కొనుక్కోవాలి - Sunday Magazine
close

కొనుక్కోవాలి

- గంగుల నరసింహారెడ్డి

రోజు ఉదయం తొమ్మిది గంటల సమయం అవుతుండగా, ఉదయపు నడక కార్యక్రమాన్ని ముగించుకొని నేను ఇంటికొచ్చేసరికి మా పెద్దబ్బాయి కుటుంబం ఎక్కడికో బయటకు వెళ్లడానికి తయారయి ఉంది.
‘‘తాతయ్యా, మేం అనంతగిరి హిల్స్‌కు వెళ్తున్నాం’’ సంబరంగా చెప్పింది నా మనవరాలు.
నిరాసక్తంగా ‘అలాగా’ అని, సోఫాలో కూర్చొని దినపత్రికను చేతిలోకి తీసుకున్నాను.
‘‘అమ్మా, బయటకు వెళ్తున్నాం, సాయంత్రం వరకల్లా వచ్చేస్తాం’’ అన్నాడు మా పెద్దబ్బాయి, వంటింట్లో ఉన్న తల్లినుద్దేశించి.
‘‘పది నిమిషాలాగితే టిఫిన్‌ తయారయిపోతుంది, తినేసి వెళ్లండి’’ తల్లి ప్రేమ వంటింట్లోంచే అభ్యర్థించింది.
‘‘నాయనమ్మ పిచ్చి ఉప్మా చేస్తోంది నాన్నా, నేను తినను, బయట హోటల్లో తిందాం’’ అన్నాడు నా మనవడు తండ్రితో.
‘‘వీడు వద్దంటున్నాడమ్మా, బయట తింటాంలే’’ అని భార్యా పిల్లలతో బయలుదేరాడు.
‘‘ఇక్కడి దగ్గరి షాపుల్లో దొరకట్లేదని ఒక టాబ్లెట్‌ తెమ్మని మొన్న చెప్పాను. ఈ రోజు దారిలో ఆగి తీసుకురారా’’ అన్నాను నేను మా వాడినుద్దేశించి.
‘‘నాకు వీలవుతుందో లేదో నాన్నా, తమ్ముడితో చెప్పి తెప్పించుకో’’ అనేసి వెళ్లిపోయాడు వాడు.
ఆ రోజు ఆదివారం, సెలవు కాబట్టి మా చిన్నబ్బాయి కుటుంబం ఇంకా నిద్రలేవలేదు. మా చిన్న కోడలు నిద్రలేచినా, బయటకు వస్తే వంట చేయాల్సి వస్తుందని అప్పుడే బయటకు రాదు.
రెండోమారు కాఫీ తాగాలనే కోరిక కలిగింది కానీ, మా ఆవిడను మళ్లీ అడగాలంటేనే నాకు మొహమాటంగా ఉంది. ఇంతమందికి వంట చేయడంలో తీరిక లేకుండా ఉండే తనను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనిపించి, మంచినీళ్లు తాగి వచ్చి పేపరు చదువుతూ కూర్చున్నాను.
పావుగంట తర్వాత కాబోలు, ‘కాఫీ తీసుకోండి’ అన్న మా ఆవిడ స్వరం నాకు మధురాతిమధురంగా వినబడి తలెత్తాను. ఆమెవంక అనురాగపూర్వకంగా చూస్తూ
కప్పు అందుకొని ‘‘థాంక్స్‌’’ అన్నాను మనస్ఫూర్తిగా.
పది గంటల సమయం కావస్తుండగా మా చిన్నబ్బాయి ఒక్కడే తమ గదిలోంచి బయటకు వచ్చి ‘‘అమ్మా, టిఫిన్‌ రెడీనా?’’ అని అడిగాడు.
‘‘అంటే వీడు కూడా తన కుటుంబంతో బయటకు చెక్కేస్తున్నాడన్నమాట’’ మనసులో అనుకున్నాను.
‘‘అయిందిరా, రండి! తినండి!’’ అంది మాతృమూర్తి.
ఆ తరువాత వాడి భార్యా, కూతురూ వచ్చారు. నా ఊహ నిజమైంది. అందరూ ప్రయాణానికి సిద్ధమై ఉన్నారు.
‘‘అత్తయ్యా, మా అమ్మ వాళ్లింటికి వెళ్లేసి వస్తాం. మధ్యాహ్న భోజనం అక్కడే’’ అంది మా కోడలు, అత్తగారితో.
అంటే, ఆ అమ్మాయి ఉద్దేశం, రాత్రికి వంట సిద్ధం చేసి ఉంచమని!
‘‘సరేనమ్మా’’ అణకువగా అంది ఈతరం అత్తగారు.
వాళ్లు తిని బయలుదేరుతుండగా మా చిన్నాడికి నా టాబ్లెట్‌ విషయం చెప్పాను బెరుకు బెరుకుగా. ఎందుకంటే వీడో కరకు వెధవ. నేనేమడిగినా కసురుకుంటూ ఉంటాడు.
ఏ కళనున్నాడోగానీ ‘సరే తెస్తాలే’ అని ఒప్పుకున్నాడు.
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత స్నానం చేసి టిఫిన్‌ చేస్తుండగా నా మొబైల్‌ మోగింది. చూస్తే, నా మిత్రుడు సదానందం నుండి వస్తున్న కాల్‌ అది.
‘‘హలో మిత్రమా’’ అన్నాను ఆనందంగా.
‘‘నేనన్నయ్యా, ప్రమీలను!’’ సదానందం భార్య గొంతు వినబడింది.
భర్త ఫోన్‌ ద్వారా అతనికి బదులు ఆమె ఎందుకు మాట్లాడుతోందో అర్థంగాక, అయోమయానికి గురై ‘‘సదానందం బావున్నాడామ్మా’’ అడిగాను ఆతృతగా.
‘‘అయిదారు రోజులుగా నడుం నొప్పంటూ మంచంపైనే పడుకొని ఉంటున్నారన్నయ్యా. చాలా ఇబ్బంది పడుతున్నారు’’ గద్గద స్వరంతో జవాబిచ్చింది.
‘‘మరి డాక్టరు దగ్గరికి తీసుకెళ్లలేదా... మీ పిల్లలకు చెప్పారా?’’
‘‘........................’’’
‘‘హలో.. హలో...’’ గట్టిగా అన్నాను.
బదులుగా అవతలివైపు నుండి ప్రమీల సన్నగా రోదిస్తున్నట్లుగా వినబడింది. ‘‘అయ్యో, ఏడవకండమ్మా, నడుం నొప్పే కదా తగ్గిపోతుందిలే’’ అన్నాను ఊరడిస్తూ.
‘‘నా దుఃఖమంతా మా పిల్లల నిర్లక్ష్యం గురించే అన్నయ్యా, నొప్పి మొదలయిన రోజునుండీ మా అబ్బాయికీ, అమ్మాయికీ ఫోన్‌ చేసి చెబుతూనే ఉన్నాను. అయినా, వాళ్లు పట్టించుకోవడమే లేదు. ఎటూ తోచకా మీకు ఫోన్‌ చేశాను. ఎంతో ప్రేమగా పెంచిన తన పిల్లల వైఖరి గురించే ఆయన ఎక్కువ దిగులుపడుతున్నట్లున్నారు. ఓ మారు మీరు వచ్చి మాట్లాడితే ఆయన తేరుకుంటారని నా ఆశ’’ బలవంతంగా దుఃఖాన్ని ఆపుకుంటున్నట్లుగా తెలుస్తూనే ఉంది.
‘‘తప్పక వస్తాను, ధైర్యంగా ఉండమ్మా’’
‘‘శేషగిరి అన్నయ్యకు కూడా ఫోన్‌ చేశాను కానీ లైను కలవడం లేదు’’
‘‘శేషగిరితో నేను మాట్లాడతాను, కంగారు పడకమ్మా’’ అని ఆమెకు ధైర్యం చెప్పి శేషగిరికి ఫోన్‌ చేశాను. అదృష్టవశాత్తు వెంటనే బదులు పలికాడు. సదానందం ఆరోగ్య పరిస్థితి చెప్పాను.
‘‘అయ్యో, అలాగా’’ అని ‘‘సదానందాన్ని సికింద్రాబాద్‌ యశోదా హాస్పిటల్‌కు తీసుకురా, అందులో నాకు తెలిసిన ఒక డాక్టరున్నాడు. సదానందం ఇంటినుండి బయలుదేరేముందు నాకు ఫోన్‌ చేసి చెప్పు. అప్పుడే నేను మా ఇంటినుండి బయలుదేరతాను’’ అన్నాడు శేషగిరి.
అతనుండేది సనత్‌నగర్‌లో, సదానందం ఇల్లు రాంనగర్‌లో ఉంది. నేనేమో కొత్తపేటలో ఉంటున్నాను కాబట్టి శేషగిరి చెప్పిన సలహా బాగానే ఉందనిపించింది.
ఫోన్‌లో నా సంభాషణల ద్వారా విషయం అర్థమయినట్లుంది కాబోలు, ‘‘తొందరగా బయలుదేరండి, పైగా రేపు జనతా కర్ఫ్యూ అట సాయంత్రం వరకల్లా తిరిగి వచ్చేయండి’’ అంది మా ఆవిడ.
‘‘రేపు జనతా కర్ఫ్యూ కదా, నిజమే సుమా, నేను మరిచేపోయాను, తొందరగానే వచ్చేస్తాలే’’ అని చెప్పి క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాను.
క్యాబ్‌లో రాంనగర్‌కు వెళ్తుండగా ఏవేవో ఆలోచనలు... మనసు గతంలోకి పరుగు తీసింది.

*  *  *

హైదరాబాద్‌లో ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో మేం ముగ్గురం ఒకేరోజున జాయినయ్యాం. ఆనాడే మా ముగ్గురికీ తొలిసారిగా పరిచయం ఏర్పడింది. ముగ్గురికీ వేర్వేరు డిపార్ట్‌మెంట్లలో పోస్టింగ్స్‌ ఇచ్చినా, మధ్యాహ్న సమయంలో క్యాంటీన్‌లో కలుసుకొని ఒకేచోట కూర్చొని భోంచేసేవాళ్లం. అలా మా పరిచయం కాస్తా స్నేహంగా మారి క్రమక్రమంగా బలపడింది. పైగా ముగ్గురమూ సమాన వయస్కులమే.
రెండు మూడు సంవత్సరాల వ్యవధిలో మా వివాహాలు జరిగాయి. సదానందానికి ఒకమ్మాయీ, ఒకబ్బాయీ సంతానమైతే శేషగిరికి ఇద్దరబ్బాయిలూ, ఒకమ్మాయి కలిగారు. నాకేమో ఇద్దరూ అబ్బాయిలే! రోజులు గడుస్తున్నాయి. ఉద్యోగంలో సదానందానికి రెండుసార్లు ప్రమోషన్‌ వస్తే, నాకూ శేషగిరికీ మాత్రం ఒక ప్రమోషనే దక్కింది. అందుకే టర్మినల్‌ బెనిఫిట్స్‌ కానీ, పెన్షను కానీ మా ఇద్దరికన్నా సదానందానికే ఎక్కువ. ఎవరికి వీలయిన ఏరియాలో వాళ్లం ఇళ్లు కట్టుకున్నాం.
పెళ్లయిపోతే మా అమ్మాయి ఎలాగూ అత్తారింటికి వెళ్లిపోతుంది. మా అబ్బాయిని కూడా వాడి పెళ్లయ్యాక సెపరేటుగా ఉండమని చెబుతా. నా టెర్మినల్‌ బెనిఫిట్స్‌తో వాడికో అపార్ట్‌మెంట్‌ కొనిస్తా’’ అనేవాడు సదానందం, అలాగే చేశాడు కూడా. వాళ్లబ్బాయి ఆఫీసుకు దగ్గర్లో అపార్టుమెంటు కొనడానికి ధన సహాయం చేశాడు.
‘‘నేనూ, మా ఆవిడా మాత్రం పిల్లల్లేకుండా ఇద్దరమే ఉండలేమురా. వయసు పైబడ్డాక తోడుగా పిల్లలుంటే సౌకర్యంగా ఉంటుంది. అదీగాక, నాకు నా మనవరాళ్లతో మనవళ్లతో సరదాగా సంతోషంగా గడపాలనే బలీయమైన కోరిక ఉంది. కానీ, మా అబ్బాయిలు వేరేగా ఉంటామని చెబితే మాత్రం నా కోరిక తీరదు. రిటైర్‌మెంటు డబ్బుల్తో రెండు ఓపెన్‌ ప్లాట్స్‌ కొని పిల్లలకిద్దామనుకుంటున్నాను. మాకు నా పెన్షను డబ్బు సరిపోతుందనుకుంటున్నాను...’’ ఇది నా ప్లానింగ్‌.
ఇక శేషగిరి విషయానికొస్తే, ఈ విషయం గురించి మేమిద్దరం మాట్లాడుతున్నా, తను మాత్రం పట్టనట్లు, ఇష్టంలేనట్లుగా మొహం పెట్టేవాడు. మరీ బలవంతం చేస్తే ‘‘కచ్చితంగా ఇలా చేయాలనీ, పిల్లలతో ఇలా ఉండాలనీ నేనింతవరకూ ఆలోచించలేదురా. మన డబ్బులు మనం ఎలాగూ మన పిల్లలకే ఇస్తాము, కానీ, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలనేది, ఎప్పుడు, ఎలా ఇవ్వాలనేది మాత్రం రిటైర్‌మెంటు తరువాత ఉండే పరిస్థితులను బట్టి ఆలోచిస్తాను’’ అనేవాడు.
పాత ఇంటిని మార్పులు చేసి, ఇద్దరు కొడుకుల కుటుంబాలతో శేషగిరి దంపతులు ఒకే ఇంట్లో ఉంటున్నట్లుగా తరువాత చెప్పాడు.
అందరం రిటైర్‌ అయి ఇప్పటికి ఐదేళ్లు దాటింది. నెలకో రెండు నెలలకో ఫోన్‌ చేసుకోవడం తప్పితే వ్యక్తిగతంగా కలుసుకోవడం దాదాపుగా తగ్గిపోయింది.
ఇదిగో, ఈ రోజు సదానందం భార్య ఫోన్‌ చేయడం వల్ల ముగ్గురం కలుసుకోబోతున్నాం.

*  *  *

రాంనగర్‌కు చేరుకున్నాను. సదానందం నన్ను చూసి కళ్లనీరు పెట్టుకున్నాడు. మనిషి చాలా నీరసంగా ఉన్నాడు. మొహం దిగులుతో పీక్కుపోయి ఉంది. శారీరక అనారోగ్యం కన్నా మానసికంగా ఎందుకో బాగా కుంగిపోయినట్లుగా కనిపించాడు. ధైర్యం చెప్పాను. మాతోబాటు ప్రమీల కూడా హాస్పిటల్‌కు వచ్చింది. మేం వెళ్లిన పదినిమిషాల తరువాత శేషగిరి వచ్చాడు. అతడు రావడం చాలా మేలయింది. అతనికి తెలిసిన డాక్టరు ఎంతో చొరవ తీసుకొని సహాయం చేశాడు.
రకరకాల పరీక్షలు చేశారు. ఎమ్‌.ఆర్‌.ఐ. కూడా తీశారు. భయపడాల్సిన అవసరం లేదని డాక్టరు హామీ ఇచ్చాక సదానందం మొహం తెరపిన పడింది. ప్రమీల మొహంలో వెలుగు ప్రత్యక్షమయింది.
‘‘క్యాబ్‌ బుక్‌ చేయమంటావా, లేక ఈ చుట్టుపక్కల ఏమైనా పనులున్నాయా?’’ హాస్పిటల్‌ నుండి బయటకు వచ్చాక సదానందాన్ని అడిగాను.
‘‘బుక్‌ చేయి, ఇంకే పనులూ లేవు’’
‘‘క్యాబ్‌ వద్దు, నేను డ్రాప్‌ చేస్తాను. కారు తీసుకువచ్చాను’’ అన్నాడు శేషగిరి.
‘‘కారు కొన్నావా?’’ ఆశ్చర్యంగా అడిగాను.
‘‘అవున్రా, మారుతిలో ఆటోగేర్‌ కొన్నాను. నడపడం చాలా ఈజీ’’ అంటూ పార్కింగ్‌ వైపు వెళ్లాడతను.
నేను సదానందం వంక చూశాను. అతడూ నా వంకే చూస్తున్నాడు నిర్లిప్తంగా!
నిజంగానే శేషగిరి తన ఆటోగేర్‌ కారును చాలా సులువుగా డ్రైవ్‌ చేస్తున్నాడు.
‘‘అన్నయ్యా, లోపలికి రండి. భోంచేసి వెళ్దురుగాని’’ ఇంటి దగ్గర కారు దిగుతూ ఆహ్వానించింది ప్రమీల.
‘‘ఎందుకమ్మా, నీకు శ్రమ’’
‘‘మీరొస్తారనే కూరలు ఎక్కువ చేశాను. అరగంటలో అన్నం వండేస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి’’
ఉద్యోగ జీవితం గురించిన కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టేసరికి సదానందం మొహం చిరునవ్వుతో వెలిగిపోయింది. ఆ తరువాత, మా సంభాషణ మా పిల్లల వైఖరిలో వచ్చిన మార్పు వైపు మళ్లింది.
పిల్లల విషయం చెప్పాల్సి వచ్చేసరికి సదానందం మొహంలో మళ్లీ విచారం తొంగిచూసింది.
‘‘మీ వాడు మీ ఇంటివైపే రావట్లేదా?’’ అడిగాను.
‘‘నా దగ్గర డబ్బులున్నంతవరకూ రోజూ ఫోన్‌ చేసి మా యోగక్షేమాలు కనుక్కునేవాడు. వారానికోమారు కుటుంబ సమేతంగా తప్పక వచ్చి వెళ్లేవాడు. ఎప్పుడయితే నా దగ్గర డబ్బులేం మిగల్లేదని తెలుసుకున్నాడో అప్పటినుండి ఇంటికి రావడం లేదు. ఫోన్‌ చేస్తే ముక్తసరిగా సమాధానం చెప్పి పెట్టేస్తున్నాడు’’ నిర్వేదంగా చెప్పుకొచ్చాడు సదానందం.
‘‘మరి మీ అమ్మాయి...?’’ అడిగాడు శేషగిరి.
అప్పుడు వివరంగా చెప్పుకొచ్చాడు సదానందం.
తన రిటైర్‌మెంటు డబ్బుల్లో కొంత కూతురికి ఇచ్చి, కొంత తమదగ్గర ఉంచుకొని ఎక్కువ డబ్బు కొడుక్కి, అపార్టుమెంటు కొనుక్కోవడానికని ఇచ్చాడట. అందుకే కూతురు తల్లిదండ్రులపైన అలిగి, ఇంటికి రావడం మానేసిందట. ఫోన్‌ చేస్తే ఒకట్రెండు మాటలు మాత్రమే మాట్లాడి పెట్టేస్తుందట.
ఇక కొడుకు, తండ్రి ఇచ్చిన డబ్బుతో సంతృప్తి చెందక, ‘అపార్ట్‌మెంట్‌లో కప్‌బోర్డ్స్‌ చేయించాలి, ఫర్నీచర్‌ కొనాలి’ అంటూ తండ్రిని పీడించి మిగిలిన డబ్బంతా ఊడ్చేశాడంట.
‘‘మేం ఇక పాలివ్వని, వట్టిపోయిన గేదెలమని తెలిసిపోయింది వాడికి. అందుకే మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు’’ ఈ మాట అంటున్నప్పుడు సదానందం గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.
అతన్ని ఏమని ఓదార్చాలో మా ఇద్దరికీ అర్థం కాలేదు.
ఆ తరువాత, రాజకీయాల గురించీ,  కరోనా ఉపద్రవం గురించి మాట్లాడుకున్నాం.
భోంచేసి, ఆ దంపతుల దగ్గర సెలవు తీసుకొని బయటకు వచ్చాం నేనూ, శేషగిరీ.
‘‘నన్ను అమీర్‌పేట, మెట్రో స్టేషను దగ్గర డ్రాప్‌చేయరా, వెళ్లిపోతాను’’ అన్నాను.
‘‘సరే పదా’’ అన్నాడు.
దారిలో సదానందం దురవస్థ గురించి కాసేపు మాట్లాడుకున్నాం. బేగంపేట దాటుతుండగా శేషగిరి నన్ను తన ఇంటికి ఆహ్వానించాడు.
‘‘రేపెలాగూ జనతా కర్ఫ్యూ కదా, బయటకు వెళ్లకుండా ఇంట్లో కూర్చోవాలి. రేపు మా పెళ్లిరోజు. రేపొక్కరోజు మాతో గడుపు. రేపు రాత్రికి గానీ, ఎల్లుండి ఉదయం గానీ నిన్ను పంపిస్తాను’’
ఊహించని ఆహ్వానం అది. ఏమని జవాబివ్వాలో అర్థం కాలేదు నాకు. అతడన్నట్లుగా మరునాడు జనతా కర్ఫ్యూ కాబట్టి ఎక్కడున్నా ఇంట్లో కూర్చొని ఉండాల్సిందే. అతనింట్లో ఉంటే అతడి కుటుంబ పరిస్థితి కూడా చూడవచ్చనే ఉత్సుకత కలిగింది. సరే అన్నాను.
అమీర్‌పేటలో ఒక చోట కారాపి ‘‘చిన్న పనుంది, పది నిమిషాల్లో వస్తాను. అవునూ, నీ అండర్‌ గార్మెంట్స్‌ సైజు చెప్పు. రేపటికి నీకు కావాలిగా’’ అన్నాడు.
అతని దూరాలోచనకి అబ్బురపడుతూ నా సైజు చెప్పాను.
కాసేపటికి, పెద్ద కవరు తీసుకొని వచ్చాడు. అదే విషయం అడిగాను.
‘‘నీకు ఇబ్బంది గాకుండా అండర్‌ గార్మెంట్స్‌తో బాటు ఓ లుంగీ, టవలూ, టూత్‌బ్రష్‌ తెచ్చాను. ఓకేనా?’’
‘‘ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తావురా బాబూ, పకడ్బందీగా ఉంటుంది నీ ప్లానింగ్‌’’ అంటూ నవ్వాను.
మరో పదిహేను నిమిషాల తరువాత సనత్‌నగర్‌లోని వాళ్లింటికి చేరుకున్నాం. ఇల్లు చాలా మారిపోయి ఉంది. పాత ఇంటిపైన రెండంతస్తులు కొత్తగా కట్టారు.
‘‘పైన రెండు ఫ్లోర్లు మా అబ్బాయిలు కట్టుకొని, అందులో ఉంటున్నారు’’ అంటూ నన్ను తీసుకొని వెళ్లాడు, కింద ఉన్న తన పాత ఇంటిలోకి. లోపల మాత్రం చాలా నీటుగా ఉంది.
అతని భార్య ప్రేమలత నన్ను ఆప్యాయంగా పలకరించింది.
‘‘రేపు కూడా మనతో ఉండేలా ఒప్పించి తీసుకొచ్చాను’’ అన్నాడు శేషగిరి భార్యతో.
‘‘చాలా మంచి పని చేశారు. వదిన కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది’’.
‘‘అవును సుమా, నీవు చెప్పేంతవరకు నాకా ఐడియానే రాలేదు’’ అని నా వైపుకు తిరిగి ‘‘స్నానం చేసి రారా, కాఫీ తాగుదాం’’ అన్నాడు శేషగిరి నాకో గదిని చూపిస్తూ.
నేను హాలులోకి తిరిగి వచ్చేసరికి, భార్యాభర్తలిద్దరూ మనవడూ, మనవరాలితో కలిసి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
‘‘తాతయ్యా, మీ ఫ్రెండా?’’ అడిగింది మనవరాలు.
‘‘అవునమ్మా అంటూ, తను అమీర్‌పేటలో దిగినప్పుడు తెచ్చాడు కాబోలు, రెండు పార్సిల్స్‌ వాళ్లకిస్తూ ‘‘కర్రీ పఫ్స్‌, కేకులూ తెచ్చాను, తీసుకోండి. ఒక పాకెట్‌ మీకూ, మరొకటి పెద్దనాన్న వాళ్లకూ’’ అన్నాడు.
‘‘థాంక్యూ తాతయ్యా’’ అంటూ ఆనందంగా వాటిని తీసుకొని వెళ్లిపోయారు.
‘‘మా చిన్నాడి పిల్లలు’’ అని నాతో చెప్పి, వంటింటివైపు తిరిగి ‘‘కాఫీ రెడీనా’’ అన్నాడు భార్యతో.
నా మనసులో ఎక్కడో ఓ గిల్టీ ఫీలింగ్‌ కలుక్కుమంది. ఎందుకంటే నేనెప్పుడూ నా మనవలకూ, మనవరాళ్లకూ బయటనుండి ఇలా ప్రత్యేకంగా తినుబండారాలు ఏవీ కొని తీసుకురాలేదు. నాకా ఆలోచనే రాలేదెప్పుడూ.
మాకూ తెచ్చాడు కాబోలు మొదట సమోసాల ప్లేట్లు ఇచ్చి వెళ్లి తరువాత కాఫీ కప్పులు తీసుకొని వచ్చింది ప్రేమలత.
ఆ తరువాత, కొడుకులుగానీ, కోడళ్లుగానీ, వాళ్ల పిల్లలు గానీ ఎవరో ఒకరు వచ్చి కబుర్లు చెప్పి వెళ్లిపోతున్నారు. సమయం ఇట్టే గడిచిపోయింది.
డిన్నర్‌లో చపాతీలతో బాటు మూడు రకాల కూరలు వడ్డించింది ప్రేమలత.
‘‘ఎందుకమ్మా ఇన్ని చేసి శ్రమపడ్డారు’’ అన్నాను మొహమాటంగా.
‘‘ఇవన్నీ నేనేం చేయలేదన్నయ్యా. ఒక్కటే నేను చేసింది. మిగతా రెండూ ఫస్ట్‌ ఫ్లోర్‌నుండీ, సెకండ్‌ ఫ్లోర్‌ నుండీ వచ్చినవి’’
అందామె నవ్వుతూ, ఆ నవ్వులో నిండైన సంతృప్తి కనబడింది. ఎందుకో నాకాక్షణం నా భార్య ఇప్పటికీ పడుతున్న కష్టాలు జ్ఞాపకం వచ్చి హృదయం బాధతో మూలిగింది. మా కోడళ్లైతే వంటింటి వైపేరారు.
ఆ రాత్రి పడుకునే సమయానికి నాకో విషయం స్పష్టంగా అర్థమయింది. మా ఇంటి గాలినీ, సదానందం ఇంటి గాలినీ శేషగిరి ఇంటి గాలితో పోల్చినప్పుడు నాకెంతో వ్యత్యాసం కనబడింది. మా ఇంటిలో గాలి భారంగా, ఇబ్బందిగా ఉంటే సదానందం ఇంటి గాలి నిండా విచారం, నిర్లిప్తతలు నిండి ఉన్నాయి. కానీ ఈ ఇంటి గాలి ఆనందం, ఆహ్లాదాలతో హాయిగా ఉంది.
మరునాడు ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ. ఆ రోజే శేషగిరి దంపతుల పెళ్లిరోజు కాబట్టి వాళ్ల పెద్దబ్బాయి అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేస్తానంటే చిన్నబ్బాయి మధ్యాహ్న భోజన ఏర్పాట్ల సంగతి చూసుకుంటానన్నాడట. రాత్రి డిన్నర్‌ కోసం ప్రత్యేకమైన వంటకాలతో శేషగిరి స్వయంగా క్యాటరింగ్‌కు చెప్పి విందు ఇస్తున్నాడట.
ఇల్లంతా సందడిగా ఉంది. కూతురు వాళ్ల కుటుంబం వీళ్లింటికి దగ్గర్లోని ఓ అపార్ట్‌మెంట్‌లోనే ఉంటుందట. ఆమె ఒక పెద్ద కేకును తీసుకొని భర్తా పిల్లలతో వచ్చింది.
పిల్లల కోలాహలం మధ్య శేషగిరి దంపతులు కేకు కట్‌చేశారు. కుటుంబ సభ్యులంతా కాళ్లు మొక్కి వెళ్తుంటే అందరికీ ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న పేపర్‌ కవర్లని చేతిలో పెడుతున్నారు. ఆ కవర్లలో డబ్బులున్నట్లు తెలుస్తూనే ఉంది.
క్యాటరర్‌ వెనక వీధిలోనే ఉంటాడట. అందుకే కర్ఫ్యూ ఉన్నా ఆ రాత్రికి ఆర్డర్‌ ప్రకారం విందు భోజనం వడ్డించాడు. కటుంబ సభ్యులంతా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ తినడం చూస్తుంటే నా మనసులో మళ్లీ కలుక్కుమంది. మా పెళ్లిరోజుని ఉత్సవంగా జరపడం మాట అటుంచి, మా కుటుంబ సభ్యులంతా ఇలా కలిసి విందారగించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటీ లేదు.
భోజనాలయ్యాక పిడుగులాంటి వార్త ఒకటి తెలిసింది. ఈ మార్చి నెలాఖరు దాకా రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘అంటే నేను మరో తొమ్మిది రోజులు ఇక్కడే ఉండిపోవాలా’ అని ఆందోళన కలిగింది. అది గమనించిన శేషగిరి ‘‘నీవు వర్రీగాకురా, ఎలాగోలా పాస్‌ సంపాదించి నిన్ను ఇంటికి పంపిస్తాలే’’ అన్నాడు.
కానీ, ఆ పాస్‌ దొరకడానికి మరో నాలుగు రోజులు పట్టింది. ఈ నాలుగు రోజుల్లో మరో చిన్న ఫంక్షన్‌ కూడా జరిగింది.
శేషగిరి చిన్నబ్బాయి కూతురు బర్త్‌డే పార్టీని కూడా సందడిగా జరుపుకున్నారు. ఆరోజు రాత్రి భోజనం చిన్నబ్బాయి నివాసంలోనే చేశామందరం. శేషగిరి దంపతులు మనవరాలి చేతిలో కానుకగా ఓ బరువైన కవరునే పెట్టి ఆశీర్వదించారు.
ఈ నాలుగయిదు రోజుల్లో నేను గమనించిన విషయమేంటంటే శేషగిరి తన కుటుంబ సభ్యులకు ఉదారంగా డబ్బులిస్తున్నాడు. తినుబండారాలు కొనివ్వడానికి ధారాళంగా ఖర్చుపెడుతున్నాడు. ఆ దంపతులపై కోడళ్లకు గౌరవమూ, కొడుకులకు అభిమానమూ, చిన్నపిల్లలకు ప్రేమా, ఇష్టమూ ఉన్నాయి.
శేషగిరి ఉద్యోగంలో ఉండగా చాలా పిసినారిగా ఉన్నాడు. ఇప్పుడేమో చేతికి ఎముక లేనట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా ఖర్చు పెట్టడానికి అతనికి ఈ వయసులో ఎక్కడినుండి వస్తుందోననే సంశయం నన్ను తొలిచేస్తోంది.
మా ఇంటికి నన్ను తీసుకెళ్తున్నప్పుడు కారులో నా అనుమానాల్ని నివృత్తి చేశాడతను.
లాక్‌డౌన్‌ కాబట్టి రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆటోగేర్‌ కారు నిశ్శబ్దంగా పరుగులు తీస్తోంది.
‘‘ఆనందంగా సాగిపోతున్న నీ జీవితాన్ని చూస్తుంటే నీ అదృష్టానికి ఆశ్చర్యంతో బాటు, కించిత్‌ అసూయకూడా కలుగుతోందిరా. నీ విజయ రహస్యమేంటో చెప్పవా?’’ అని అడిగాను నవ్వుతూ.
‘‘నా రహస్యం చెబుతాను కానీ ముందు నువ్వు నాకో విషయం చెప్పు. నీ టర్మినల్‌ బెనిఫిట్స్‌ని ఏం చేశావు?’’
‘‘వచ్చే పెన్షన్‌ మా ఇద్దరి అవసరాలకి సరిపోతుంది కదా అనుకొని ఇద్దరబ్బాయిల కోసం మొత్తం డబ్బుతో హస్తినాపురంలో రెండు ఓపెన్‌ ప్లాట్లు కొన్నాను. ఇప్పుడు వాటి విలువ రెండు కోట్లపైనే ఉంది’’ గర్వంగా చెప్పాను.
‘‘నిజానికది చాలా పెద్ద మొత్తం. కానీ మీ అబ్బాయిలకు మాత్రం ఆ విషయమే పట్టదు కదూ’’
‘‘అవున్రా, అందుకు వాళ్లు నన్ను ఎప్పుడూ మెచ్చుకోలేదు కూడా’’ ఇప్పుడు నా జవాబులో గర్వం లేదు.
‘‘ఎందుకంటే నీ తరువాత అవి తమకే చెందుతాయి కాబట్టి వాళ్లు పట్టించుకోరు. సరే, నువ్వు చేసిందీ, మన సదానందం చేసిందీ సర్వ సాధారణంగా అందరు తండ్రులు చేసే పనే. మొత్తం డబ్బులు పంచి ఇస్తే మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారనీ, స్థిరాస్తుల్ని సంపాదించి ఇస్తే పిల్లలు తమని నెత్తిన పెట్టుకొని ఊరేగుతారనీ ప్రతి తండ్రీ భ్రమ పడతాడు’’.
‘‘అవున్రా నిజమే’’ ఒప్పుకున్నాను నేను.
కారు పంజాగుట్ట దాటింది.
‘‘నా ఇంటిపైన అబ్బాయిలిద్దరికీ టెర్రస్‌ రైట్స్‌ ఇచ్చి లోన్‌ తీసుకొని ఇళ్లు కట్టుకునేలా చేశాను. మార్జిన్‌ మనీ తక్కువయితే చెరో ఐదు లక్షలు మాత్రం ఇచ్చాను. అబ్బాయిల కిచ్చాను కాబట్టి మా అమ్మాయికి కూడా ఐదు లక్షలిచ్చాను. ఎంతో సంతోషపడింది. మిగిలిన డబ్బును రకరకాలుగా ఇన్వెస్ట్‌ చేసి - పెన్షన్‌ కాక నెలకు పదిహేను వేల అదనపు ఇన్‌కం వచ్చేట్లుగా చూసుకున్నాను. నా అదృష్టానికి నేనెప్పుడో కొన్న కొన్ని షేర్లు, బోనస్‌ షేర్లు కలుపుకొని ఎన్నో రెట్లు పెరిగి సంవత్సరానికి డివిడెండ్‌ కూడా చాలా ఎక్కువే వస్తూంది...’’
ఆసక్తిగా వింటున్నాను. కారు ఎర్రమంజిల్‌ దాటుతోంది.
ఇక అసలు విషయానికొస్తే, ఈ వయసులో మనల్ని మన పిల్లలు ప్రేమగా చూసుకోవాలనీ, మనతో కలిసి ఉండాలనీ మనం కోరుకుంటాం కానీ వాళ్లు అందుకు ఇష్టపడరు. వాళ్ల ప్రేమ అంతా వాళ్ల సంతానంపైనే ఉంటుంది. మరి మనమేం చేయాలంటే... వాళ్ల ప్రేమని కొనుక్కోవాలి’’
‘‘కొనుక్కోవాలా... ప్రేమను కొనుక్కోవాలా?!’’ ఆశ్చర్యంగా అడిగాను.
‘‘అవును. ముఖ్యంగా వాళ్ల భార్యల దగ్గర్నుంచీ, వాళ్ల పిల్లల దగ్గర్నుంచీ మనం ప్రేమను కొనుక్కోవాలి. అందుకు మనకు ఆ ‘కొనుగోలు శక్తి’ ఉండాలి. అంటే మన చేతిలో సరిపడా లిక్విడ్‌ క్యాష్‌ ఉండాలి’’
రెండు నిమిషాలపాటు దిగ్భ్రమతో ఏమీ మాట్లాడలేకపోయాను.
తిరిగి తనే అన్నాడు, ‘‘చెప్పుకుంటే కఠోరంగా ఉంటుంది కానీ నేను చేస్తున్న పని అదే. వాళ్ల మ్యారేజ్‌డేల రోజున ప్రతి జంటకూ పదివేలు, బర్త్‌డేల రోజున అయిదేసి వేలు ఇచ్చి బట్టలు కొనుక్కోమంటాను. పిల్లల బర్త్‌డేలకి సరేసరి, రకరకాల కానుకలిస్తుంటాను. ప్రతి పండుగకీ మూడు కుటుంబాల పిల్లలందరికీ తలా మూడేసి వేల చొప్పున ఇచ్చి కొత్త బట్టలు కొనుక్కోమంటాను. ఎప్పుడు బయటకు వెళ్లినా వట్టి చేతులతో ఇంటికి రాను. స్వీట్లో, పండ్లో, ఇంకేమైనా తినుబండారాలో పట్టుకొచ్చి ఇస్తుంటాను.’’
‘‘నిజంగా నీది చాలా మంచి ఐడియారా. దాన్ని ఆచరణలో పెట్టి ఆనందంగా ఉన్నావ్‌’’ శేషగిరిని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాను. తిరిగి నేనే అన్నాను ‘‘పిల్లలు పెద్దవాళ్లయ్యేంతవరకూ మన ప్రేమను వారికి ఉచితంగా ఉదారంగా అందించి, మనం వృద్ధులమై ఉన్నప్పుడు వారిప్రేమ కావాలంటే మాత్రం డబ్బులిచ్చి కొనుక్కోవాలి’’ అని.
‘‘అంతేగా మరి’’ అన్నాడు శేషగిరి నవ్వుతూ. ఆ నవ్వులో జీవం లేదు, పండిన అనుభవం ఉంది.
కొత్తపేట సమీపించింది కారు. నన్ను మా ఇంటి ముందు దింపేసి వెళ్లిపోయాడతను.

*  *  *

ఆరోజు రాత్రి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. దానిని మా ఆవిడకు కూడా చెప్పాను. సంతోషంగా ఒప్పుకుంది.
మరునాడు ఉదయం, పదిగంటల సమయంలో మా పక్కింటి అతనికి ఫోన్‌ చేశాను. అతను చాలా రోజులుగా ‘మనిద్దరి ఇళ్ల జాగా డెవలప్‌మెంటుకిద్దామండీ. మీకు కనీసం మూడు, నాకు రెండు అపార్టుమెంట్లు వస్తాయి’ అని అడుగుతున్నాడు.
అతనితో ‘‘మనిద్దరి ఇళ్లను డెవలప్‌మెంటుకు అడుగుతున్నారుగా... అలాగే ఇద్దాం. ఆ బిల్డర్‌ను రమ్మనండి, మాట్లాడుకుందాం’’ అని చెప్పాను.
డైనింగ్‌ టేబుల్‌ దగ్గర టిఫిన్‌ చేస్తున్న మా అబ్బాయిలూ, కోడళ్లూ నావంక తలతిప్పి ఆశ్చర్యంగా చూడడం గమనించాను. ఆ తరువాత నాకు తెలిసిన ఒక రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌కి ఫోన్‌ చేశాను.
‘‘హస్తినాపురంలోని ఒక ప్లాట్‌ను అమ్మాలనుకుంటున్నాను. మంచి రేటు వచ్చేట్లు చూడండి’’ అని చెప్పాను.
మా పెద్దబ్బాయి ఆత్రం పట్టలేక కాబోలు, టిఫిన్‌ మధ్యలోనే లేచి నా దగ్గరికి వచ్చి ‘‘ఈ ఇంటిని డెవలప్‌మెంటుకు ఇవ్వడం వరకు ఓకే గానీ, ఆ ప్లాట్‌ని ఇప్పుడు అమ్మడం దేనికి నాన్నా? ఏం చేస్తారా డబ్బుతో?’’ ఆశ్చర్యం ప్రకటిస్తూ అడిగాడు.
‘‘కొనుక్కోవాలిరా’’ అన్నాను తాపీగా‘‘ఏం కొనుక్కోవాలి?’’ అందరూ వింతగా చూస్తున్నారు నా వంక. పెద్దవాడితో సహా అందరిలోనూ ఉద్వేగం నాకు స్పష్టంగా కనబడుతోంది.
‘‘మా ఇద్దరికీ ఈ వయసులో కావాల్సింది కొనుక్కోవాలి!’’ అన్నాను దృఢంగా నా నిర్ణయానికి తిరుగులేదన్నట్లుగా.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న