క్రౌడ్‌ఫండింగ్‌... సాయానికి చిరునామా! - Sunday Magazine
close

క్రౌడ్‌ఫండింగ్‌... సాయానికి చిరునామా!

చేతిలో చిల్లిగవ్వ లేదు... ఆస్పత్రిలో బిల్లు చూస్తే లక్షల్లో ఉంది. బంధువులనో స్నేహితులనో అడుగుదామంటే అభిమానం అడ్డొస్తుంది. ఒకవేళ అడిగినా వాళ్లు ఇవ్వగలరన్న గ్యారంటీ లేదు. ఈరోజుల్లో ఎవరి పరిస్థితి మాత్రం బాగుంది కనుక. అందుకే ‘క్రౌడ్‌ఫండింగ్‌’ వెబ్‌సైట్లు మేమున్నామంటున్నాయి. కొవిడ్‌ సమస్యలపై  ప్రత్యేకంగా స్పందిస్తున్నాయి. ‘మిలాప్‌’లో ప్రతి ఇరవై నిమిషాలకీ ఒక కొత్త అర్జీ దాఖలవుతోందట. ‘ఇంపాక్ట్‌గురు’ వెబ్‌సైట్లో ప్రతి మూడో నిమిషంలోనూ ఒక దాత విరాళం అందిస్తున్నాడట. అటు డబ్బు అవసరమూ ఇటు దాతృత్వమూ కూడా మామూలుకన్నా నాలుగు రెట్లు పెరిగిన నేపథ్యంలో గత ఏడాదిన్నరలో వేల కోట్ల రూపాయలను దాతల దగ్గరనుంచి సేకరించి ఆపన్నుల కోసం ఖర్చు చేశాయి ఈ వెబ్‌సైట్లు.

‘క్రౌడ్‌ఫండింగ్‌’ పేరు కొత్తగా ఉన్నా ఈ పద్ధతి మనకి కొత్తదేం కాదు. స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీజీ జోలెపడితే ఆడా మగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ తమ దగ్గరున్న డబ్బునీ ఒంటిమీద బంగారాన్నీ మహదానందంగా తీసిచ్చిన సంగతి మనకు తెలుసు.స్వతంత్ర భారత ఖజానాకి చైనాతో యుద్ధం తలకు మించిన భారం కాగా, నాటి ప్రధాని నెహ్రూ ‘డిఫెన్స్‌ ఇండియా ఫండ్‌’కు సాయం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తే నగదూ నగల రూపంలో ప్రజలనుంచి విరాళాలు వెల్లువెత్తాయి.
గుజరాత్‌ పాడిరైతుల సహకార సమాఖ్య గురించి ఒక సినిమా తీయమని శ్యామ్‌ బెనెగల్‌ని కోరారు ఆ సంస్థ అధిపతి వర్ఘీస్‌ కురియన్‌. 12 లక్షలదాకా ఖర్చవుతుందని ఆయన సంకోచిస్తుంటే ఆ ఖర్చు కూడా పాడిరైతులే పెట్టుకుంటారని చెప్పిన కురియన్‌ రెండు రూపాయలకు తక్కువ కాకుండా విరాళాలు ఇవ్వమని రైతుల్ని అడిగారట. వారం తిరిగేసరికి 12లక్షలూ శ్యామ్‌ బెనెగల్‌ చేతికందింది. ఆ సినిమా (మంథన్‌)కి ప్రొడ్యూసర్లుగా టైటిల్స్‌లో ‘గుజరాత్‌కి చెందిన ఐదు లక్షల మంది రైతులు’ అని వేశారు.అంతదాకా ఎందుకూ... వెనక మన పల్లెల్లో ఒకరింట్లో పెళ్లంటే ఊరంతా తలో చెయ్యీ వేసేది కాదూ..! పాలూ పెరుగూ పప్పులూ కూరగాయలూ ఆఖరికి వంట పాత్రలతో సహా అందరిళ్లనుంచీ వచ్చేవి. అంతా కలిసి పిల్ల పెళ్లి ఘనంగా చేసి పంపేవారు. ఆ సంప్రదాయమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమైంది. దానికి అంతర్జాలం వేదికైంది. ఒక్కో చుక్కా కలిస్తే సముద్రం అయినట్లు... ఒక్కో రూపాయినీ కలిపి లక్షలూ కోట్లూ చేయొచ్చనీ దాంతో అసాధ్యమనిపించే ఎన్నో పనుల్ని సుసాధ్యం చేయొచ్చనీ నిరూపిస్తోంది ‘క్రౌడ్‌ఫండింగ్‌’ విధానం.

ఎలా మొదలైంది?
అంతర్జాలంలో క్రౌడ్‌ఫండింగ్‌ చేసిన మొట్టమొదటి సంఘటన 1997లో జరిగింది. అయితే ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్‌గా ఈమెయిల్‌ ఒక్కటే ఉన్న రోజులవి. బ్రిటన్‌కి చెందిన ఒక రాక్‌బ్యాండ్‌ అమెరికాలో పర్యటించాలనుకుంది. అందుకు అవసరమైన డబ్బు సమకూర్చమని అభిమానులను అడిగింది. విషయాన్ని వివరిస్తూ వెయ్యిమందికి ఈమెయిల్స్‌ పెడితే వాళ్లంతా వాటిని మరికొందరికి పంపించి మొత్తమ్మీద అందరూ కలిసి రాక్‌బ్యాండ్‌ పర్యటనకి సరిపోయే నిధుల్ని సమకూర్చారు. ఈ విధానం విజయవంతం కావడం చూసిన కొందరు ఆ తర్వాత కొన్నాళ్లకు ‘ఆర్టిస్ట్‌షేర్‌’ పేరుతో వెబ్‌సైట్‌ పెట్టారు. కళాకారుల పర్యటనలకీ, ఆల్బమ్‌ విడుదల ఖర్చులకీ కావలసిన నిధులు సేకరించడం దీని లక్ష్యం. అప్పటినుంచీ నిధుల సేకరణకు ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చన్న ఐడియా మాత్రం చాలామందిని ఆలోచింపజేస్తూనే ఉంది. ఆ ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చి పూర్తిస్థాయి క్రౌడ్‌ఫండింగ్‌ వెబ్‌సైట్‌గా 2007లో ‘ఇండీగోగో’ అందుబాటులోకి వచ్చింది. తర్వాత రెండేళ్లకి ‘కిక్‌స్టార్టర్‌’ ప్రారంభమైంది. 2008లో ఆర్థికమాంద్యం వల్ల అమెరికాలో చాలా వ్యవస్థలు కుప్పకూలాయి. ఉద్యోగాలు పోవడంతో ఇళ్ల రుణాలు కట్టలేక, వైద్యం చేయించుకోలేక, వ్యాపారాలకు బ్యాంకుల తోడ్పాటు లభించక చాలామంది ప్రత్యామ్నాయాల వైపు చూసేవారు. దాంతో ఐదారేళ్లపాటు క్రౌడ్‌ఫండింగ్‌ సంస్థలే వారిని ఆదుకున్నాయి. ఆ సమయంలోనే ఈక్విటీ క్రౌడ్‌ఫండింగ్‌ని చట్టబద్ధం చేసింది ఒబామా ప్రభుత్వం. స్టార్టప్‌లకు సంబంధించిన ఈ చట్టం వల్ల బిజినెస్‌ క్రౌడ్‌ఫండింగ్‌ ఊపందుకుంది.

సేవల వైపు ఎలా వచ్చింది?
మనదేశంలో క్రౌడ్‌ఫండింగ్‌ వేదికలు ప్రారంభమై ఇంకా దశాబ్దమన్నా కాలేదు. అమెరికాలో సృజనాత్మక కళలకు ప్రోత్సాహాన్నిస్తున్న ‘కిక్‌స్టార్టర్‌’ స్ఫూర్తితో ఇక్కడి కళాకారులకు అండగా నిలిచేందుకు 2012లో మొట్ట మొదట ‘విష్‌బెర్రీ’ ప్రారంభమైంది. ఆ తర్వాత ‘కెట్టో’, ‘మిలాప్‌’ వచ్చాయి. 2015లో ‘ఇంపాక్ట్‌గురు’ వైద్య సమస్యలకోసం ప్రత్యేక వేదికగా ఆవిర్భవించింది. పాశ్చాత్య దేశాల్లో సృజనాత్మక, సాంకేతిక, వ్యాపార ప్రాజెక్టులు ఎక్కువ ఆదరణ పొందితే మనదేశంలో వైద్య, సామాజిక సమస్యలు ఎక్కువ ప్రాధాన్యమూ ఆదరణా పొందుతున్నాయి. దాంతో కళలకు సంబంధించిన వెబ్‌సైట్లు తప్ప మిగిలినవి దాదాపు అన్ని రంగాల్లోనూ- అంటే ఉన్నతవిద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక సమస్యలు, సంఘసేవ లాంటి వాటన్నిటికీ నిధులను సేకరిస్తుండగా అందులో దాదాపు 80 శాతం వరకూ వైద్యానికే వెళ్తున్నాయి. మొదట పదిలక్షలకు మించిన ఖరీదైన వైద్యం అంటే అరుదైన కేసులే వస్తాయనుకుని ఆ పరిమితి పెట్టారు కానీ ఇప్పుడు లెక్కలేనన్ని కేసులు. గుండెజబ్బులు, లివర్‌ వ్యాధులు, క్యాన్సర్లు, అవయవమార్పిడి, రోడ్డు ప్రమాదాలు, ఆఖరికి ఆసిడ్‌ దాడుల కేసుల్లోనూ ఆదుకుంటున్నది క్రౌడ్‌ఫండింగే.

ఎలా పనిచేస్తాయి?
క్రౌడ్‌ఫండింగ్‌ అంటే పైకి కనిపించేది డబ్బే కానీ దాని వెనకాల కనపడని ఓ శక్తి ఉంది. ఆ డబ్బుని సమకూర్చిన లక్షలాది మనసుల మంచితనాన్నీ వారి ఔదార్యాన్నీ ఒక గాడిలో పెట్టే వేదికలివి. ఇక్కడ సాయం చేయగలవాళ్లే చేస్తారు. ఎక్కడా బలవంతం లేదు, ఎవరి మీదా ఒత్తిడి ఉండదు. ఒక మధ్య తరగతి వ్యక్తికి వెయ్యి రూపాయలు పెద్ద మొత్తం కాదు. అలా వందమంది తలో వెయ్యీ ఇస్తే... లక్ష- పెద్ద మొత్తమే. అలాంటి పది లక్షలు కలిస్తే- ఒక పేద గుండె కోలుకుంటుంది. కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఒక నిరుపేద విద్యార్థి ఉన్నత చదువుల కల నెరవేరుతుంది. ఒక జంట తమ కలల పంటను అరుదైన వ్యాధి నుంచి కాపాడుకోగలుగుతుంది.
అందుకు చేయాల్సిందల్లా...
క్రౌడ్‌ఫండింగ్‌ వెబ్‌సైట్‌ని ఎంచుకుని దరఖాస్తు చేయడమే. బాధితుల తరఫున బంధువులూ స్నేహితులూ ఎవరైనా ఎక్కడ నుంచి అయినా ఈ నిధుల సేకరణ చేయవచ్చు. వారినే ‘ఫండ్‌ రైజర్‌’ అంటారు. ఎవరికోసం చేస్తున్నారో, ఎంత డబ్బు అవసరమో చెబుతూ బాధితుల ఫొటోలనూ జతచేయాలి. వైద్య పరీక్షల నివేదికలు సమర్పించాలి. ఆ వివరాలన్నిటినీ వెబ్‌సైట్‌ తాలూకు నిపుణులు పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయనుకుంటే నిధుల సేకరణకు వెబ్‌సైట్‌లో ప్రచారం(క్యాంపెయిన్‌) ప్రారంభిస్తారు.
ఉదాహరణకు... ముద్దులు మూటగట్టే చిన్నారి తీరా కామత్‌ వెన్నెముకకి సంబంధించి అరుదైన జన్యువ్యాధితో పుట్టింది. దానికి చికిత్స చేయకపోతే పాప రెండో పుట్టినరోజు జరుపుకునే అవకాశం లేదన్నారు డాక్టర్లు. జీన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీ అనే ఆ చికిత్సకి 16 కోట్లు ఖర్చవుతాయి. పాప తల్లిదండ్రులు ‘ఇంపాక్ట్‌గురు’ వెబ్‌సైట్‌ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించారు. 87వేల మందికి పైగా దాతలు తలో చేయీ వేస్తే 215 రోజుల్లో దాదాపు 15 కోట్లు సమకూరాయి. ఈ నిధులు నేరుగా పాపకు చికిత్స చేసే ఆస్పత్రికే వెళ్తాయి. కాబట్టి ఎక్కడా అవి దుర్వినియోగమవుతాయన్న సందేహానికి తావుండదు. సేకరణ ప్రారంభించిన నాటి నుంచి ప్రతి రోజూ ఎంత మొత్తం సమకూరిందీ తెలుస్తూనే ఉంటుంది. నిధుల లక్ష్యం చేరగానే ఆ క్యాంపెయిన్‌ని వెబ్‌సైట్‌ నుంచి తొలగిస్తారు. చికిత్స పూర్తయి కోలుకున్న సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు. దాతలకు ఆదాయపన్ను మినహాయింపు వర్తిస్తుంది.

మోసం జరిగే అవకాశం లేదా?
ఒకటీ అరా జరగకుండా ఉండవు. అయితే క్రౌడ్‌ఫండింగ్‌ వెబ్‌సైట్లన్నీ అలా జరగకుండా ఉండేందుకు తీసుకోగలిగిన చర్యలన్నీ తీసుకుంటాయి. ప్రతి దరఖాస్తునీ క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఆ సమాచారంలో ఏమన్నా లొసుగులు ఉన్నాయా అని ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా తెలుసుకుంటాయి. ఉదాహరణకు ఫలానా చికిత్సకో, చదువుకో పాతిక లక్షలు కావాలని ఫండ్‌రైజర్‌ చెబితే నిజంగా దానికి ఎంత ఖర్చవుతుందో వాకబు చేస్తాయి. కాబట్టి ఇష్టం వచ్చినట్లు ఎక్కువ మొత్తం రాసి డబ్బు దాచుకుందామంటే కుదరదు. చేపట్టిన క్యాంపెయిన్‌ ఏదైనా మోసపూరితంగా ఉందీ అనుకుంటే దాన్ని ఏ దశలోనైనా రద్దు చేసే అధికారం ఈ సంస్థలకు ఉంటుంది. అప్పటివరకూ అందిన దాతల డబ్బుని తిప్పి పంపించేస్తాయి.
కొవిడ్‌-19కి ఏవిధంగా తోడ్పడతాయి?
ఏ ఉపద్రవంతో పోరాడాలన్నా మనుషులు కావాలి... డబ్బు కావాలి. ఆ రెంటికీ అండగా నిలుస్తోంది క్రౌడ్‌ఫండింగ్‌ విధానం. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఒక్కసారిగా సామాజిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఉద్యోగాలు పోయి, ఉపాధి కోల్పోయి కోట్లాది మంది రోడ్డున పడ్డారు. మరో పక్క రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులకు వైరస్‌ ముప్పుని ఎదుర్కొనే జాగ్రత్తలు తీసుకోవడం అదనపు భారమైంది. ఆదుకోబోయిన స్వచ్ఛంద సంస్థల దగ్గర నిధులు లేవు. ఈ పరిస్థితుల్లో సమాజ అవసరాలకు తగినట్లుగా స్పందించడం మొదలెట్టాయి క్రౌడ్‌ఫండింగ్‌ సంస్థలు. అప్పటివరకూ నామమాత్రంగానే ఉన్న రుసుమును పూర్తిగా రద్దుచేశాయి. ఏ పక్క నుంచి ఏ అభ్యర్థన వచ్చినా కొద్ది గంటల్లో అది కార్యరూపం దాల్చేలా చూసేందుకు వారంలో ఏడురోజులూ పనిచేస్తున్నాయి. ఇప్పటివరకూ చేపడుతున్న కార్యక్రమాలకు తోడుగా కొవిడ్‌ రిలీఫ్‌ విభాగాన్ని ప్రత్యేకంగా తమ వెబ్‌సైట్లలో జతచేశాయి. స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యక్తులు కానీ కొవిడ్‌ బాధితులకు ఏ రకంగా సాయం చేయాలనుకున్నా ఈ విభాగం కింద నిధులు సేకరించే ఏర్పాటుచేశాయి.
కొవిడ్‌ వైద్యానికి ఇవ్వరా?
కొవిడ్‌ వైద్యానికీ వీరి సాయం తీసుకోవచ్చు. ఈమధ్యే భువనేశ్వర్‌కి చెందిన 24ఏళ్ల అమృత్‌ ప్రధాన్‌ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకి చదువుకుంటుండగా కరోనా సోకింది. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమవడంతో నెలరోజులుగా ఆస్పత్రిలో వెంటిలేటరు మీద ఉన్నాడు. ఎక్మో చికిత్స, ఊపిరితిత్తుల మార్పిడి- అతడికి అత్యవసరం. ఆ చికిత్సలను అందించాలంటే అతడిని విమానంలో చెన్నై కానీ హైదరాబాద్‌ కానీ తరలించాలి. చేతిలో కనీసం కోటి రూపాయలు ఉంటే కానీ ఇవేవీ సాధ్యం కావు. అమృత్‌ సోదరి కోటీ 20లక్షల సాయం కోరుతూ మిలాప్‌లో దరఖాస్తు చేసింది. దాదాపు సగం నిధులు జమయ్యాయి. మరో పక్కన చికిత్స కూడా మొదలైనట్లు అప్‌డేట్స్‌ కూడా ఆమె వెబ్‌సైట్లో పోస్ట్‌ చేసింది. అయితే ఇలాంటి కేసులు అరుదు. కొవిడ్‌కి సంబంధించి సీరియస్‌ కేసులకు క్రౌడ్‌ఫండింగ్‌ క్యాంపెయిన్లు నిర్వహించేంత సమయం ఉండటం లేదు. అందుకని ఈ వెబ్‌సైట్లు మరో మార్గంలో సమాజానికి తోడ్పడుతున్నాయి.

ఎలా..?
కొవిడ్‌ వల్ల ఒక్కసారిగా ఆస్పత్రుల మీద భారం పెరిగింది. మాస్కులూ, శానిటైజర్లూ, పీపీఈ కిట్లూ, ఫేస్‌ షీల్డులూ, వెంటిలేటర్లూ, ఐసీయూ పడకలూ, ఆక్సిజన్‌ సిలిండర్లూ, వ్యాధినిరోధక శక్తినిచ్చే మందులూ రోగులకూ వైద్యసిబ్బందికీ ఆహారం... హఠాత్తుగా ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం ఏ ఆస్పత్రులకైనా కష్టమే. మరోపక్క సమాజంలో వృత్తిపనులు చేసే చాలామంది ఉపాధి కోల్పోయారు. పేదలకు రెండు పూటలా తిండి దొరకడమూ కష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో క్రౌడ్‌ఫండింగ్‌ సంస్థలు ముఖ్యంగా మూడు మార్గాల్లో సాయం అందిస్తున్నాయి. ఉపాధి కోల్పోయినవారికి నగదు సాయం, బస్తీల్లో నిరుపేదలకు ఉచిత రేషన్‌ పంపిణీ, ఆస్పత్రులకు కావలసిన సరంజామా... వీటి ద్వారా అందుతున్నాయి. ఒక్క గివ్‌ ఇండియా సంస్థే ఈ విభాగం కింద ఆరు లక్షల మందికి 40 కోట్ల రూపాయల్ని నగదు సాయంగా అందించింది. వలస కూలీలకు 40 లక్షల భోజనాలు, 8 లక్షల కుటుంబాలకు రేషనుతో పాటు హెల్త్‌ కిట్లనూ అందజేసింది. ముంబయిలోని మురికివాడల్లో ఆరు మొబైల్‌ మెడికల్‌ యూనిట్లను నిర్వహిస్తూ కరోనా పరీక్షలు చేస్తూ చికిత్సలకు ఏర్పాటుచేస్తోంది. ఇలాంటివే కాకుండా కొవిడ్‌ పరిస్థితులకే సంబంధించి మరెన్నో క్యాంపెయిన్లను ఈ వెబ్‌సైట్లు నిర్వహిస్తున్నాయి.

ఎలాంటి క్యాంపెయిన్లు?
గతేడాది కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన 200 మంది చేనేత కార్మికుల కోసం 42 లక్షలు, లాక్‌డౌన్‌ వల్ల మూతపడిన రాంబో సర్కస్‌ సిబ్బంది 90మంది ఆకలి తీర్చడానికి 12.5 లక్షలు కెట్టో ద్వారా సేకరించారు. మొన్నటికి మొన్న అనుష్కాశర్మ, విరాట్‌ కోహ్లి దంపతులు కెట్టో ద్వారానే 11కోట్లకు పైగా సేకరించి కొవిడ్‌ సహాయ చర్యలు చేపడుతున్న ‘యాక్ట్‌ గ్రాంట్స్‌’ అనే సంస్థకు అందజేశారు. ఎనిమిదేళ్లుగా ఈ రంగంలో ఉన్న తమకు- కరోనా వచ్చిన ఈ ఏడాదిలోనే 300శాతం నిధులు పెరిగాయనీ, మొదటి సారి చిన్న పట్టణాలనుంచి కూడా దాతలు విరాళాలు ఇస్తున్నారనీ, మళ్లీ మళ్లీ విరాళాలు ఇవ్వడానికి వెబ్‌సైట్‌కి వస్తున్న వారి శాతం 30నుంచి 70కి పెరిగిందనీ అంటున్నారు కెట్టో వ్యవస్థాపకుడు వరుణ్‌ సేథ్‌. ఇంపాక్ట్‌గురు ప్రాథమికంగా వైద్యం కోసం నిధులు సేకరించేది. అలాంటిది ఇప్పుడు ఆ సంస్థకి డొనేషన్స్‌ రెట్టింపయ్యాయట. నిమిషానికి ముగ్గురు దానం చేస్తున్నారనీ ఇప్పటివరకూ 15 కోట్లు కొవిడ్‌ రిలీఫ్‌ కార్యక్రమాలకు ఖర్చు పెట్టామనీ చెబుతోంది ఈ సంస్థ. తమిళనాడులో 500 మంది గిరిజన రైతుల పసుపు పంట వృథాగా పడివుండగా దాన్ని అమ్మిపెట్టడం ద్వారా 27లక్షలు సేకరించి ఇచ్చింది ‘ఫ్యుయెల్‌ఎడ్రీమ్‌’ సంస్థ. మహారాష్ట్రలో కూరగాయలు పండించే రైతులకు వాటిని నిల్వ చేసుకునే సబ్జీ కూలర్లు కొనుక్కోడానికి పాతిక లక్షల దాకా సమీకరించింది.‘డొనేట్‌కార్ట్‌’ వంద కోట్ల విలువైన సామగ్రిని సేకరించి ఎన్జీవోలకు అందజేసింది. ఇవే కాదు, ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేయడానికీ, ఐసొలేషన్‌ కేంద్రాలు నిర్వహించడంకోసం, ఆస్పత్రుల్లో రోగులకూ సిబ్బందికీ ఆహారం సరఫరా చేయడానికీ, రాత్రింబగళ్లూ పనిచేస్తున్న శ్మశానాల్లోని సిబ్బందికి తిండి పెట్టటానికీ... ఇలా ఎన్నో మంచి పనులకోసం ఎందరో ఈ వెబ్‌సైట్ల ద్వారా నిధులు సేకరిస్తున్నారు. వారి మీద నమ్మకంతో మరెందరో తమ కష్టార్జితం నుంచి కొంత మొత్తాన్ని ఆనందంగా ఇస్తున్నారు.అడగనిదే అమ్మయినా పెట్టదంటారు. అలాగని అడగడానికి మనసు చిన్నబుచ్చుకునే అవసరమూ లేదు. క్రౌడ్‌ఫండింగ్‌ వేదికపై ఒక చిన్న అర్జీ... పెద్ద విన్నపమై వేల మనసుల్ని కదిలిస్తోంది. రోజుల వ్యవధిలోనే ఊహకందని మొత్తాల్ని సేకరిస్తోంది. తమకు అసలు పరిచయమే లేని వారిని సైతం దొడ్డ మనసుతో ఆదుకుంటున్న మారాజుల మంచితనాన్ని కోట్ల రూపాయల్లో కొలిచి చూపిస్తోంది..!

అలా మొదలైంది..!

అలెగ్జాండర్‌ పోప్‌ అనే రచయిత గ్రీకు కావ్యం ‘ద ఇలియడ్‌’ని ఆంగ్లంలోకి అనువదించాడు కానీ ప్రచురించడానికి డబ్బు లేకపోయింది. అందుకని తాను ప్రచురించబోతున్న పుస్తకానికి ముందుగా డబ్బులిచ్చి కొనుక్కునేవారి పేర్లను పుస్తకంలో ప్రచురిస్తానని చెప్పాడు. దాంతో బోలెడు డబ్బు వచ్చింది. అన్నట్టుగానే 750 మంది పేర్లను ఆ పుస్తకంలో ప్రచురించాడు. చరిత్రలో మొట్టమొదటి ‘క్రౌడ్‌ఫండింగ్‌’ ఇదేనంటారు. అమెరికా అనగానే గుర్తొచ్చే స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ తయారీకి డబ్బులు సరిపోక ఫ్రాన్స్‌, అమెరికా దేశాలు రెండూ కూడా ప్రజలనుంచి విరాళాలు సేకరించాయి. ఇలా ఆచరణలో క్రౌడ్‌ఫండింగ్‌ విధానం ఎప్పటినుంచో అమల్లో ఉన్నా దానికి ఆ పేరు మాత్రం పదిహేనేళ్లక్రితమే వాడుకలోకి వచ్చింది. వీడియోబ్లాగులకు సంబంధించిన ప్రాజెక్టులకు నిధులు సేకరించే ఉద్దేశంతో మైకేల్‌ సలివాన్‌ 2006లో ‘ఫండావ్లాగ్‌’ని ప్రారంభిస్తూ మొదటిసారి ‘క్రౌడ్‌ ఫండింగ్‌’ అన్న మాట వాడాడు. అయితే మైకేల్‌ తలపెట్టిన ప్రాజెక్టు విఫలమైనా అతడు సృష్టించిన ఈ పదం తర్వాత వచ్చిన ‘కిక్‌స్టార్టర్‌’ అనే వెబ్‌సైట్‌తో బాగా ప్రాచుర్యం పొందింది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న