అంబులెన్సులతో ఆదుకుంటున్నారు! - Sunday Magazine
close

అంబులెన్సులతో ఆదుకుంటున్నారు!

దేశంలో ఎమర్జెన్సీ వైద్య సేవల వ్యవస్థ డొల్లతనం కొవిడ్‌తో బయటపడింది. ఇప్పుడిప్పుడే అది గాడిలో పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇంతటి ఉపద్రవాన్ని ఊహించకపోయినా, అత్యవసర వైద్యంలో కీలకమైన అంబులెన్స్‌ సేవల్ని అందించే లక్ష్యంతో కొన్ని సంస్థలు కొవిడ్‌కు ముందే వచ్చాయి. ఈ ఆపత్కాలంలో అవి అద్భుతంగా ఆదుకుంటున్నాయి.

అంబులెన్స్‌లకు ఓలా లాంటిది!

అవసరమైన వాళ్లకి దగ్గర్లోనే అంబులెన్స్‌ ఉన్నా కానీ, ఆ సమాచారం తెలియక దూరంగా ఉన్న మరో అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేస్తుంటారు. దాంతో అది రావడం ఆలస్యమై రోగి సమస్య తీవ్రమవుతుంది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చే ఉద్దేశంతో ఉబర్‌, ఓలా మాదిరిగా ఆప్‌ద్వారా బుక్‌చేసుకుంటే రోగి ఉన్నచోటకు దగ్గర్లోని అంబులెన్స్‌ను సాధ్యమైనంత త్వరగా పంపించేలా పనిచేస్తోంది మెడ్యులెన్స్‌. దిల్లీకి చెందిన రావ్‌జోత్‌ అరోరా, ప్రణవ్‌ బజాజ్‌ 2017లో దీన్ని ప్రారంభించారు. 22 నగరాల్లో 5000 అంబులెన్స్‌లు వీరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో పాటు ప్రైవేటు సంస్థలకు చెందిన అంబులెన్స్‌లు దీన్లో ఉంటాయి. ఐసీయూ ఆన్‌ వీల్స్‌, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్నవీ, మృతదేహాల్ని తరలించేవీ... ఈ ఆప్‌లో అందుబాటులో ఉంటాయి. అంబులెన్స్‌ను ఆప్‌లో చేర్చేముందు సిబ్బందినీ, దానిలోని పరికరాల్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆప్‌ సౌకర్యంతోపాటు హెల్ప్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటారు వీరి సిబ్బంది. ఫోన్‌ చేసిన ఎనిమిది నిమిషాల్లోపల రోగిని చేరుకోవడం వీరి ప్రత్యేకత. హెచ్‌సీఎల్‌, ఇండిగో, జీఎమ్‌ఆర్‌, జొమాటో, గోద్రెజ్‌... లాంటి సంస్థల ఉద్యోగులకు 3-4 నిమిషాల్లోనే అంబులెన్స్‌ను అందించేలా ఆయా సంస్థలతో ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి దిల్లీ ప్రభుత్వానికి 100 అంబులెన్స్‌లను ప్రత్యేకంగా కేటాయించి పనిచేస్తోంది.


విదేశాల్లో ఉద్యోగం వదిలి...

ఆరేళ్ల కిందట విదేశాల్లో ఉద్యోగం చేసేవాడు ప్రభ్‌దీప్‌ సింగ్‌. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పనిచేసిన అతడికి అత్యవసర వైద్యం విలువేంటో తెలుసు. భారత్‌లో ఆ విషయమై ఆధారపడదగ్గ నమ్మకమైన సంస్థ అతడికి ఒక్కటీ కనిపించలేదు. ఇది తన ఒక్కడి సమస్య మాత్రమే కాదని గమనించి ఉద్యోగం వదిలి వచ్చి మిత్రులతో కలిసి హైదరాబాద్‌ కేంద్రంగా స్టాన్‌ప్లస్‌ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ ‘రెడ్‌ అంబులెన్స్‌’ పేరుతో అంబులెన్స్‌, ఎయిర్‌ అంబులెన్స్‌ సేవల్ని అందిస్తోంది. సంస్థకు సొంతంగా 130 అంబులెన్స్‌లు ఉన్నాయి. వీటితోపాటు ప్రైవేటు ఆసుపత్రులూ, సంస్థల భాగస్వామ్యంతో 2800 అంబులెన్స్‌లను నడుపుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, విశాఖపట్నం, భువనేశ్వర్‌, రాయ్‌పుర్‌, కోయంబత్తూర్‌లలో సేవలు అందిస్తోంది. ఈ నగరాల్లో 40  హాస్పిటల్స్‌తో స్టాన్‌ప్లస్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. అంబులెన్స్‌ను 15 నిమిషాల్లో పేషెంట్‌ దగ్గరకు చేర్చేలా లక్ష్యం పెట్టుకున్నట్టు చెబుతాడు సింగ్‌. ఏ హాస్పిటల్‌కు అయినా నెట్‌వర్క్‌లోని ఏ అంబులెన్స్‌ల ద్వారానైనా రోగుల్ని తరలించే సౌలభ్యం ఉంటుంది. 2-3 అంబులెన్స్‌లు ఉన్న హాస్పిటల్స్‌ ఈ నెట్‌వర్క్‌లోకి రావడంవల్ల నగరాల్లోని ఏ మూలనుంచైనా పేషెంట్‌ను 15 నిమిషాల్లో చేరుకునే అవకాశం వచ్చింది. మరోవైపు కార్పొరేట్‌ ఒప్పందాల ద్వారా పది లక్షల మందికి అత్యవసర సర్వీసులు అందుబాటులో తీసుకువచ్చింది. ఈ విధానంలో కంపెనీలు తమ ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌, హాస్పిటల్‌ బెడ్‌ లాంటి సేవల్ని వీరిద్వారా అందిస్తున్నాయి.


ఐఐటీ విద్యార్థుల... హెల్ప్‌నౌ

మూడేళ్ల కిందట ఆదిత్య తండ్రికి గుండె పోటు వచ్చినపుడు అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేస్తే రావడానికి 50 నిమిషాలు పడుతుందన్నారు. దాంతో సొంత కారులో హాస్పిటల్‌కి తీసుకువెళ్లి చికిత్స అందించారు. అప్పుడే మిత్రులు వెంకటేష్‌ అమృత్‌వార్‌, శిఖర్‌ అగర్వాల్‌లతో తన అనుభవాన్ని చెప్పి అంబులెన్స్‌ సేవల రంగంలోకి అడుగుపెడదామన్నాడు ఆదిత్య. వెంకటేష్‌ ఐఐటీ బోంబే పూర్వ విద్యార్థి కాగా... శిఖర్‌, ఆదిత్య అదే ఐఐటీలో ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌లో ఉండగానే సంస్థ నెలకొల్పడానికి ఫండింగ్‌ రావడంతో గ్యాప్‌ ఇయర్‌ తీసుకున్నారు ఆదిత్య, శిఖర్‌. 2019లో 12 అంబులెన్స్‌లతో సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ముంబయిలోనే వీరికి 350 అంబులెన్స్‌లు ఉన్నాయి. ఈ ఏడాది పుణె, దిల్లీ, బెంగళూరుకూ సేవల్ని విస్తరించారు. కేవలం 20 నిమిషాల్లో అంబులెన్స్‌ను రోగి దగ్గరకు చేర్చుతారు. వ్యాపార సంస్థ అయినా ముంబయిలో పేదలకూ, పోలీసులకూ, ప్రభుత్వ ఉద్యోగులకూ ఉచితంగా సేవలు అందిస్తూ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ‘ఉచిత సేవల్ని కాదనలేకపోతున్నాం కానీ నిధుల కొరత ఉంది. సాయం కావాల’ని కోరి.. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా రూ.2.5కోట్లు సేకరించారు. గతేడాది ఆన్‌లైన్‌ తరగతులు మొదలయ్యాక ఆదిత్య, శిఖర్‌ చదువుని కొనసాగిస్తూనే మరో పక్క కంపెనీ పనులు చూసుకుంటున్నారు.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న