అందాల పూలబొమ్మ! - Sunday Magazine
close

అందాల పూలబొమ్మ!

‘ఈ భూమ్మీద అందమైనవి రెండే రెండు... ఒకటి నువ్వు, మరొకటి నేను’. విరిసిన సుమాలకే గనక మాటలొస్తే సుకుమారమైన చేతుల్తో తమని తల్లో తురుముకుంటున్న అందాల మగువను చూసి ఇలానే మురిసిపోయేవేమో. మరి... ఆ ముద్దుగుమ్మలే చూడచక్కని బొమ్మలై పూల గుత్తుల్ని చేత పడితే... ఇంటికి ఎంతందమో!

చుట్టూ ఉన్న వాతావరణం మనకు తెలీకుండానే మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఇల్లంతా చిందర వందరగా ఉంటే మనసు కూడా గందరగోళంగా ఉన్నట్లే ఉంటుంది. అదే... అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తే ఎంత ఒత్తిడిలో ఉన్నా మనసు తేలికపడుతుంది. ఆ మాటకొస్తే పూలని మించి హృదయాన్ని తడిమేవీ హాయిని గొలిపేవీ మరొకటేముంటాయి... ప్రకృతి లోకంలో అందాల పోటీలు పెడితే మిస్‌ యూనివర్స్‌ కిరీటం ఎప్పుడూ పూల సొగసుకే సొంతం. సుతిమెత్తగా, చూడచక్కని రంగులతో పువ్వులు అంతగా ఆకట్టుకుంటాయి మరి. అందుకే, రకరకాల పూలను వేజుల్లో పెట్టి హాల్లో ఎదురుగా కనిపించేలా అలంకరించడం ఎప్పట్నుంచో ఉంది. అయితే, వాటిని పెట్టే వేజుల్లో ఎన్ని రకాలున్నా మరీ పూలతో పోటీ పడే అంత అందంగా ఉన్నవైతే లేవనే చెప్పాలి. ఆ లోటు తీర్చేందుకు వస్తున్నవే ‘నొర్డిక్‌ స్టైల్‌ మోడర్న్‌ గర్ల్‌ వేజెస్‌’. చూడముచ్చటైన అమ్మాయిల రూపంలో ఉన్న ఈ వేజుల్లో పూల గుత్తుల్ని పెడితే, ఆ బొమ్మని చూడాలో అందులోని పువ్వుల్ని చూడాలో తెలీక తికమక పడటం ఖాయం.

చూపు తిప్పుకోనివ్వవు
తీరైన ముక్కు, చిన్ని చిన్ని పెదవులు, ప్రశాంతంగా మూసిన కనులతో ఉన్న ఈ వేజు బొమ్మల్ని చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించడమే కాదు, మనసుకెంతో హాయిగానూ అనిపిస్తుంది. ఇందులో కొన్నిటికి చేతిలో బొకేలాంటి
నిర్మాణం ఉండి, అందులో పువ్వుల్ని అమర్చుకునేలా ఉంటుంది. మరికొన్ని చిన్న కూజాను పట్టుకున్నట్లూ భుజానికి బ్యాగు తగిలించుకున్నట్లూ ఉంటాయి. వాటిలో పూలను పెట్టుకోవచ్చు. ఇంకొన్నిటికి బొమ్మల తలపైభాగంలో పువ్వుల్ని పెట్టుకునేలా అమరిక ఉంటుంది. మోడ్రన్‌ డ్రెస్సులూ, హెయిర్‌స్టైల్స్‌, తలకు టోపీలతో ఆధునికంగానూ కనిపించే ఈ గర్ల్‌ వేజ్‌లు ఈతరం గృహాలంకరణకు చక్కగా సరిపోతాయి. పైగా వీటిని పెడితే పనిగట్టుకుని వేరే అలంకరణ బొమ్మల్ని కొనాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక, ఎప్పుడైనా మనకు కుదరక మామూలు వేజ్‌లలో పువ్వులు పెట్టకపోతే ఆ వేజ్‌లు అడ్డంగా అనిపిస్తాయి. కానీ ఈ అమ్మాయి వేజ్‌లలో పువ్వులు పెట్టకపోయినా అందంగానే కనిపిస్తాయి. ‘సొగసు చూడతరమా...’ అంటారా..?

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న