మసాలా కర్రీలు... నచ్చాయా! - Sunday Magazine
close

మసాలా కర్రీలు... నచ్చాయా!

బిర్యానీ, పులావ్‌, రోటీ... దేనికైనా నాన్‌వెజ్‌ కర్రీ ఉంటే ఆ మజానే వేరంటారు మాంసాహార ప్రియులు. మరి ఈ కూరలు వేటికి బాగుంటాయో ఆలోచించుకుని నచ్చినదాన్ని వండుకుంటే సరి.

చెట్టినాడ్‌ ప్రాన్స్‌

కావలసినవి శుభ్రం చేసిన రొయ్యలు: అరకేజీ, దాల్చిన చెక్క: ఒక ముక్క, యాలకులు: రెండు, ఉల్లిపాయలు: రెండు, టొమాటోలు: రెండు, ఉప్పు: తగినంత, నూనె: నాలుగు టేబుల్‌స్పూన్లు. మసాలా కోసం: కరివేపాకు: నాలుగు రెబ్బలు, సోంపు: చెంచా, మిరియాలు: రెండు చెంచాలు, జీలకర్ర: చెంచా, ఎండుమిర్చి: నాలుగు, దనియాలు: చెంచా, పసుపు: అరచెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు.
తయారీవిధానం: స్టౌమీద కడాయి పెట్టి అల్లంవెల్లుల్లి, పసుపు తప్ప మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలు వేయించి తీసుకోవాలి. తరువాత ఆ మసాలా, అల్లంవెల్లుల్లిముద్ద, పసుపు మిక్సీలో వేసి కాసిని నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి దాల్చినచెక్క, యాలకులు వేయించి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక టొమాటో గుజ్జు వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. టొమాటో గుజ్జు ఉడికాక ముందుగా చేసుకున్న మసాలా, కాసిని నీళ్లు, తగినంత ఉప్పు, రొయ్యలు వేసి అన్నింటినీ కలపాలి. కూర పూర్తిగా తయారయ్యాక  ఓసారి కలిపి దింపేస్తే సరి.

ఫిష్‌ బటర్‌ మసాలా

కావలసినవి ఏదయినా ఒకరకం చేప ముక్కలు: ఆరు, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: ఒకటిన్నర చెంచా, టొమాటోలు: ఆరు, క్రీమ్‌: పావుకప్పు, జీడిపప్పు ముద్ద: ఒకటిన్నర చెంచా, దాల్చినచెక్క: ఒకటి, యాలకులు: మూడు, లవంగాలు: మూడు, బిర్యానీ ఆకు: ఒకటి, పసుపు: ఒకటిన్నర చెంచా, కారం: రెండు చెంచాలు, జీలకర్ర పొడి: చెంచా, దనియాలపొడి: రెండు చెంచాలు, గరంమసాలా: చెంచా, కసూరీ మేథీ: చెంచా, ఉప్పు: తగినంత, వెన్న: అరకప్పు, నూనె: అరకప్పు.
తయారీ విధానం: చేప ముక్కలపైన అరచెంచా పసుపు, ఉప్పు వేసి వాటికి బాగా పట్టేలా కలపాలి. పది నిమిషాలయ్యాక వీటిని నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మరో బాణలిని స్టౌమీద పెట్టి వెన్న వేయాలి. అది కరిగాక దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించుకుని ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో గుజ్జు, సరిపడా ఉప్పు వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. టొమాటో గుజ్జు ఉడికాక మిగిలిన పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, జీడిపప్పు ముద్ద వేసి బాగా కలిపి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. ఇది గ్రేవీలా అయ్యాక చేప ముక్కలు వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. పది నిమిషాలయ్యాక క్రీమ్‌, గరం
మసాలా, కసూరీమేథీ వేసి బాగా కలిపి దింపేయాలి.

చికెన్‌ మసాలా

కావలసినవి చికెన్‌ ముక్కలు: అరకేజీ, అల్లంవెల్లుల్లి ముద్ద: నాలుగు చెంచాలు, పెరుగు: పావుకప్పు, కారం: రెండు చెంచాలు, పసుపు: చెంచా, దనియాలపొడి: చెంచా, జీలకర్రపొడి: చెంచా, గరంమసాలా: చెంచా, వెల్లుల్లి రెబ్బలు: పదిహేను, ఎండుమిర్చి: పదిహేను, నూనె: పావుకప్పు, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత.
తయారీ విధానం: ముందుగా ఎండుమిర్చి, వెల్లుల్లిని మిక్సీలో వేసి కాసిని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. చికెన్‌ ముక్కలపైన కారం, తగినంత ఉప్పు, గరంమసాలా, పసుపు, దనియాలపొడి, జీలకర్రపొడి, ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి అన్నింటినీ కలిపి ముప్పావుగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద బాణలి పెట్టి రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి మారినేట్‌ చేసిన చికెన్‌ ముక్కల్ని వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక అరకప్పు నీళ్లు పోసి, ఎండుమిర్చి మసాలా వేసి మూత పెట్టాలి. చికెన్‌ పూర్తిగా ఉడికాక మరికాస్త ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి.

మీట్‌ బాల్స్‌ కర్రీ

కావలసినవి ఉల్లిపాయలు: రెండు పెద్దవి, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, పసుపు: అరచెంచా, కారం: ఒకటిన్నర చెంచా, దనియాలపొడి: టేబుల్‌స్పూను, జీలకర్రపొడి:పావు చెంచా, గరంమసాలా: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, టొమాటో గుజ్జు: కప్పు, కొబ్బరిపాలు: అరకప్పు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: రెండు కట్టలు, మటన్‌కీమా:అరకేజీ, పచ్చిమిర్చి ముద్ద: రెండు చెంచాలు, ఉప్పు: అరచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం
మటన్‌ కీమాను కడిగి ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో ఒక కట్ట కొత్తిమీర తరుగు, పావుచెంచా గరంమసాలా, అరచెంచా ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా కలిపి, చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి మూడు చెంచాల నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, టొమాటో గుజ్జు వేసి అన్నింటినీ బాగా కలపాలి. టొమాటో గుజ్జు ఉడికాక తగినంత ఉప్పు, మిగిలిన గరంమసాలా, రెండు కప్పుల నీళ్లు పోసి స్టౌని సిమ్‌లో పెట్టి కొబ్బరిపాలు పోయాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యాక మటన్‌కీమా ఉండల్ని వేసి అయిదు నిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేయాలి.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న