టీకా భుజంమీదే ఎందుకు? - Sunday Magazine
close

టీకా భుజంమీదే ఎందుకు?

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను భుజం దగ్గర వేస్తున్నారనేది తెలిసిందే. పోలియో తప్పితే దాదాపుగా అన్ని రకాల వ్యాక్సిన్లనూ భుజం కండరానికే వేస్తారుగానీ ఇతర ఇంజెక్షన్ల మాదిరిగా రక్తనాళానికి ఎక్కించరు. ఎందుకంటే- భుజం పై భాగంలో ఉండే డెల్టాయిడ్‌ కండరాల్లో రోగనిరోధకశక్తి కారక డెండ్రిటిక్‌ కణాలు ఉంటాయి. ఇవి వ్యాక్సిన్‌లోని యాంటిజెన్లను వెంటనే గుర్తించి, శరీర రోగనిరోధక వ్యవస్థ కేంద్రస్థానమైన లింఫ్‌నోడ్స్‌కు చేరవేస్తాయి. అక్కడున్న టి, బి కణాలు అంతే త్వరగా స్పందించి, యాంటీబాడీల ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. అదే నేరుగా రక్తంలోకి వెళ్లేలా ఇంజెక్ట్‌ చేస్తే ఇతర కణాలతో కలగలిసిపోవడంతో వ్యాక్సిన్‌లోని యాంటిజెన్లను రోగనిరోధక వ్యవస్థ త్వరగా గుర్తించలేదు. పైగా కండరానికి ఇవ్వడం వల్ల వాచినా నొప్పి వచ్చినా అది అక్కడికే పరిమితమవుతుంది. అంటే దుష్ఫలితాల శాతమూ తక్కువే అని
వివరిస్తున్నారు నిపుణులు.


నిద్రలేమితో దృష్టిలోపం!

మయోపియా... పిల్లల్లో ఎక్కువగా వచ్చే దృష్టిలోపం. దీనివల్ల వాళ్లకు దూరం వస్తువులు సరిగ్గా కనిపించవు. పిల్లలతోపాటు కౌమార దశలో ఉన్నవాళ్లలో ఈ లోపం ఎక్కువగా ఉంటుంది. టీవీ, ఫోన్లూ ఎక్కువగా చూడటం వల్లే వాళ్లలో ఈ రకమైన దృష్టిలోపం ఏర్పడుతుందని ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే మయోపియాకీ నిద్రలేమికీ కూడా సంబంధం ఉంది అంటున్నారు ఫ్లిండర్స్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. ఈ విషయమై వీళ్లు ఇరవై ఏళ్లు దాటిన విద్యార్థుల్ని ఎంపికచేసి మయోపియా ఉన్నవాళ్లనీ లేనివాళ్లనీ వేరు చేసి పరిశీలించారట. అందులో ఎలాంటి దృష్టి దోషాలూ లేనివాళ్లతో పోలిస్తే మయోపియా ఉన్నవాళ్లలో నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌ ఉత్పత్తి తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. అంతేకాదు, మిగిలినవాళ్లకన్నా వీళ్ల నిద్రావేళలు కూడా సరిగ్గా లేవని తెలిసింది. దీన్నిబట్టి నిద్రలేమి అనేది కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు, కంటి ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది అంటున్నారు. చిన్నప్పటి నుంచీ పిల్లలకు డిజిటల్‌ వస్తువుల్ని అలవాటు చేయడం వల్లే వాళ్లలో నిద్రపోయే సమయం తగ్గిపోయి, అనేక సమస్యలకు కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు.


ఓసీడీ ఉందా?

కడిగిందే కడుగుతూ చేసిందే చేస్తూ అతి శుభ్రత పాటించేవాళ్లని చూస్తే ఓసీడీ అనీ చాదస్తం అనీ అనుకుంటామే తప్ప అదో వ్యాధిగా పెద్దగా పరిగణించం. కానీ ఈ అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ను అలాగే వదిలేస్తే అది భవిష్యత్తులో పక్షవాతానికి దారితీస్తుంది అంటున్నారు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కు చెందిన నిపుణులు. ఇలాంటివాళ్లు ఆరోగ్యకరమైన ఆహారం తింటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలనీ ధూమపానానికి దూరంగా ఉండాలనీ చెబుతున్నారు. రక్తనాళంలో పూడిక రావడం లేదా దానికి రంధ్రం ఏర్పడటంతో మెదడుకి రక్తం- తద్వారా ఆక్సిజన్‌ అందకపోవడంతో పక్షవాతం వస్తుంది. ఇది కొందరిలో మరణానికీ కారణమవుతుంది. ఈ విషయాన్ని నిర్ధారించడంకోసం ఓసీడీ ఉన్నవాళ్లనీ, అది లేనివాళ్లనీ ఎంపికచేసి వాళ్లను కొన్నేళ్లపాటు పరిశీలించారట. ఓసీడీ లేనివాళ్లతో పోలిస్తే, ఉన్నవాళ్లు- అదీ అరవై ఏళ్లు పైబడ్డాక మూడు రెట్లు ఎక్కువగా స్ట్రోక్‌ బారినపడటాన్ని గమనించారట. అందుకే ఓసీడీ ఉందని గుర్తించిన వెంటనే దాన్ని తగ్గించుకునేందుకు మందులు వాడటంతోపాటు బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకుంటే స్ట్రోక్‌ వచ్చే శాతం తక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు సదరు పరిశోధకులు.


దంత సంరక్షణతో కరోనా పరార్‌!

దంతసిరి బాగుంటే ఆరోగ్యం బాగున్నట్లే అంటుంటారు. అది ఆరోగ్యానికీ వర్తిస్తుంది. చిగుళ్లవ్యాధులూ దంతక్షయం లేకుండా నోరు పరిశుభ్రంగా ఉంటే, కొవిడ్‌ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పెరిడాంటాలజీకి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. నోటి పరిశుభ్రత కరోనా వ్యాప్తిని చాలావరకూ అడ్డుకుంటుందని వాళ్ల తాజా అధ్యయనాల్లో తేలిందట. చిగుళ్ల వ్యాధులకీ శ్వాసకోశ వ్యాధులకీ సంబంధం ఉందని గతంలోనే స్పష్టమైంది. అదేమాదిరిగా దంత సమస్యలు ఉన్నవాళ్లలోనే కొవిడ్‌ మరణాల శాతం కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, దంత సమస్యలు లేనివాళ్లు కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకుంటే, చిగుళ్ల వ్యాధులు ఉన్నవాళ్లకి ఎక్కువ సమయం పట్టిందట. రెండోదశ కొవిడ్‌ కేసుల్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించిందట. పైగా కొవిడ్‌ వచ్చి తగ్గాక వస్తోన్న మ్యూకర్‌మైకోసిస్‌ అనే ఫంగస్‌ కూడా ఎక్కువగా చిగుళ్లకే వస్తుంది. కాబట్టి రెండుసార్లు బ్రష్‌ చేయడం, తరచూ పుక్కిలించడం వంటి వాటివల్ల కొవిడ్‌ బారి నుంచి కొంతవరకూ సురక్షితంగా ఉండొచ్చు అంటున్నారు.


నీడ మాయమయింది!

ప్పుడూ మనతోనే ఉండే మన నీడ అప్పుడప్పుడూ మాయమవుతుందని తెలుసా... మే నెల 21న ఒడిశాలోని భువనేశ్వర్‌లో అలాగే జరిగింది. అవును... ఉదయం 11 గంటల 43 నిమిషాలకు నీడ పోయింది. అలా మూడు నిమిషాల పాటు మనుషుల నీడలే కాదు... వస్తువుల నీడలూ కనిపించలేదు. ఉన్నట్టుండి ఇలా నీడ మాయమవ్వడంతో జనాలంతా సరదాగా వస్తువుల్ని ఎండలో ఉంచి ఫొటోలు తీస్తూ ఆశ్చర్యపోయారు. నీడ కనిపించకుండా పోయిన ఈ రోజును ‘జీరో షాడో డే’ అంటారు. ఇప్పుడే కాదు, ఏటా రెండుసార్లు ఇలా జరుగుతుంది. అసలు నీడ పోవడానికి కారణం ఏంటో తెలుసా... సూర్యుడు నడినెత్తిమీదకు రావడం. మిట్టమధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిమీద ఉన్నాడని అంటాం కానీ నిజానికి ఉండడు. అయితే అలా కచ్చితంగా సూర్యుడు నడినెత్తిమీదకు ఏడాదిలో రెండుసార్లు మాత్రమే వస్తాడు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణించే సమయంలో ఒకసారి, దక్షిణాయనంలో ప్రయాణించేటప్పుడు రెండోసారి. ఆ సమయంలో సూర్యుడు కచ్చితంగా మనముండే ప్రాంతంలో నడినెత్తిమీద అంటే ‘జెనిత్‌’ పాయింట్‌లో ఉంటాడు. అందుకే ఆ సమయాల్లోనే నీడ మాయమైపోతుంది. అయితే ఇలా ప్రపంచవ్యాప్తంగా అవుతుందా అంటే... అవదు. కర్కాటక రేఖ, మకరరేఖ మధ్యలో ఉండే ప్రాంతాల్లోనే ఈ జీరో షాడో డేలు వస్తాయి. ప్రతిసారీ ఒకేరోజు, ఒకే సమయంలో ఇలా జరగదు. సాధారణంగా ఉత్తరాయణంలో మేలోనూ, దక్షిణాయనంలో ఆగస్టులోనూ వస్తుంటాయి. అందుకే ఆ నెలల్లో వేరు వేరు తేదీల్లో ఇలా నీడ పోతుందన్నమాట. హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనూ ఏడాదికి రెండుసార్లు ఇలా నీడ కనిపించకుండాపోవడం మనం గమనించొచ్చు. నిజంగా ఇదో ఆశ్చర్యపరిచే సంగతే కదూ!


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న