వంటింటి అరల్లోనూ ఫ్రిజ్‌..! - Sunday Magazine
close

వంటింటి అరల్లోనూ ఫ్రిజ్‌..!

ఈ మధ్య ఎవరింట్లో చూసినా బీరువా సైజు ఫ్రిజ్‌లే కనిపిస్తున్నాయి. అదేమంటే ‘అన్నీ ఫ్రిజ్‌లోనే దాచుకోవాల్సి వస్తుంది కదా... అందుకే చిన్న సైజువి ఓ పట్టానా సరిపోవడం లేద’ని అంటున్నారు. మరి కొందరైతే, ఒకటి చాలడం లేదని  వంటింటి గట్టు కింద ఉండే కబోర్డుల్లోనూ కాస్త చిన్న సైజు రిఫ్రిజిరేటర్లను అమర్చేస్తున్నారు. అవేంటో చూద్దామా మరి..!

ఎంత పెద్ద వంటిల్లు ఉన్నా ఫ్రిజ్‌ను మాత్రం ఎక్కువగా డైనింగ్‌ హాల్లోనే పెడుతుంటాం. దాంతో నాలుగు పచ్చిమిర్చి కావాలన్నా, రెండు టొమాటోలు కావాలన్నా మాటిమాటికీ అక్కడకు వెళ్లడం విసుగ్గా అనిపిస్తుంది. అదే కిచెన్‌ గట్టు కింద ఉన్న అరలోనే ఉంటే తీసుకోవడానికి ఎంత బాగుంటుందో కదా... ఆ వెసులుబాటు కోసం వస్తున్నవే ఈ అండర్‌ కౌంటర్‌ రిఫ్రిజిరేటర్‌లు. సూపర్‌ మార్కెట్లలో కూరగాయలూ పండ్లూ పాలూ కూల్‌డ్రింకులూ... వంటివి పెట్టుకోవడానికి అరలతో ఉన్న భారీ రిఫ్రిజిరేటర్లు ఉన్నట్లే ఇవీ ఉంటాయన్న మాట. వీటిని వంటింట్లోని కిచెన్‌ క్యాబినెట్‌కి కింద అరలు అమర్చినట్లే పెట్టేసుకోవచ్చు. అయితే ముందుగా కావాల్సిన ఫ్రిజ్‌ను ఎంపిక చేసుకుని దానికి తగ్గట్లుగా కిచెన్‌ గట్టును కట్టించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, మన అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ అండర్‌కౌంటర్‌ కూలర్‌ను ఎంపిక చేసుకోవాలి. కూరగాయలూ పండ్లూ లాంటివి ఎక్కువగా పట్టాలంటే అందుకు తగ్గట్లుగా వెడల్పాటి డ్రాలుగానీ అరలుగానీ ఉండేవాటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిల్లో కొన్నింటికి బయటకు లాక్కునే సొరుగులు ఉంటే మరికొన్ని అచ్చంగా మినీ రిఫ్రిజిరేటర్‌ని పోలినవీ ఉన్నాయి. దాంతో మనకు ఎక్కువగా అవసరమయ్యేవాటికోసం పెద్ద ఫ్రిజ్‌ దగ్గరకు వెళ్లకుండా గట్టు కిందే ఉన్న అరల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా పండ్లూ ఇడ్లీ-దోశ పిండి వంటివీ ఇందులో పెట్టుకోవచ్చు.

ఈమధ్య షాపుల నుంచి ఇంటికి తెచ్చిన కొన్ని రోజులకే సరుకుల్లో పురుగు వచ్చేస్తోంది. బహుశా అప్పటివరకూ అవి సూపర్‌మార్కెట్లలో చల్లని వాతావరణంలో ఉండి కబోర్డుల్లో పెట్టేసరికి సరిగ్గా గాలి ఆడక అలా జరుగుతుండవచ్చు. అందుకే చాలామంది సరుకుల్ని కూడా ఫ్రిజ్‌ల్లోనే పెడుతున్నారు. కానీ వండిన పదార్థాలూ పండ్లూ కూరగాయలూ... ఇలా అన్నీ పెట్టేసరికి ఫ్రిజ్‌ అంతా కుక్కినట్లుగా అయిపోతుంది. ఎక్కడ ఏవి ఉన్నాయో కూడా తెలీదు. అందుకే భారీ ఫ్రిజ్‌లు కొనుక్కుంటున్నా అవీ సరిపోవడం లేదు. దాంతో ఈ కిచెన్‌ గట్టు కిందా రకరకాల అరలతో కూడిన ఈ రిఫ్రిజిరేషన్‌ బాక్సుల్ని అమర్చేస్తున్నారు. వీటిల్లో కొన్నింటికి షాపుల్లోని వాటి మాదిరిగానే అద్దాలు ఉండటంతో అందులోవన్నీ చక్కగా కనిపిస్తూ ఏవి ఉన్నాయో ఏవి లేవో తెలిసిపోతుంది. పైగా వీటిల్లో రెండు రకాల ఉష్ణోగ్రతలు ఉండేలా అరలు ఉంటున్నాయి. ఇలా డ్యూయల్‌ జోన్‌ ఉండటం వల్ల ఐస్‌క్రీమ్‌లూ నూట్రిషనల్‌ డ్రింకులూ వంటివి కూలింగ్‌ ఎక్కువ ఉన్న డ్రాల్లోనూ మిగిలినవి కాస్త కూలింగ్‌ తక్కువగా ఉండే డ్రాల్లోనూ పెట్టుకోవచ్చు. అలాగే వీటిని కిచెన్‌ ఐల్యాండ్‌కి పక్కగా కూడా పెట్టుకోవచ్చు. పైగా డ్రాలు ఉండటం వల్ల ఒక్కో అరలో ఒక్కో రకం కూరగాయలు పెట్టుకోవచ్చు. దుకాణాల్లో డిస్‌ప్లే కోసం రకరకాల కూలింగ్‌ రిఫ్రిజిరేటర్లను తయారు చేసినట్లే వీటినీ కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా తయారుచేస్తున్నాయి. కాబట్టి మన కిచెన్‌కి అవసరమైనదాన్ని ఎంపిక చేసుకుంటే మెయిన్‌ ఫ్రిజ్‌లో మరీ లోడ్‌ ఎక్కువ లేకుండా ఉంటుంది మరి. ఏమంటారు?


ఆకాశంలో మెరుపుల నాట్యం

ర్షాకాలంలో ఉరుములు మెరుపులు రావడం సహజం. కానీ కాలంతో సంబంధం లేకుండా మెరుపుల విన్యాసం చూడాలంటే మాత్రం వెనెజులాకి వెళ్లాల్సిందే. అక్కడి మరకైబొ సరస్సు దగ్గర ఏడాదిలో 300 రోజులపాటు ఆకాశం మెరుస్తూ గర్జిస్తుంటుంది. సరస్సు ఉన్నంత మేరా ఆకాశంలో మెరుపులు కనిపించినప్పటికీ కెటాటుంబొ నది మరకైబొ సరస్సులోకి ప్రవహించే ముఖద్వారం దగ్గర మాత్రం వాటి విన్యాసం కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉంటుందట. అది రాత్రో పగలో కూడా తెలియదన్నట్లుగా అక్కడ ఆకాశం తెల్లవార్లూ అలా మెరుస్తూనే ఉంటుందట. మిగిలిన కాలాలతో పోలిస్తే అక్టోబరు నెలలో మరీ ఎక్కువట. ఆ సమయంలో ఆకాశంలో ఎవరో బాణాసంచా కాలుస్తున్నట్లుగా ఆ ప్రాంతమంతా రంగుల వెలుగు పరచుకుంటుందట. నిమిషానికి 16 నుంచి 40 సార్లు చొప్పున దాదాపు తొమ్మిది గంటలపాటు అక్కడ ఆకాశం అలా మెరుస్తుంటుందట. సరస్సులో నీరు వేడిగా ఉండటంతో దాన్నుంచి వచ్చే వేడి గాలులు, రాత్రివేళలో మూడువైపులా ఉన్న పర్వత అంచులమీద నుంచి వీచే చల్లని గాలులతో ఢీకొనడంవల్ల అని కొందరూ, అక్కడి నేలలో యురేనియం ఉండటంవల్లేనని ఇంకొందరూ, సరస్సు చుట్టూ ఉన్న చమురు నిక్షేపాల నుంచి వెలువడే మీథేన్‌ గాల్లో కలవడంతో ఆ ప్రాంతమంతా అస్థిరమైన వాతావరణం నెలకొంటుందనీ దానివల్లే ఈ మెరుపుల నాట్యం అని మరికొందరు నిపుణులూ ఊహిస్తున్నారే తప్ప ఇదీ అని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఆ సంగతెలా ఉన్నా ఒక్క రాత్రిలో వేలసార్లు మెరిసే ఆ ఆకాశ వింతను చూడ్డానికి సందర్శకులు మాత్రం పెద్దయెత్తున వస్తుంటారు. దాంతో ఆ ప్రాంతం ప్రముఖ పర్యటక ప్రదేశంగా మారిపోయింది. ఆ సరస్సు చుట్టూ ఉన్న గ్రామాలకు చెందిన చేపలు పట్టేవాళ్లంతా పడవల్లో పర్యటకుల్ని సరస్సు మధ్యలోకి తీసుకెళ్లి మరీ ఈ మెరుపుల వర్షాన్ని చూపిస్తారట.


మీకు తెలుసా!

ఆంగ్ల కవి, నాటక రచయిత అయిన షేక్‌స్పియర్‌ 1700కి పైగా పదాలను కనిపెట్టాడట. ఇంగ్లిష్‌ భాషలోని మూన్‌బీమ్‌, లాఫబుల్‌, ఐబాల్‌, ఛాంపియన్‌, బెడ్‌రూమ్‌, ఎగ్జైట్‌మెంట్‌... వంటి వన్నీ ఆయన సృష్టే.


ఫస్ట్‌... ఫస్ట్‌..!

భారత్‌లో మొదటి సెల్‌ఫోన్‌ సంభాషణ జరిగింది 1995 జులై 31న. అప్పటి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు కోల్‌కతా నుంచి దిల్లీలో ఉన్న కేంద్ర సమాచార శాఖ మంత్రి సుఖ్‌రామ్‌తో మాట్లాడారు.

Advertisement

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న