మమ్మా!

అవునూ చిలకడదుంపంటే గుర్తొచ్చింది... మన వీధిలో ఉండే బ్రౌన్‌కలర్‌ చెవులున్న నల్లకుక్క ఎలా ఉంది అమ్మమ్మా?

రాత్రి బాగా పొద్దుపోయాక తాతయ్యకి స్నానానికి నీళ్ళు కాసిచ్చి కణకణలాడుతున్న ఆ నిప్పుల మధ్యలో నువ్వు కూరికూరి వదిలేసిన ఇంత లావు చిలకడదుంప తెల్లారేపాటికి పాకం వచ్చేలా ఉడికితే తీయని ఆ వాసనకి మన ఇల్లు పట్టుకుని వదిలేదు కాదు ఆ నల్లకుక్క.

నాకెంత గుర్తో- ఒకట్రెండుసార్లు నువ్వేదో పనిలో ఉంటే అది మన లోపలికొచ్చి పొయ్యిలో ఉడికిన దుంపలెత్తుకుపోతే, నిక్కరు పైకి లాక్కుంటూ కంగారుపడుతూ, నువ్వొస్తున్నావో లేదోనని వెనకెనక్కి తిరిగి చూసుకుంటూ దాని వెంటపడి పరుగులెత్తిన రోజులు.

‘‘తిననియ్‌ రా పాపం... దానికి మాత్రం ఎవరు పెడతార్రా’’ అని నువ్వంటే నేనెంత ఏడ్చానో నేనెలా మర్చిపోగలను! దాన్ని తిననివ్వమన్నందుకు కాదు నా ఏడుపు, నీ దగ్గరున్న నా ప్రేమని దానికిచ్చేస్తున్నందుకు. దానికి నువ్వు పంచగా నాపట్ల నీ ప్రేమ కొద్దిగానైనా తరిగిపోయినందుకు.

ఎన్ని దుంపలు అమ్మమ్మా... నాకెంతో ఇష్టమని, నిలవ ఉంటే మరింత తీపెక్కుతాయని నెల్లాళ్ళముందే తోటలో రాసులమీద ఏరించి మరీ పెద్దపెద్దవి తెప్పించేదానివి. అలా తెప్పించిన దుంపల్ని గోనెపట్టాలేసి ఆరబోసేదానివి. ఆరేకొద్దీ ఎంత తియ్యగా ఉండేవి అమ్మమ్మా... ఆ చిలకడదుంపలు. ఎక్కడ అయిపోతాయోనని ఆ దుంపలు వచ్చినన్నాళ్ళూ నెల్లాళ్ళముందే జాగ్రత్తపడేదానివి... నేనెలా మర్చిపోతాను అమ్మమ్మా!

ఈశాన్యం మూల దొడ్లో పరిచిన బరకం గుడ్డమీద పొందిగ్గా నువ్వు కూర్చుని, మడిచిన నీ కాలుమీద ఏటవాలుగా పీట పెట్టి, మట్టిబెడ్డల్ని వేరుచేయటానికి మినుముల్ని పీటమీద పోసేదానివి. ఆ పక్కనే నా కాళ్ళమీద చిన్న పీట పెట్టుకుని నేనూను.

తాతయ్య నన్నలా చూసి ఎంత నవ్వుకునేవాడో బోసినోటితో.

నన్నలా ఆడుకోనివ్వటానికని పొలం వెళ్ళటం కూడా మానేసేవాడు- నేను ఆడుకుంటూ చిందరవందర చేసేసే మినుముల్ని ఏరటానికి. కాసిని గింజలు పోతేయేమని అప్పుడేదో అనిపించేది కానీ అలా ఏరటంలో ఆ పంటపట్ల తాతయ్య ప్రేమా అవలా అక్కడిదాకా రావటం వెనుక తాత కష్టం నాకిప్పుడు అర్థం అవుతున్నాయి అమ్మమ్మా!

అలా దొర్లించి దొర్లించి మరీ మట్టిబెడ్డల్ని వేరుచేసిన మినుముల్ని మట్టికుండలో పోసి పొయ్యిమీద పెట్టి కుండ పగలకుండా జాగ్రత్తగా ఒక పక్కన చేసిన చిల్లులోంచి కర్రతో వాటిని వేపేదానివి. ఆ కుండనేదో పేరుపెట్టి పిలిచేదానివి... ఆ... గుర్తొచ్చింది గుర్తొచ్చింది... మంగలం. మంగలంలో అలా వేగిన మినుముల్ని తిరగలిలో పప్పు చేయటం... అలా విసిరిన పప్పుని తొక్క ­డొచ్చేలా రోట్లో వేసి రోకలితో దంచి, పొట్టుపోయేలా చేటలో బాగా చెరిగి మరీ తిరగలిలో విసిరేదానివి- నాకు సున్నుండలు చేయటానికని.

‘‘వెన్నపూస ముందే కాయకు వాసనపోద్ది’’ అనేవాడు తాతయ్య.

‘‘ఆ... నా మనవడు కాదు మరి వాడు. కాసేసి ఎందుకుంచుతాను. నాకు మాత్రం తెలవదా?’’ అని ఓరకంట నన్ను చూసి నవ్వుతూ అనేదానివి. తాతయ్య సంతృప్తిపడేవాడనుకుంటా, బదులిచ్చేవాడు కాదు.

అప్పటికప్పుడు కాసిన నెయ్యి అయితే కమ్మటి వాసనొచ్చి, సున్నుండలు మరింత రుచిగా ఉంటాయనే తాతయ్య మాటల్లోని ప్రేమ నాకు ప్రతిక్షణం గుర్తొస్తోంది అమ్మమ్మా!

అలా నువ్వు నాకోసం శ్రమపడి చేసిన సున్నుండలే కాదు, కడిగి ఎండలో ఆరబోసి మరీ తిరగలిలో విసిరిన రాగిపిండితో నువ్వు కాసిచ్చిన రాగిజావా, మన పొలంలో పండిన చెరకు పంటని బెల్లం వండుతుంటే, బెల్లం తయారయ్యాక బుట్టల్లో పోసేముందు ‘మా మనవడికిట్టం’ అని అందులో ముంచి, తాత తెచ్చిచ్చిన చెరుగ్గడ చుట్టూ అంటుకున్న బెల్లం తినే కదా నాకింత బలం!

అటుకుల్లో మెత్తగా కోరిన బెల్లం వేసి అందులో వేడివేడి పాలు పోసి ఇచ్చేదానివి. కమ్మటి వాసనొచ్చే ఆ బెల్లం కలిసిన ఆ తియ్యని అటుకులు తిన్నరోజు అన్నం తినకపోతే, ఇంకెప్పుడూ అటుకులు పోటెయ్యను అనేదానివి. కానీ ఉండలేకపోయేదానివి. అప్పుడప్పుడే పొట్టపోసిన వరి కంకుల్ని కట్టగాకట్టి, తాత తెస్తే వాటిని పీటమీద నూర్చి మంగలంలో వేపి మరీ రోట్లో దంచేదానివి. నువ్వు అలా పోటేస్తూ రోకలి పైకెత్తినప్పుడల్లా, నీ పక్కన నిలబడి నిన్ననుకరిస్తూ పుల్లముక్కతో నేలమీద పోటేస్తుంటే అది చూసి ‘కిస్‌ కిస్‌’మంటూ తాత నవ్విన నవ్వు విన్న నాకు ఏ మ్యూజిక్కూ నచ్చటం లేదు అమ్మమ్మా!

మీ ఆ నవ్వులే కదా నా బలం.

అంతులేని ప్రేమా, వాత్సల్యంతో నాకోసం శ్రమించి, అనుక్షణం నాకోసమే మీ బతుకును వెచ్చించి నాకింత బలాన్నిచ్చారు కదా, ఈ బలంతో నేనేం చేస్తున్నాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడల్లా నాకొకటే సమాధానం వస్తోంది అమ్మమ్మా!

పగలనకా, రేయనకా కాళ్ళకి చెప్పుల్లేకుండా ఏ పరాయివాడి పాలన నుంచి విముక్తులవటానికి తాతయ్య స్వాతంత్రోద్యమంలో పాల్గొని అంత కష్టపడ్డాడో... అదే కష్టం ఆధారంతో పెరిగిన నేను విముక్తమైన నా నేలని వీడి, పరాయోడి పంచన చేరి, వాడి పాలనలో నా ­పిరికి ఆయువు పోసుకుంటూ, వాడికి బతుకునిస్తున్నా.

నాకిక్కడ ఉద్యోగం వచ్చినప్పుడు- నేనెంతో సాధించేసినట్టు ఇంత ముఖం చేసుకుని- అమెరికా వెళ్తున్నానని తాతయ్యకి చెబితే ‘‘ఎందుకురా?’’ అన్నాడు తాతయ్య నిర్భావంగా.

ఆ ఒక్క పదంలో ఎంత అర్థం ఉందో నాకిప్పుడు అర్థం అవుతోంది అమ్మమ్మా!

అవును, నిజమే! ఎందుకు?

పరుగెట్టమని ఈ ప్రపంచం నన్నెందుకు ప్రేరేపించిందో, తరిమిందో, పరుగులు పెట్టించిందో కానీ... నన్ను నేను నిరూపించుకోవటం, రుజువుపరుచుకోవటం కచ్చితంగా ఇలా మాత్రం కాదని నాకనిపిస్తోంది..!

అందుకే...

వచ్చేస్తున్నా అమ్మమ్మా! నా నేలా, నా ­వూరూ... నావాళ్ళ కోసం వచ్చేస్తున్నా!

ఇప్పుడు నన్నెవరూ అడగలేరు అమ్మమ్మా!- ఎందుకురా? - అని.

అవును అడగలేరు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.