ఎగ్‌ కర్రీ.. ఎన్ని రకాలో! - Sunday Magazine
close

ఎగ్‌ కర్రీ.. ఎన్ని రకాలో!

బిర్యానీ, పులావ్‌, రోటీల్లాంటివి చేసుకున్నప్పుడు... జతగా మసాలా కూరలే బాగుంటాయి. శాకాహారులైతే పనీర్‌, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీలు చేసుకోవడం... అదే మాంసాహారులైతే చికెన్‌, మటన్‌ వండుకోవడం మామూలే. ఈసారి ఇవేవీ కాకుండా గుడ్డుతో ఇలాంటి కూరల్ని వండి చూడండి. కాస్త వెరైటీగానూ ఉంటుంది, రుచికి రుచీ కూడా.


ఎగ్‌ ఘీ రోస్ట్‌

కావలసినవి: ఉడికించిన గుడ్లు: ఏడు, దనియాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: టేబుల్‌స్పూను, సోంపు: టేబుల్‌స్పూను, మిరియాలు: అరచెంచా, లవంగాలు: ఆరు, దాల్చినచెక్క: ఒక ముక్క, ఎండుమిర్చి: పన్నెండు, నెయ్యి: పావుకప్పు, ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, కరివేపాకు రెబ్బలు: రెండు, టొమాటోలు: రెండు, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి దనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క, ఎండుమిర్చి వేయించుకుని, ఆ తరువాత మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి వేయించుకుని పొడిచేసిన మసాలాతోపాటు మిగిలిన పదార్థాలను వేసి బాగా కలిపి పావుకప్పు నీళ్లు పోయాలి. ఈ   కూర దగ్గరకు అయ్యాక ఉడికించిన గుడ్లు వేసి బాగా కలిపి దింపేయాలి.


అండా  కీమా కర్రీ

కావలసినవి: ఉడికించిన గుడ్లు: మూడు, గుడ్లు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, కొత్తిమీర: కట్ట, పచ్చిమిర్చి: రెండు, అల్లంవెల్లుల్లిముద్ద: టేబుల్‌స్పూను, జీలకర్ర: చెంచా, పసుపు: పావుచెంచా, కారం: రెండు చెంచాలు, దనియాలపొడి: చెంచా, పావ్‌భాజీ మసాలా: చెంచా, చాట్‌మసాలా: చెంచా, ఉప్పు: తగినంత, నూనె: మూడు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి జీలకర్ర వేయించి తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేయాలి. అవి వేగాయను కున్నాక అల్లంవెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి. తరువాత పసుపు, కారం, దనియాలపొడి, పావ్‌భాజీ మసాలా, చాట్‌మసాలా వేసి కలిపి పావుకప్పు నీళ్లు పోయాలి. ఇది కూరలా తయారై నూనె పైకి తేలాక ఉడికించిన గుడ్లను చేత్తో మెదిపి అందులో వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఇప్పుడు మిగిలిన రెండు గుడ్ల సొనను గిలకొట్టి కూరలో వేసి బాగా కలిపి అయిదారు నిమిషాలయ్యాక దింపేయాలి.


హరియాలీ ఎగ్‌ మసాలా

కావలసినవి: క్రీమ్‌: అరకప్పు, గిలకొట్టిన పెరుగు: అరకప్పు, నిమ్మరసం: రెండు చెంచాలు, వెన్న: మూడు టేబుల్‌స్పూన్లు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, ఉల్లిపాయ: ఒకటి, జీడిపప్పు ముద్ద: రెండు చెంచాలు, పచ్చిమిర్చి: అయిదు, కొత్తిమీర తరుగు: కప్పు, చాట్‌మసాలా: చెంచా, కసూరీమేథీ: చెంచా, ఉప్పు: తగినంత, ఉడికించిన గుడ్లు: నాలుగు. (రెండుగా చేసుకోవాలి)

తయారీ విధానం: ఓ గిన్నెలో పెరుగు, క్రీమ్‌ తీసుకుని రెండింటినీ బాగా కలుపు కోవాలి. అదేవిధంగా కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి వెన్న వేయాలి. అది కరిగాక అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. అయిదు నిమిషాలయ్యాక కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద వేసి వేయించి పెరుగు, జీడిపప్పు ముద్ద, చాట్‌మసాలా, కసూరీమేథీ, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇది కూరలా అయ్యాక ఉడికించిన గుడ్డు ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలిపి స్టౌ కట్టేయాలి.


ఆమ్లెట్‌ కర్రీ ఫ్రై

కావలసినవి: గుడ్లు: మూడు, ఉల్లిపాయలు: నాలుగు, పచ్చిమిర్చి: నాలుగు, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: అరచెంచా, కొబ్బరితురుము: రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: అరచెంచా, సోంపు: అరచెంచా, దనియాలపొడి: రెండు చెంచాలు, కారం: ఒకటిన్నర చెంచా, పసుపు: పావుచెంచా, గరంమసాలా: అరచెంచా, టొమాటోలు: రెండు, నిమ్మరసం: రెండు చెంచాలు, నూనె: పావుకప్పు.

తయారీ విధానం: ముందుగా మిక్సీలో కొబ్బరితురుము, జీలకర్ర, సోంపు, సగం కొత్తిమీర తరుగు, పసుపు, గరంమసాలా, కాసిని నీళ్లు పోసి మెత్తని పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి. గుడ్లసొనను ఓ గిన్నెలో వేసి బాగా గిలకొట్టి అందులో పావువంతు ఉల్లిపాయముక్కలు, రెండు పచ్చిమిర్చి తరుగు, మిగిలిన కొత్తిమీర, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి ఆమ్లెట్‌లా వేసుకుని తరువాత సన్నని ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు వేయించి ముందుగా చేసుకున్న మసాలా, ఆమ్లెట్‌ ముక్కలు, మిగిలిన పదార్థాలు వేసుకుని.. పొడి కూరలా అయ్యేవరకూ సిమ్‌లో వేయించుకుని తీసుకుంటే చాలు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న