అండం... బ్రహ్మాండం..! - Sunday Magazine
close

అండం... బ్రహ్మాండం..!

గుడ్డుని గట్టిగా పట్టుకోవాలంటేనే భయపడుతుంటాం. అలాగని కాస్త వదులుగా పట్టుకుంటే జారిపడటం ఖాయం. అలాంటి గుడ్డులోంచి సొనను పొరతో సహా బయటకు తీసి దాన్నో చూడచక్కని శిల్పంలా చెక్కేవాళ్లు కొందరు... దానిపైన అందమైన బొమ్మలు వేసేవాళ్లు మరికొందరు... సూదీదారంతో ఎంబ్రాయిడరీ చేసేవాళ్లు ఇంకొందరు. ఇక, ఆ పెంకుల్ని అతికిస్తూనే అద్భుతమైన చిత్రాల్ని చిత్రించేవాళ్లు మరెందరో... ఇలా ఎన్నో కళలకు కాన్వాస్‌గా మారిన ఆ గుడ్డు ‘బొమ్మ’ల్ని చూస్తే ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ అనిపించడం సహజమే కదూ. అందుకే వాటిల్లో కొన్ని..!

‘గుడ్డు ముందా... పిల్ల ముందా...’ అన్నది ఎంతటి సంక్లిష్టమైన ప్రశ్నో, గుడ్డు కళ ఎప్పటిదో చెప్పడం కూడా అంతే కష్టం. 65 వేల సంవత్సరాల క్రితమే ఆస్ట్రిచ్‌ పక్షి గుడ్లలోని సొనని తొలగించి ఆ పెంకుల్లో నీళ్లు నిల్వచేసుకున్నారనీ, అవి తమవి అని తెలిసేలా వాటిమీద డిజైన్లు చెక్కుకున్నారనీ చరిత్ర చెబుతోంది. ఆ తరవాత గుడ్డుని సంతానోత్పత్తికి ప్రతీకగా భావిస్తూ వాటికి రంగులద్ది బొమ్మలు గీసి వధూవరులకీ లేదూ పిల్లలు పుట్టినప్పుడూ కానుకలుగా ఇచ్చేవారట. ఆపై క్రీస్తు పునరుత్థానం సందర్భంగా చేసుకునే ఈస్టర్‌ పండగకోసం గుడ్డుని రకరకాలుగా అలంకరించి సన్నిహితులకు కానుకలుగా ఇవ్వడం అనేక దేశాల్లో వాడుకలోకి వచ్చింది. ఆ విధంగా అండానికి రంగులద్దడం, అలంకారం చేయడం... అనేది పురాతన కాలం నుంచీ వాడుకలో ఉన్నప్పటికీ కాలాను గుణంగా అది మరెన్నో కళలకు కాన్వాస్‌గా మారింది, ఎన్నెన్నో అలంకరణలతో అందమైన అలంకారంగా నట్టింట్లో కొలువైంది. ఈ గుడ్డు కళలన్నీ అలా పుట్టుకొచ్చినవే మరి.

చిత్రం... అండ విచిత్రం!
బొమ్మంటూ వేయడం వస్తే ఎక్కడైనా వేయొచ్చు అనుకుంటాం కానీ, గుడ్డుమీద చిత్రించడం అంత సులభం కాదు. గుడ్డుకి చిన్న రంధ్రం చేసి బ్లోయర్‌ సాయంతో అందులోని సొనని పూర్తిగా బయటకు తీసేస్తారు. ఆపై వాటర్‌ ఫ్లాజర్‌తో కడిగి దాన్ని ఆరనిస్తారు. తరవాత పెన్సిల్‌తో డిజైన్‌ గీసుకుని ఆపై కుంచెతో బొమ్మలు వేస్తుంటారు అండ ‘చిత్ర’కారులు. జానపద చిత్రాల్నీ దేవతా రూపాల్నీ ప్రకృతి దృశ్యాల్నీ వ్యక్తుల్నీ... ఇలా గుడ్డుమీద తమలోని సృజనని ప్రదర్శిస్తోన్నవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఈ గుడ్డు చిత్రకళకి పెట్టింది పేరు ఉక్రెయిన్‌. తేనెపట్టు నుంచి తీసిన మైనంలో రంగులు కలిపి సన్నని సూదితో గుడ్లమీద జానపద డిజైన్లు గీయడం అక్కడి కళాకారులకి వెన్నతోపెట్టిన విద్య. ఈ కళని ‘పైశాంక’ అని పిలుస్తారు. ఇప్పటికీ అక్కడ ఈ పద్ధతిలోనే ఈస్టర్‌ గుడ్లని చిత్రిస్తారట.

అందానికే అందం... గుడ్డు శిల్పం!
‘శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్లు... సృష్టికే అందాలు తెచ్చినారు’ అంటూ రాతిమీద శిల్పాలు చెక్కితేనే ఎంతో ఆశ్చర్యపోయాం. కానీ పెళుసైన గుడ్డు పెంకుమీద దాని ఆకారం చెదరకుండానే సూదిలాంటి పరికరంతో దాన్నో శిల్పంలా మలుస్తోన్న ఈనాటి కళాకారుల నైపుణ్యాన్ని ఎంత ప్రశంసించినా తక్కువేనేమో. మొదట్లో మందంగా ఉండే ఆస్ట్రిచ్‌ గుడ్డునే చెక్కడానికి వాడేవారు కానీ ఇప్పుడు కోడి, బాతు గుడ్లనీ చెక్కేస్తున్నారు. సొన తీసేసి, కడిగి ఆరబెట్టిన గుడ్డుమీద పెన్సిల్‌తో డిజైన్‌ గీసుకుని సన్నని ఉలితో చెక్కుకుంటూ వెళతారు. దీనికి నైపుణ్యంతోపాటు ఏకాగ్రతా ఓపికా కావాలి. చెక్కేటప్పుడు దాన్నుంచి వచ్చే పొడి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. అచ్చం లేసు అల్లికలో మాదిరిగానే ఎంతో క్లిష్టమైన డిజైన్లనీ గుడ్లలో చొప్పించడం ఒక అద్భుతమే. చేతిలో ఇమిడిపోయే అంత చిన్న గుడ్డులోనే ఆకులూ పువ్వులూ ఈకలూ పక్షులూ జంతువులూ... ఇలా సృష్టిలోని సకల ప్రాణుల రూపాల్నీ అచ్చుగుద్దినట్లుగా చెక్కేస్తున్నారు. ఈ గుడ్డు శిల్పాల్లో కొన్ని గంటలోనే పూర్తయితే, మరికొన్ని డిజైన్లకి సంవత్సరాలు కూడా పట్టొచ్చట. కొందరైతే గుడ్డు శిల్పాలకు రంగులద్ది, లైట్లు అమర్చి బెడ్‌ల్యాంప్‌లుగానూ మలుస్తున్నారు.

మొజాయిక్కా... గుడ్డు పెంకా?!
చిన్న చిన్న రాళ్లూ గాజూ లేదా సెరామిక్‌ ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి పేర్చుతూ అందమైన చిత్రాల్ని ఆవిష్కరించే మొజాయిక్‌ కళ సుపరిచితమే. అయితే రాళ్లకు బదులుగా గుడ్డు పెంకులతోనే అందమైన మొజాయిక్‌ చిత్రాల్ని రూపొందిస్తున్నారు నేటి కళాకారులు. రాళ్లు లేదా గాజుముక్కలతో చేసిన చిత్రాల మాదిరిగానే గుడ్డుపెంకులతో చేసినవీ అంతే అందంగా ఉండటం విశేషం. అంతేనా... ఇవి కూడా చెక్కుచెదరవట. ఈ చిత్రాలకోసం గుడ్డు పెంకుల్ని సబ్బునీళ్లలో కడిగి వినెగర్‌ అద్దిన దూదితో తుడిచి ఆరబెడతారు. గీతల్లేకుండా కావాల్సిన సైజుల్లోకి విరిచి రంగుల్లో ముంచి తీసి జిగురుతో అతికిస్తూ బొమ్మల్ని ఆవిష్కరిస్తారు. గోడ చిత్రాలతోపాటు సీసాలూ ఫొటోఫ్రేములూ వేజ్‌లూ పూలకుండీలూ... ఇలా ఎన్నో రకాల వస్తువులు ఇప్పుడు ఎగ్‌ మొజాయిక్‌ అందాల్ని అద్దుకుని కళ్లను కట్టి పడేస్తున్నాయి.

ఎంబ్రాయిడరీ... ‘ఎగ్‌’స్ట్రార్డినరీ!
గుడ్డుమీద బొమ్మలేయడం, చెక్కడం.. వంటివన్నీ ఒకెత్తయితే, ఏకంగా ఆ గుడ్డుమీద అందమైన ఎంబ్రాయిడరీలు కుట్టడం మరోకెత్తు. మందంగా ఉన్న పెంకులోకి ఓపికగా సూదిని దూరుస్తూ బట్టమీద మాదిరిగానే క్రాస్‌ స్టిచ్‌ నుంచి రిబ్బన్‌ ఎంబ్రాయిడరీ వరకూ అన్నీ కుట్టేస్తున్నారు. నేటి ఎంబ్రాయిడరీ బ్లౌజుల అందాలకు ఏమాత్రం తీసిపోకుండా గుడ్డుమీద కుట్టులోనూ పూసల్నీ రాళ్లనీ అలంకరిస్తూ అద్భుతమైన డిజైన్లు సృష్టించేస్తున్నారు.

‘ఎగ్స్‌’ట్రీమ్‌!
గుడ్డుకి అలంకారాలు చేయడమే కాదు, ఆ గుడ్డుతో నగల బాక్సుల్నీ చేస్తున్నారు కొందరు ఎగ్‌ డిజైనర్లు. రష్యన్‌ జార్‌ చక్రవర్తుల వైభవానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఆనాటి జ్యువెలరీ డిజైనర్‌ ఫాబర్జె, ఈస్టర్‌ కోసం బంగారం, వజ్రాలతో అత్యద్భుతమైన గుడ్లను తయారుచేసేవాడు. అవన్నీ ఖరీదైనవి కావడంతో వాటిని అనుకరిస్తూ ఇప్పుడు పెద్దగా ఉండే ఈము, ఆస్ట్రిచ్‌, బాతు గుడ్ల లోపల శాటిన్‌ బట్టను అతికించి, పై భాగంలో రంగులద్ది, రాళ్లూ పూసలూ సిల్కు, జరీదారాల్ని అతికించి ఫాబర్జె ఎగ్స్‌ మాదిరిగా మలుస్తున్నారు నేటి అండ ప్రియులు. ఈ పెట్టెల్ని లోహపు స్టాండుల్లో అమర్చడంతో చూసేవాళ్లకివి నిజంగా గుడ్లేనా అన్న అనుమానమూ కలగకపోదు. ఇవేకాదు, గుడ్డుమీద క్విల్లింగ్‌ చేస్తూ ఊలు దారాలతో అల్లేస్తూ పూలని అద్దేస్తూ... ఇలా అండాన్నే అండగా చేసుకుని తమలోని సృజనని ప్రదర్శిస్తోన్న వాళ్లందరినీ ‘ఎగ్స్‌’లెంట్‌ అంటూ పొగడకుండా ఉండగలమా?!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న