టీ దుకాణాలకు కెఫే లుక్కు! - Sunday Magazine
close

టీ దుకాణాలకు కెఫే లుక్కు!

కాఫీ తాగుతూ కాసేపు సేదదీరడానికి కాఫీ డే, బరిస్తా, స్టార్‌బక్స్‌... లాంటి ఎన్నో వేదికలున్నాయి. కానీ సగటు భారతీయులు తరచుగా తాగే చాయ్‌ దుకాణాలు ఎక్కువగా రోడ్డు పక్కనే ఉంటాయి. అక్కడ నిలబడే టీ తాగేస్తుంటారు. అలా కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో, గరమ్‌ గరమ్‌ చాయ్‌కి తోడు రుచికరమైన స్నాక్స్‌ ఆరగించమంటున్నాయి ఈ సంస్థలు!


హార్వర్డ్‌ ఎంబీఏ... చాయ్‌ పాయింట్‌!

ములీక్‌ సింగ్‌ బిజ్రాల్‌... హార్వర్డ్‌లో ఎంబీఏ చేసి ఇండియాలో ఒక కార్పొరేట్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌గా చేరాడు. వినియోగదారులతో నేరుగా అనుబంధం ఉండే ఉత్పత్తిని తేవాలనేది మొదట్నుంచీ అతడి ఆలోచన. అయితే అది ఏ విభాగమన్నది చాన్నాళ్లు తేల్చుకోలేకపోయాడు. బెంగళూరులో తాను పనిచేసే కంపెనీలో చాలామంది ఉద్యోగులు రోజులో రెండు సార్లయినా విరామం తీసుకుని సమీపంలోని టీ దుకాణాలకు వెళ్లడం చూశాడు. చిన్నప్పట్నుంచీ టీ తాగడంతోపాటు తానే స్వయంగా చేసే అలవాటూ ఉంది అములీక్‌కి. అప్పుడే ‘కాఫీ డే’ తరహాలో ‘చాయ్‌ పాయింట్‌’ లను పెట్టాలనే ఆలోచన వచ్చింది. 2010లో తను పనిచేస్తున్న కంపెనీకి ఇండియా హెడ్‌గా ఉన్నాడు. అయినా ఆ ఉద్యోగం వదిలేసి మరో ఇద్దరు స్నేహితులతో కలసి చాయ్‌ పాయింట్‌ని మొదలుపెట్టాడు. ఇక్కడ పదుల సంఖ్యలో చాయ్‌ రుచుల్ని అందిస్తున్నారు. వాటితోపాటు స్నాక్స్‌గా బిస్కెట్‌, రస్క్‌, పఫ్‌, రోస్టెడ్‌ పీనట్స్‌ లాంటి వాటినీ అందిస్తారు. బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, దిల్లీ... లాంటి పలు నగరాల్లో వందకు పైగా వీరి దుకాణాలు ఉన్నాయి. ఆఫీసులూ, షాపింగ్‌ మాల్స్‌ ఎక్కువగా ఉండే చోట ఈ దుకాణాలు ఉంటాయి. ఫోన్‌ కాల్స్‌, ఫుడ్‌ ఆప్‌ల ద్వారా డోర్‌ డెలివరీ కూడా చేస్తారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.190 కోట్ల టర్నోవర్‌ సాధించింది. కొవిడ్‌ అనుభవంతో కొత్తగా టీ పొడుల వ్యాపారంలోకీ అడుగు పెట్టారు.


టాటాల ‘చా’

టీ పొడులూ, గ్రీన్‌ టీ విభాగంలో ఎప్పట్నుంచో ఉన్న టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ టీ ఔట్‌లెట్ల ట్రెండ్‌ను గమనించి ఇటువైపు అడుగులు వేసింది. ‘టాటా చా’ పేరుతో 2017లో  బెంగళూరులో మొదటి కెఫేను ప్రారంభించింది. ప్రస్తుతం బెంగళూరులోనే వీరికి 14 ఔట్‌లెట్లు ఉన్నాయి. ఇక్కడ అల్లం, రోజ్‌, మసాలా చాయ్‌ లాంటి వివిధ రకాలు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు వెజ్‌, చికెన్‌ కట్లెట్‌, ఆలూ సమోసా, చనా చాట్‌ లాంటివీ దొరుకుతాయి. ముంబయిలో దశాబ్దాలుగా ‘టాటా టీ హౌస్‌’ను నిర్వహిస్తోంది టాటా సంస్థ. అక్కడ టీలతోపాటు స్నాక్స్‌నూ అందిస్తుంది. టీ చరిత్రనీ, టీ రంగంలో టాటాల ప్రయాణాన్నీ చెప్పే ఫొటోలూ ప్రదర్శనకు ఉంటాయి. ఇదే తరహాలో యువతను మరింతగా ఆకట్టుకునేలా ‘చా’ ఔట్‌లెట్లను తీర్చిదిద్దారు. ఇక్కడ టీ ధర రూ.50 నుంచి మొదలవుతుంది. స్నాక్స్‌ ధరలు రూ.100-200 మధ్య ఉంటాయి. రద్దీ ప్రాంతాల్లో సువిశాలమైన పెద్ద రెస్టరెంట్లుగా, మిగతా చోట్ల ఓ మాదిరి కెఫేలుగా ఈ ఔట్‌లెట్లని తెస్తున్నారు. త్వరలోనే మిగతా నగరాలకూ వీటిని విస్తరించనున్నారు.


ముగ్గురు మిత్రుల ‘చాయ్‌ బార్‌’

ఇందోర్‌కు చెందిన అనుభవ్‌ దుబే, ఆనంద్‌ నాయక్‌, రాహుల్‌... కలిసి చదువుకున్నారు. కాలేజీ రోజుల్లో పాకెట్‌ మనీ కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు. డిగ్రీ తర్వాత కూడా కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నారు కానీ కుదరలేదు. తర్వాత అనుభవ్‌ సివిల్స్‌కు సిద్ధమవడానికి దిల్లీ వెళ్లాడు. ఆనంద్‌ బంధువులతో కలసి వస్త్ర వ్యాపారం మొదలుపెట్టాడు. రాహుల్‌ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండేవాడు. ఏడాది తర్వాత ముగ్గురూ కలిసినపుడు ఉమ్మడిగా ఏదైనా వ్యాపారం చేద్దామని ప్రతిపాదించాడు ఆనంద్‌. మిగతా ఇద్దరూ సరేనన్నారు. ఆనంద్‌ తల్లిదండ్రులకు చెబితే మూడు లక్షలు ఇచ్చారు. ఆ మొత్తంతో ఆహార విభాగంలో అడుగు పెట్టాలనుకున్నారు. ఎందుకంటే వీరి మీటింగ్‌లన్నీ చాయ్‌ దుకాణాలూ, రెస్టరెంట్ల దగ్గరే జరిగేవి. అక్కడ వాతావరణం, టీ రుచి అంత బాగా లేకున్నా, వందల మంది అక్కడికి వస్తుండటం చూశారు.

అప్పుడే విద్యార్థులూ, యువత లక్ష్యంగా మంచి వాతావరణంతో టీ దుకాణాల్ని ప్రారంభించాలనుకున్నారు. 2015లో ఇందోర్‌లోనే మొదటి దుకాణాన్ని పెట్టారు. మట్టి గ్లాసులో చాయ్‌ రూ.10కే అందించడం వీరి ప్రత్యేకత. ఆపైన రూ.200 ఖరీదైన టీ రుచులూ దొరుకుతాయి. పది రకాల్లో టీలను అందిస్తారు. వాటిని బార్‌ టేబుల్‌లా ఉండే బల్లమీద పెడతారు. అందుకే దీనికి ‘చాయ్‌ సుట్ట బార్‌’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీరికి 150కి పైగా ఔట్‌లెట్లు ఉన్నాయి. వీటిద్వారా రోజూ మూడు లక్షల చాయ్‌లు అమ్ముతున్నారు. టర్నోవర్‌ రూ.50కోట్లు. నేపాల్‌, ఒమన్‌, దుబాయిలలోనూ దుకాణాల్ని ప్రారంభించారు.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న