మీకోసం.. మేమున్నాం..! - Sunday Magazine
close

మీకోసం.. మేమున్నాం..!

కదల్లేకా, కనుచూపు లేకా ఇబ్బంది పడే ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు చదువు చెప్పించడం అంటే చిన్న విషయం కాదు. వారి బాగోగులు చూసుకుంటూ సరైన సౌకర్యాలు కల్పించడమూ ఓ సవాలే. అలాంటి వందలాది అభాగ్యులకు చదువు చెప్పిస్తూ మరెందరో దివ్యాంగుల పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నారు ‘సైకోరియన్లు’.. అదేనండీ, విజయనగరంలోని కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థులు!

ది 2009... నెదర్లాండ్స్‌కు చెందిన ‘ఫ్రెండ్‌ ఇన్‌డీడ్‌’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు ఆనా లెగ్‌ ల్యాండ్‌ మనదేశంలోని మత్స్యకారగ్రామాల్లో పర్యటిస్తూ విజయనగరం జిల్లా పూసపాటిరేగకీ వచ్చింది. అక్కడ ఎక్కువ సంఖ్యలో కనిపించిన దివ్యాంగుల్ని చూసి చలించిపోయింది. వారికోసం ఏదైనా సాయం చేయాలన్న ఆలోచనతో విరాళాలు సేకరించి ‘క్యాంపస్‌ ఛాలెంజ్‌’ పేరుతో ఓ పాఠశాలను ఏర్పాటు చేసింది. విద్యార్థులతో పాఠశాల బాగా నడుస్తోంది. అప్పుడే ఆనా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆమెలో ‘క్యాంపస్‌ ఛాలెంజ్‌ స్కూల్‌ బాధ్యత ఎవరికి అప్పగించాలి’ అన్న మీమాంస మొదలైంది. సరిగ్గా అప్పుడే హైదరాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా వీధి బాలల కోసం ‘కృషి హోమ్స్‌’ నడుపుతున్న కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థుల గురించి తెలిసింది. వారు చేసే సేవా కార్యక్రమాలు నచ్చి తను నడుపుతున్న దివ్యాంగుల పాఠశాల బాధ్యత వాళ్లకు అప్పజెప్పి వెళ్లిపోయింది. దీంతో 2014 నుంచి కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థులు ఆ బాధ్యతను తీసుకుని ఆనాతో కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు.

చదువు నుంచి ఉపాధి వరకు...

ఈ క్యాంపస్‌ ఛాలెంజ్‌ స్కూల్లో ప్రస్తుతం 150 మంది దివ్యాంగులున్నారు. వీళ్లకు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యతో పాటు వసతీ కల్పిస్తోందీ బడి. మూగవారు, బధిరులు, అంధులు, బుద్ధి మాంద్యులు, దివ్యాంగుల కోసం విడివిడిగా ఎన్నో ప్రత్యేక సదుపాయాలుంటాయిక్కడ. మెడికల్‌ సెంటరూ, ఫిజియోథెరపీ, ఆర్థోపెడిక్‌ వర్క్‌షాపూ వంటివెన్నో అందుబాటులో ఉంచారు. కదల్లేని వారికి కృత్రిమ అవయవాలు ఇక్కడే తయారు చేసి ఇస్తుంటారు. వీరి ఆలనాపాలనే కాకుండా వారి అభిరుచికి అనుగుణంగా నృత్యమూ, యోగా, క్రీడల్లోనూ శిక్షణ ఇస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ చేరిన దివ్యాంగుల్ని సాధారణ పిల్లలకులానే అన్నింట్లో ముందుండేలా ప్రోత్సహిస్తుంటారు. ‘మీరూ ఏదైనా సాధించగలరు’ అన్న ధైర్యాన్ని నింపుతారు. పదో తరగతి పూర్తవ్వగానే ఉన్నత విద్య కోసం కళాశాలల్లోనూ వీరే చేర్పిస్తారు. కావాలంటే నచ్చిన రంగంలో ఉపాధి శిక్షణా ఇప్పిస్తారు. క్యాంపస్‌లోనే కుట్టు శిక్షణ, బుక్‌ బైండింగ్‌, ప్రింటింగ్‌, డీటీపీ, వడ్రంగం వంటి పనులూ నేర్పిస్తూ ఉపాధి అవకాశాలు కూడా చూపిస్తారు. ఇక్కడ ఒక్కో విద్యార్థి కోసం నెలకు రూ.3 వేల వరకు ఖర్చు పెడతారట. మొత్తం క్యాంపస్‌ నిర్వహణా, సిబ్బంది జీతభత్యాలూ, ఇతర అవసరాలకు ఏడాదికి దాదాపు కోటిన్నర రూపాయలవుతుందట.

బడి కాకుండా...

పాఠశాలతో పాటూ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల పరిధిలోని మత్స్యకార, గిరిజన గ్రామాల్లో దివ్యాంగులకూ, బుద్ధి మాంద్యం ఉన్న పిల్లలకూ సేవలందిస్తున్నారు ఈ సైకోరియన్లు. ఈ జిల్లాల్లోని దాదాపు 374 గ్రామాలను దత్తత తీసుకొని ఏడాది నుంచి 25 ఏళ్లలోపు వయసున్న వెయ్యిమందికి పైగా దివ్యాంగుల బాగోగులు చూసుకుంటున్నారు. అవసరమైన మందులూ, పౌష్టికాహారమూ ఇస్తున్నారు. ఈ ఊళ్లలో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలూ ఏర్పాటుచేస్తుంటారు. అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలిస్తూ ప్రత్యేక అవసరాల చిన్నారుల్ని గుర్తించి మెరుగైన వైద్యం అందించడం.. అవసరమైతే క్యాంపస్‌ ఛాలెంజ్‌ బడికి పంపడం లాంటివీ చేస్తుంటారు. 

ఎలా కలిశారంటే...

‘సైనిక్‌ స్కూల్లో చదువుకుని ఉన్నత స్థాయికి చేరిన మనం సమాజానికీ ఎంతో కొంత తిరిగిచ్చేయాలి’ అన్న ఉద్దేశంతో 1992 అక్టోబరు 15న కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ విద్యార్థులు సైకోరియన్లుగా ఏర్పడ్డారు. అలా ఏటికేడూ పూర్వవిద్యార్థులు కలుస్తూ ప్రస్తుతం దాదాపు మూడు వేల మంది అయ్యారు. వీరంతా హైదరాబాద్‌, వైజాగ్‌, విజయవాడ, బెంగళూరుల్లో చాప్టర్లుగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌కుమార్‌, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ డి.సుబ్బారావు, పర్వతారోహకుడు మస్తాన్‌ వలీ తదితరులందరూ సైకోరియన్లే.

- కె.మునీందర్‌, ఈనాడు విజయనగరం

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న