close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిశ్శబ్దానికి చిరునామా మాథెరాన్‌!

నిశ్శబ్దానికి చిరునామా మాథెరాన్‌!

‘పచ్చని వాతావరణంలో నిశ్శబ్ద సంగీతాన్ని వింటూ కొండగాలి చల్లదనాన్ని ఆస్వాదిస్తూ రణగొణధ్వనులకి దూరంగా ఓ నాలుగు రోజులు హాయిగా గడిపి రావాలనుకునేవాళ్లకి మాథెరాన్‌ చూడచక్కని విడిది’ అంటూ ఆ ప్రాంతంలోని సుందర ప్రకృతి గురించి చెప్పుకొస్తున్నారు నవీ ముంబైకి చెందిన చిల్లరిగే పద్మ.

మాథెరాన్‌... మేముండే నవీ ముంబైకి చాలా దగ్గర. కాంక్రీట్‌ అరణ్యం నుంచీ పరుగులెత్తే హడావుడి జీవితం నుంచీ ఓ రెండుమూడు రోజులు తప్పించుకోవాలని మాథెరాన్‌కు బయలుదేరాం. మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో కర్జత్‌ తాలూకాలో ఉందీ ప్రాంతం. మనదేశంలోని అత్యంత చిన్న కొండప్రాంత విడిది ఇదే. పర్యావరణ ప్రియమైన పర్యటక ప్రదేశం. ఎందుకంటే పశ్చిమ కనుమల పర్వతశ్రేణుల్లో ఉన్న ఈ ప్రాంతానికి ఎలాంటి మోటారు వాహనాల్నీ అనుమతించరు. అందుకే మిగిలిన హిల్‌స్టేషన్లకన్నా ఎంతో భిన్నమైనది మాథెరాన్‌. సముద్రమట్టం నుంచి 2,625 అడుగుల ఎత్తు కొండమీద ఉన్న మాథెరాన్‌కు వెళ్లాలంటే ముందుగా కొండకింద ఉన్న నేరల్‌ అనే వూరుకి వెళ్లాలి. అక్కడనుంచి కొండమీద ఉన్న దస్తూరినాకాకి వెళ్లి; ఆపై నడక, గుర్రపు స్వారీ లేదా రిక్షాల ద్వారా మాథెరాన్‌కు చేరుకోవచ్చు.

అదిగో... మాథెరాన్‌!
ఉదయాన్నే అల్పాహారం చేసి కారులో బయలుదేరాం. ముంబై-పుణె రహదారిమీద ఉన్న సీబీడీ బేలాపూర్‌ అనే పట్టణంనుంచి నేరల్‌ జంక్షన్‌కి చేరడానికి 90 నిమిషాలు పట్టింది. ఈ నేరల్‌ జంక్షన్‌కి ముంబై, పుణెల నుంచి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. అయితే పుణె నుంచి కాస్త దూరం ఎక్కువ. ట్యాక్సీల్లో కూడా వెళ్లొచ్చు. మనమే డ్రైవ్‌ చేసుకుని వెళితే దస్తూరినాకాలో ఉన్న కారు పార్కింగ్‌ దగ్గర వరకూ వెళ్లొచ్చు. రుసుము కట్టి మళ్లీ మనం తిరిగి వచ్చేవరకూ కారుని అక్కడ పార్క్‌ చేసుకోవచ్చు. ఈ పాయింటు వరకూ మోటారు వాహనాలను అనుమతిస్తారు. ఒక్క అంబులెన్సు తప్ప, మరి వేటినీ ఆ ప్రాంతం దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. మేం మా కారుని నేరల్‌ జంక్షన్‌ దగ్గరే పార్కు చేసి షేర్‌ ట్యాక్సీలో దస్తూరినాకా వరకూ వెళ్లాం. స్థానిక ట్యాక్సీ యూనియన్‌ నడిపించే వాటికే అక్కడ అనుమతి. ప్రైవేటు ట్యాక్సీలను అనుమతించరు. స్థానికులకు జీవనోపాధి కల్పించేందుకే ఆ ఏర్పాటు. మాథెరాన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ పర్యటకుల నుంచి ప్రవేశ రుసుము పెద్దవాళ్లకు 25, పిల్లలకు 10 రూపాయల చొప్పున వసూలు చేస్తోంది. నిర్వహణ ఖర్చులకీ మాథెరాన్‌ అభివృద్ధికీ ఈ నిధిని ఉపయోగిస్తారు.

ఇదివరకు నేరల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి మాథెరాన్‌ అమన్‌ లాడ్జి వరకూ నేరోగేజ్‌ ఉండేది. దీనిమీద టాయ్‌ ట్రెయిన్‌ నడుస్తుంటుంది. కానీ గత ఏడాది రెండుసార్లు పట్టాలు తప్పడంవల్ల ప్రజల భద్రతకోసం ఈ రైలు సర్వీసుల్ని ప్రస్తుతం రద్దు చేశారు. తిరిగి ఇంకా మొదలుపెట్టలేదు. ఈ ప్రత్యేక టాయ్‌ రైలుని పూల్‌ రాణి అని పిలుస్తారు. వర్షాకాలంలో ఈ ప్రాంతం పూలతో అద్భుతంగా ఉంటుంది. మరాఠీలో మాథె అంటే నుదురు. రాన్‌ అంటే అడవి. మాథెరాన్‌ అంటే ‘నుదురులాంటి అడవి’ అని అర్థం. మన శరీరంలో నుదురు భాగం ఎత్తుగా ఉంటుంది కదా, అందుకే ఎత్తుగా ఉన్న అడవి అనే ఉద్దేశంలో దీనికాపేరు వచ్చిందని చెబుతారు.

కోతుల లోకం!
అక్కడ సామాన్లు మోయడానికి కూలీలు దొరుకుతారు. రిక్షాలూ గుర్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. చిన్న గేట్‌ దాటి ముందుకు వెళ్లగానే ఎర్ర మట్టి దారి కనిపించింది. ఎలాంటి కాలుష్యం సోకని స్వచ్ఛమైన కొండగాలి... అయితే రైలు పట్టాలమీదుగా నడుచుకుంటూ వెళితే గంటలోనే వెళ్లచ్చు అని చెప్పడంతో ఆ దారినే నడక మొదలెట్టాం. లెక్కలేనన్ని కోతులు పర్యటకుల్ని వెంబడిస్తుంటాయి. మన చేతిలో తినే వస్తువులుంటే వెంటనే లాగేస్తాయ్‌. స్నేహితుల సలహామేరకు చేతిలో ఏమీ ఉంచుకోకుండా నీళ్ల సీసాతో నడక మొదలెట్టాం. పక్షుల కూతలు, కోతుల కిచకిచలు, గాలిలో తేలి వచ్చే పర్యటకుల సంభాషణల శబ్దం తప్ప మరెలాంటి ధ్వనీ వినిపించదు. ఆ నిశ్శబ్ద ప్రకృతిలో చల్లని చెట్ల నీడ ఒడిలో మా నడక సాగింది.

ఎలా తెలిసింది?
థానే కలెక్టర్‌ హ్యూగ్‌ పోయెజ్జ్‌ మాలెట్‌ 1850లో ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడట. దీన్ని హిల్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి నాటి ముంబై గవర్నర్‌ లార్డ్‌ ఎలిఫిన్‌ స్టోన్‌ పునాది వేశారట. రెండు అడుగుల నేరో గేజ్‌ మార్గాన్ని నిర్మించారు. 1907 నుంచి ఆ కొండ రైలు మార్గం సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. దాంతో రాకపోకలు మొదలయ్యాయి. అయితే కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మాథెరాన్‌ని ఎకో సెన్సిటివ్‌ ప్రాంతంగా ప్రకటించింది. చుట్టూ చూసుకుంటూ కోతుల బారినుంచి తప్పించుకుంటూ రైలుపట్టాలమీద నడవడం మరపురాని అనుభూతి. కొండమీద నుంచి నెరల్‌ పట్టణాన్నీ కర్జత్‌ పట్టణాన్నీ చూశాం. ఆగి ఆగి ఫొటోలు తీసుకుంటూ గంటన్నర తరవాత మాథెరాన్‌ మార్కెట్‌ చేరుకున్నాం. అప్పటికి ఒంటిగంట కావస్తోంది. మేం ముందుగా బుక్‌ చేసుకున్న హోటల్‌ మార్కెట్‌నుంచి మరో పదిహేను నిమిషాల దూరంలో ఉంది. ఆ మధ్యలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి, స్కూలు, రైల్వే స్టేషన్‌ ఉన్నాయి. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చిక్కీ అమ్మే దుకాణాలే. ఇక్కడ వాళ్లకి మరాఠీ, హిందీ, ఇంగ్లిష్‌ మాట్లాడటం వచ్చు.

గుర్రాల కోసమే...
మాథెరాన్‌ను సందర్శించడానికి సీజన్‌తో సంబంధం లేదు. ఎప్పుడైనా రావచ్చు. ప్రకృతిని ఆసాంతం ఆస్వాదించాలంటే మాత్రం వర్షాకాలమే సరైనది. అక్కడివాళ్లకి పర్యటకమే ప్రధాన ఆదాయం. కింద నుంచి వచ్చిన సవారీలన్నీ మార్కెట్‌ వరకే. అక్కడినుంచి మరొకటి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆ దారిలో వస్తుంటే పార్సీవాళ్ల బంగళాలు కనిపించాయి. బ్రిటిష్‌ వాళ్లు మాథెరాన్‌ని హిల్‌ స్టేషన్‌గా మార్చడంవల్ల అక్కడి నిర్మాణాలన్నీ బ్రిటన్‌ వాస్తు శైలిని ప్రతిబింబిస్తున్నాయి. వూరంతా ఎర్రటి దుమ్ము... గుర్రాల పాదాలు తారు రోడ్డు వేడికి తట్టుకోలేవు. వాటికీ మట్టి రోడ్డు మంచిది. అందుకే మాథెరాన్‌లో అన్నీ మట్టి రోడ్లే. పాండే రోడ్డులో ఉన్న మా రిసార్ట్‌కి వెళ్లి, కొద్దిసేపు సేదతీరి, మాథెరాన్‌ అందాలు చూడ్డానికి బయలుదేరాం.

ముందుగా మా రిసార్ట్‌కి దగ్గరగా ఉన్న రాంబాగ్‌ పాయింట్‌ దగ్గరకు వెళ్దామని బయలుదేరాం. దారిలో 1860లో క్యాథలిక్కులు నిర్మించిన అతి పురాతనమైన చర్చి ఉంది. అక్కడ ఆగి, లోపలికి వెళితే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అక్కడ నుండి రాంబాగ్‌కి వెళ్లాం. మెయిన్‌ మార్కెట్‌ నుంచి సుమారు రెండు కి.మీ. ఉండొచ్చు. మా రిసార్ట్‌కి చాలా దగ్గర. దారంతా చిన్న చిన్న రాళ్లతో మెట్ల మెట్లుగా ఉంటుంది. గుర్రాలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. వీధి దీపాలు చాలా తక్కువ. అక్కడ నుంచి సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. అయితే తెల్లవారుజామునే లేచి అక్కడకు ఆ దారిలో వెళ్లాలంటే చేతిలో టార్చిలైటు ఉంటే మంచిది. ముందే చూసి రావడంవల్ల మర్నాడు ఆరు గంటలకల్లా చేతిలో టార్చిలైటు ఉంచుకుని, రాళ్లనీ గుర్రాలనీ తప్పించుకుంటూ రాంబాగ్‌ పాయింట్‌కి చేరుకున్నాం. చిక్కని ఆ నిశ్శబ్దాన్ని కదిలిస్తూ మధ్యమధ్యలో సూర్యోదయం చూడాలని వచ్చిన యాత్రికుల గుసగుసలు... అప్పుడు జరిగిందో ప్రకృతి అద్భుతం...

కొండల వెనక నుంచి ముందు నెమ్మదిగానూ ఆపై గబగబా పైకి వచ్చాడు భానుడు. ఆ దృశ్యం అద్భుతం... అమోఘం... ఎంతసేపు చూసినా తనివి తీరదు. ‘ఆకాశం నుదుట పెట్టుకున్న ఎర్రటి బొట్టులా ఉన్నాడు సూరీడు’ అన్న ముత్యాలముగ్గులోని రావుగోపాలరావు డైలాగులు గుర్తుకురాక మానవు. అలా అక్కడ చాలాసేపు సూర్యుణ్ణి చూస్తూనే ఉండిపోయాం.

తిరిగి రిసార్ట్‌కి వచ్చే దారిలో- 1916లో కట్టించిన అంటువ్యాధుల వార్డు శిథిలావస్థలో ఉంది. ఆ రోజుల్లో వ్యాధిసోకిన వాళ్లని అలా దూరంగా ఉంచేవారన్నమాట. అల్పాహారం చేశాక మాథెరాన్‌ చూడ్డానికి బయలుదేరాం. ముందుగా ఆ చుట్టుపక్కల పరిసరాలకి నీటిని అందించే చార్లెట్‌ సరస్సు దగ్గరకు వెళ్లాం. చిన్నదైనా పారదర్శకంగా ఉన్న ఆ కొలనులో చేపలు పట్టడం, బట్టలు ఉతకడం లాంటివి అస్సలు అనుమతించరట. అక్కడ ఓ చిన్న ఆనకట్ట కట్టడంవల్ల వర్షాకాలంలో పైనుంచి వచ్చే చిన్న జలపాతం ద్వారా ఈ కొలనులో ఎప్పుడూ నీళ్లు నిల్వ ఉంటాయి.

దీనికి కుడివైపున అతి పురాతనమైన పిసర్నాధ్‌ మందిర్‌ ఉంది. గుడి ప్రాంగణంలో భారీ గంట ఉంది. ఇక్కడ శివుడు స్వయంభువుడు. పిసర్నాథ్‌ను స్థానికులు గ్రామదేవతగా కొలుస్తారు. ‘ఎల్‌’ ఆకారంలోని లింగాకృతిలో ఉండటమే ఇక్కడి శివుడి ప్రత్యేకత. పూర్తిగా సింధూరంతో ఉంటుంది శివలింగం. ఇక్కడికొచ్చే పర్యటకులు సూర్యాస్తమయంలోపలే దర్శనం చేసుకుంటే మంచిదిగా భావిస్తారు. దట్టమైన అడవి మధ్యలో ఉండటంవల్ల చీకటిపడితే జంతువులు తిరుగుతుంటాయట. ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకున్నాక లార్డ్‌ పాయింట్‌ దగ్గరకు వెళ్లాం. అక్కడకు వెళ్లేసరికి నడిచిన అలసట అంతా ఎగిరిపోయింది. ఆ ప్రాంతాన్ని మాటల్లో వర్ణించలేం. చూసి తీరాల్సిందే. అక్కడినుంచి దూరంగా కనిపించే ఓ కొండను చూస్తే దేవతా ఆకారంలో చెక్కినట్లు అనిపిస్తుంది. కానీ ప్రకృతి సహజంగా ఏర్పడిన వింత కొండ అది. ఆ పాయింట్‌ నుంచే బైనాక్యులర్స్‌ లేదా గైడ్‌ దగ్గరున్న టెలీస్కోప్‌ ద్వారా దూరంగా ఉన్న ప్రబలగఢ్‌ కోటను చూడొచ్చు. అది మరాఠాల శౌర్యానికీ వీరత్వానికీ ప్రతీక. మొఘల్‌ చక్రవర్తుల్ని ఓడించి శివాజీ గెలుచుకున్న కోట అది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. దూరంగా కనిపించే శివాజీ నిచ్చెననీ చూశాం. అప్పట్లో శివాజీ వేటకోసం మాథెరాన్‌ కొండలు ఎక్కేవాడట. ఆయన ఎక్కేదారినే శివాజీ నిచ్చెన అని పిలుస్తారు. ఈ శివాజీ నిచ్చెన ఎక్కే ముంబై గవర్నర్‌ ఈ కొండమీదకి వచ్చి ఇక్కడి అందాలను చూసి ముగ్ధులయ్యారని చెబుతారు. ఇప్పటికీ గిరిజనులు ఆ దారిలోనే మాథెరాన్‌ అడవుల్లోకి వెళతారు. సాహసభరితమైన ట్రెక్కింగ్‌ మార్గంగా ఈ శివాజీ నిచ్చెన పేరొందింది.

ఒంటరి చెట్టు!
తరవాత ఎకో పాయింట్‌ చూడ్డానికి వెళ్లాం. అక్కడి నుంచి మనం పిలిస్తే అది ప్రతిధ్వనిస్తుంది. వర్షాకాలంలో వెళితే అక్కడి జలపాతాల అందాలను చూస్తూ వాటి జావళీల్నీ వినొచ్చు. తరవాత వన్‌ట్రీ పాయింట్‌ దగ్గరకు వెళ్లాం. ఓ నేరేడుచెట్టు అక్కడ దశాబ్దాలుగా ఒంటరిగా ఉంటోంది. వర్షాకాలంలో చిన్నచిన్న మొక్కలు మొలిచినా చెట్టు మాత్రం ఇదొక్కటే ఉండడంతో దీనికా పేరు. ఆ రోజంతా తిరగడంతో బాగా అలసిపోయాం. దారిలో లిటిల్‌ చౌక్‌ పాయింట్‌, ఖండాలా పాయింట్‌ చూసి, ఇక కాళ్లు మొరాయించడంతో రిసార్ట్‌లోకి వచ్చి పడ్డాం. మర్నాడు ఉదయాన్నే రూము ఖాళీ చేసి అక్కడ దొరికే చిక్కీలనీ చాక్లెట్‌ ఫడ్జెస్‌నీ కొనుక్కుని తిరుగు ప్రయాణమయ్యాం. లోనావాలా చిక్కీల మాదిరిగానే మాథెరాన్‌ చిక్కీలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. తిరుగు ప్రయాణంలో రిక్షా ఎక్కాం. దీన్ని ముందు ఒకరూ వెనక ఇద్దరూ పట్టుకుని నడిపిస్తారు. అలా దస్తూరినాకా వరకూ వచ్చి, నేరల్‌ చేరుకుని అక్కడినుంచి మా కారులో ముంబై దారిపట్టాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.