ఆటాడుకుందాం... రా..! - Sunday Magazine
close

ఆటాడుకుందాం... రా..!

బొమ్మరిళ్లు, కారు బొమ్మలు... అనగానే ఎవరికైనా పిల్లలే గుర్తొస్తారు. కానీ ఈమధ్య పిల్లలతోపాటు పెద్దవాళ్లూ వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. అవునండీ, ఆటవిడుపు ఎవరికైనా అవసరమే కదా. కరోనా కారణంగా ఏడాదినుంచీ విహార యాత్రల్లేక ఇంటికే పరిమితమైన పిల్లాపెద్దా అందరికీ అటు మానసిక ఆనందాన్నీ ఇటు మెదడుకి చురుకుదనాన్నీ కలిగించేవి ఆటలే మరి. అందుకే ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆడుకోగలిగేలా లెగో బ్లాక్‌లు సరికొత్త రూపాల్లో సకల హంగులతో వస్తున్నాయి.

చిట్టిచిట్టి చేతులతో ఇసుకలో పిచ్చుకగూడు కడితేనే చిన్నారులు ఆనందంతో గంతులు వేస్తారు. అలాంటిది తమ కలలసౌధాన్ని తామే నిర్మించుకుంటే వాళ్లకి ఇంకెంత సంతోషంగా ఉంటుందో కదా అనుకున్నట్లుంది లెగో కంపెనీ. పిల్లలు హాయిగా ఆడుకుంటూనే మానసికంగానూ ఎదగాలన్న ఉద్దేశంతో రంగురంగుల బ్రిక్స్‌ లేదా బ్లాక్స్‌నే ఆటవస్తువులుగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత కొన్ని దశాబ్దాలుగా ఆ కంపెనీ తయారుచేస్తోన్న బిల్డింగ్‌ బ్లాక్స్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంతో వాటి పేరే లెగోస్‌గా స్థిరపడిపోయింది. అంటే- బ్లాక్స్‌కి ‘లెగోస్‌’ అనేది పర్యాయపదంగా మారిపోయింది. లెగో అంటే డ్యానిష్‌ భాషలో ‘బాగా ఆడు’ అని అర్థమట. ఆ తరవాత మరెన్నో కంపెనీలు బ్రిక్స్‌ తయారుచేసినప్పటికీ అవన్నీ దానికి అనుకరణలనే చెప్పాలి.

ప్రపంచ వింతలన్నీ...
మొదట్లో ఈ బ్లాక్స్‌ ఆకర్షణీయమైన రంగుల్లో కాస్త పెద్ద సైజులో వచ్చేవి. వాటినే చిన్నారులు తమకు నచ్చినట్లుగా పేర్చుకుంటూ ఇళ్లు కట్టుకుంటూ ఆడుకునేవారు. ఆ తరవాతి నుంచీ వయసులవారీగా సెట్స్‌ రూపంలో వస్తున్నాయి. వాటిల్లో సాదా బొమ్మరిల్లు నుంచి అద్భుతమైన కట్టడాల వరకూ, సైకిల్‌ నుంచి నాసా స్పేస్‌ క్రాఫ్ట్‌ వరకూ... ఇలా ఎన్నో రకాల థీమ్‌లతో ఉన్నాయి. అంతేనా... ప్రపంచవ్యాప్తంగా చిన్నాపెద్దా అందరినీ అలరించిన హ్యారీపాటర్‌, స్టార్‌వార్స్‌... ఇలా సినిమా సంబంధిత థీమ్స్‌తోనూ బ్లాక్స్‌ వచ్చాయి.

తాజ్‌మహల్‌, ఈఫిల్‌ టవర్‌, కొలోజియం... వంటి ప్రపంచ వింతల నుంచి మదురై మీనాక్షి టెంపుల్‌, స్వర్ణ దేవాలయం... ఇలా దేశీయంగా ప్రాచుర్యం పొందిన ఆలయాల్నీ ఉద్యానవనాల్నీ మ్యూజియాల్నీ ఇతరత్రా సందర్శక ప్రదేశాల్ని కూడా సెట్స్‌గా రూపొందించేస్తోందా కంపెనీ. ఇవనే కాదు, వైకింగ్స్‌, క్యాజెల్‌, పైరేట్స్‌, రోబో... ఇలా రకరకాల థీమ్‌లతోనూ బ్రిక్స్‌ను తయారు చేస్తోంది. కొన్ని సెట్స్‌లో అయితే వేల సంఖ్యలో బ్లాక్స్‌ ఉంటున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన అన్ని సెట్స్‌లోకీ తాజాగా విడుదలైన వరల్డ్‌మ్యాప్‌ సెట్‌లో 11695 బ్లాక్స్‌ ఉంటే, 9036 బ్రిక్స్‌తో కొలోజియం రెండో స్థానంలోనూ, 5923 బ్లాక్స్‌తో తాజ్‌మహల్‌ సెట్‌ ఐదో స్థానంలోనూ ఉన్నాయట.

కారుకీ పవర్‌!
అమ్మాయిలకు బొమ్మరిళ్లమీద ఇష్టం ఉన్నట్లే, అబ్బాయిలకి కార్లన్నా బైక్‌లన్నా ఎంతో ఇష్టం. అది దృష్టిలో పెట్టుకునే లెగో బ్లాక్స్‌లో మెకానిజాన్నీ చొప్పించి లెగో టెక్నిక్‌ పేరుతో బుగాటి చిరాన్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌, పొర్షె, ల్యాండ్‌ రోవర్‌... వంటి రకరకాల కార్ల సెట్లను తీసుకొచ్చిందా కంపెనీ. నిజమైన కార్లలో ఉన్నట్లే బ్యాటరీ బాక్సులూ మోటర్లూ లైట్‌ సెట్లూ ఎక్స్‌టెన్షన్‌ కేబుల్‌ వైర్లూ- ఇలా అన్నింటినీ సెట్‌లో భాగంగా కలిపి ఇవ్వడంతోపాటు విడిగానూ వాటిని అమ్ముతోంది. దాంతో కార్లతో ప్రయోగాలు చేస్తూ కొత్త మోడల్స్‌ రూపొందించాలనుకునేవాళ్లకి ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. తాజాగా కొన్ని కార్లను ‘పవర్డ్‌ అప్‌’ థీమ్‌తో తీసుకొస్తోంది. అంటే- స్మార్ట్‌ఫోన్‌ ఆప్‌ ద్వారా వాటిని నడిపించవచ్చన్నమాట.

ఇళ్ల విషయానికొస్తే, లాన్‌లో పరిచే గడ్డి నుంచి గుమ్మం దగ్గర కాళ్లు తుడుచుకోవడానికి వేసే పట్టా వరకూ అన్నీ ఆయా రూపాలని పోలి ఉండేలా రకరకాల ఆకారాల్లోనూ సైజుల్లోనూ బ్లాక్స్‌ వస్తున్నాయి. అంతేకాదు, దేశాల్నీ ప్రాంతాల్నీ దృష్టిలో పెట్టుకుని పాత కాలం నాటి పూరిళ్లూ పెంకుటిళ్ల నుంచి నేటి ఆధునిక విల్లాలూ అపార్ట్‌మెంట్ల వరకూ అన్ని రకాల ఇళ్ల డిజైన్లతో సెట్లను తయారుచేస్తోంది. దాంతో పిల్లలూ పెద్దవాళ్లూ అన్న తేడా లేకుండా ఎవరికైనాగానీ ఇల్లు కట్టినా కారు రూపొందించినా నిజంగానే తామేదో గొప్ప పని చేసిన భావన వాళ్లలో కలుగుతుంది. సృజనశీలురైతే సెట్‌ను యథాతథంగా కాకుండా రెండుమూడు సెట్లలోని బ్లాక్స్‌ని కలిపి తమదైన కొత్త రకం మోడళ్లనీ తయారుచేసుకోవచ్చు. దానివల్ల వాళ్లలో ఆనందం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది అంటున్నారు పరిశోధకులు.

నిజానికి లెగో బ్లాక్స్‌ ఏవయినాగానీ పేరుకే పిల్లలకోసంగానీ వాటిల్లో పెద్దవాళ్ల సాయం లేకుండా ఉండదు. ముఖ్యంగా వందల వేల సంఖ్యలో ఉన్న బ్లాక్స్‌తో కట్టాలంటే అంత తేలిక కాదు మరి. అందుకే పెద్దవాళ్లూ వాటితో కుస్తీ పడుతూ తమ బుర్రకు పదును పెట్టుకుంటుంటారు. ఆ విషయాన్ని గమనించే కార్పొరేట్‌ కంపెనీలు ‘లెగో సీరియస్‌ ప్లే’ పేరుతో తమ టాస్క్‌ల్ని లెగోలతో కట్టి మరీ వివరించమంటున్నాయట. కొన్ని యూనివర్సిటీలు ప్రాజెక్టు వర్కుల్లోనూ వర్కుషాపుల్లోనూ ఈ లెగో మోడల్స్‌నే వాడుతున్నాయట.

ఏ కారణంతో అయితేనేం... కంటికి కనిపించే ప్రతిదాన్నీ రూపొందించగలిగేలా బ్లాక్స్‌ వస్తున్నాయనేది నిజం. దాంతో పిల్లలతోపాటు పెద్దవాళ్లూ రోజులకొద్దీ శ్రమించి మరీ సరికొత్త ఇళ్ల మోడల్స్‌ రూపొందించేస్తున్నారు. కొందరు ఈ బ్లాక్స్‌తో కట్టిన ఇళ్లనే డాల్‌హౌస్‌లుగానూ అలంకరించుకుంటున్నారు.

అంతెందుకు... ‘ఆ రోజుల్లో తాజ్‌మహల్‌ నిర్మించడానికి షాజహాన్‌కయితే ఇరవయ్యేళ్లకు పైనే పట్టింది. కానీ మాకయితే ఒక్కరోజు చాలు’ అంటోన్నవాళ్లూ లేకపోలేదు. అవునుమరి, ఒక్క తాజ్‌మహల్‌ అనేముందీ... ఈ లేటెస్ట్‌ బిల్డింగ్‌ బ్లాక్స్‌ ఉంటే ప్రపంచంలోని అద్భుతాలన్నింటినీ యథాతథంగా రోజుల్లోనే నిర్మించేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం... కట్టడం మొదలెట్టేయండి మరి!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న