అమ్మకు ఆహ్వానం - Sunday Magazine
close

అమ్మకు ఆహ్వానం

- వేమూరి సత్యనారాయణ

సాయంత్రం పార్కులో ముచ్చట్లు ముగిశాక, ఇంటికి రాబోతూ హరగోపాల్‌ని అడిగాను. ‘రేపు పుస్తకావిష్కరణకి వస్తున్నారుగా’ అని.
‘‘లేదండీ రాత్రికి బయలుదేరి బందరు వెళుతున్నాను ఫ్యామిలీతో. రేపు మా అమ్మ ఆబ్దికం. ఆమె పోయి పదేళ్లయింది. ఇన్నాళ్లూ కుదరలేదు. ఈసారైనా తప్పకుండా మా అయిదుగురు అన్నదమ్ములం, ఇద్దరు సిస్టర్స్‌ అందరం ఉండేలా మూడు నెలల ముందే ఏర్పాట్లు చేసుకున్నాం’’ అన్నాడాయన.
‘‘సరే వచ్చాక కలుద్దాం’’ అని చెప్పి మిగతా మిత్రుల దగ్గరకూడా సెలవు తీసుకుని బయలుదేరిపోయాను నేను.
ఇంటికొచ్చి స్నానం చేసి, భోజనాలు కూడా అయ్యాక తీరిగ్గా కూర్చుని టీవీ పెట్టి వెతుకులాట మొదలెట్టి, చివరికి అమితాబ్‌, శశికపూర్‌ నటించిన పాత సినిమా ‘దీవార్‌’ దగ్గర ఆగాను. కాసేపటికి పనులు ముగించుకుని వచ్చి పక్కన కూర్చుంది నా శ్రీమతి లక్ష్మి. పదినిమిషాలు కాకుండానే రిమోట్‌ తీసుకుని సౌండ్‌ కాస్త తగ్గించింది. నాతో ఏదో మాట్లాడటానికి అదో సంకేతం. అది నాకు తెలుసు. ఏమిటన్నట్లు చూశాను.
‘‘ఫిబ్రవరి మూడు సంగతి మర్చిపోయారా?’’ అంది.
ఎందుకు అలా అందో అర్థం కాలేదు నాకు.
‘‘ఏం మర్చిపోయానూ...’’ అన్నాను సందేహంగా చూస్తూ.
‘‘అత్తయ్య పోయిన రోజు కదా? డేట్‌ మర్చిపోయారా?’’
చాచి లెంపకాయ కొట్టినట్టనిపించింది. సాయంత్రం హరగోపాల్‌ వాళ్ల అమ్మ విషయం చెప్పినప్పుడు కూడా జ్ఞాపకం రాలేదు నాకు.
అవునా? అమ్మ పోయి సంవత్సరం అవుతోందా!
‘మేరాపాస్‌ మా హై’ అంటున్నాడు శశికపూర్‌ టీవీలోంచి.
సిగ్గనిపించింది.
‘‘సారీ లక్ష్మీ, అస్సలు గుర్తు రాలేదు’’ అని నసిగాను.
‘‘సరేలెండి. రేపు పంతులుగారితో ఒకసారి మాట్లాడి కనుక్కోండి. ఒక్కోసారి తిథుల ప్రకారం డేట్‌ మారుతూ ఉంటుంది సంవత్సరీకం చెయ్యటానికి’’ అంది లక్ష్మి.
నేనెప్పుడూ ఓడిపోయే సందర్భాలు ఇవి. ఆచారాలూ నమ్మకాల పేరుతో జరిపే ఈ క్రతువుల మీద నాకేమాత్రం నమ్మకం లేదు. దానికి వ్యతిరేకం కూడా. అయితే ఏవీ చెయ్యకుండానూ లేను. ఇక్కడ పని చేసేది ఆత్మీయమైన మానవ సంబంధాలు.
అమ్మానాన్నల కోసమో, భార్య కోసమో, బంధుమిత్రుల కోసమో నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా, వాళ్ల నమ్మకాలని గౌరవిస్తూ, వాటిని పాటిస్తూ వస్తున్నాను. ఎవరైనా పిలిస్తే ఆయా కార్యక్రమాలలో పాల్గొంటున్నాను కూడా, వాళ్ల మనసుకు కష్టం కలిగించటం ఇష్టం లేక.
ఈసారైనా గట్టిగా నిలబడాలనిపించింది.
‘‘అలాంటివేవీ వద్దులే లక్ష్మీ. ఏదైనా అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్నవాళ్లకు మంచి భోజనం ఏర్పాటు చేద్దాం. అంతే కాకుండా వాళ్లకు మరిన్ని సౌకర్యాల కోసం అమ్మ పేరు మీద ఒక యాభై వేలు డొనేట్‌ చేద్దాం. అమ్మనలా గుర్తుచేసుకుందాం’’ అని కొంచెం స్థిరంగానే అన్నాను లక్ష్మితో.
‘‘చాలా మంచి ఆలోచనండీ. అలాగే చేద్దాం. భోజనాలు బయటనుంచో, ఆ అనాథాశ్రమం వాళ్లతో చెప్పి ప్రత్యేకంగా చేయించో ఏర్పాటు చేద్దాం. అత్తయ్యకి ఇష్టమైన సున్నుండలు నేను ఇంట్లో చేస్తాను, తీసుకువెళదాం’’ అంది లక్ష్మి.
ఆ మాటల్లో నా నిర్ణయానికి తన మెచ్చుకోలు కనిపించింది నాకు. అంతే కాకుండా ‘అమ్మయ్య ఇన్నాళ్లకు నాకు నచ్చని పని చెయ్యటం లేద’న్న రిలీఫ్‌ కూడా.
ఆ రిలీఫ్‌ కొన్ని నిమిషాల ముచ్చటే అయింది.
‘‘అయినా మనకు ప్రతి సంవత్సరం ఇలా చేసే ఆచారం ఎలాగూ లేదు. మొదటి సంవత్సరమేగా చేసేది. మావయ్యగారికి ఎలాగూ చేశాం గతంలో. ఇప్పుడు అత్తయ్య విషయంలో తేడా చూపటం బాగోదు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని, తరవాత అనాథాశ్రమానికి వెళ్లి మీరు చెప్పినట్టుగా అత్తయ్య పేరుతో సాయం చేసొద్దామండీ’’ అంది లక్ష్మి మళ్లీ. ఇంకేముంది అవతల మనిషి సెంటిమెంటూ నమ్మకమూ నా మీద పని చేశాయి. ఈ విషయంలో మళ్లీ ఓడిపోయి అంగీకారంగా తలూపేశాను.
పంతులు గారితో మాట్లాడితే, పంచాంగం చూసీ లెక్కలేసీ జనవరి ఇరవయ్యేడుకే తిథుల ప్రకారం సంవత్సరీకం చెయ్యాలని చెప్పాడు. అందుకు కావలసిన సరకులన్నీ ఆయనే తెచ్చుకుని ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్యాకేజ్‌ మాట్లాడుకున్నాం. పిలుపులు మొదలయ్యాక ‘వీళ్లని పిలవకపోతే ఏం బాగుంటుందీ’ అని తనంటే ‘మరి వీళ్లో’ అని నేననడం... ఇలా లిస్ట్‌ బాగానే పెరిగింది. అంతా అయిందనుకున్నాక కూడా ‘ఫలానా వాళ్లను మర్చిపోవద్దండోయ్‌, అత్తయ్యకి వాళ్లంటే చాలా ఇష్టం’ అని గుర్తు చేసేది లక్ష్మి. మేమున్న అపార్ట్‌మెంట్స్‌లోనే మరో ఫ్లాట్‌లో ఉంటున్న మా అబ్బాయీ కోడలూ పనుల్లో సాయపడుతూ దాదాపు మా ఇంట్లోనే గడిపేవారు రెండురోజుల ముందునుంచీ. ఒకరోజు ముందుగానే మా అమ్మాయీ వచ్చింది తల్లికి సాయంగా ఉండటానికి.
ఆ రోజు ఉదయమే- నేనూ నాతో పాటూ ఇద్దరు జ్ఞాతులూ, అమ్మకి దహన సంస్కారాలు చేసిన శ్మశానం దగ్గరకే వెళ్లి ఆ కార్యక్రమం ముగించుకున్నాం. తిరిగొచ్చాక కూడా ఇంట్లో చిన్న పూజ లాంటిది చేసి మా అమ్మ ఫొటోకి నమస్కరించి సంభావనలు తీసుకుని వెళ్లారు పంతులుగారు.

మా ఇంట్లో ఇటువంటి కార్యక్రమాలపుడు బయట క్యాటరింగ్‌కి ఆర్డర్‌ చెయ్యటం అలవాటు లేదు. ఆ సమయానికి ముందే కొంతమంది దగ్గర చుట్టాలు వచ్చి అందరూ కలిసి వంటలు ఇంట్లోనే చేసే అలవాటు. పంతులు గారిని సాగనంపి వచ్చేసరికి వంటిల్లు అంతా సందడిగా ఉంది. పనులు జరుగుతున్నాయి. నేను స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చుని అప్పటికే వచ్చిన బంధువులతో మాటల్లో పడ్డాను. వంటింట్లో నుంచి గిన్నెల సందడితోపాటూ మాటలూ వినపడుతున్నాయి.
‘విసమ్మామ్మ దోసకాయ పచ్చడి ఎంత బాగా చేసేదో’ అంటోంది గీత, మా బావగారి అమ్మాయి.
‘అదేనా, ఎండు మిరపకాయలూ, చింతపండూ, ఉప్పూ, బెల్లం- వీటిని చేత్తో నలిపి కారం పచ్చడి చేసేది. ఎంత ప్రయత్నించినా నాకు కుదరలేదు. పాపం చివర్లో అలా నలపలేక మానేసింది, వేళ్లలో సత్తువ లేక. ఆ పచ్చడీ దాని రుచీ అత్తయ్యతోనే పోయింది’ అంటోంది లక్ష్మి.
బంధువులు ఒక్కొక్కరూ రావటం మొదలైంది. నా మిత్రులొస్తే నేను వాళ్లతో మాట్లాడుతూ కూర్చున్నాను. మిగతా అతిథుల బాధ్యత మా అబ్బాయీ కోడలూ చూసుకుంటున్నారు. గదిలో ఓ మూల టేబుల్‌పైన గోడకానించి ఉన్న అమ్మ ఫొటో పూలదండతో అలంకరించి ఉంది. ఫొటో కింద భాగాన, వచ్చిన వాళ్లలో కొందరు అమ్మకు నివాళి అర్పిస్తూ వేసిన పూలరేకలు చిన్న గుట్టగా ఏర్పడ్డాయి. ఫొటో ముందు అమ్మకిష్టమైన పిండివంటలూ చిన్న చిన్న గిన్నెల్లో. పక్కన రెండు అరటి పళ్లూ, చివరిగా చివర్లో తాను ఎక్కువగా ఇష్టపడ్డ విత్తనాలు తీసిన ఖర్జూర పళ్లూ, ఇంత తీరికలేని పనుల్లోనూ, లక్ష్మి ప్రత్యేకంగా చేసిపెట్టిన సున్నుండలూ కూడా ఉన్నాయి ఆ పదార్థాల్లో. అప్పుడప్పుడూ నా చూపులు అటు వెళ్తున్నాయి. అమ్మ ఫొటోలోంచి నవ్వుతూ చూస్తోంది.
మిత్రుల మాటల్లో మా అమ్మ ప్రస్తావన... రెండేళ్ల క్రితం వాళ్ల అమ్మాయి పెళ్లికి పిలవటానికి మా ఇంటికి వచ్చినప్పటి సంఘటన గుర్తు చేసుకున్నాడు శేషు. ‘అదే మొదటిసారి ఆమెని చూడటం. సత్యంగారు ఆమె గదిలోకి నన్నూ మా ఆవిడనీ తీసుకెళ్లి పరిచయం చేస్తే చాలా ఆప్యాయంగా పలకరించారు. పెళ్లి విషయం చెబితే, ‘ఏదీ అల్లుడి ఫొటో చూపించూ మీ ఫోనుల్లో ఉంటాయిగా’ అని అడిగారు ఎంతో చనువుగా. ఆశ్చర్యపోయాను. ఎంగేజ్‌మెంట్ ఫొటో చూపిస్తే ‘మంచి అందగాడ్ని అల్లుడిగా కొట్టేశావ్‌’ అని నవ్వి, ‘ఈడూ జోడూ చూడ ముచ్చటగా ఉన్నారు’ అని మెచ్చుకున్నారు. నా చేతికున్న బ్రేస్‌లెట్‌ తడుముతూ ‘ఇలాంటిది అల్లుడికి చేయించే ఉంటావుగా’ అని అడిగారు నవ్వుతూ. సెలవు తీసుకుని రాబోతుంటే లక్ష్మిగారిని పిలిచి జాకెట్‌ గుడ్డ తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి, మా ఇద్దరికీ చెరో అరటిపండూ ఇచ్చి, ఇద్దరి తలలూ ఆప్యాయంగా నిమిరి ఆశీర్వదించారు. మొదటి పరిచయంలోనే ఆమె చూపిన ఆత్మీయతకు తెలియకుండానే నా కళ్లలో నీళ్లు. చాలా ఎమోషనల్‌ అయి ఒంగి కాళ్లకు నమస్కారం పెట్టేశాను’ అన్న శేషు గొంతులో ఇప్పుడూ కొంచెం తడి ధ్వనించింది.
‘మామ్మగారూ, పచ్చిమిరపకాయ పచ్చడి చేసిపెట్టమని ఎన్నిసార్లు అడిగి చేయించుకున్నానో లెక్కలేదు’ అన్నాడు మరో మిత్రుడు రవికిషోర్‌ అమ్మ ఫొటో వంక చూస్తూ.
ఫొటోలోంచి అమ్మ నవ్వుతూ చూస్తూనే ఉంది.
మాట్లాడుతూ ఉండగానే భోజనాలకు పిలుపొచ్చింది. కబుర్లు చెప్పుకుంటూనే తింటున్నాం. మాటల్లో ఏదోరకంగా అమ్మ ప్రస్తావన వస్తూనే ఉంది. ఇదంతా అమ్మ నవ్వుతూ చూస్తూనే ఉంది ఫొటోలోంచి.
రెండుగంటలకల్లా భోజనాలు పూర్తి అయ్యాయి. అందరూ వెళ్లగా అతి సమీప బంధువులు పది పన్నెండు మంది మిగిలారు. సాయంత్రం వరకూ ఉండి లక్ష్మికి సర్దుళ్లలో సాయం చేసి, కొంచెం పెందరాళే భోజనాలు కూడా చేసి వెళ్లే అలవాటు ఇలాంటి సందర్భాల్లో.
అందరూ కబుర్లలో పడ్డారు.
‘వారందాటి కనపడకపోతే అలిగేది అత్తయ్య. కనీసం ఫోన్లో అన్నా పలకరించాల్సిందే’ గుర్తు చేసుకున్నాడు మేనత్తని మా పెదబావ, లక్ష్మి పెద్ద అన్నయ్య. నేను మేనమామ కూతుర్నే చేసుకున్నాను.
‘నువ్వు మా అమ్మవే అని అందరి పిల్లలకంటే ఒక బిస్కట్‌ ఎక్కువ ఇచ్చేది ఎప్పుడూ’ అంది సీత, మా పెదబావ కూతురు. నాయనమ్మ పేరు పెట్టుకున్నాడు మా బావ తన కూతురికి. ఆ సీతమ్మే మా అమ్మమ్మ.
వాళ్ల కబుర్లు అలా సాగుతుండగానే బాగా అలసిపోయి ఉన్నానేమో అలాగే దివాను మీద ఒత్తిగిలి నిద్రలోకి జారాను.
అలా వెంటనే నిద్ర పోగలిగే నా అదృష్టానికి పొగుడుతూ ఈర్ష్య పడేవాడు మా చినబావ.
‘దేనికైనా పెట్టి పుట్టాల్రా’ అనేసేది మా అమ్మ.
మగత నిద్రలో లీలగా మాటలు వినపడుతున్నాయి. ఆ మాటల్లో విసమ్మత్తయ్య, విసమ్మ పిన్ని, విసమ్మక్కయ్య, విశాలాక్షి... ఇలా అమ్మ గురించిన కబుర్లు. వివరాలు తెలియకపోయినా అన్నీ అమ్మ మాటలే. పేరు విశాలాక్షి అయినా విసమ్మనే పిలిచేవారు ఎక్కువమంది.
నా కాళ్లదగ్గర ఎవరో కూర్చున్నట్లున్నారు... వాళ్ల చెయ్యి తగిలింది నా కాళ్లకు చల్లగా.
అమ్మ గుర్తొచ్చింది. రోజూ నేను పడుకునేముందు కాళ్లకు నూనె రాసేది. అలా చెయ్యటం నాకూ ఇష్టంగానే ఉండేది. ‘కాస్త తక్కువ రాయవమ్మా,
దుప్పట్లనిండా నూనె పూసుకుపోతోంది’
అని విసుక్కునేది లక్ష్మి.
చివర్లో చిక్కిపోయిన చేతులూ, సన్నగా వణికే ఆ వేళ్లూ చూసి ‘వద్దమ్మా ఇక రాయొద్దు’ అని ఎంత చెప్పినా వినేది కాదు. చివరికి ఒకసారి గద్దించి చెప్పేసరికి దీనంగా ముఖం పెట్టి ‘సరేలే, నూనె రాయనుగానీ కాలు జాపు ఊరికే అలా రుద్ది పడుకుంటా’ అనేది బతిమాలుతూ.
అమ్మ మరి!
కాసేపటికి నిద్రలేచాను.
మళ్లీ సాయంత్రం స్నాక్స్‌, కాఫీలు. మధ్య మధ్య అమ్మ మాటలూ. అమ్మ ఫొటోలోంచి నవ్వుతూ చూస్తూనే ఉంది. ఫొటోకి వేసిన దండ కాస్త జరిగి ముఖాన్ని ఒక భాగం మూసేస్తున్నట్టు ఉంటే వెళ్లి సర్దింది మా అమ్మాయి. సాయంత్రం ఆరయ్యేసరికి పెద్దగా పనులూ ఏమీ లేకపోవటంతో అందరం తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం.
‘ఏమైనా మేనత్తకి కోడలివి అయి సుఖపడిపోయావ్‌’ అన్నాడు మా పెదబావ చెల్లెలితో. నిజమేనని ఒప్పుకుంటూ అమ్మ చివరి రోజుల విశేషాలు ఏకరువు పెట్టింది లక్ష్మి...
‘మావయ్య పోయాక, తనకీ కొంచెం లేచి తిరగటం కష్టం అనిపించే స్థితికి వచ్చాక ఎక్కువ తన గదిలోనే ఉండేది. ఒంటరితనంతో ఇబ్బంది పడేది. తనకి కూడా తెలిసిన వాళ్లు వచ్చి ముందు హాల్లో మాట్లాడుతుంటే వాళ్ల మాటలు గుర్తుపట్టేది. ఏ కొంచెం ఆలస్యం అయినా తనని పలకరించటానికి ఇంకా రావటం లేదని అలక మొదలయ్యేది. నెమ్మదిగా సంకేతాలు పంపేది. దగ్గటం, కుర్చీ శబ్దం వచ్చేలా జరపటం ఇలా. నాకర్థమై వాళ్లకి చెప్పి లోపలికి పంపేదాన్ని. మరీ చిన్న పిల్లలా మారిపోయింది చివర్లో.’
నవ్వుతూ లక్ష్మినే చూస్తోంది ఫొటోలోని అమ్మ.
నిజంగా చివర్లో, తన రూమ్‌లో తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీవీతో సహా అన్ని సౌకర్యాలూ ఉన్నా ఒంటరితనం వల్ల చాలా బాధపడింది. పెద్దగా ఆరోగ్య సమస్యలూ లేవు. అరగంట దాటితే తట్టుకోలేక ఏదో మిషతో లక్ష్మిని పిలిచేది. వంటగదిలో పనిలోంచి హడావిడిగా వెళ్తే
‘ఆ కర్టెన్‌ కాస్త సర్ది వెళ్లు’ లాంటి చిన్న పనేదో చెప్పేది. ఇలా ఒకటికి నాలుగు సార్లు జరిగేసరికి విసుక్కునేది లక్ష్మి. ‘నాకూ వయసొస్తోంది కదా అత్తయ్యా, మోకాళ్ల నొప్పులని నీకూ తెలుసు. ఇన్నిసార్లు పిలిస్తే ఎలా?’ అని.
ఒక్కమాట కూడా మాట్లాడకుండా అలా చూస్తుండి పోయేది అమ్మ. మళ్లీ పిలవటం మామూలే. ఒకసారి మరీ విసుగొచ్చి లక్ష్మి అన్నమాట విని ఇద్దరిమీదా జాలేసింది నాకు.
‘ఇలాగే ఏడిపిస్తూ ఉండు. ఎప్పుడో నీ గొంతు పిసికి చంపేసి నేనూ ఉరేసుకు చస్తా’ అనేసింది ఆ రోజు.
‘చూడరా అబ్బాయ్‌ ఎంత మాటందో. కావాలని అన్న కూతుర్ని కోడలుగా చేసుకుంది దాన్ని కష్టపెట్టటానికా?’ అంది అక్కడే ఉన్న నాతో.
‘నువ్వు కూడా తన కష్టం చూడవే అమ్మా. కాస్త సర్దుకుపోవాలిగా’ అని ఆమెకే నచ్చచెప్పబోయాను అప్పటి సందర్భాన్ని బట్టి. నేను కూడా అలా అనేసరికి బిక్కమొహం పెట్టి మా ఇద్దరి వంకా చూసింది అమ్మ.
పాపం జాలేసిన లక్ష్మి, ‘అదేమంటే ఆ జాలి చూపొకటి’ అంటూ పక్కన కూర్చుని చేతిలో ఉన్న గిన్నెలోంచి తోలు వలిచి బద్దలుగా చేసిన సపోటా పండు అమ్మ నోటికందించింది.
బాగా వయసు పెరిగిన పెద్దలున్న ఏ ఇంట్లో అయినా ఈ సమస్యలు తప్పవేమో, ఎవరి తప్పూ లేకపోయినా. అప్పుడప్పుడూ విసుక్కున్నా చివరి వరకూ ప్రేమగానే చూసిన కోడలి వంక నవ్వుకుంటూ, ప్రేమగా చూసుకుంటోంది ఫొటోలోని అమ్మ.
కొంచెం పెందరాళే, పొద్దుటి కూరలూ, ఆ పూట చేసిన పప్పుచారుతో భోజనాలు ముగించాం. వెళ్లబోతూ గుర్తు చేసుకున్నాడు మా బావ తన దినకార్యాల గురించి మా అమ్మ కోరుకున్న కోరికలు...
‘పదకొండు రోజుల వరకూ ఆగొద్దు. అందరూ ఇబ్బంది పడతారు. దుబారా చెయ్యొద్దు. సింపుల్‌గా చేసెయ్యండి’ అనేదట. నెమ్మదిగా ఒక్కొక్కరే వెళ్తున్నారు.
‘‘ఇలా అందరం చేరి కబుర్లు చెప్పుకున్న ప్రతిసారీ ఆమెకి పండగలాగే ఉండేది. ఎంత ఆలస్యంగా బయల్దేరినా ‘వెళ్దురుగాన్లే, ఇంకాసేపు ఉండండ్రా’ అనేది’’ వెళ్లబోతూ అమ్మని గుర్తు చేసుకుంది గీత, మా వదినగారి కోడలు.
మా అమ్మాయివాళ్లు వెళ్లేటప్పుడు మాత్రం చిన్న కుదుపు. వెళ్లబోతూ ఒక్కసారి బావురుమంది మా అమ్మాయి. కారణం అడిగితే ఏమీ చెప్పలేదు. కాస్త ఆ దుఃఖం తగ్గి వెళ్లబోతూ ‘ఎందుకోనమ్మా ఒక్కసారి నాయనమ్మ గుర్తొచ్చింది’ అని మాత్రం లక్ష్మితో అంది.
చివరిలో మా అబ్బాయివాళ్లూ లేచారు వెళ్లటానికి. వెళ్లబోతూ వెళ్లబోతూ మా ఏడేళ్ల మనవడు వెనక్కొచ్చి అమ్మ ఫొటో దగ్గర కెళ్లి దణ్ణం పెట్టి వచ్చాడు.
‘‘నువ్వు చెప్పావా దణ్ణం పెట్టుకుని రమ్మని’’ మా కోడల్ని అడిగాడు మా అబ్బాయి.
‘‘లేదండీ, నేనేం చెప్పలేదు. నాకే ఆశ్చర్యం వేసింది. ‘ఏమైనా మామ్మ వ్యక్తిత్వం అలాంటిది... షి డిజర్వ్‌స్‌ ఆల్‌ ది రెస్పెక్ట్‌’’ అంది  మా కోడలు మా అబ్బాయి నుంచీ చూపులు అమ్మ ఫొటో వైపు తిప్పుతూ.
అక్కడ నుంచి అమ్మ నవ్వుతూ చూస్తోంది.

వీళ్లు కూడా వెళ్లాక మేమిద్దరమే హాల్లో మిగిలాం. నేనూ లక్ష్మి. మాటలు లేవు. అలాగే ఎవరి ఆలోచనల్లో వాళ్లం. కాసేపటికి లక్ష్మే అంది ‘మీరెళ్లి స్నానం చేసెయ్యండి. నేను వంటిల్లు సర్ది, పొద్దుటికి కాఫీ డికాషన్‌ వేసి వస్తా’ అని.
నేను వెళ్లి స్నానం చేశాననిపించి బట్టలు మార్చుకుని నడుం వాల్చాను బెడ్‌రూమ్‌లో.
పడుకున్నా అమ్మ ఆలోచనలే. ఆమె దినం కార్డ్‌లో మా అబ్బాయి రాసిన వాక్యం గుర్తొచ్చింది... ‘వియ్‌ అర్‌ నాట్‌ గ్రీవింగ్‌ హర్‌ డెత్‌. వియ్‌ ఆర్‌ సెలెబ్రేటింగ్‌ హర్‌ లైఫ్‌’ అంతటి సార్థక జీవితం ఆమెది. ప్రేమను పంచుతూ బతికింది. ప్రేమను పంచటం నేర్పింది. ఇవాళ కూడా అలాగే. ఈ కార్యక్రమం కూడా వేడుకగానే జరిగింది. విషాద వీచికలు లేవు. అన్నీ ఆమె మంచి జ్ఞాపకాలే. ఒక చిన్న దుఃఖపు క్షణం మా అమ్మాయి ఎమోషనల్‌ అయినప్పుడు- అంతే. ఇప్పుడూ నా కళ్లలో తడి. నవ్వుకూ కన్నీళ్లేగా మరి..! అలాగే కళ్లు మూసుకు పడుకున్నాను.
కాసేపటికి లక్ష్మి కూడా పనులు ముగించుకుని స్నానం చేసి వచ్చి నా పక్కన పడుకుంది.
‘‘నిద్ర పోయారా’’ అంది నేను కళ్లు మూసుకుని ఉండటం చూసి.
‘‘లేదు లక్ష్మీ, ఊరికే అలా కళ్లు మూసుకున్నానంతే’’ అన్నాను కళ్లు తెరుస్తూ. ‘‘పడుకోండి. లేట్‌ అయిందిగా. వచ్చే ఆదివారం అనాథాశ్రమానికి వెళ్లి మీరన్నట్టే వాళ్లకి సాయం చేసి కాసేపు అక్కడే వాళ్లతో గడిపి, వాళ్లతోనే కలిసి భోజనం చేసి వద్దాం.’’
మళ్లీ అమ్మకి సంబంధించిన మాటే.
‘‘లక్ష్మీ’’ అన్నాను.
‘‘చెప్పండి’’ అంది నావైపు తిరుగుతూ.
‘‘ఇవాళంతా అమ్మ మాటలే. అమ్మ జ్ఞాపకాలే. అమ్మ బతికొచ్చి మన మధ్య తిరిగినట్టుగానే ఉంది. ప్రతి సంవత్సరం ఆమె వర్థంతిని ఇలాగే బంధువుల మధ్య వేడుకగా జరుపుకుందాం. పూజలూ మంత్రాలతో పనిలేదు. అమ్మను ఆ రోజు మళ్లీ మన మధ్యకు పిలుచుకుందాం. ఒకవేళ పనిఒత్తిడిలో నేను మర్చిపోయినా నువ్వు తప్పకుండా గుర్తు చెయ్యి’’ అంటున్న నా గొంతులో నాకు తెలియకుండానే చిన్న వణుకు.
‘‘తప్పకుండానండీ. అలాగే చేద్దాం’’ అంటూ అమ్మలా నా తల నిమిరింది లక్ష్మి.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న