కొత్తబడి మొదలైంది! - Sunday Magazine
close

కొత్తబడి మొదలైంది!

కరోనా కారణంగా పాఠశాలలు మూసేయడంతో పిల్లలు చదువులకే కాదు, బాల్యానికీ దూరమయ్యారు. కొందరు పిల్లలకైతే ఆటపాటలూ, స్నేహాలూ, మధ్యాహ్న భోజనం... ఇలా అన్నింటికీ కరవే. ఈ పరిస్థితిని మార్చాలని ప్రత్యేక బడులు నిర్వహిస్తూ వారి చదువులు కొనసాగేలా చేస్తున్నారు వీరు!


ఘాట్‌వాలా స్కూల్‌!

కాన్పూర్‌కు చెందిన నితిన్‌ కుమార్‌ నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగాడు. అయినా కష్టపడి చదువుకుని డిగ్రీ పూర్తిచేశాడు. ప్రస్తుతం ‘లా’ చేస్తున్నాడు. తాను ఉండే ప్రాంతంలో వలస కార్మికులు ఎక్కువ. వారిలో చాలామంది తమ పిల్లల చదువుల గురించి ఆలోచించే స్థితిలో ఉండేవారు కాదు. కొందరు పిల్లలకు చదువు విలువ అర్థం కాక సమయం వృథా చేసేవారు. 2007లో పదో తరగతి పూర్తిచేశాక ఆ పిల్లలకు సాయంత్రం పూట పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు నితిన్‌. ఇప్పుడు 1-12 తరగతులు చదివే 200 మంది ఇతడి దగ్గరకు ట్యూషన్లకు వస్తారు. పాఠాలు చెప్పడంలో స్థానిక యువత కూడా సాయపడుతున్నారు. స్కూల్‌ పూర్వ విద్యార్థులూ టీచర్లుగా పనిచేయడం గమనార్హం! దాదాపు అన్ని క్లాసు సబ్జెక్టులతోపాటు స్పోకన్‌ ఇంగ్లిష్‌ తరగతులూ నిర్వహిస్తున్నారు. పిల్లలకు సరిపడా
స్థలం లేకపోవడంతో గంగా తీరంలోని ఓ ఆలయ ఘాట్‌ దగ్గర కొన్నేళ్లుగా పాఠాలు చెబుతున్నారు. అందుకే దీనికి ‘ఘాట్‌వాలా స్కూల్‌’ అని పేరు. కరోనా సమయంలో పాఠశాలలు తెరవకున్నా ఇక్కడ మాత్రం తరగతులు కొనసాగుతున్నాయి. ఈ స్కూల్‌ ప్రాధాన్యం ఇప్పుడే ఇంకా పెరిగిందంటాడు నితిన్‌. అయితే మునుపటిలా ఘాట్‌ దగ్గర కాకుండా ఒక గది అద్దెకు తీసుకుని పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. నితిన్‌కు దాతల సాయమూ అందుతోంది.


బస్సు బడి!

దిల్లీలోని సాకేత్‌ ప్రాంతం నుంచి ఉదయాన్నే నాలుగు బస్సులు బయలుదేరుతాయి. అవి నగరానికి నాలుగువైపులా వెళ్తాయి. అవి మామూలు బస్సులు కాదు, మురికివాడల పిల్లల ఆశాజ్యోతులు. అందుకే వాటికి ‘హోప్‌ బస్‌’లని పేరు. ప్రతి బస్సూ నగరంలో వలస కార్మికులూ, రోజుకూలీలూ, చిత్తుకాగితాలు ఏరుకునేవాళ్లూ ఎక్కువగా ఉండే కాలనీలకు వెళ్తుంది. అక్కడికి చేరాక బస్సు కాస్తా బడిగా మారిపోతుంది. బస్సులోని 50 సీట్లూ పిల్లలతో నిండిపోతాయి. కరోనా కారణంగా మురికివాడల్లోని పిల్లలు బడులకీ, ఆన్‌లైన్‌ చదువులకీ దూరం కావడం చూసి ‘తేజస్‌ ఆసియా’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ బడుల్ని నడుపుతోంది. బస్సు చేరగానే స్థానికంగా ఉండే పేద కుటుంబాలకు చెందిన పిల్లలు పలకాబలపం, పుస్తకాలూ పట్టుకుని వచ్చి చదువుకుంటారు. 3-13 ఏళ్ల మధ్య వారికి ఇక్కడ వాలంటీర్లు పాఠాలు చెబుతారు. ప్రతి బస్సూ ఉదయం ఒకచోటా మధ్యాహ్నం మరోచోటా బడుల్ని నిర్వహిస్తుంది. అలా రోజూ 400 మందికి చదువుకునే అవకాశం కల్పిస్తోందీ సంస్థ. ఈ పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు.


ఆకలి తీరుస్తూ...

దయం వేళ ఆరోగ్యాన్ని అందించే యోగా కేంద్రం, మధ్యాహ్నం ఆకలితీర్చే అక్షయపాత్ర, సాయంత్రం చదువులు నేర్పే సరస్వతి ఒడి... అదే వరంగల్‌లోని బస్తీబడి. కొవిడ్‌ కారణంగా అటు చదువుకు దూరమై, ఇటు తిండి కరవై అల్లాడిపోతున్న మురికివాడల పిల్లల కోసం హన్మకొండలోని సుర్జీత్‌నగర్‌లో ఈ బస్తీ బడిని హన్మకొండకు చెందిన పెండ్లి ఉపేందర్‌రెడ్డి ప్రారంభించారు. సివిల్‌ ఇంజినీర్‌ అయిన ఉపేందర్‌... తాను ప్రారంభించిన ప్రేరణ ఫౌండేషన్‌ ద్వారా విద్యార్థులకు సాయం చేస్తుంటారు. గతేడాది మార్చిలో బడులు మూతపడ్డాక మురికివాడల్లో పిల్లల అవస్థలు చూశాక విశ్రాంత ఉపాధ్యాయుడు సంపత్‌, ఉపాధ్యాయుడు టి.వి.అశోక్‌ల సాయంతో ఈ స్కూల్‌ని ప్రారంభించారు. ఈ బడికి రోజూ 50-60 మంది పిల్లలు వస్తుంటారు. కాలనీలో ఒకచోట తడికల పందిరిలో పిల్లలకు చదువు చెబుతారు. ఉదయం ఆరింటికి యోగా తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం పన్నెండు కాగానే పిల్లలందరినీ పిలిచి ఆహార పొట్లాలు అందజేస్తారు. సాయంత్రం 4-6 మధ్య పాఠాలు చెబుతున్నారు. 5-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకి వారి స్థాయినిబట్టి చదువు నేర్పిస్తున్నారు. అక్షరమాల మొదలు తెలుగు సామెతలూ, పద్యాలూ, పిల్లల సృజనాత్మకత పెంచే విధంగా కథలూ చెబుతారు. పుస్తక పఠనం అలవాటు చేస్తున్నారు. పిల్లల చదువుకు అవసరమయ్యే పలకలూ, బలపాలూ, పెన్నులూ, పుస్తకాల్నీ బడి వ్యవస్థాపకులే సమకూరుస్తున్నారు. ఈ పిల్లలకి వ్యక్తిగత పరిశుభ్రత, సానుకూల దృక్పథం లాంటి అంశాల్నీ చెబుతున్నారు. ఆదివారమూ ఈ బడికి సెలవు ఉండదు. ఆ రోజు అనేక మంది యువ ఉద్యోగులు వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు, తమకు తోచిన సాయమూ చేస్తుంటారు.

- గుండు పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న