వెర్రి వేయివిధాలు మరి! - Sunday Magazine
close

వెర్రి వేయివిధాలు మరి!

వరైనా తమ పుట్టినరోజుకో, పెళ్లికో బంధుమిత్రులను పిలవడం మామూలే కానీ డొమినికన్‌ రిపబ్లిక్‌ దేశానికి చెందిన మైరా అలాంజో మాత్రం తన అంత్యక్రియలకు హాజరుకావాలని అందరినీ ఆహ్వానించింది. దీనికోసం ఓ రోజును ఫిక్స్‌ చేసుకుని ఫొటోగ్రాఫర్‌, శవపేటిక... ఇలా అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. అందరూ రాగానే ముక్కులో దూది పెట్టుకుని కొన్ని గంటలపాటు కదలకుండా అలాగే పడుకుంది. సన్నిహితులంతా చుట్టూ చేరి ఉత్తుత్తి ఏడుపులు మొదలుపెట్టి చివరి ప్రార్థనలూ చేశారట. ‘బాబోయ్‌ ఇదేం విడ్డూరమో’ అని ముక్కున వేలేసుకున్నారా... మైరా తన ఈ వింత కోరిక చెప్పగానే మొదట్లో అందరూ ఇలాగే ఆశ్చర్యపోయారట. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు బలై మరణించిన వ్యక్తులకు జరుగుతున్న అంత్యక్రియల్ని చూసి, తాను చనిపోతే బంధువులూ, సన్నిహితులూ ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలనే కోరికతో ఇలా ఉత్తుత్తి అంత్యక్రియలు చేసుకుందట. వింత మనుషులూ... విచిత్ర కోరికలూ!


మిస్‌ ఇండియా బొమ్మ!

గులాబీ రంగు చీరకట్టుతో కనువిందు చేస్తున్న ఈ బొమ్మను చూస్తే, ‘ఏమిటీ అందాల బొమ్మ’ అనుకుంటున్నారా... అవును, అందాల బొమ్మనే. అసలు విషయం ఏమంటే.. మొన్నీమధ్య జరిగిన ‘2020 మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో ఇండియా నుంచి పాల్గొన్న అడ్‌లిన్‌ కాస్ట్‌లీనో గులాబీ రంగు చీర, సంప్రదాయ నగలతో భారతీయ మహిళను ప్రతిబింబించేలా ముస్తాబై నాలుగో స్థానంలో నిలిచింది. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకోకపోయినా అద్భుతమైన కాస్ట్యూమ్స్‌తో అందర్నీ ఆకర్షించింది. ఆకట్టుకునే ఆమె కట్టూబొట్టుకి ఫిదా అయిన శ్రీలంక ఆర్టిస్టు అచ్చం అడ్‌లిన్‌ కాస్ట్‌లీనో కట్టుకున్న చీర, నగలతో అందాల బొమ్మను తయారుచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. కాస్ట్‌లీనో దీన్ని రీ షేర్‌ చేయడంతో ఈ బొమ్మ నెట్టింట్లో తెగ వైరల్‌ అయిపోయింది!


ఇది... బంగారు బాబు కుల్ఫీ!

ధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సిటీలో స్ట్రీట్‌ఫుడ్‌కి ప్రాచుర్యం పొందిన కొన్ని స్టాల్స్‌ ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి నట్‌వార్‌ చేసే కుల్ఫీ, ఫలూదా. సాయంత్రం అయితే చాలు.. పిల్లలూ పెద్దలూ అక్కడ గుమిగూడతారు. నట్‌వార్‌ కుల్ఫీ, ఫలూదా చేస్తున్నంతసేపూ అందరూ ఆయన్నే గమనిస్తుంటారు. ఎందుకంటే ఆయన చేతివేళ్లు, చేయి, మెడ బంగారు ఆభరణాలతో ధగధగ మెరిసిపోతుంటాయి. పుత్తడిపైన ఉన్న ప్రేమతో నట్‌వార్‌ ఇలా అర కిలోకు పైగా బంగారు నగల్ని వేసుకునే కుల్ఫీ, ఫలూదా అమ్ముతున్నాడట. రోడ్డు పక్కన స్టాలు నడిపేవాళ్ల ఆదాయమే అంతంత మాత్రం అనుకుంటుంటే... ఒంటి నిండా నగలు వేసుకునీ స్టాల్‌ నడుపుతున్న ఈ బంగారు బాబును అందరూ విచిత్రంగా చూస్తూ సరదాగా సెల్ఫీలూ, వీడియోలూ తీసుకుని వెళుతుంటారు.


మోదీ మాస్క్‌..!

సామాన్యుడు నిరుపేదల కోసం తయారుచేసిన మాస్కుని ఏకంగా దేశప్రధానే వాడితే ఎలా ఉంటుంది! కర్ణాటక దావణగెరెకి చెందిన వివేకానంద విషయంలో అదే జరిగింది. ముక్కుపైన చక్కటి ఫిల్ట్‌తో కూడిన ఆయన మాస్క్‌లని ఆ రాష్ట్రమంత్రులతోపాటూ ప్రధాని మోదీకూడా వాడుతున్నారు. మాస్క్‌ పైభాగంలో చొక్కా కాలర్‌లాగా ఉండే పట్టీలాంటిది ఉండటం వల్ల అది ముక్కు పైభాగాన ఠీవిగా కూర్చుంటుంది. గడ్డం కింద కూడా ఇలాంటి పట్టీయే ఉండటంతో ఈ మాస్క్‌ప్రత్యేక అందాన్ని సంతరించుకుంటోంది. సాధారణంగా కళ్లజోడు వాడేవారికి మాస్క్‌ వేసుకున్నప్పుడు ఓ సమస్య వస్తుంటుంది. ఉచ్ఛ్వాసనిశ్వాసల ఆవిరి అద్దాల మీద తడిగా మారి ఇబ్బంది పెడుతుంది. ముక్కుపైనా, గడ్డంకిందా పట్టీ ఉండటం వల్ల ఈ సమస్య రాదంటున్నారు వివేకానంద. ఇప్పటిదాకా 50 వేల మంది పేదలకి ఆయన ఈ మాస్కుల్ని పంచారట.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న