ఒక వైద్యుడి ఆత్మకథ - Sunday Magazine
close

ఒక వైద్యుడి ఆత్మకథ

మెరికాలో పనిచేస్తున్న డాక్టరు... భారత్‌లో ఉన్న రోగిని చూడటానికి ప్రైవేట్‌ జెట్‌ విమానంలో వచ్చారు. నటి శ్రీదేవి అనారోగ్యంతో ఉన్న తన తల్లిని తీసుకెళ్లి ఆ డాక్టరుకే చూపించారు. ఎన్టీఆర్‌ భార్య బసవతారకం, సునీల్‌ దత్‌ భార్య నర్గిస్‌, పిరమల్‌ కుటుంబంలో పెద్దవాడైన అశోక్‌... ఇలా ఎందరో ప్రముఖులు ఆయన దగ్గర చికిత్స పొందారు. ఆ వైద్యుడు... పల్లెటూళ్లో పుట్టి, పిన్నవయసులోనే తండ్రిని కోల్పోయి, కనీస సౌకర్యాలకూ అల్లాడి, చదువుకోడానికి నానా కష్టాలూ పడి - చిన్న నాటి కల నెరవేర్చుకుని వైద్యుడై, క్యాన్సర్‌ స్పెషలిస్టుగా ప్రపంచాన్ని మెప్పించిన నోరి దత్తాత్రేయుడు. ఇది ఆయన ఆత్మకథ మాత్రమే కాదు, క్యాన్సర్‌ చికిత్సలో వస్తున్న మార్పుల కథ కూడా. ఎదిగిన చెట్టునే ప్రపంచం చూస్తుంది. ఆ ఎదుగుదలకు ఆధారమై నిలిచిన వేళ్లు ఎవరికీ కన్పించవు. తన కుటుంబమూ సమాజమూ వేలుపట్టి నడిపించిన గురువులూ ఫలించిన పరిశోధనలూ దీవించిన రోగులూ... ఇలా ఎందరో కలిసి బలమైన వేళ్లుగా నిలిచి తనని మలిచారని అంటారు దత్తాత్రేయుడు. కష్టించేవారికి సాధ్యం కానిది ఏదీ లేదని చెప్పే అద్భుతమైన జీవిత చరిత్ర ఇది.

- పద్మ

ఒదిగిన కాలం (స్వీయ ఆత్మకథ)
రచన: డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు
పేజీలు: 231; వెల: రూ.600/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


విలక్షణమైన శైలి

త్తరాంధ్ర మాండలికంలో సాగే ఈ కథలు పాఠకులనీ చేయిపట్టి తీసుకెళతాయి. కళింగసీమ పల్లె జీవితాన్ని కళ్లకు కడతాయి. అడిగినవారినీ అడగనివారినీ పిలిచి మరీ ప్రేమగా వేడి వేడి బెల్లం పెట్టే మంచి మనిషి పరదేశమ్మ బాలింతకు నాలుగు పాతబెల్లం ముక్కలకోసం షావుకారి కొట్లో ఎందుకు అవమానపడాల్సివచ్చిందో చెప్పే కథ ‘ఉడుకుబెల్లం’. రోజూ పాసింజరు రైల్లో ఆఫీసుకెళ్లే మహిళల గురించి వినిపించే కథల వెనక అసలు ‘సంగతి చెప్పిన సత్యవతక్క’ గవర్నమెంటు ఉద్యోగం గుట్టు విప్పుతుంది. పిండీ బియ్యం పోతే పిడకలొట్టుకుని ఏడవడం, అమాసనాడు అట్టెట్టలేదు, పున్నమినాడు బూరెట్టలేదు... లాంటి ప్రయోగాలు ఆకట్టుకుంటాయి. 

- శ్రీ

ఉడుకుబెల్లం (కథలు)
రచన: చింతకింది శ్రీనివాసరావు
పేజీలు: 122; వెల: రూ.120/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ప్రేమకథ

దాదాపు అరవై అయిదేళ్ల క్రితం రచయిత ఆత్మతృప్తికోసం రాసుకున్న నవల ఇది. దానిని ఏ మార్పులూ లేకుండానే ఇప్పుడు ప్రచురించారు. రామం, శశిలది చిన్ననాటి స్నేహం. యుక్తవయసులో ప్రేమగా మారిన ఆ బంధం పెళ్లితో ముడిపడేలోపే విధి శశిని దూరం చేస్తుంది. ఆ తర్వాత రామం జీవితంలోకి యశోరాజ్యం అడుగుపెడుతుంది. అటు శశి స్మృతులతో ఇటు యశో ప్రేమతో సతమతమవుతున్న రామానికి మరో ఇద్దరు స్త్రీలు పరిచయమవుతారు. వారందరి మధ్యా అతడి జీవితం ఎలా గడిచిందో స్త్రీపురుష సంబంధాలు ఎలాంటి అనూహ్య మలుపులు తిరుగుతాయో చెబుతుంది కథనం. శరత్‌ సాహిత్యాన్ని విపరీతంగా అభిమానించి చదివిన రచయిత తనకు తెలియకుండానే తన ఈ తొలి రచనను అదే శైలిలో రాసినట్లు కనిపిస్తుంది.

- సుశీల

క్షంతవ్యులు(నవల)
రచన: భీమేశ్వర చల్లా(సి.బి.రావు)
పేజీలు: 228; వెల: రూ.150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


హనుమంతుడి కథలు

క్కో దిక్కునీ జయిస్తూ దక్షిణం వైపు వెళ్లిన అర్జునుడికి అక్కడ సముద్రంలో రామసేతువు కన్పించింది. రాముడు బాణాలతో కాక రాళ్లతో వారధి కట్టడమేమిటీ అని నవ్వాడు అర్జునుడు. అది విని ప్రత్యక్షమైన హనుమంతుడు అర్జునుడితో ఒక పందెం వేశాడు. ఆ పందెంలో అర్జునుడే ఓడిపోయి అగ్నిప్రవేశం చేయబోయాడు. వెంటనే ప్రత్యక్షమైన శ్రీకృష్ణుడు సాక్ష్యం లేకుండా పెట్టుకునే పోటీ చెల్లదనీ తన ఎదురుగా పెట్టుకోమనీ చెబుతాడు. ఈసారి పోటీలో అర్జునుడు గెలిచేలా చేయడానికి కృష్ణుడు ఏంచేశాడో హనుమంతుడికి తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందో అర్జునుడి ధ్వజంపై చిహ్నంగా ఆంజనేయుడు ఎందుకు నిలిచాడో చెబుతుంది ఒక కథ. ఇలాంటి ఎన్నో కథలతో పాటు వాల్మీకి రామాయణంలో పవనపుత్రుడి పాత్రనీ వివరిస్తుంది ఈ పుస్తకం.

- అంకిత

వీరాంజనేయ లీలామృతము
సేకరణ: కోపల్లె విజయప్రసాదు
పేజీలు: 311; వెల: రూ.300/-
ప్రతులకు: ఫోన్‌-7794820104


స్ఫూర్తినిచ్చే స్మృతులు

స్వీయచరిత్ర రచనల్లో ఇదో విభిన్న ప్రయోగం. దేశం గర్వించదగ్గ హెపటైటిస్‌-బి టీకా సృష్టికి కారకులైన డా.కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి అనుభవాలూ, జ్ఞాపకాలూ ఇవి. పల్లెలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తనకు జీవితంలో ఎదురైన వ్యక్తుల ప్రభావం గురించి ఆయన ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు. దీనిలో ప్రస్తావించినవారి ఉన్నత వ్యక్తిత్వాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. పాలేరు కాళ్ళకు దణ్ణంపెట్టించిన తల్లి, ఆమె విలువను గుర్తించిన తండ్రి, తెలుగుపై ఇష్టం పెంచిన ఉపాధ్యాయుడు, గణితాన్ని నిజజీవితంలో అన్వయించుకోవటం నేర్పిన మాస్టారు, పరోపకారం కోసం నిలిచే ఆత్మబంధువులూ, గురువులూ, మిత్రులూ, శాస్త్రవేత్తలూ.. ఇలా ఎందరి గురించో వివరంగా స్మరించుకున్నారు. తనను ప్రభావితం చేసిన రెండు పుస్తకాల గురించీ వివరించారు. ప్రచురించిన చిత్రాలూ సందర్భోచితంగా ఉన్నాయి. ఆద్యంతం పఠనీయంగా, హృద్యంగా తోచే స్మృతుల సమాహారమిది!

- సీహెచ్‌.వేణు

శాంతిపథం (నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు)
రచన: డా.కె.ఐ.వరప్రసాద్‌ రెడ్డి
పేజీలు: 157; వెల: రూ. 200/-
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్‌

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న