close
ప్రేమంటే..

ప్రేమంటే..


 

వ్యాపారమూ కన్నబిడ్డే!

యువతీయువకుల మధ్య చిగురించినదో తల్లిదండ్రులు పిల్లలపట్ల చూపించేదో మాత్రమే ప్రేమగా భావిస్తాం. కానీ వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని కూడా అలాగే లేదా అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తారని ఫిన్‌ల్యాండ్‌ పరిశోధకుల పరిశీలనలో తేలింది. ఇందుకోసం కొందరు వ్యాపారుల్నీ తండ్రుల్నీ ఎంపికచేశారు. వ్యాపారులకు వాళ్ల సొంత కంపెనీ ఫొటోలనూ ఇతర కంపెనీ ఫొటోలనూ చూపించగా; తండ్రులకు వాళ్ల పిల్లల ఫొటోలనూ ఇతర పిల్లల ఫోటోలనూ చూపించి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ల ద్వారా వాళ్ల మెదడు పనితీరుని గమనించారట. అందులో సొంత పిల్లల ఫొటోల్ని చూసినప్పుడు తండ్రుల మెదడు ఎలా స్పందించిందో అచ్చం అలాగే సొంత కంపెనీని చూసినప్పుడు వ్యాపారుల మెదడు స్పందించిందట. అందుకేనన్నమాట... వ్యాపారవేత్తలకు అదే పరమావధి..!


 

చాంద్‌బాలీ బుట్టలకు ఫిదా!

మొఘలుల కాలంనాటి ఆభరణాల్లో ఎంతో ప్రాచుర్యం పొందినదే చాంద్‌బాలీ డిజైన్‌. అర్ధచంద్రాకృతిలోని ఈ డిజైన్‌తో వచ్చిన జుంకీలు ఆమధ్య బాలీవుడ్‌ రామలీలా సినిమాతో మళ్లీ వెలుగులోకి రావడమేకాదు, విదేశీ మహిళల్నీ ఆకట్టుకున్నాయి. అక్కడితో ఆగితే విశేషమేముంది... ఇప్పుడు ఆ చాంద్‌బాలీ డిజైన్‌కు మధ్యలోనూ కిందా భిన్న సైజుల్లో విభిన్న రకాల బుట్టలోలాకుల్ని జోడించి కొత్తగా రూపొందిస్తున్నారు. అచ్చంగా రత్నాలూ వజ్రాలూ పొదిగిన వాటితోబాటు; కుందన్‌, పోల్కీ, మీనాకారీ, టెంపుల్‌ జ్యువెలరీ డిజైన్లలోనూ వీటిని తయారుచేస్తున్నారు. సిల్కుదారాలు, పూసలు, బ్లాక్‌ మెటల్‌, ఆక్సిడైజ్‌డ్‌ సిల్వర్‌... వంటి ఇతరత్రా ఫంకీ నగల్లో కూడా ఈ డిజైన్‌ తెగ సందడి చేస్తోంది. దాంతో చాంద్‌బాలీ బుట్ట జుంకీల అందాలకు అమ్మాయిలంతా ఫిదా!


 

బురద జీన్స్‌!

టల్లో దుమ్మకొట్టుకున్నా రోడ్లమీద మట్టి అంటుకున్నా తెలియవనో తరచూ ఉతకాల్సిన పనిలేదనో లేదా సౌలభ్యంకోసమో... ఇలా జీన్స్‌ను ధరించడానికి ఎవరి కారణాలు వాళ్లవి. ఇక, అవి చిరిగినా వెలిసినా ఎలుకలు కొట్టినట్లున్నా ఎలా ఉన్నా ఫ్యాషనే అంటూ వాటిని ఎప్పటికప్పుడు రకరకాలుగా ఏమార్చేస్తుంటారు డిజైనర్లు. అందులో భాగంగానే జపాన్‌కు చెందిన పీఆర్‌పీఎస్‌ అనే కంపెనీ కొత్తగా బురదలో దొర్లివచ్చినట్లుండే జీన్స్‌ను తయారుచేస్తోంది. చేతికి కాదు కదా, కాళ్లకు మట్టి అంటుకోవడం కూడా మనకి అంత నచ్చదు కానీ, హీరో మాదిరి ఫైట్‌ చేసి వచ్చినట్లు పోజివ్వాలంటే మాత్రం వీటిని ధరించాల్సిందే కదా. అందుకే ధర కాస్త ఎక్కువైనా సరే, ఆన్‌లైన్‌లో దొరుకుతున్న ఈ జీన్స్‌ కొనేందుకు తెగ ఆర్డర్లు వచ్చేస్తున్నాయట. ఎంతైనా యువత రూటే వేరు కదా!


 

బ్రూ కాదు, ‘బ్లూ’ కాఫీ!

‘కాఫీ ఏ రంగులో ఉంటుంది?’ అని ఎవర్నయినా అడిగి చూడండి... దిమాక్‌ ఖరాబయిందా అన్నట్లు అనుమానంగా చూడకపోతే ఒట్టు. ఎందుకంటే దాని పేరే ఓ రంగుగా స్థిరపడిపోయిన పదార్థాల్లో అదీ ఒకటి. అలాంటిది ఈమధ్య ఆస్ట్రేలియాలోని మిల్క్‌బార్‌ అనే వేగన్‌ కెఫె, స్మర్ఫ్‌ పేరుతో బ్లూ ఆల్గే(నీలి నాచు)తోనూ కాఫీ తయారుచేసింది. కొబ్బరిపాలల్లో నీలి నాచు, నిమ్మ, అల్లం జోడించి చేసిన ఈ కాఫీని రుచి చూసినవాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేయడం ప్రారంభించారు. దాంతో అది క్రమంగా అంతటా నురగలు కక్కుతోంది.


 

జంటపక్షుల కోసం...

ఇంట్లోనే హోమ్‌థియేటర్‌ ఏర్పాటుచేసుకుని విలాసవంతమైన మల్టీప్లెక్సుల్లో సినిమా చూస్తోన్న అనుభూతిని సొంతం చేసుకోవాలనుకునేవారు ఈరోజుల్లో కోకొల్లలు. అలాంటివాళ్లకోసమే ఆధునిక ఫర్నిచర్‌ కంపెనీలు ఈ ‘కడల్‌ కౌచెస్‌’ తయారుచేస్తున్నాయి. రకరకాల ఆకారాల్లో వస్తోన్న వీటిల్లో కొన్నింటికి హ్యాండిల్‌పైన స్నాక్స్‌ప్లేట్లూ టీకప్పులూ వాటర్‌బాటిళ్లూ పెట్టుకునేలానూ రూపొందిస్తున్నారు సో... ప్రేమజంట హాయిగా ఇందులో కూర్చునీ పడుకునీ తింటూ కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూడొచ్చు... పుస్తకాలూ చదువుకోవచ్చు.


 

చెక్కిన టాటూ!

ఇంటి అలంకరణలో సునిశితమైన పనితనంతో ఎంతో అందంగా చెక్కిన శిల్పాలను అలంకరించుకోవడం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల చెక్కకాలునీ అమర్చుకున్నారేమో అనిపిస్తోంది కదూ ఈ బొమ్మను చూస్తుంటే. కానీ అది నిజంగా కాలే. దానిమీద ఉన్నది ఓ టాటూనే. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. చెక్కను కార్వింగ్‌ చేశారేమో అనిపించేంత సహజంగానూ అందంగానూ ఒంటిమీద టాటూని చిత్రించేయడం సరికొత్త ట్రెండ్‌గా మారింది. నిజానికి టాటూ అంటేనే ఓ క్రేజీ కళ. అందుకే అందులో వందల వేల డిజైన్లు ఎప్పటికప్పుడు కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్నాయి. ఇక, త్రీడీ రియలిస్టిక్‌ బొమ్మలయితే మరీనూ...ఒళ్లంతా తూట్లు పొడిచినట్లూ వీపుని చీల్చి కుడుతున్నట్లూ... ఆయా దృశ్యాలన్నీ ఒంటిమీద ఉన్నాయన్న భ్రమనీ ఒకింత భీతినీ కలిగిస్తాయి. ఇప్పుడు కొత్తగా ఒంటిమీద చెక్క కళ కనువిందు చేస్తోంది. చూడ ‘చెక్క’ని ఆ టాటూ కళాకారుల నైపుణ్యం నిజంగానే అదుర్స్‌..!


 

సూపర్‌ బైక్‌!

ఎంత ఖరీదైన కారున్నా సరే, బైక్‌ను చూస్తే చాలు కుర్రకారు మనసు కళ్లెం తెంచుకున్న గుర్రంలా పరుగులు తీస్తుంది. అలాంటిది ప్రపంచంలోనే ఖరీదైన ఈ ఎకోస్‌ ఇఎస్‌1 సూపర్‌బైక్‌ను చూసి ముచ్చటపడని వాళ్లూ ఒక్కసారయినా దానిమీద రైడ్‌కి వెళ్లాలనుకోనివాళ్లూ ఎవరుంటారు? కాకపోతే దీని ధర వింటే బడా మిలియనీర్లకయినా కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. అవును మరి, ఈ బైక్‌ ధర సుమారు 25.2 కోట్ల రూపాయలు. 1000 సి.సి.; వి4, ఫోర్‌ స్ట్రోక్‌ ఇంజిన్లు ఉన్న ఈ బైక్‌ గంటకు 370.1 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందట. కార్బన్‌ ఫైబర్‌తో డిజైన్‌ చేయడంతో తేలిగ్గానూ ఉంటుంది. సూపర్‌ కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.