తీరికవేళ... ఏం చేస్తారంటే! - Sunday Magazine
close

తీరికవేళ... ఏం చేస్తారంటే!

ఎవరినైనా తీరిక సమయంలో ఏం చేస్తారని అడిగితే... సినిమా, సంగీతం, పాటలు, చిత్రలేఖనం, డాన్స్‌, వంట అంటూ బోలెడు చెప్పేస్తారు కదూ... మరి అనుక్షణం  మీటింగుల్లో మునిగితేలుతూ, తమ సంస్థల్ని ముందుకు నడిపే సీఈవోలు తమ ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో తెలుసు కోవాలని ఉందా... ఆలస్యమెందుకు, చదివేయండి మరి.

చేతిలో కెమెరా లేదా టెన్నిస్‌రాకెట్‌

ఎంత బిజీగా ఉన్నా సరే... ఏదయినా ఒక వీడియో లేదా ఫొటో నచ్చితే దాన్ని అప్పటికప్పుడు ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంలో, అవసరమైన వారికి సాయం అందించడంలో ముందుండే ఆనంద్‌ మహీంద్రా తనకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా పుస్తకం చదువుతాడట. అలాగే  సెయిలింగ్‌ అన్నా ఇష్టమట. లేదంటే టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకుని ఆడేందుకు సిద్ధమైపోతాడు. అయితే... మొదటినుంచీ ఆనంద్‌ మహీంద్రాకు సినిమా తీయాలని ఓ కోరిక. అందుకే హార్వర్డ్‌లో చదువుతున్నప్పుడు ఫిలిం మేకింగ్‌కు సంబంధించి ఓ కోర్సు కూడా పూర్తి చేశాడట. ఆ ఇష్టంతోనే ఫొటోగ్రఫీని తన అభిరుచిగా మార్చుకుని, అవకాశం వచ్చినప్పుడల్లా నచ్చిన ఫొటోలు తీస్తుంటాడు. వీటన్నింటితోపాటూ ‘బ్లూస్‌’ సంగీతాన్నీ బాగా వింటాడు. ఆ సంగీతంపైన ఇష్టంతోనే కొన్నాళ్లక్రితం ‘మహీంద్రా బ్లూస్‌’ పేరుతో ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు.


రాకెట్ల శకలాలు సేకరిస్తాడు

ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా, అమెజాన్‌ వ్యవస్థాపకుడిగా జెఫ్‌బెజోస్‌ ఎప్పుడూ ఎంత బిజీగా ఉంటాడో చెప్పక్కర్లేదు. తన స్థానాన్ని పదిలపరచుకునేందుకు అనుక్షణం కష్టపడే ఈ అపర కుబేరుడు కాస్త విరామం దొరిందనుకున్నప్పుడు మొదట చేసే పని హాయిగా స్టార్‌ట్రెక్‌ అనే కార్యక్రమం చూడటం. ఆ తరువాత ఎప్పటికప్పుడు నాసా విడుదల చేసే రాకెట్ల నుంచి సముద్రాల్లో పడిపోయే శకలాలను సేకరిస్తుంటాడట. అదే తన హాబీ అని చెప్పే ఈ సంపన్నుడు ఆ శకలాలను వెతికేందుకు అప్పుడప్పుడూ తన పిల్లల్నీ తీసుకెళ్తుంటాడట.


వీడియోగేమ్స్‌ ఉంటే చాలు

అనుక్షణం బిజీగా ఉంటూ..  వారంలో దాదాపు వంద గంటలు పనిచేస్తూ మీటింగ్‌ల మధ్యలోనే భోజనం కానిచ్చేయడం స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ స్టైల్‌. అత్యవసరమైన ఫోన్లూ, ఈమెయిల్స్‌ మాత్రమే చూస్తూ ఎప్పుడూ పని తప్ప మరో ధ్యాస లేనట్లుండే ఈ పని రాక్షసుడి హాబీ ఏంటో తెలుసా... వీడియోగేమ్స్‌ ఆడటం. అవును ఏ కాస్త ఖాళీ దొరికినా చాలు ఒక్కడూ కూర్చుని వీడియోగేమ్స్‌ ఆడుతూ గడిపేస్తాడు. అలాగే పనిలో ఎంత బిజీగా ఉన్నా సరే బయోగ్రఫీలు చదవడం ఇష్టం అని చెప్పే ఎలన్‌మస్క్‌ పుస్తకాలకోసం కొంత సమయం పెట్టుకుంటాడట. ఇక బాగా తీరిగ్గా ఉంటే కొద్దిమంది సన్నిహితులను ఆహ్వానించి పార్టీ ఏర్పాటు చేసేస్తాడు. ఆ సమయంలో అతిథులతో కలిసి తెల్లారేవరకూ సరదాగా గడిపేస్తుంటాడు. పిల్లలకోసం అప్పుడప్పుడూ బేకింగ్‌ చేయడం కూడా తన హాబీనే అంటాడు.


సినిమాలు చూస్తూ గడిపేస్తాడు

భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందిన ముకేష్‌ అంబానీ... ఏ మాత్రం తీరిక దొరికినా హోంథియేటర్‌లో కూర్చుని నచ్చిన హిందీ సినిమాని చూస్తాడట. లేదంటే పాత హిందీ పాటలు వింటాడు. వీటితో పాటు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడిపేందుకు ప్రణాళికలు వేసుకుంటాడు. లేదంటే హాయిగా ఈతకొట్టి తన ఒత్తిడిని దూరం చేసుకుంటాడట. ఇంకా తీరిగ్గా ఉంటే వీలైనంత ఎక్కువ దూరం నడిచేందుకు ప్రయత్నిస్తాడట. ఇవన్నీ కూడా బోర్‌ కొట్టాయనుకున్నప్పుడు సరదాగా జంగిల్‌ అడ్వెంచర్‌ చేస్తాడట. వీటన్నింటితోపాటూ ఖరీదైన కార్లు సేకరించడం అన్నా ఇష్టమేనని అంటాడు.


క్రికెట్‌ అంటే ఇష్టం

మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సంస్థలో తనదైన ముద్ర వేయడమే కాదు, ఉద్యోగుల్లోనూ ఎప్పటికప్పుడు స్ఫూర్తిని నింపే సత్యా నాదెళ్లకు కవిత్వం, క్రికెట్‌ అంటే చెప్పలేనంత ఇష్టమట. అందుకే తీరిక దొరికినప్పుడల్లా భారతీయ కవిత్వమే కాదు, ఇంగ్లిష్‌ పద్యాలనూ ఇష్టంగా చదివేస్తుంటాడు. ఇక, ఈ రెండూ కాకపోతే క్రికెట్‌ అంటాడు. క్రికెట్‌ చూస్తుంటే ప్రపంచాన్నే మర్చిపోతానని చెప్పే సత్యా నాదెళ్ల తాను స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్‌ టీమ్‌లో సభ్యుడిగానూ  ఉండేవాడట. క్రికెట్‌ ఆడటం వల్ల తనకు నలుగురితో కలిసిపోయి పనిచేయడంతో పాటు, నాయకత్వపు లక్షణాలూ అలవడ్డాయని చెబుతాడు ఈ టెక్‌ సీఈవో.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న