బీరువాలో ఆఫీసు! - Sunday Magazine
close

బీరువాలో ఆఫీసు!

రోనా పుణ్యమా అని ఇంటి దగ్గరే ఉండి ఆఫీసు పని చెయ్యడం సాధారణం అయిపోయింది. అయితే, టేబుల్‌ మీద కంప్యూటర్‌నూ, ఆఫీసుకి సంబంధించిన వస్తువులూ, ఫైళ్లను పెట్టేస్తే చిన్న పిల్లలుంటే అటూ ఇటూ తిరుగుతూ లాగి పడేస్తుంటారు. అవన్నీ అలా విడిగా ఉంటే చూడ్డానికీ బాగుండదు. మనకూ అంత సౌకర్యంగా అనిపించదు. ఇకపోతే, ఆఫీసు పని చేసుకుంటున్నప్పుడు మన పక్కగా ఎవరో ఒకరు తిరుగుతుంటే ఏకాగ్రత కుదరదు. ఈ సమస్యలకు పరిష్కారంగా వచ్చినవే ‘ఎస్‌ఎస్‌హెచ్‌హెచ్‌హెచ్‌ 3’, ‘ఆఫీస్‌ షెల్‌’... హోమ్‌ ఆఫీస్‌ వర్క్‌ స్టేషన్లు. ఈ రెండూ మూసినప్పుడు చూడ్డానికి బీరువాలానే ఉంటాయి. కానీ తెరిస్తే అందులో చిన్నసైజు ఆఫీసు కనిపిస్తుంది. కంప్యూటర్‌, కీబోర్డు, ఫైల్స్‌... లాంటివి దేనికదే పెట్టుకునేందుకు వీలుగా ఉండడంతో పాటు పనైపోయాక కుర్చీని కూడా అందులోనే ఉంచేసి తలుపులు మూసేయొచ్చు. ఆఫీస్‌ షెల్‌లో అయితే మనం లోపలికి వెళ్లి కూర్చుని తలుపులు మూసేసుకోవచ్చు.


రూబిక్స్‌ క్యూబ్‌ ఆడడం ఇక సులభమే!

రూబిక్స్‌ క్యూబ్‌ని ఆడడానికి చాలామంది ప్రయత్నిస్తారు. కానీ కొద్దిమంది మాత్రమే దాన్ని సాల్వ్‌ చెయ్యగలరు. మిగిలినవాళ్లకి అది ఎంతకీ అర్థం కాని పజిలే. ఇక, ఆడడం వచ్చినవాళ్లకేమో మళ్లీ మళ్లీ ఆడి బోర్‌ కొట్టేస్తుంది. దీనికి చక్కని పరిష్కారమే ఈ ‘రూబిక్స్‌ కనెక్టెడ్‌ క్యూబ్‌’. చూడ్డానికి మామూలు రూబిక్స్‌ లానే ఉన్నా నిజానికి ఇది స్మార్ట్‌ క్యూబ్‌. ఫోన్‌లో దీని ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసి, బ్లూటూత్‌ ఆన్‌చేస్తే చాలు, మనం ఆడుతున్న క్యూబ్‌ ఫోన్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. ఈ ఆప్‌ మనకి ఎలా ఆడాలో అంచెలంచెలుగా చూపిస్తూ నేర్పిస్తుంది. అంతేకాదు, కనెక్టెడ్‌ క్యూబ్‌లో సభ్యులుగా ఉన్న మిగిలిన వాళ్లతో మనం పోటీ పెట్టుకుని కూడా ఆడుకోవచ్చు. అదండీ సంగతి.మెదడుకి పదును పెట్టే రూబిక్స్‌ని ఇక సులభంగా ఆడేయొచ్చన్నమాట.


లైటు మారిపోతుంది!

లైటంటే ఎంత కాలమైనా ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. ఎలా పెడితే అలానే ఉంటుంది. ఈ ‘స్మార్ట్‌ బంచ్‌’ లైట్‌ మాత్రం అలాంటివాటికి పూర్తి భిన్నం. అయస్కాంతం ఇమిడి ఉన్న త్రికోణాకృతి ఫలకాలు ఒకదానికొకటి అతుక్కుని ఉండే ఈ లైటుని ఎన్ని రూపాల్లోకైనా మార్చుకోవచ్చు. దీన్లో ఉండే ఫలకాలను విడదీసి లైటుని గోడకు టైల్స్‌లా అంటించేయొచ్చు. అన్నిటినీ బంతిలా కలిపి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర షాండ్లియర్‌లానూ వేలాడదీయొచ్చు. మరీ ఎక్కువ కాంతి అవసరం లేదనుకున్నప్పుడు కొన్ని ఫలకాలను మాత్రమే కలిపి ఉంచి బెడ్‌లైటులానూ ఉపయోగించుకోవచ్చు. మధ్యభాగంలో ఉన్న ప్యానెల్‌ నుంచే మిగిలినవాటికి విద్యుత్‌ సరఫరా అవుతుంది. ఇది కరెంటుతోనూ రీఛార్జబుల్‌ బ్యాటరీలతోనూ కూడా పనిచేస్తుంది. బాగుంది కదూ..!


మడిస్తే బొమ్మ... తెరిస్తే షర్టు!

మెత్తగా ఉండే సాఫ్ట్‌ టాయ్స్‌ని ఇష్టపడని చిన్నారులుండరు. కొందరికైతే ఎటు వెళ్లినా ఏం చేస్తున్నా చేతిలో తమకి బాగా నచ్చిన ఆ బొమ్మ ఉండాల్సిందే. అలాంటప్పుడు ఏదో మ్యాజిక్‌ చేసినట్లూ తమ చేతిలోని బొమ్మ చిటికెలో షర్టులా మారిపోతే... మరికొన్ని దుప్పట్లైపోతే..వారి ఆశ్చర్యానికి అంతే ఉండదు కదా..ఆ మ్యాజిక్‌ని స్నేహితులకూ చూపి సంబరపడిపోతారు. అలాంటివే ఈ ‘కబ్‌కోట్స్‌’, ‘బ్లాంకెట్‌ సాఫ్ట్‌ ఫ్లష్‌ టాయ్‌ పిల్లో’లు. మామూలుగా రకరకాల బొమ్మల్లా కనిపించే కబ్‌కోట్స్‌ వెనుక భాగంలో జిప్‌ ఉంటుంది. దాన్ని తెరిచి లోపల మడతలుగా దూర్చిన క్లాత్‌ని మొత్తంగా బయటకు లాగేసరికి కళ్లముందే బొమ్మ షర్టులా మారిపోతుంది. ఫ్లష్‌ టాయ్‌ దిండ్లు కూడా ఇలాగే. ఇవి చూడ్డానికి కుషన్లు, సాఫ్ట్‌ టాయ్స్‌లా ఉంటాయి. జిప్‌ తెరిస్తేనేమో అందులోంచి పిల్లల దుప్పటి వస్తుంది. ఇలాంటి బొమ్మల్నైతే పర్యటనలకు వెళ్లేటప్పుడూ వెంట తీసుకెళ్లొచ్చు. అమ్మలూ ఒకటికి నాలుగు కొనడానికి వెనకాడరు... ఎలాగూ షర్టులే కాబట్టి, అదనంగా బొమ్మలకోసం ఖర్చుపెట్టే పనుండదు మరి.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న