ఆ రెండేళ్లూ.. కొత్త బట్టలూ కొనలేదు! - Sunday Magazine
close

ఆ రెండేళ్లూ.. కొత్త బట్టలూ కొనలేదు!

ఆ మధ్య పాకిస్థాన్‌ నుంచి బాంబులతో చొచ్చుకొచ్చిన డ్రోన్‌ ఒకటి... జమ్మూలో ఐదుగురు సైనికుల ప్రాణాల్ని తీసింది. అలాంటివాటిని పసిగట్టి ఎదుర్కొనే వ్యవస్థ ఇప్పటిదాకా మనకు లేదు. ఆ సాంకేతికతని ఏ అగ్రదేశం నుంచో తెచ్చుకుంటారని అందరూ అనుకుంటే... మన సైన్యం ‘జెన్‌ టెక్నాలజీ’ సంస్థని ఆశ్రయించి ఆశ్చర్యపరిచింది. ఆ ఒప్పందంతో ఈ హైదరాబాదీ సంస్థ పేరూ, షేరూ ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడిలా నింగికెగసిన ఈ సంస్థ ప్రయాణం ఒకప్పుడు పాతాళం నుంచి ప్రారంభమైందంటున్నారు సంస్థ సీఎండీ అట్లూరి అశోక్‌కుమార్‌. ఆ కథ ఇది..

అది 1993వ సంవత్సరం. ఓ పెద్ద కుదుపు నుంచి మా కుటుంబం అప్పుడప్పుడే కోలుకుంటూ ఉంది. హైదరాబాద్‌ చైతన్యపురి దగ్గర మానాన్న కట్టిన ఇల్లు అమ్మేసి.. సికింద్రాబాద్‌లో అద్దె ఇంటికి మారాం. మేం కొత్తగా వచ్చిచేరిన ఆ ప్రాంతం సైనిక
స్థావరాలున్న కంటోన్మెంట్‌ ఏరియా. ఒకప్పుడు నిజాం నవాబుకి సాయపడేందుగ్గాను బ్రిటిష్‌వాళ్లు ఈ కంటోన్మెంటుని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో నాటి హైదరాబాద్‌ నగరానికి శివారుగా ఉండే ఈ ప్రాంతం... స్వాతంత్య్రం వచ్చాక దానికదే ఓ నగరంగా మారిపోయింది. కంటోన్మెంట్‌ చుట్టూ ఎన్నో ఇళ్ళు ఏర్పడ్డాయి. ఆ ఇళ్ళ మధ్యే... సైనిక కాలేజీ ఫైరింగ్‌ శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి. సైనికులు అలా తుపాకీ పేలుస్తుంటే మురికివాడల పిల్లలు అక్కడికి చేరిపోయేవారు. పేల్చిన తూటా తాలూకు సీసాన్ని ఏరు
కునేందుకు టార్గెట్‌లవైపు పరుగెత్తేవారు. వాటిని అమ్ముకుంటే... వాళ్లకి పదోపరకో దక్కేది. కానీ తుపాకీ పేల్చే సైనికుల గురి ఏ కాస్త తప్పినా... ఈ చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుండేవి. తూటా ఆ గురికి మరీ దూరంగా వెళితే... శిక్షణాకేంద్రం బయట తచ్చాడుతున్న వ్యక్తులూ చనిపోతుండేవారు! సైన్యానికి నగరంలో ఇదితప్ప మరే స్థలమూ(రేంజ్‌) అప్పట్లో లేదు. ఒక్క సికింద్రాబాద్‌ అనే కాదు భారత సైన్యానికి దేశమంతా ఇదే పరిస్థితి. అప్పట్లో సాఫ్ట్‌వేర్‌ సంస్థని నడుపుతున్న మమ్మల్ని ‘ఈ సమస్యకి కంప్యూటర్‌ల ద్వారా మీరేమైనా పరిష్కారం చూపగలరా?’ అని అడిగారు ఓ రోజు సైనికాధికారులు. ‘మేమా... ఎలా?’ అని ఆశ్చర్యపోతున్న మాకు అప్పుడే ‘షూటింగ్‌ సిమ్యులేటర్‌’ల గురించి వాళ్లు చెప్పారు. ఆ కొత్త పరికరాలు మా జీవితాన్ని మార్చేస్తాయని ఆ క్షణం నేను ఊహించనే లేదు.. నేను పుట్టింది విశాఖపట్నంలో. మా నాన్న అట్లూరి శ్యామ్‌సుందర్‌దత్‌ ఆంధ్రా వర్సిటీలో ఇంగ్లిషు ప్రొఫెసర్‌గా చేశారు. నేను పుట్టాక ఆయన అధ్యాపకవృత్తిని వదిలి దిల్లీలోని నవభారత్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఎగుమతుల వ్యాపారం పెట్టారు. నేను ఇక్కడే చదువుకున్నాను. నాన్న అధ్యాపకవృత్తికి దూరమైనా పుస్తకాలు విపరీతంగా చదువుతుండేవారు. ఇంట్లో నాతోపాటూ మా అన్నయ్యా, ఓ తమ్ముడూ చెల్లెలూ ఉన్నా... నాన్నలోని ఈ పుస్తకాల పిచ్చి నాకే బాగా పట్టింది. ఇంటర్‌ ముగించే నాటికే అయాన్‌ రాండ్‌ నవలలన్నింటినీ పిండికొట్టేశాను! ఆమె చెప్పే సబ్జెక్టివిజమ్‌ థియరీల ఆసరాతో.. పెట్టుబడి వ్యవస్థ చాలా గొప్పదంటూ మా నాన్నతో వాదనకి దిగుతుండేవాణ్ణి. ఎంతగా వ్యాపారం చేసినా ఆయన కమ్యూనిస్టు సానుభూతిపరుడు కావడంతో నాకు దీటుగా జవాబు చెబుతుండేవారు. ఈ వాదనలు పోగా... నన్ను కూర్చోబెట్టుకుని షేక్స్‌పియర్‌ నాటకాల్లోని భాషా మాధుర్యాన్ని వివరిస్తుండేవారు. ముఖ్యంగా హామ్లెట్‌ నాటకంలో పలోనియస్‌ తన కొడుక్కిచ్చే జీవిత-ఆర్థిక పాఠాల్ని విడమర్చి చెప్పేవారు. ఆయన చెబుతున్నప్పుడు వాటిన్నేను పెద్దగా పట్టించుకోలేదు... నాన్న కన్నుమూశాక కానీ వాటి విలువ తెలియలేదు! ఆయన అలా అనారోగ్యంతో చనిపోయేనాటికి నేను డిగ్రీ మొదటి ఏడాదిలో ఉన్నాను.

మిరపకాయలు అమ్మాం...

అప్పటిదాకా ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి చనిపోతే... ఆ కుటుంబం ఆర్థికంగా ఒడుదొడుకులకి లోనుకావడం సహజమే. కానీ మా సమస్య అదొక్కటే కాదు. నాన్న దగ్గర పనిచేసిన ఆడిటర్‌ల నిర్లక్ష్యం కారణంగా... సేల్స్‌, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ రిటర్న్‌లేవీ సరిగ్గా ఫైల్‌ కాలేదు. ఆయన పూచీకత్తుతో బ్యాంకు రుణాలు తీసుకున్నవాళ్లూ పత్తాలేకుండా పోయారు. దాంతో ఈ సంస్థలన్నీ మా కుటుంబాన్ని కోర్టుకులాగాయి. నాన్న నడుపుతున్న కంపెనీకి అమ్మ డైరెక్టర్‌ కావడంతో ఆమెకి అరెస్టు వారెంట్లూ జారీ చేశాయి! అప్పటికి మా అన్నయ్య ఎంసీఏ చదువుతున్నాడు... తమ్ముడూ చెల్లెలూ డిగ్రీలో ఉన్నారు. వాళ్ల చదువుకి అంతరాయం రాకూడదని ఈ కేసుల వ్యవహారాల్ని నేనే చూడటం మొదలుపెట్టాను. ఇవన్నీ చూస్తూనే అరకొర అటెండెన్స్‌తో బీకామ్‌ ముగించాను. సీఏ ఆర్టికల్స్‌కి వచ్చాక సెలవులు పెట్టడం కష్టమైపోయి మానేశాను. కానీ ఆ చదువులేవీ నేర్పలేని జ్ఞానాన్ని మాపైనున్న కేసులు నాకు నేర్పాయి. కంపెనీ చట్టాలూ, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ నిబంధనలన్నీ క్షుణ్ణంగా చదవడం మొదలు పెట్టాను. అంతకన్నా... మనుషుల్ని అర్థం చేసుకోవడం నేర్చుకున్నాను. నాన్న ఉన్నన్ని రోజులూ అతివినయం నటించినవాళ్లందరూ జారుకుంటే... మామూలుగా ఉన్నవాళ్లందరూ ముందుకొచ్చి సాయపడ్డ వింతని గమనించాను. ఇవన్నీ నాకు మంచి వ్యవహారజ్ఞానాన్నిచ్చాయి. మా పైనున్న కేసుల్ని ఒక్కొక్కటిగా సెటిల్‌ చేస్తూ వెళ్లాను. అప్పట్లోనే మా నాన్న పాత మిత్రుడొకాయన మమ్మల్ని మిరపకాయల బిజినెస్‌ చేయమని సలహా ఇచ్చారు. మాకు వాటి గురించేమీ తెలియదని చెప్పినా వినకుండా 65 ట్రక్కుల మిరప కొనుగోలు చేయించారు. ఆ వ్యాపారమే కొంతవరకూ మా కుటుంబాన్ని మళ్లీ నిలబెట్టింది. ఆ మిరపకాయల బిజినెస్సులో ఉన్న మేం కాస్తా కంప్యూటర్‌ల వైపు వెళ్లడానికి నా పుస్తకాల పిచ్చే కారణమైంది...

కంప్యూటర్‌ లోకంలోకి..

సీఏ మానేశాక అప్పుడప్పుడూ మా అన్నయ్య దగ్గరున్న కంప్యూటర్‌ పుస్తకాలని తిరగేస్తుండేవాణ్ణి. అవి నాకు చాలా ఆసక్తిగా అన్పించి కోడింగ్‌ నేర్చుకున్నాను. విడిభాగాలు కొని కంప్యూటర్‌ని అసెంబుల్‌ చేయడం కూడా మొదలుపెట్టాను. సరిగ్గా అప్పుడే హైదరాబాద్‌లో కంప్యూటర్‌ బూమ్‌ మొదలైంది. అన్నయ్య ఎలాగూ ఎంసీఏ కాబట్టి ఇద్దరం కలిసి టార్చ్‌ కంప్యూటర్స్‌ అనే సంస్థని ప్రారంభించాం. పాత కేసుల సెటిల్‌మెంట్లో భాగంగా నాన్న కట్టిన ఇంటిని అమ్మేసి... సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతానికి మారాం. ఈ కొత్త కంప్యూటర్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ మూడుపువ్వులూ ఆరుకాయలన్నట్టే ఉన్నా... నాకు పెద్దగా సంతృప్తినివ్వలేదు. మాదైన పరిశోధనతో ఏదైనా కొత్తగా ఆవిష్కరించి సొంత సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు తయారుచేయాలనే కోరిక ఉండేది. అప్పుడే సైన్యం ఎదుర్కొంటున్న ఫైరింగ్‌ రేంజ్‌ సమస్య గురించి అధికారులు చెప్పారు. వాటికి పరిష్కారంగా ‘షూటింగ్‌ సిమ్యులేటర్‌’ని తయారుచేసివ్వమన్నారు. అదేమిటీ అంటారా... నేటి షాపింగ్‌ మాల్స్‌లో పిల్లల కోసం ఏర్పాటుచేసే ‘వర్చువల్‌ రియాల్టీ గేమింగ్‌’ పరికరాలని చూసుంటారు కదా! ఓ కంప్యూటర్‌ తెరకి ఎదురుగా తుపాకీలాంటిదాన్ని పెడతారు. తెరపైన కదిలే బొమ్మల్ని ఈ తుపాకీతో పేల్చమంటారు. తుపాకీలోని ఇన్‌ఫ్రారెడ్‌ రేస్‌తో ఆ లక్ష్యాల్ని ఎన్నిసార్లు కొడితే అన్ని పాయింట్స్‌ ఇస్తారు. షూటింగ్‌ సిమ్యులేటర్‌ అలాగే ఉంటుంది... నిజానికి ఇప్పుడు మనం చూస్తున్న వర్చువల్‌ గేమింగ్‌ పరికరాలన్నింటికీ అది జేజమ్మలాంటిది. ఇందులో కంప్యూటర్‌ తెరలో మనం గురిపెట్టాల్సిన లక్ష్యం ఉంటే... దాన్ని చూస్తూ మిలటరీవాళ్లు తుపాకిని పేల్చాలి. కాకపోతే వాటి నుంచి తూటాలకి బదులు ఓ ‘లేజర్‌ సిగ్నల్‌’ దూసుకెళ్లి తెరని తాకుతుంది. అది అలా తాకగానే కంప్యూటర్‌... పేల్చినవాళ్లు తుపాకిని పట్టుకున్న తీరు(హ్యాండ్లింగ్‌), గురి చూసిన విధానం(ఎయిమింగ్‌), ట్రిగ్గర్‌ నొక్కిన పద్ధతి(ట్రిగ్గరింగ్‌)ని అప్పటికప్పుడు విశ్లేషించి చెబుతుంది. దీనికి పెద్దగా స్థలం(రేంజ్‌) అక్కర్లేదు. 1990లో ఇలాంటిదాన్నే తమకి చేసివ్వమన్నారు సైనికులు. అప్పటికే అమెరికా నుంచి కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఇలాంటి పరికరాన్ని తెచ్చారు కానీ... అది మన పరిస్థితులకి తగ్గట్టు లేకపోవడంతో వాడకుండా మూలనపడేశారు. మమ్మల్ని తక్కువ ఖర్చులో, మనకి వీలుగా ఉండేలా చేసివ్వమన్నారు.

ఆస్తులన్నీ ఆవిరి..

మా అన్నయ్య ఫ్రెండ్‌ మిడతల రవి అని ఉండేవారు. ఆయన ఇంటర్‌ డ్రాపవుట్‌ అయినా... కంప్యూటర్‌ ఆద్యంతాలు చూడగలడు. ఆయన్ని భాగస్వామిగా చేసుకుని పని మొదలుపెట్టాం. ఆరునెలల్లోనే ఆర్మీవాళ్లు కోరుకున్నట్టు ‘రైఫిల్‌ సిమ్యులేటర్‌’ తయారుచేశాం. దాన్ని చూసిన సైనికాధికారులందరూ ఎంతో మెచ్చుకున్నారు. వాళ్ల మాటలు మాకెంత ఆత్మవిశ్వాసాన్నిచ్చాయంటే... ఇక వీటి తయారీయే మా జీవితం అనుకున్నాం. విదేశీ పరికరాల దిగుమతితో నష్టపోతున్న మన సైన్యం డబ్బుని ఈ రకంగా ఆదా చేయడమే మా లక్ష్యమనుకున్నాం. అందుకోసమే మా పాత సంస్థ టార్చ్‌ కంప్యూటర్స్‌ని మూసి... జెన్‌ టెక్నాలజీని ప్రారంభించాం. కానీ ఈ సంభ్రమమంతా అట్టేకాలం నిలవలేదు. సైన్యం కోసం లక్షల రూపాయల పరికరం అమ్మడమంటే ప్రభుత్వాధికారులతో కూడుకున్న వ్యవహారం కదా! వాళ్ల దగ్గరకెళితే నెలల తరబడి తిప్పించుకుని... ఆ తర్వాత తీరిగ్గా ఆర్డర్‌ ఇవ్వలేమని చెప్పేవారు. వాళ్లకి ‘డెమో’ చూపించడం కోసం మా పరికరాలన్నీ తీసుకెళ్లడానికి 50 వేల దాకా ఖర్చవుతుండేది. దానికితోడు తయారీ ఖర్చులూ పెరుగుతుండటంతో... మాకు ఏ కాస్తోకూస్తో మిగిలిన ఆస్తులన్నీ అమ్మేశాం. రెండేళ్లపాటూ ఇంట్లో ఎవ్వరం కొత్తబట్టలూ కొనలేదు. మరో ఏడాదీ పరిస్థితి ఇలాగే ఉండటంతో విసిగి వేసారిపోయాం. ఆశలన్నీ వదులుకుని మా పరికరాన్ని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీ(అప్పా) ఆవరణలో ఉచితంగానే ఇన్‌స్టాల్‌ చేసి వచ్చేశాం! ఆర్నెల్ల తర్వాత దిల్లీ పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది... ‘మీ సిమ్యులేటర్‌ మాకు అమ్ముతారా! రూ.8 లక్షలకంటే ఎక్కువ ఇవ్వలేం. ఓకేనా?’ అని. ఆ ప్రశ్నే... ప్రస్తుతం మాకున్న వందలకోట్ల టర్నోవర్‌కి నాందీ ప్రస్తావనగా నిలిచింది! 

110 పేటెంట్లు..

‘అసలు కంప్యూటర్‌ సాయంతో షూటింగ్‌ నేర్చుకోవడం సాధ్యమేనా? ’- 1998లో నాటి ఆంధ్రప్రదేశ్‌ ఐజీగా ఉన్న ఏకె మహంతికి ఈ సందేహం వచ్చింది. వెంటనే- పోలీసు శిక్షణ తీసుకుంటున్న 50 మందిని సగం-సగం విభజించి ఓ వర్గానికి మామూలు రేంజర్‌ శిక్షణ, ఇంకో వర్గానికి సిమ్యులేటర్‌ శిక్షణ ఇప్పించారు. ఆ ఇరువర్గాలని నిజంగా పరీక్షించినప్పుడు సిమ్యులేటర్‌తో చేసినవాళ్లు వందకు వంద సక్సెస్‌ అయ్యారు! ఆ తర్వాతే మాకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఆర్డర్‌ ఇచ్చారు. అదయ్యాకే భారతసైన్యం తీసుకోవడం మొదలుపెట్టింది. మన సైన్యం విదేశాల అత్యాధునిక ఆయుధాలని తీసుకుంటూ ఉంటుందికానీ ప్రతిసారీ వాటినే వాడుతూ సైనికులకి శిక్షణ ఇప్పించాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. ఆ ఖర్చుని తగ్గించుకోవడం కోసం మమ్మల్ని సిమ్యులేటర్‌లు తయారుచేయమనేది. వాళ్లకోసం ఐసీవీ- బీఎంపీ సాయుధ శకటం సిమ్యులేటర్‌ని చేసివ్వడం మా కెరీర్‌లో పెద్ద మలుపు. సైన్యం వరసగా రెండేళ్లపాటు అలాంటి ఆర్డర్‌లు ఇవ్వడంతో మా దశ తిరిగిపోయింది. ఆ తర్వాత మన సైన్యం దగ్గరున్న అన్ని ఆయుధాలకీ సిమ్యులేటర్‌లని తయారు చేయడం మొదలుపెట్టాం. ఆ రకంగా మన దేశానికి కోట్ల రూపాయలు ఆదా చేశాం. ఆ క్రమంలో మాకంటూ ముప్ఫై పేటెంట్‌లు సాధించి... విదేశాలకీ ఎగుమతి చేస్తున్నాం! ఇక భవిష్యత్తు యుద్ధాల్లో డ్రోన్‌లదే కీలకపాత్ర అవుతుంది కాబట్టి... వాటిని నిర్వీర్యం చేసే ‘జెన్‌ యాంటీడ్రోన్‌ సిస్టమ్‌’(జడ్‌ఏడీఎస్‌)నీ రూపొందించాం. జమ్మూలో మనవాళ్లపైన డ్రోన్‌ దాడి తర్వాత... భారత వైమానిక దళం రూ.155 కోట్లతో దీనికోసమే మాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నో దేశవిదేశీ సంస్థలు పోటీపడ్డా ఈ అవకాశం మాకే దక్కడంతో మార్కెట్లో మా షేరు విలువ వారంలోనే 119 శాతం పెరిగింది!

ఒకప్పుడు కేవలం ఐదుగురితో మొదలైన మా సంస్థలో మూడువందల మంది సిబ్బంది ఉన్నారు. ఎంతోమంది మాజీ సైనికాధికారులూ మా సంస్థలో చేరారు. మా అన్నయ్య కిశోర్‌దత్‌ ప్రెసిడెంట్‌గానూ, మా భాగస్వామి రవి మిడతల డైరెక్టర్‌గానూ ఉంటున్నారు. అందరం... సాంకేతికత పరంగా మన సైన్యం ఎవ్వరిమీదా ఆధారపడాల్సిన అవసరం రాకూడదన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నాం!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న