close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆల్చిప్పలు... కురిపిస్తున్నాయి కాసులు!

ఆల్చిప్పలు... కురిపిస్తున్నాయి కాసులు!

 

సముద్రంలో వేటకు వెళ్లారంటే చేపల కోసమనే అనుకుంటాం. కానీ పులికాట్‌ తీరాన ఉన్న ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల పరిధిలోని గ్రామాల్లోని వారు మాత్రం నత్తగుల్లలూ, ఆల్చిప్పల వేటకు వెళ్తారు. తరతరాలుగా అక్కడివారికి ఇదే ప్రధాన జీవనోపాధి!

పులికాట్‌...ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సరస్సు 600 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందులో 420 చ.కి.మీ. ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉంది. సహజ సిద్ధమైన ఈ సరస్సులో పలు రకాల వనరులు ఉన్నాయి. ఇక్కడ దొరికే గరిక మొక్కల్ని ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు. ఇక్కడ చేపలూ, పీతలూ ఎక్కువగానే దొరుకుతాయి. ఇవి మిగతా అన్నిచోట్లా ఉంటాయి, కానీ నత్తగుల్లలూ, ఆల్చిప్పలూ ఇక్కడ మాత్రమే కోకొల్లలుగా లభిస్తాయి. పులికాట్‌లో ఆల్చిప్పలు లభించడానికి పలు కారణాలు ఉన్నాయి. సాధారణంగా నత్తగుల్లలూ, ఆల్చిప్పలూ అతి తక్కువ లోతుండే ఉప్పునీటిలో విస్తారంగా లభిస్తాయి. పులికాట్‌ సరస్సు చాలాచోట్ల అర అడుగు నుంచి నాలుగు అడుగుల మేర లోతు ఉంటుంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో ఇతర జీవరాశి కూడా ఉన్నందువల్ల నత్తగుల్లలూ, ఆల్చిప్పలూ విస్తారంగా పుట్టి పెరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. దాంతోపాటు అతి తక్కువ కాలంలోనే ఎక్కువగా ఉత్పత్తి అయ్యే జీవుల్లో ఇవీ ఉండటం ఒక కారణం.

ప్రయోజనాలు ఎన్నో!
పులికాట్‌ సరస్సులో దొరికే ఆల్చిప్పలకు వాణిజ్యపరంగా మంచి గిరాకీ ఉంది. వీటిని పొడిగా చేసి రంగుల తయారీలో వాడటంతోపాటు, రసాయన పరిశ్రమల్లోనూ, ఔషధ తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. ఇంటికి వేసే సాధారణ సున్నంలోనూ కలుపుతుంటారు. అందుకే ఈ ప్రాంతంవారికి చేపలవేట మాదిరిగా నత్తగుల్లలూ, ఆల్చిప్పలవేట ప్రధాన జీవనోపాధిగా ఉంది. మిగతా చోట్లకంటే తమిళనాడు రాష్ట్ర పరిధిలో పులికాట్‌ ఒడ్డున ఉన్న సున్నపుగోళం, కొంగల్‌తెట్టి ప్రాంతాల్లో ఆల్చిప్పల నిల్వలు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మర ఆడించిన సున్నాన్ని చెన్నైకి తీసుకుని వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు అనువుగా ఉండటంతో రోజుకు టన్నుల కొద్దీ తీసుకెళ్తుంటారు. అక్కడే దీనికి మంచి మార్కెట్‌ ఉంది.

వేట సాహసమే...
పులికాట్‌ సరస్సులోని ఆల్చిప్పలను వెతికి తీయడంలో స్థానికులు సిద్ధహస్తులని చెప్పాలి. వీరు పది నిమిషాలపాటు శ్వాసను బంధించుకుని ఓ బుట్టతో నీటిలోపలికి వెళ్లి ఆల్చిప్పల్ని బయటకు తీసుకొని రాగలరు. ఇది సాహసంతో కూడిన పని. ఇలా సరస్సు నుంచి ఆల్చిప్పల్ని తీసేవారిని ఆ ప్రాంతంలో చాలా సులువుగా గుర్తించవచ్చు. వీళ్లు ఉప్పు నీటిలో ఎక్కువ సమయం ఉన్నందువల్ల తల వెంట్రుకలు తెల్లగా పాలిపోయి ఉంటాయి. సాధారణంగా పదిమందితో కూడిన బృందాలుగా పడవలపైన సరస్సులోకి వెళ్లి ఆల్చిప్పల్ని సేకరిస్తుంటారు. ఆల్చిప్పల్ని వేటాడుతూ ఒడ్డునుంచి అయిదు కిలోమీటర్ల దూరం వరకూ వెళ్తారు. సరస్సు అడుగున ఆల్చిప్పల్ని గుర్తించడానికి 10-15 అడుగుల పొడవుండే ఇనుప చువ్వలను పట్టుకొని వెళ్తారు. ఆ చువ్వని అక్కడక్కడా నీటిలోకి గుచ్చుతుంటారు. ఎక్కడ గట్టిగా తగిలినట్లనిపిస్తే అక్కడ ఆగి ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్లి ఆల్చిప్పలున్నదీ లేనిదీ పరీక్షిస్తారు. దాదాపు పది అడుగులు లోతుండే ప్రదేశాల వరకూ ఇలా వెళ్లగలరు. ఆల్చిప్పలు ఉన్నట్లు నిర్ధారించుకుంటే నలుగురు రెండు జట్లుగా లోపలికి వెళ్లి వాటిని వెదురు బుట్టల్లో నింపి బయటకు తీసుకొస్తారు. పడవలో ఉన్నవారు వాటినుంచి బురద, ఇసుకలేకుండా శుభ్రంచేస్తుంటారు. ఈ పనిచేసేందుకు పడవలపైన మహిళలూ ఉంటారు. వీరంతా సూర్యోదయ సమయానికే బయలుదేరి పడవలమీద సరస్సులోకి వెళ్తారు. సూర్యాస్తమయం వరకూ పనిలో ఉండి ఆ తర్వాతే ఒడ్డుకు చేరుకుంటారు. బయటకు తెచ్చిన ఆల్చిప్పల్ని ఒడ్డున ఎండబెడతారు. ఇలా వెళ్లినవారు రోజులో ఒక్కొక్కరూ సగటున 20 కిలోల దాకా సేకరిస్తారు. వాటిని అమ్మి ఒక్కో వ్యక్తి రోజుకి రూ.500 సంపాదిస్తారు. సున్నం బుకులం ప్రాంతంలో పులికాట్‌ ఒడ్డున పెద్ద ఎత్తున వీటిని పోగు చేస్తుంటారు. తర్వాత స్థానికంగా మర ఆడించి అవసరాలకు తగ్గట్టు వాడతారు. పులికాట్‌ ఒడ్డున దాదాపు 30 వరకూ ఇలాంటి మర యంత్రాలు ఉన్నాయి.

చారిత్రక అవసరం
వెయ్యేళ్ల క్రితంనుంచీ భవన నిర్మాణాలకు సున్నాన్ని ఉపయోగిస్తున్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఆల్చిప్పలతో చేసిన సున్నంలో బెల్లం, కాకరకాయ రసం కలిపి నిర్మిస్తే కట్టడం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఆంగ్లేయుల కాలంలో సున్నం ఉపయోగించి భారీ నిర్మాణాలు చేపట్టేవారు. అప్పట్నుంచీ ఈ సున్నానికి మంచి గిరాకీ ఉంది. పులికాట్‌లో ఆల్చిప్పల వేట కూడా ఆంగ్లేయుల కాలంలోనే బాగా ఎక్కువైంది. ఆంధ్ర,

తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో దాదాపు వెయ్యి కుటుంబాలకు ఇదే జీననోపాధి. వీరిలో చాలా కుటుంబాలు ఆరు తరాలుగా ఇదే పనిలో ఉన్నాయి. తమిళనాడుతోపాటు దక్షిణాదిలో చాలా ఆలయాలూ, భవనాలూ, కోటల నిర్మాణాలకు ఈ సున్నాన్ని వాడారు. శతాబ్దాల కిందట నిర్మితమైన చారిత్రక కట్టడాలకు మరమ్మతులు చేయడానికి అవసరమైన సున్నాన్నే ప్రస్తుతం ఆల్చిప్పల నుంచే తయారుచేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులోనూ వీటికి గిరాకీ ఉంటుందన్నమాట!

- కల్లిపూడి దేవేంద్రరెడ్డి,
న్యూస్‌టుడే సూళ్లూరుపేట, నెల్లూరు జిల్లా

 

తెలుగు ‘వెలుగు’ చూసొద్దామా...

అపురూపమైన కళలూ అబ్బురపరిచే శౌర్య పరాక్రమాలూ ఘనమైన సాహిత్య పరిమళాలూ సంస్కృతీ సంప్రదాయాల మేళవింపే తెలుగు జాతి. ఆ వెలుగుల చరిత్ర గురించి భావితరాలకు గర్వంగా చెప్పుకునే ప్రయత్నమే విశాఖ తీరంలోని తెలుగు మ్యూజియం.

దిగదిగో అతడే తాళ్లపాక అన్నమాచార్య... భారతదేశంలో పాటలు రచించి, పాడిన తొలి కవి. మన తెలుగువాడే.

ఇదిగో ఇతడే... రెండో బుద్ధుడిగా చెప్పుకునే ఆచార్య నాగార్జునుడు. క్రీ.శ 150-250 సమయంలోనే ఇతడి దగ్గర బౌద్ధధర్మాన్ని చదువుకునేందుకు చైనా, టిబెట్‌లాంటి దేశాలనుంచి విద్యార్థులు తెలుగు గడ్డమీదికి వచ్చేవారు. విశాఖపట్టణంలోని కైలాసగిరి కొండమీదున్న తెలుగు సాంస్కృతిక నికేతనంలోకి అడుగు పెడితే ఇలా శతాబ్దాల తెలుగు చరిత్రంతా కళ్లముందు కదులుతుంది. ఒక జాతి ఔన్నత్యాన్ని తెలియజేసేందుకు దేశంలో ఏర్పడిన తొలి మ్యూజియం ఇదే కావడం విశేషం.

పన్నెండేళ్ల కష్టం
ఏ మనిషికైనా మూలాలు తెలిసి ఉండడం అవసరం. కానీ ఇప్పటి తరాల వారికి మన పూర్వీకుల కీర్తి ప్రతిష్ఠలూ అలనాటి కళా వైభవం, సంస్కృతీ సంప్రదాయాల గురించిన కనీస పరిజ్ఞానం కూడా ఉండడం లేదు. పాఠ్యాంశాల్లో కూడా ఆ వివరాలు తగ్గిపోతున్నాయి... ప్రపంచ తెలుగు సమాఖ్య సభ్యులు, కేసీపీ గ్రూపు సంస్థల జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన ఇందిరాదత్‌కి వచ్చిన ఈ ఆలోచనే తెలుగు మ్యూజియం ఏర్పాటుకు పునాది అయింది. అత్యాధునిక సౌకర్యాలతో మ్యూజియం నిర్మించేందుకు స్వయంగా తను విరాళాలు ఇవ్వడంతో పాటు మరికొందరినీ అందులో పాలుపంచుకునేలా చేశారు. అలా భారత్‌, అమెరికాల్లో స్థిరపడ్డ మరికొందరు దాతలూ ప్రపంచ తెలుగు సమాఖ్య సభ్యులూ కలిపి ఇచ్చిన విరాళాలు ఎనిమిది కోట్ల రూపాయలు అయ్యాయి. వీరి ఆలోచన నచ్చడంతో ప్రభుత్వం ఇంకో ఏడుకోట్ల రూపాయలను మంజూరు చెయ్యడంతో పాటు, కైలాసగిరి కొండమీద ఆరు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణితో డిజైన్‌ చేయించి, పన్నెండేళ్లపాటు నిర్మించిన ఈ మ్యూజియం గేటు దగ్గర్నుంచి భవనాల సీలింగుల వరకూ దేన్ని చూసినా మన సంస్కృతులూ కళాకృతులకు అద్దం పట్టేలా ఉంటుంది. మ్యూజియం లోపల ఆచార్య నాగార్జునుడు, అన్నమాచార్య, శ్రీకృష్ణ దేవరాయలు, కవయిత్రి మొల్ల, భక్త రామదాసు, కులీకుతుబ్‌షా, బొబ్బిలి రాజు, రాణీ రుద్రమదేవి, అల్లూరి సీతారామరాజు, నాయకురాలు నాగమ్మ... ఇలా క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుంచి 1918వ సంవత్సరం వరకూ తెలుగు జాతి చరిత్రలో కీలకపాత్ర పోషించిన ఎంతోమంది విగ్రహాలు కొలువుదీరి ఉంటాయి. ఇవేనా, అద్భుతమైన శిల్పకళా సౌందర్యానికి ప్రతీకలుగా కనిపించే వివిధ నిర్మాణాలూ, ప్రాచీన కాలంనాటి స్తూపాలూ, ప్రముఖ దేవాలయాలూ రాజుల కాలంలోని ఆస్థానాలనూ కళ్లకు కట్టేలా తీర్చిదిద్దిన నమూనాలెన్నో దర్శనమిస్తాయి ఇక్కడ.

ఆడిటోరియం గిర గిరా...
మ్యూజియం మధ్యలో ఏర్పాటు చేసిన 98 కుర్చీల రివాల్వింగ్‌ ఆడిటోరియంలో కూర్చుంటే అది ఆత్మ ప్రదక్షిణ చేసినట్లూ కొంచెం కొంచెంగా తిరుగుతూ ఒక్కో విగ్రహం ముందూ ఆగుతుంది. ప్రేక్షకులు కూర్చున్న సీట్లు ఏ విగ్రహం ముందు ఆగితే ఆ వ్యక్తి చరిత్రలో పోషించిన పాత్ర గురించి స్పీకర్లలో శ్రావ్యమైన సంగీతం మధ్య మాటలూ పాటలూ పద్యాలతో వినిపిస్తుంది. విదేశీయులూ ఇతర భాషల వారికోసం ఆంగ్లమాధ్యమంలోనూ ఈ షోను నిర్వహిస్తున్నారు. అలా ఈ మ్యూజియంలోని 49నిమిషాల షోని చూస్తే తెలుగు జాతి ఆవిర్భావం నుంచి నాగరికత, సంస్కృతీ సంప్రదాయాల వరకూ తెలుగువారి గొప్పతనం గురించిన ఎన్నో విషయాలు తెలుస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

ఇక్కడి ప్రాంగణంలో అభివృద్ధి చేసిన ఉద్యానవనం కూడా బెంగళూరులోని బృందావన్‌ గార్డెన్‌ను తలపిస్తూ పర్యటకుల్ని ఆకట్టుకుంటుంది. మ్యూజియం దగ్గర్నుంచి చూస్తే కైలాసగిరి అందాలూ సముద్ర తీరం పంచే ఆహ్లాదం పర్యటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఓసారి చూసొద్దామా మరి..?

- బి.ఎస్‌.రామకృష్ణ, ఈనాడు, విశాఖపట్టణం
పొటోలు: జె.ఎ.నాయుడు

 

ఈ ఆటోవాలా రూటేవేరు...

ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేసే వాళ్లుంటారు. కానీ సరైన ఆదాయమే లేకపోయినా సేవా కార్యక్రమాలను కొనసాగించే వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తే ఈ ఉదయ్‌భాయ్‌.

హ్మదాబాద్‌కు చెందిన ఉదయ్‌ రమణ్‌లాల్‌ జాదవ్‌ను అందరూ ప్రేమగా ఉదయ్‌భాయ్‌ అని పిలుచుకుంటారు. ఖాకీ చొక్కా వేసుకుని గాంధీ టోపీ పెట్టుకునే ఈ ఉదయ్‌ ఆటోలో ప్రయాణించాలంటే కొత్తవాళ్లు ఎవరైనా ముందుగా కాస్త సందేహిస్తారు. ఎందుకంటే ఆటో ఎప్పుడూ పరిశుభ్రంగా కళకళ్లాడుతూ ఉంటుంది. లోపల న్యూస్‌పేపర్లూ, మంచినీళ్లు, చిరుతిళ్లూ, డస్ట్‌బిన్‌ పొందిగ్గా అమర్చి ఉంటాయి. వీటన్నిటినీ చూసినవాళ్లు ఎక్కువ డబ్బు వసూలు చేస్తాడేమోనని ఆటోలో ఎక్కడానికి సంకోచిస్తారట. అయితే ఒక్కసారి ఎక్కిన తర్వాతగానీ ఉదయ్‌భాయ్‌ మంచితనం గురించి తెలియదు. ప్రయాణికులు ఎక్కగానే ఉదయ్‌ వెంటనే మీటరు వేయడు. ఎక్కడికి వెళ్లాలని మాత్రమే అడుగుతాడు. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చిన తర్వాత ఎంత అయ్యిందో చెప్పడు. ఒక ఎన్వలప్‌ మాత్రమే వారి చేతిలో పెడతాడు. దాంట్లో ఉండే గ్రీటింగ్‌కార్డు పైన ‘పే ఫ్రమ్‌ యువర్‌ హార్ట్‌’ అని రాసి ఉంటుంది. మనసుకు ఎంత ఇవ్వాలని అనిపిస్తే అంత ఇవ్వవచ్చు. ఆ ఇచ్చిన మొత్తంలోనే కొంత భాగం సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తాడు. గర్భిణులూ, వికలాంగులూ ఉదయ్‌ ఆటోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉదయ్‌ ఆటో మీటరు ఎప్పుడూ సున్నానే సూచిస్తుంది.

ఒకసారి ఆటోలో ప్రయాణించిన ఒక పెద్దాయనకు అలవాటుగా కవర్‌ అందించాడు ఉదయ్‌. అతడు ఒక్క రూపాయిని ఆ కవర్‌లో పెట్టి ఇచ్చాడట. ఉదయ్‌ ఒక్కమాట కూడా మాట్లాడకుండా చిరునవ్వుతో ఆ రూపాయి తీసుకుని వెళ్లిపోయాడట. ఆ మరుసటి రోజు ఉదయ్‌కు ఆ పెద్దాయన నుంచి ఫోన్‌ వచ్చిందట. ‘డబ్బు ఇవ్వకుండా వెళ్లిపోతే నీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలనే అలా చేశాను. ఏమీ అనుకోవద్దు. నిన్నటి నుంచీ ఏదో తప్పుచేసినట్టుగా అనిపిస్తుంటే నీ నంబరు కనుక్కుని ఫోన్‌ చేస్తున్నాను’ అన్నాడట. అలా మౌనంతో ఎదుటివాళ్లు తమ తప్పు తెలుసుకునేలా చేయడం ఎంతమందికి సాధ్యమవుతుంది.