చిరుత... మళ్లీ వస్తోంది! - Sunday Magazine
close

చిరుత... మళ్లీ వస్తోంది!

ఎవరైనా చాలా వేగంగా ఉరికితే... చిరుతలా పరుగెత్తుతున్నాడని చెబుతాం... చిరుతని ప్రత్యక్షంగా చూసినవాళ్లలా. నిజానికి చిరుతల్ని చూడకపోవడం మన తప్పు కాదు, ఎందుకంటే అవి భారతదేశంలో చాలా ఏళ్ల కిందటే అంతరించిపోయాయి. నమ్మలేకపోతున్నారు కదూ, అయినా ఇది నిజం. ‘మరి మన దేశంలో చిరుతని చూడలేమా...’ అంటే, చూడగలం. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే మన అడవుల్లోనూ చిరుత మళ్లీ పరుగు తీస్తుంది.

చిరుత... భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు. గంటకు 100కి.మీ. వేగంతో పరిగెత్తే చిరుతకే ‘చీటా’ అని పేరు. ‘రంగులద్దుకున్న, అలంకరించుకున్న’ అని సంస్కృతంలో దీని అర్థం. శరీరంమీద తీర్చిదిద్దినట్టుండే చుక్కల్నిబట్టి ఈ పేరొచ్చింది. దీని మూలాలు ఆసియావేనంటారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. క్రీ.శ. రెండో శతాబ్దంలో భారతదేశంలో చిరుతలు విరివిగా ఉండేవట. మొఘలులూ, జైపుర్‌, గ్వాలియర్‌ రాజులూ చిరుతలతో వేటకు వెళ్లేవారని చెబుతారు. మధ్య భారతదేశంలో వీటి ఉనికి ఎక్కువగా ఉండేది. వేటగాళ్లు దాడిచేయడం, సరైన ఆహారం దొరక్కపోవడం... తదితర కారణాలవల్ల కాలక్రమంలో వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ సంస్థానానికి రాజు అయిన రామానుజ్‌ ప్రతాప్‌సింగ్‌ 1947లో మూడు చిరుతుల్ని కాల్చి చంపాడు. తర్వాత మనదేశంలో చిరుత జాడ ఎక్కడా కనిపించలేదు. దాంతో 1952లో భారత్‌లో చీటాల్ని అంతరించిన జాతిగా ప్రకటించింది ప్రభుత్వం.

ఇరాన్‌లో మాత్రమే...

చిరుతలు మనదేశంలో కొన్ని జూ పార్కుల్లో తప్ప అడవుల్లో లేవు. అందుకే వాటిని మళ్లీ మన అడవుల్లోకి తీసుకురావాలనే ప్రతిపాదన 50 ఏళ్ల కిందట మొదలైంది. ఆసియా దేశాల్లో- ఇరాన్‌లో మాత్రమే చిరుతలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి జన్యుపరంగా ఒకప్పటి భారతీయ చిరుతలకు దగ్గరగా ఉంటాయి. అందుకని ఇరాన్‌ నుంచి వాటిని తేవాలనీ, బదులుగా వారికి మన సింహాల్ని ఇవ్వాలనీ 1970ల్లో అనుకున్నారు. అంతలో భారత్‌లో ఎమర్జెన్సీ విధించడంతో ఆ ప్రతిపాదన ముందుకు పోలేదు. 2009లో మరోసారి చిరుతల్ని భారత్‌కు తీసుకొచ్చే ప్రతిపాదనని ఇరాన్‌ ముందు ఉంచినపుడు ఆ దేశం తిరస్కరించింది. దాంతో ఆఫ్రికా నుంచి చిరుతల్ని తేవాలన్న ప్రతిపాదన కొత్తగా వచ్చింది. ఇలా చేస్తే స్థానికంగా ఉండే జంతువుల మనుగడకు ప్రమాదమనీ, అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉండే గ్రామీణులకూ ముప్పు ఉంటుందనీ కొందరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. అన్ని అంశాల్నీ పరిశీలించి చివరకు చిరుతల్ని తెప్పించేందుకు 2020లో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ వ్యవహారాన్ని చూడల్సిన బాధ్యతను ‘నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ’కి అప్పగించింది.

తొమ్మిది చిరుతలు వస్తున్నాయి...

ప్రస్తుతం భూమ్మీద మొత్తం 10 వేల చిరుతలు ఉంటే, వాటిలో ఏడు వేల వరకూ దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాల్లోనే ఉన్నాయి. చిరుతల దిగుమతి కోసం భారత ప్రతిపాదనకు దక్షిణాఫ్రికా, నైజీరియా అంగీకరించాయి. ముందుగా దక్షిణాఫ్రికా నుంచి చిరుతల్ని తరలించాలని నిర్ణయించారు. చిరుతలు పెరగాలంటే ఆహారంతోపాటు సువిశాలమైన గడ్డిప్రాంతాలు ఉండాలి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అక్కణ్నుంచి కొంతమంది నిపుణులు వచ్చి మనదేశంలో ప్రతిపాదిత అటవీ ప్రాంతాల్ని పరిశీలించారు. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌, నౌరేదేహి వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ, గాంధీ సాగర్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ, మాధవ్‌ నేషనల్‌ పార్క్‌లను చూశాక, అన్నింటిలోకీ కునో ఎక్కువ అనుకూలమైనదని తేల్చారు. ఎన్‌టీసీఏ రూ.14 కోట్ల రూపాయల్ని ‘వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’కు కేటాయించి ‘ప్రాజెక్టు చీటా’ బాధ్యతను అప్పగించింది. ఈ ఏడాది నవంబరులో మొదట కునోకి తొమ్మిది(అయిదు మగ, నాలుగు ఆడ) చిరుతల్ని తేనున్నారు. కునోలో ఇప్పటికే సింహాలూ, పులులూ, లెపర్డ్స్‌ ఉన్నాయి. చిరుతలూ వస్తే ప్రపంచంలోనే నాలుగు అతిపెద్ద వన్యమృగాలకు ఆశ్రయమిచ్చే ఏకైక అటవీ ప్రాంతంగా ప్రత్యేకతను కునో సంపాదించనుంది. పర్యటకానికి, జీవ వైవిధ్యానికి ఇది సాయపడే అంశమే అయినా, కొత్త వాతావరణంలో చిరుతలు మనుగడ సాగించగలవా లేదా అన్నదే కోట్ల రూపాయల ప్రశ్న!


జలగ సాయం!

లగ... ఆ పేరు వినగానే ఒళ్లు జలదరిస్తుంది కొందరికి. కానీ ఆస్పత్రుల్లో ఇప్పుడవి చేస్తున్న సేవల గురించి తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. సూక్ష్మ శస్త్రచికిత్సలు(మైక్రో సర్జరీలు) చేసేటప్పుడు ఆస్పత్రులు నిజంగానే జలగ సాయం తీసుకుంటున్నాయి. ఒకప్పుడు శరీరంలోని చెడు రక్తాన్ని తొలగించడానికి జలగల్ని వాడేవారు. ఆధునిక వైద్యంతో అది మరుగునపడిపోయినా ఇప్పుడు మరోరకంగా వైద్యంలో జలగ ప్రాధాన్యం పెరిగింది. తన శరీరం కొనభాగాన సక్షన్‌ ప్యాడ్స్‌ లాంటి నిర్మాణం సాయంతో రక్తం పీల్చాలనుకున్న చోట గట్టిగా అతుక్కుపోతుంది జలగ. అలా అతుక్కున్న వెంటనే మ్యూకస్‌తో ఆ ప్రాంతాన్ని తడిపితే అది ఎనస్థీషియా లాగా పనిచేసి మనకు నొప్పి తెలియకుండా చేస్తుంది. ఆ తర్వాత దవడని లోపలికి గుచ్చి లాలాజలం లాంటి ద్రవాన్ని మనిషి శరీరంలోకి పంపిస్తుంది. ఆ ద్రవానికి బ్లడ్‌థిన్నర్‌(రక్తం గడ్డకట్టకుండా చూసే మందు) లక్షణం ఉంటుంది. ఇదుగో ఈ లక్షణమే దాన్ని ఆస్పత్రులకు ఎంతో అవసరమైన ప్రాణిని చేసింది. ఉదాహరణకు చర్మాన్ని గ్రాఫ్టింగ్‌ చేసే ప్లాస్టిక్‌ సర్జరీ లాంటివాటిల్లోనూ ఇంకా చాలా రకాల మైక్రోసర్జరీల్లోనూ రక్తం గడ్డకట్టకుండా చూడటానికి జలగ సాయం తీసుకుంటున్నారు. ఈ చికిత్సని ‘హిరుడోథెరపీ’ అంటారు. ఇదే ప్రక్రియని మధుమేహం, గుండెజబ్బులతో బాధపడుతున్నవారి చికిత్సల్లోనూ వాడుతున్నారు. ఇలా వైద్యంలో ఉపయోగించే జలగలను పెంచడానికి ఫ్రాన్స్‌, రష్యాలాంటి దేశాల్లో ప్రత్యేక కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలనుంచే అన్ని దేశాలకూ జలగలను సరఫరా చేస్తారు. వీటివల్ల మరో లాభమేంటంటే- వ్యాధులు వ్యాపించవు, గాయం దగ్గర మచ్చలూ పడవు.


ఫస్ట్‌... ఫస్ట్‌..!

మైక్రోవేవ్‌ ఒవెన్‌లో తయారైన మొదటి ఆహారపదార్థం... పాప్‌కార్న్‌. 1945లో అమెరికాకి చెందిన పెర్సీ స్పెన్సర్‌ అనే ఇంజినీర్‌కి మైక్రోవేవ్‌ ఎనర్జీతో పాప్‌కార్న్‌ తయారుచేయవచ్చన్న ఆలోచన రావడంతో... ఒవెన్‌ ఆవిష్కరణకు దారితీసిందట.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న