Antarctica: అంటార్కిటికా.. చూసొద్దామా! - Sunday Magazine
close

Antarctica: అంటార్కిటికా.. చూసొద్దామా!

చైనా, భారత్‌ కలిస్తే ఎంత పెద్ద భూభాగం అవుతుందో... అంత పెద్దగా ఉంటుంది అంటార్కిటికా!  జనాభా మాత్రం వెయ్యికి మించదు.  99 శాతం మంచుతో కప్పి ఉండటం... ఉష్ణోగ్రత -86 డిగ్రీలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితేనేం, అక్కడి మంచుకొండల అందాలనీ, పెంగ్విన్‌లనీ, మంచు ఎడారి ఒయాసిస్సుల్నీ చూడటానికి రెండు కళ్లూ చాలవు! ఈ అవకాశాన్ని ఇప్పుడు  పర్యటకులకి అందిస్తోంది ఓ సంస్థ...

ప్రపంచ నలుమూలల నుంచి అంటార్కిటికాకి పర్యటనలకు వెళ్లడం కొత్త విషయమేం కాదు. గత 70 ఏళ్లుగా ఎన్నో సంస్థలు వీటిని నిర్వహిస్తున్నాయి. కానీ, అవన్నీ ఈ దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని దూరం నుంచి మాత్రమే చూపిస్తాయి. దక్షిణ అమెరికాలోని పెరూ, చిలీ వంటి దేశాల నుంచి ఓడల్లో తీసుకెళ్లి, అంటార్కిటికా అంచుల్లోని తీరంలో కాసేపు తిప్పి వెనక్కి తీసుకొస్తాయి. కానీ లండన్‌కి చెందిన ‘వైట్‌ డెజర్ట్‌’ అనే సంస్థ ఇప్పటిదాకా సైంటిస్టులకి తప్ప సామాన్యుల పాదం పడని చోట్లని సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా విమానాలే కాదు... అక్కడ ఒక హోటల్‌నీ ఏర్పాటుచేసింది.

‘మూణ్ణెల్ల’ ముచ్చట...

అంటార్కిటికాలో మనకున్నట్టు పగలూ రాత్రీ ప్రతిరోజూ రావు! ఏడాదిలో తొమ్మిది నెలలు ఇక్కడ సూర్యుడే కనిపించడు.. పగలైనా రాత్రయినా చీకటి మాత్రమే ఉంటుంది. అది ఇక్కడ చలికాలం. ఇక డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చీకటి అనేదే ఉండదు... 24 గంటలూ వెలుగే ఉంటుంది. అదే ఇక్కడి వేసవి. ఈ మూణ్ణెల్ల వేసవిలోనే పర్యటనలు నిర్వహిస్తుంటారు. ఆ కాలంలోనే పెంగ్విన్‌లూ, సీల్‌లాంటివి సముద్రం నుంచి నేలమీది కొస్తాయి. ప్రపంచంలోని ఈ అతిపెద్ద మంచు ఎడారిలో అప్పుడే స్వచ్ఛమైన నీటి ఒయాసిస్సులు ఏర్పడతాయి. ఈ ఒయాసిస్సుల పక్కనే ప్రపంచ దేశాలన్నీ తమ పరిశోధనా కేంద్రాల్ని నిర్వహిస్తుంటాయి. భారతదేశం కూడా ‘షిర్‌మేకర్‌’ అన్న అతిపెద్ద ఒయాసిస్సు పక్కన ‘మైత్రి’ అనే పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ కేంద్రానికి దగ్గర్లోనే ‘విచావే’ అనే క్యాంప్‌ని ఏర్పాటుచేసి... అక్కడ అంటార్కిటికాలోనే తొలి హోటల్‌ని నిర్మించింది వైట్‌ డెజర్ట్‌ సంస్థ. ఈ హోటల్‌లో కృత్రిమ వెచ్చదనం కల్పించే ‘పాడ్‌’లు ఉంటాయి. ఇక్కడ పులావ్‌ నుంచి సాల్మన్‌ చేపల ఫ్రై దాకా ప్రతిదీ ఏర్పాటుచేస్తోంది వైట్‌ డెజర్ట్‌. పర్యటనతో అలసిపోయిన వాళ్లని యోగాతోనూ సేదదీరుస్తారు. ఈ వసతులన్నీ ఒక ఎత్తైతే... అంటార్కిటికా ఖండం మారుమూలలకి విమానాలూ, హెలికాప్టర్‌ల ద్వారా పర్యటకులని తీసుకెళ్లడం ఒక ఎత్తు. మన ప్రాంతాల్లోలాగా అంటార్కిటికాలో తారుతోనో కంకర రాళ్లతోనో రోడ్లు వేయలేం... అసలు బయటి దేశాల నుంచి వీటిని ఇక్కడికి తీసుకురావడం కూడా నిషేధమే! అందుకనే, మామూలు మంచు నేలనే ఎప్పటికప్పుడు చదునుచేస్తూ ‘రన్‌ వే’లు నిర్మిస్తారు...
ప్రతి ఫ్లైట్‌కీ ఇలా చేస్తూనే ఉంటారు. ‘వూల్ఫ్‌ ఫ్యాంగ్‌’ పేరుతో తనకంటూ ఇలాంటి సొంత రన్‌వేని నిర్మించుకుంది ‘వైట్‌ డెజర్ట్‌’ సంస్థ. ‘ఏడాదిలో మూణ్ణెల్లు తప్ప పర్యటకులు రాని ఇక్కడికి సొంత రన్‌వేలూ, విమానాలూ, హోటళ్లు... ఇంత ఖర్చూ కష్టమూ ఎందుకూ?’ అనిపిస్తోంది కదూ. కానీ దీని వ్యవస్థాపకుల లక్ష్యం కేవలం లాభనష్టాలతో ముడిపడింది కాదు...

ఆ ఇద్దరే...

ఆ ఇద్దరూ పర్యటనలంటే ప్రాణంపెట్టే యువదంపతులు. అతని పేరు ప్యాట్రిక్‌, ఆమె పేరు రాబిన్‌. వాళ్లిద్దరూ అంటార్కిటికాని ఒకటికి మూడుసార్లు కాలినడకన పర్యటించినవాళ్లు! అప్పుడే ‘సైంటిస్టులకీ, తమలాంటి సాహసయాత్రికులకే పరిమితమైన అంటార్కిటికా పర్యటనని సామాన్యులకీ చేరువచేయాల’న్న ఆలోచన వచ్చిందట. ఫలితంగానే ‘వైట్‌ డెజర్ట్‌’ని ఏర్పాటుచేశారు. మిగతా సంస్థల్లా దక్షిణ అమెరికా నుంచి ఓడల్లో కాకుండా... దక్షిణాఫ్రికా కేప్‌ టౌన్‌ నుంచి నేరుగా విమానంలో తీసుకెళ్తారు వీళ్లు. ఎనిమిదిరోజుల పర్యటనలో భూమిలోని అత్యంత లోతట్టు ప్రాంతాన్నీ, దక్షిణధ్రువం చిట్టచివరి కొసనీ, వేలాది పెంగ్విన్‌లు ఉండే ‘అట్కిన్‌ బే’నీ, నీటిలో తేలే డ్రైగాల్స్‌నీ మంచు పర్వతశ్రేణుల్నీ చూపిస్తారు. నడక, ట్రెక్కింగ్‌, బస్సు ప్రయాణం, విమానం, హెలికాప్టర్‌, పడవలూ... ఇలా రకరకాలుగా సాగుతుందీ పర్యటన! దీన్ని కుదించి ఒకరోజుకే పరిమితం చేసే ప్యాకేజీ కల్పిస్తున్నారు. ఈ పర్యటనలకి పది నుంచి డెబ్భైలక్షల రూపాయలదాకా ఖర్చవుతుంది!రైలు తెచ్చిన ఫస్ట్‌ ఎయిడ్‌

వేలు తెగినా, చెయ్యి కాలినా... ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ కోసం పరుగెడతాం. దూది, బ్యాండ్‌ ఎయిడ్‌, యాంటిసెప్టిక్‌ లోషన్‌... లాంటివన్నీ ఇప్పుడు ఒకచోట పెట్టుకుంటున్నాం కానీ అసలీ ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ కనిపెట్టక ముందు పరిస్థితి దారుణంగా ఉండేది. కొత్తగా రైలు మార్గాల్ని నిర్మిస్తున్న రోజులవి. కొండలూ గుట్టలూ తొలుస్తూ నగరాలకు దూరాన రైల్వే లైను వేస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగితే అంత దూరం నుంచీ క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ప్రాణాలు పోయేవి. కొందరికి సెప్టిక్‌ అయ్యి అవయవాల్ని తీసేయాల్సి వచ్చేది. ఒక్క అమెరికాలోనే ఏటా 12వేల మంది ప్రాణాలు కోల్పోయేవారట. దాంతో సత్వర చికిత్స అందించడానికి నిర్మాణ సంస్థలే పని జరుగుతున్నచోట డాక్టర్ని నియమించుకునేవి. యంత్రాలవల్ల జరిగే ప్రమాదాల్లో తీవ్రతను గుర్తించి చికిత్స చేయడం ఆనాటి డాక్టర్లకూ కొత్తే. పైగా ఆస్పత్రిలో ఉండే సదుపాయాలేమీ లేకుండా ఒక్కరే చికిత్స చేయడం కష్టంగా ఉండేది. అలాంటి ఒక డాక్టర్‌ ఊరెళ్తుండగా రైల్లో పరిచయమైన వ్యక్తికి తన కష్టసుఖాలన్నీ చెప్పుకున్నాడు. ఆ వ్యక్తి... మందుల కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యవస్థాపకుడైన రాబర్ట్‌ ఉడ్‌ జాన్సన్‌. డాక్టర్‌ మాటల్లో రాబర్ట్‌కి ఓ వ్యాపారావకాశం కన్పించింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాథమిక చికిత్స చేసి ఆ తర్వాత ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాపాయం తగ్గుతుందని అర్థమైంది. ఆ ప్రాథమిక చికిత్సకి ఏయే పరికరాలూ మందులూ అవసరమో చెప్పమని పలువురు డాక్టర్లకు లేఖ రాశాడాయన. వారందరి సలహాలతో కంపెనీ సైంటిఫిక్‌ డైరెక్టర్‌ అయిన ఫ్రెడ్‌ కిల్మర్‌ శాస్త్రీయంగా ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ని రూపొందించాడు. కట్టు కట్టడానికే కాక కుట్లు వేయడానికి అవసరమైన పరికరాలతో సహా అన్నిటినీ ఓ పెట్టెలో సర్ది 1888లో విడుదల చేసింది జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌. దాని ఉపయోగాన్ని ఆచరణలో చూశాక ప్రాథమిక చికిత్స గురించి ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని భావించిన కిల్మర్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ గురించి చిన్న పుస్తకాన్ని కూడా ఆ కిట్‌లో పెట్టాడు.


మీకు తెలుసా!

భూమి మీద రోడ్డు మార్గంలో చేయగలిగిన సుదీర్ఘ ప్రయాణం- దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ నుంచి రష్యాలోని మగడన్‌ వరకు ఉంటుంది. దాదాపు 23వేల కిలోమీటర్ల పొడవుండే ఈ దారిలో 17 దేశాలనూ ఆరు టైమ్‌ జోన్లనూ దాటాలి. ఈ మధ్యే కనుక్కున్నారు కాబట్టి ఇంకా ఎవరూ ఈ మార్గంలో ప్రయాణించలేదు. 

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న