ఆ మేడమ్‌ క్లాస్‌ విన్నాక.. ఇష్టం పెరిగింది! - Sunday Magazine
close

ఆ మేడమ్‌ క్లాస్‌ విన్నాక.. ఇష్టం పెరిగింది!

జిటా... బ్యాంకింగ్‌ రంగంలో సేవలకు అత్యాధునికమైన సాంకేతికతను అందిస్తోన్న అంకుర సంస్థ. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ విలువని ఇటీవల రూ.11వేల కోట్లుగా లెక్కించి సుడెక్సో, సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులు పెట్టాయి. ఈ మధ్య చాలా సంస్థలు యూనికార్న్‌(బిలియన్‌ డాలర్‌ కంపెనీ) మైలురాయిని అందుకుంటున్నా, జిటా ప్రత్యేకత ఏంటంటే దీని సహ వ్యవస్థాపకుడూ, కీలకమైన ‘చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌’ తెనాలి యువకుడు రామకృష్ణ గడ్డిపాటి కావడం. సాంకేతిక ప్రపంచానికి తెలుగువారి సత్తాను చాటి చెబుతున్న రామకృష్ణ ప్రయాణమిది...

నేను పుట్టిపెరిగింది గుంటూరు జిల్లాలో. అమ్మావాళ్ల ఊరు తెనాలి. నాన్నావాళ్లది  గూడవల్లి. నాకు నెలల వయసులోనే నాన్న నాగేశ్వరరావు చనిపోవడంతో ఎక్కువగా అమ్మమ్మగారింటి దగ్గరే పెరిగాను. అమ్మ విజయలక్ష్మి, మారు తండ్రి చంద్రమౌళి దగ్గర కొన్నాళ్లు ఉన్నాను. అమ్మమ్మా, నానమ్మా, పెద్దమ్మలూ, మేనమామా నాకు ఏలోటూ రాకుండా చూసుకున్నారు. పదో తరగతి వరకూ తరచూ స్కూళ్లు మారేవాణ్ని. ఇంటర్మీడియెట్‌ కూడా తెనాలిలోనే ఫస్ట్‌ ఇయర్‌ సెకండ్‌ ఇయర్‌ వేర్వేరు కాలేజీల్లో చదివా. స్కూల్‌ రోజుల్లో హిందీ, సోషల్‌ తప్పించి మిగతా సబ్జెక్టుల్లో ఎప్పుడూ ముందుండేవాణ్ని. అమ్మవైపు బంధువుల్లో ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నారు. అన్నయ్య (పెద్దమ్మ కొడుకు) కార్డియాలజిస్టుగా అమెరికాలో స్థిరపడ్డాడు. నేనూ డాక్టర్‌ అవ్వాలనుకునేవాణ్ని. అందుకే బైపీసీ తీసుకున్నా. మాది కొత్త కాలేజీ... అప్పట్లో అమ్మాయిలకూ, అబ్బాయిలకీ వేర్వేరు క్యాంపస్‌లు ఉండేవి. అబ్బాయిల క్యాంపస్‌లో బైపీసీ సెక్షన్‌కి విద్యార్థులు లేకపోవడంతో నన్ను బయాలజీ క్లాసులకు అమ్మాయిల క్యాంపస్‌కు తీసుకెళ్తుండేవారు. రెండు నెలలైనా అబ్బాయిలెవరూ బైపీసీలో చేరకపోవడంతో నన్ను కూడా ఎంపీసీలో చేరిపోమన్నారు. అప్పటికే బాగా ఆలస్యం కావడంతో ఇంకో అవకాశంలేక సరేనన్నాను. ఇలా మారడంవల్ల ఎక్కడ వెనకబడతానోనని మరింత కష్టపడి చదివా. ఫస్టియర్‌లో రాష్ట్రస్థాయిలో టాప్‌-10లో ఒకడిగా నిలిచా. 1998లో ఇంటర్మీడియెట్‌ మంచి మార్కులతో పాసయ్యా. ఇంజినీరింగ్‌ ఏదైనా జాతీయస్థాయి కాలేజీలో చదవాలనుకున్నా. ఐఐటీలకు కాలేజీలో శిక్షణ ఇవ్వలేదు. ఇంటర్మీడియెట్‌ మార్కులతో బిట్స్‌ పిలానీలో సీటు వచ్చింది. కంప్యూటర్‌ సైన్స్‌లో రాలేదు కానీ, ఆ క్యాంపస్‌లో ఏ సీటైనా ప్రత్యేకమేనని ‘మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌’లో చేరాను. బిట్స్‌లో ఏ గ్రూప్‌ స్టూడెంట్‌ అయినా తనకు నచ్చిన సబ్జెక్టులు చదువుకోవచ్చు, నచ్చిన క్లాసులకి హాజరుకావొచ్చు. హాజరు గురించి పట్టింపు ఉండదు. పరీక్ష పాసయితే చాలు. ఆ వాతావరణం ఇష్టమైన అంశాలపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టేలా ఉంటుంది. అక్కడ ఉషా సుబ్రమణ్యం మేడమ్‌ క్లాసు మొదటిసారి విన్నాక ప్రోగ్రామింగ్‌, కంప్యూటర్స్‌పైన ఇష్టం పెరిగింది. ఆవిడ క్లాసులు ఆడిటోరియంలో జరిగేవి. సీట్లు సరిపోక, ద్వారాలూ, కిటికీల దగ్గరా నిల్చొని వినేవాళ్లం. మిగతా ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఏదైనా ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఎక్కువ టైమ్‌ పడుతుంది. అదే కంప్యూటర్‌ సైన్స్‌లో అయితే ప్రాజెక్టు అనుకోవడం, దాన్ని అభివృద్ధి చేయడం, అమలు చేయడం చాలా వేగంగా జరిగిపోతాయి. కంప్యూటర్స్‌పైన నాకు ఆసక్తి కలగడానికి అది కూడా ఓ కారణమని చెప్పాలి. కాలేజీలో ఉన్నపుడే మొదటి సెమిస్టర్‌ పూర్తయ్యాక పీసీ కొనిచ్చారు ఇంట్లోవాళ్లు. ఆ నాలుగేళ్లూ కంప్యూటరే ప్రపంచం. ప్రోగ్రామింగ్‌లో సాంకేతికతతో పాటు సృజనాత్మకతా ఉందనిపించింది.

బిట్స్‌లో మొదటి అంకుర సంస్థ

క్యాంపస్‌ ఇంటర్వ్యూలోనే నాకు ఉద్యోగం వచ్చింది. అయితే 2001లో అమెరికాలో ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత సంఘటనతో ఉద్యోగం ఇవ్వలేమని చెప్పేసిందా సంస్థ. దాంతో 2002లో హైదరాబాద్‌ వచ్చి లీప్‌స్టోన్‌ సిస్టమ్స్‌ అనే కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరాను. ఎంత గొప్పగా ప్రోగ్రామింగ్‌ చేస్తున్నా నా డిగ్రీ మాత్రం ‘మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌’ అని ఉండేది. దాంతో ఉద్యోగ ప్రయత్నాల్లో, ఇతర అంశాల్లో ఇబ్బంది అయ్యేది. అంతకుమించి నా భవిష్యత్తు కంప్యూటర్‌ సైన్స్‌లోనే అనుకుంటూ అందులో డిగ్రీ లేకపోవడం మంచిది కాదనిపించి ఏడాది తర్వాత బిట్స్‌లో ‘మాస్టర్స్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌’ చేయడానికి వెళ్లా. ఈసారి చదువుతూనే టీచర్‌గా పనిచేసే అవకాశమూ వచ్చింది. మొదట్నుంచీ సొంత కంపెనీ పెట్టాలని ఉండేది. అందుకే బిట్స్‌లో ఉంటూనే మిత్రులతో కలిసి 2004లో ‘బ్రైడల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సిస్టమ్స్‌(బిట్స్‌)’ని మొదలుపెట్టా. బిట్స్‌లో పురుడుపోసుకున్న మొట్టమొదటి కంపెనీ ఇదే. ఆ కంపెనీకి సీఈఓ నేనే అయినా ప్రధానంగా ప్రోగ్రామింగ్‌ చేసేవాణ్ని. కంపెనీని విస్తరించడానికి హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆఫీసు పెట్టాను. అప్పుడప్పుడే మొబైల్‌ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. వాటిచుట్టూ ఏదైనా చేయాలనుకున్నాం. అప్పుడు 2-3 రకాల సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు తెచ్చాం. వాటిలో ‘స్కూల్‌మేట్‌’ ఒకటి. విద్యార్థుల హాజరు, మార్కులూ, ఫీజులూ మొదలైన వివరాలు మెసేజ్‌ ద్వారా తల్లిదండ్రులకు పంపే వెసులుబాటు ఉండేది దాంట్లో. హైదరాబాద్‌, వైజాగ్‌లలోని కొన్ని స్కూళ్లు దీన్ని వినియోగించేవి. 2007 నాటికి ఏటా రూ.2.3కోట్ల ఆదాయం వచ్చేది. అయితే ఇంట్లోవాళ్లకి నేను చేస్తున్న పనిమీద అసంతృప్తి ఉండేది. ఏదైనా ఎంఎన్‌సీలో చేరమని ఒత్తిడి చేయడంతో 2007లో మోర్గాన్‌ స్టాన్లీలో చేరాను. అక్కడ ఓ విభాగంలో పదేళ్లుగా ఒకే రకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుండేవారు. నేను వెళ్లాక ఏడాదిలో దానికి అయిదు ప్రత్యామ్నాయాలు చూపించాను.

యువకులతో పనిచేయాలని...

నాకు మొదట్నుంచీ వినూత్నమైన సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తిని తేవాలని ఉండేది. అందుకే జీతం బాగా వస్తున్నా ఉద్యోగం చేయబుద్ధి కాలేదు. అప్పటికి సిలికాన్‌ వ్యాలీ గురించి రోజూ వార్తలు వస్తుండేవి. అక్కడకు వెళ్లాలనుకున్నా ఆర్థికమాంద్యం లాంటి అంశాలవల్ల కుదరలేదు. అలాగని మోర్గాన్‌ స్టాన్లీలోనూ ఇమడలేకపోయా. ఆ సమయంలో ‘డైరెక్టై’ వ్యవస్థాపకుడు భావిన్‌ తుకారియా గురించి ఓ మ్యాగజైన్లో చదివాను. ముంబయికి చెందిన భావిన్‌, దివ్యాంక్‌ సోదరులు వినూత్న ఉత్పత్తులతో ఇంటర్నెట్‌ మార్కెట్‌లో తమదైన మార్కుని చూపిస్తున్నారు. నా వయసున్న ఆ కుర్రాళ్లతో పనిచేస్తే కొత్తగా ఆలోచించవచ్చని భావించాను. అప్పట్లో వారు ఒక ప్రోగ్రామింగ్‌ సమస్యను ఇచ్చి దాన్ని పరిష్కరించినవాళ్లకి ఉద్యోగావకాశం ఇచ్చేవారు. నేను సంప్రదిస్తే ఓ పరీక్ష పెట్టారు. ప్రోగ్రామింగ్‌ చేసి పంపడంతో ఇంటర్వ్యూ కోసం ముంబయి రమ్మన్నారు. నవంబరు 26, 2008 అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి ముంబయికి ఫ్లైట్‌ బుక్‌ చేసుకున్నా. ముంబయిలో దిగాకే ఆరోజు రాత్రి పాకిస్థాన్‌ ముష్కరులు హోటళ్లమీద దాడిచేశారని తెలిసింది. భావిన్‌ తన సిబ్బందిని పంపించి నన్ను క్షేమంగా హోటల్‌కి తీసుకువెళ్లేలా చూశాడు. మర్నాడు ఆఫీసుకి ఎవరూ రాలేదు. భావిన్‌, నేనూ మాత్రమే ఉన్నాం. రోజంతా నన్ను వివిధ రకాలుగా ప్రశ్నించి అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చాడు.

బ్యాంకింగ్‌ వ్యవస్థను మార్చేయాలని..

డైరెక్టైలో ‘టెక్‌ లీడ్‌’గా బాధ్యతలు తీసుకున్నా. అక్కడ ‘ఫ్లాక్‌’, ‘స్లాక్‌’ లాంటి ఉత్పత్తులు తెచ్చాం. ఇవి ఒక సంస్థలో ఉద్యోగులు అంతర్లీనంగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఉపయోగపడే వేదికలు. అదే సమయంలో అమెరికాలో కంపెనీ విస్తరణ కోసం కొన్నాళ్లు అక్కడికి వెళ్లి పనిచేశాను. డైరెక్టై ద్వారా కొత్త ఉత్పత్తులు తేవడంలో పురోగతి సాధించాం. కానీ చిన్నచిన్న సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్నాం కానీ ఏదైనా ఒక వ్యవస్థ గతిని మార్చే పెద్ద ఆవిష్కరణ చేయలేకపోతున్నామన్న భావన నాకు ఉండేది. భావిన్‌కు చెబితే తనూ అలాగే ఫీలయ్యాడు. ఇద్దరం కలిసి ఆ దిశగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో డైరెక్టైని 2014లో వేరే సంస్థకు అమ్మేశాం. నాలుగైదు నెలలు ఆలోచించాక బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగంలోకి అడుగుపెట్టాలను కున్నాం. ఇక్కడ దాదాపు నలభై ఏళ్ల కిందటి సాంకేతికతనే ఇప్పటికీ వాడుతూ వస్తున్నారు. ఆ రంగంలో మార్పు తెస్తే బ్యాంకులకే కాదు, సామాన్యుల సమస్యలకీ పరిష్కారం చూపవచ్చనుకున్నాం. బ్యాంకింగ్‌ రంగానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందించడమా, లేదంటే డిజిటల్‌ చెల్లింపుల కంపెనీని పెట్టడమా అని ఆలోచించి మాకు ప్రోగ్రామింగ్‌ మీదే పట్టు ఉంది కాబట్టి మొదటి అంశంమీదే దృష్టి పెట్టాలనుకున్నాం. బ్యాంకింగ్‌ రంగంలో విప్లవంగా చెప్పుకోదగ్గ మార్పు తేవడం స్వల్ప వ్యవధిలో ఎవరికీ సాధ్యం కాదు. అలాగని మేం ఎక్కువ కాలం ఏ ఉత్పత్తీ తేకుంటే మమ్మల్ని పరిశ్రమ గుర్తించదు. అందుకని మా అంతిమ లక్ష్యమైన బ్యాంకింగ్‌ సేవల సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తూనే మధ్యలో ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే కెఫెటేరియా చెల్లింపులూ, పర్యటనలూ, గిఫ్ట్‌ కార్డులూ, హెల్త్‌ కార్డులూ తదితర సేవల్ని అందించేలా ఓ ఉత్పత్తిని తెచ్చాం. ఆ సమయంలో యాక్సెంచర్‌, ఐబీఎమ్‌ లాంటి కంపెనీలు సహా కొన్ని బ్యాంకులూ మా ఖాతాదారులుగా మారాయి. అప్పటివరకూ ఫ్రెంచ్‌ కంపెనీ సుడుక్సో ఈ విభాగంలో దిగ్గజంగా ఉండేది. మేం వారి మార్కెట్‌ని డిజిటల్‌గా సొంతం చేసుకోవడాన్ని గమనించి మాతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చింది. 2017 నుంచి ‘ఉద్యోగుల లబ్ధి’ విభాగంలో మేం కలిసి పనిచేస్తున్నాం. మా సాంకేతికతతో సుడుక్సో వివిధ దేశాల్లో సేవలు అందిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ మా సాంకేతికతతోనే...

మేం అనుకున్న ప్రధాన ఉత్పత్తి 2020 జనవరి ఒకటిన సిద్ధమైంది. అదే ‘టాకియాన్‌...’ ఈ సాంకేతికత ఉపయోగించి బ్యాంకులు- డిపాజిట్లు, వ్యక్తిగత రుణాలూ, గృహ రుణాలూ, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులూ... ఇలా అన్నిరకాల సేవల్నీ నిర్వహించుకోవచ్చు. అంతకు ముందు బ్యాంకులు వేర్వేరు సర్వీసులకు వేర్వేరు సాంకేతికతలను ఉపయోగించేవి. దాంతో ఖర్చూ, నిర్వహణా వాటికి భారమయ్యేవి. వాటన్నింటినీ ఒకే వేదికమీదకు తెచ్చిన మొదటి కంపెనీ మాదే. దేశంలో ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ పూర్తిగా మా టాకియాన్‌ సాంకేతికతను వాడుతోంది. కొన్ని నెలలపాటు అన్ని విధాలుగా పరీక్షించాకే హెచ్‌డీఎఫ్‌సీ మా సాంకేతికతను వినియోగించడానికి అంగీకరించింది. ఆరు ప్రైవేటు బ్యాంకులూ వేర్వేరు విభాగాల్లో టాకియాన్‌ను ఉపయోగిస్తున్నాయి. త్వరలో కొన్ని అమెరికా బ్యాంకులూ ఈ సాంకేతికతను వినియోగించనున్నాయి. ఇది కాకుండా ‘ఫ్యుజన్‌’ అనే మరో సాంకేతికతనూ తెచ్చాం. ఇది బ్యాంకులు బ్రాంచుల్లో కాకుండా డిజిటల్‌గా కస్టమర్లకి కావాల్సిన చోటే సేవలు అందించే సాంకేతికత. దీన్ని బ్యాంకులతోపాటు ఫిన్‌టెక్‌ కంపెనీలూ ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఎనిమిది దేశాల్లో పది బ్యాంకులూ, 25 ఫిన్‌టెక్‌ కంపెనీలూ మా సాంకేతికతను వాడుతున్నాయి. వీటిని క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా అందించడంవల్ల బ్యాంకులకు ఐటీ నిర్వహణ భారం తగ్గిపోనుంది. వాళ్లు పూర్తిగా బ్యాంకింగ్‌ అంశాలపైనే దృష్టి పెట్టొచ్చు. కరోనా మహమ్మారి వచ్చాక బ్యాంకింగ్‌ సేవలు ‘డిజిటల్‌ ఫస్ట్‌’గా మారాయి. ఇందుకు అవసరమైన సాంకేతికతను అందించడంలో పోటీ కంపెనీలకంటే మేం ఎంతో ముందున్నాం. ‘జిటా’ పనితనాన్ని గుర్తించిన జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ మా సంస్థ విలువను 1.54 బిలియన్‌ డాలర్లు(రూ.11వేల కోట్లు)గా లెక్కకట్టి మే నెలలో రూ.1800 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ మొత్తాన్ని సాంకేతికత అభివృద్ధి కోసం, విదేశీ మార్కెట్లలో విస్తరణ కోసం ఉపయోగిస్తాం. రాబోయే రెండేళ్లలో ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ మా సాంకేతికత ఉండాలని లక్ష్యం పెట్టుకున్నాం.

రోజూ 12-14 గంటలపాటు పనిచేస్తూ ఆటవిడుపు కోసం తెలుగుదనాన్ని ఆశ్రయిస్తా. తెలుగు సినిమాలు చూస్తా, తెలుగు పాటలు వింటా, తెలుగు పత్రికలు చదువుతా. త్వరలో ప్రపంచంలోని మరిన్ని అత్యుత్తమ కంపెనీలు
భారత్‌ నుంచి వస్తాయి. వాటి వెనక మరింత మంది తెలుగువాళ్లను చూడబోతున్నాం. ప్రతి నాలుగు అవకాశాల్లో రెండు లేదంటే ఒక్కటైనా తెలుగువాళ్లే సొంతం చేసుకుంటారనడంలో సందేహమే లేదు!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న