ముంబై నుంచి గోవాకి.. ఓడలో విలాసంగా..! - Sunday Magazine
close

ముంబై నుంచి గోవాకి.. ఓడలో విలాసంగా..!

ముంబై నగర విద్యుద్దీపకాంతుల అందాల్ని వీక్షిస్తూ జుహూ తీరంలోని సందడిని చూస్తూ గోవాలోని ప్రముఖ పర్యటక స్థలాల్ని సందర్శించేందుకు అరేబియా సాగరజలాల్లో విహరిస్తూ వెళ్లడం... అదీ విలాసవంతమైన ఓడలో వెళ్లడం... ఎంత బాగుంటుందో కదూ... కానీ అదెలా సాధ్యం అనుకోవద్దు. ఆ కోరిక తీర్చేందుకు స్వదేశీ క్రూజ్‌ సంస్థ అయిన కార్డిలియా, భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌తో అనుసంధానమై పనిచేస్తూ అటు పర్యటకుల్నీ, ఇటు డెస్టినేషన్‌ పెళ్లి వేదికగా అతిథుల్నీ ఆహ్వానిస్తోంది.

రీబియన్‌, సిల్వర్‌ సీ, వైకింగ్‌ ఓషన్‌, రీజెంట్‌ సెవెన్‌ సీస్‌... వంటి క్రూజ్‌ల్లో ఒక్కసారయినా ప్రయాణించాలనుకునే సంపన్నులు చాలామందే ఉంటారు. అయితే విదేశీ ప్రయాణాల్లో ఆ రకమైన నౌకా విహారం సాధ్యమే. కానీ మనదేశంలో అలాంటి లగ్జరీ క్రూజ్‌లు లేవనే చెప్పాలి. అందుకే తొలిసారిగా స్వదేశీ అంకుర సంస్థ అయిన కార్డిలియా, ద రాయల్‌ కరీబియన్‌ సంస్థకు చెందిన ‘ద ఎంప్రెస్‌ ఆఫ్‌ ద సీస్‌’ నౌకను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచింది. అంతేకాదు, భారతీయ రైల్వేతో ఒప్పందం చేసుకుని పర్యటకుల్నీ ఆకర్షిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి అరేబియా జలాల్లో తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదటి దశగా ముంబై కేంద్రంగా గోవా, డయ్యు, కొచ్చి, లక్షద్వీప్‌ల వరకూ ప్రయాణిస్తోంది. రెండో దశలో చెన్నై కేంద్రంగా కొలంబో, గాలె, ట్రింకోమలై, జాఫ్నా, మాల్దీవుల వరకూ పర్యటనల్ని చేపట్టనున్నట్లు సంస్థ సీఈఓ జర్గెన్‌ బెయ్‌లమ్‌ చెబుతున్నారు. ఈ క్రూజ్‌ పర్యటనల్లో అనేక రకాలున్నాయి. ‘వీకెండ్‌ గెట్‌ అవే’ విభాగంలో సాగరంలో విహరిస్తూ తీరాల్లో సేదతీరుతూ సముద్ర లోతుల్ని చూస్తూ ప్రయాణించే వీలు ఉంటే, ‘ల్యాండ్‌ అండ్‌ క్రూయిజ్‌’ ప్యాకేజీల్లో ఆయా ప్రదేశాల్లోని ముఖ్య స్థలాల్ని సందర్శించే వెసులుబాటూ ఉంటుంది. ముఖ్యంగా రెండో విభాగంలో అటు సాగరంలో ప్రయాణించడంతోపాటు ఇటు ఆయా ప్రదేశాల్నీ ఆసాంతం చూసి రావొచ్చన్నమాట. ఉదాహరణకు ముంబై నుంచి గోవా ప్రయాణంలో ముంబైలోని జూహూ బీచ్‌ అందాలని తనివితీరా చూసి, అక్కడ షాపింగ్‌ చేసుకుంటూ కాసేపు గడపొచ్చు. అలాగే సిద్ధి వినాయక ఆలయంతోపాటు ముంబైలోని మరికొన్ని ప్రముఖ స్థలాల్నీ సందర్శించవచ్చు. గోవాలో మోలం జాతీయపార్కునీ; కర్ణాటక సరిహద్దులో ఉన్న దూధ్‌సాగర్‌ జలపాతాన్నీ; నైట్‌ క్లబ్‌లూ వాటర్‌ స్పోర్ట్స్‌ ఫుల్‌ మూన్‌ పార్టీలతో నిత్యం సందడిగా ఉండే అంజునా బీచ్‌ అందాల్నీ చుట్టి రావొచ్చు. గుజరాత్‌ తీరంలోని డయ్యు ప్యాకేజీ తీసుకుంటే అక్కడి నగోవా బీచ్‌లో సేదతీరి, నాటి పోర్చుగీసు కోటల్నీ, చర్చిల్నీ, గిర్‌ జాతీయ పార్కునీ నాడియా గుహల్నీ చూసి, పార్సీ రుచుల్ని ఆస్వాదించొచ్చు. అలాగే లక్షద్వీప్‌లోని కోరల్‌ రీఫ్స్‌ని చూసి, కాడ్‌మట్‌ దీవిలో స్కూబా డైవింగ్‌ చేయడంతోపాటు సాగరంలో విహరిస్తూ అక్కడి దీవులన్నీ చుట్టి రావొచ్చు. ఇక, ఇలాతలంమీదే స్వర్గంగా పేరొందిన కేరళలో బ్యాక్‌వాటర్ల అందాలనీ కొచ్చిన్‌ హార్బరునీ ఆ నగరంలోని ప్రముఖ స్థలాల్నీ ఏకబిగిన చుట్టేయొచ్చు... ఇలా రకరకాల ప్యాకేజీలతో దేశీ సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది కార్డిలియా నౌక.

సురక్షితంగా...

అడుగు పెట్టిన క్షణం నుంచీ అక్కడ ఉన్నన్ని రోజులూ పర్యటకుల్ని రాజూరాణీల్లానే చూస్తారట ఈ నౌకా సిబ్బంది.  స్వాగతం నుంచి వీడ్కోలు వరకూ సదా మీ సేవలో అన్నట్లే ఉంటారన్నమాట. దేశంలోనే తొలి ప్రీమియం క్రూజ్‌ లైనర్‌ అయిన ఈ సంస్థ, పర్యటకుల ఆరోగ్యానికి పూర్తి బాధ్యతను వహిస్తూ వాళ్లు సురక్షితంగా విహరించేందుకు అన్ని జాగ్రత్తల్నీ తీసుకుంది. సిబ్బంది మొత్తానికీ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సమర్థంగా పూర్తి చేయడంతోపాటు ప్రతిరోజూ వాళ్లకి హెల్త్‌ చెకప్‌ చేయడం, సామాజిక దూరం పాటించడం... వంటివన్నీ తు.చ. తప్పక అమలు చేస్తోంది. పిల్లలు, వృద్ధులకోసం ప్రత్యేక సర్వీసు విభాగాలున్నాయి. ఎక్కడికక్కడ శానిటైజింగ్‌ స్టేషన్లనూ ఏర్పాటుచేసిందట. ప్రయాణికుల్ని సైతం పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తోంది. ఒకరు తాకినవి మరొకరు తాకే పనిలేకుండా క్యూఆర్‌ కోడ్‌ డిజిటల్‌ మెనూలు, చెక్‌ ఇన్‌, బోర్డింగ్‌ అన్నీ ఆన్‌లైన్‌లోనే చేయడం... వంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఓషన్‌ వ్యూ సూట్‌ సుమారు పాతిక వేల రూపాయల వరకూ ఉంటే, స్టేట్‌ రూమ్‌ ధర 18 వేల వరకూ ఉంది. బాల్కనీ సూట్‌ అయితే 32 వేల రూపాయలు. టూరు ప్యాకేజీని బట్టి ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం ఈ సంస్థ రెండు నుంచి ఏడు రాత్రుల వరకూ రకరకాల ట్రిప్‌లను నిర్వహిస్తోంది. చిన్నపాటి నగరాన్ని తలపించేలా ఉండే ఈ సువిశాలమైన నౌకలో రెస్టరెంట్‌, స్విమ్మింగ్‌పూల్‌, బార్‌, సినిమా థియేటర్‌, పిల్లలకోసం ఆటస్థలం, జిమ్‌, స్విమ్మింగ్‌పూల్‌... వంటి సకల హంగులూ ఉంటాయి. ‘భారతీయ ఆతిథ్యాన్ని అంతర్జాతీయ ప్రమాణాల్లో అందించాలన్నదే మా ఆకాంక్ష. అదీగాక 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న మనదేశం ఇంతవరకూ సాగరయానం మీద దృష్టి సారించలేదు. కానీ ప్రభుత్వం ఇటీవల తీరప్రాంతాలను అభివృద్ధి చేయడంతో త్వరలోనే మనదేశం క్రూజ్‌ డెస్టినేషన్‌గా మారనుంది’ అంటున్నారు సంస్థ నిర్వాహకుడైన బెయ్‌లమ్‌.

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ..

‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియాని ప్రతిబింబిస్తూ ఓడలో-  దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రుచుల్నీ మెనూలో చేర్చాం’ అంటున్నారు నిర్వాహకులు. సంప్రదాయ థాలీలూ స్వీట్లూ కబాబ్‌లూ వంటి స్వదేశీ రుచులతోపాటు థాయ్‌, జపనీస్‌, చైనీస్‌, కాంటినెంటల్‌, ఇటాలియన్‌ డిషెస్‌నూ స్వయంగా వండి వడ్డిస్తారక్కడి షెఫ్‌లు. ఇక, డెక్‌మీద మ్యాజిక్‌ షోలూ డీజే మ్యూజికల్‌ నైట్‌లూ కామెడీ షోలూ... వంటి వినోద కార్యక్రమాలూ ఉంటుంటాయి. కేసినో సరదాలనీ తీర్చుకోవచ్చు. కొవిడ్‌ పూర్తిగా అదుపులోకి వచ్చాక ఈ సంస్థ విదేశీయానానికీ శ్రీకారం చుట్టనుందట. ప్రస్తుతం నేరుగానే కాకుండా ఐఆర్‌సీటీసీ ద్వారానూ టూర్‌ టిక్కెట్లను విక్రయిస్తోంది. దాంతో 1.8 లక్షలు ఉన్న మన సాగరయాన ప్రయాణికుల సంఖ్య వచ్చే ఏడాదికి 40 లక్షలకు చేరుకోనున్నట్లు మార్కెటింగ్‌ నిపుణుల అంచనా. అంతేకాదు, కేవలం క్రూజ్‌ టూరిజం ద్వారానే రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది.

పెళ్లి వేదికగానూ...

భారీ బడ్జెట్‌ పెళ్ళిళ్ళకు నిలయమైన భారత్‌లో కొవిడ్‌ కారణంగా తాత్కాలికంగా ఆ ఖర్చు తగ్గినప్పటికీ త్వరలోనే అది కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే డెస్టినేషన్‌ పెళ్లిళ్ల పట్ల ఇష్టాన్ని చూపుతోన్న యువత, మరొక అడుగు ముందుకేసి అందులోనూ కొత్తదనాన్ని కోరుకుంటోంది. అందులో భాగంగానే ఈ ఏడాది నవంబరు, డిసెంబరుల్లో జరగనున్న అనేక వివాహాలకు కార్డిలియా క్రూజ్‌ వేదికగా మారడం విశేషం. ముఖ్యంగా ఈ కంపెనీ సొంతం చేసుకున్న ఎంప్రెస్‌లో 796 క్యాబిన్లూ మల్టీ కూయిజ్‌ రెస్టరెంట్లూ ఆన్‌బోర్డు కేసినోలూ హెల్త్‌ అండ్‌ బ్యూటీ సెంటర్లూ షాపింగ్‌ జోన్‌లూ గ్రాండ్‌ థియేటర్‌... ఇలా సకల సౌకర్యాలు ఉండటంతో ఇది సరికొత్త వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా మారనుంది. దాంతో ఆ సాగరం సాక్షిగా పెళ్లి చేసుకునేందుకు ఇప్పటికే ఎంతోమంది ఈ నౌకా సంస్థను సంప్రదిస్తున్నారట. పెళ్లికి అవసరమైన పూల అలంకరణ, ఫొటోగ్రాఫర్లు, మేకప్‌ ఆర్టిస్టులు, వెడ్డింగ్‌ ప్లానర్లు... వంటివన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉండేలా చేస్తుందీ క్రూజ్‌ లైనర్‌. ముఖ్యంగా 800 మందికి సరిపడే దీని డెక్‌ ఏరియా పెళ్లితోపాటు సంగీత్‌, రిసెప్షన్‌ వేడుకలకీ బాగుంటుందట. పైగా ఈ పెళ్లిళ్లకోసం ఓడలో ఆహారం నుంచి అలంకరణ వరకూ పూర్తిగా కస్టమైజేషన్‌ చేసి మరీ ఇస్తారట.  చూశారుగా మరి... విలాసవంతమైన నౌకా విహారంకోసం ఇప్పుడు వేరే దేశమే వెళ్లాల్సిన అవసరం లేదు... స్వదేశీ అందాల్ని చూస్తూనే ఆ కోరికనీ తీర్చుకోవచ్చన్నమాట. ఏమంటారు మరి!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న