ఆసక్తికరమైన కథలు - Sunday Magazine
close

ఆసక్తికరమైన కథలు

ఘాటు మిరప చేలకైనా, పంతాలూ రోషాలకైనా పుట్టిల్లు పల్నాడు. ఈ ప్రాంత జీవిత శకలాలను చక్కని కథలుగా మలిచారు రచయిత్రి. పల్నాటి వీరగాథ ఇక్కడి జనజీవనంపై తరతరాలుగా వేసిన గాఢ ముద్రను కథల్లోని పాత్రలూ, వారి మాటల్లో దొర్లే పోలికలూ, సామెతలూ తేటతెల్లం చేస్తాయి. ముఖ్యంగా నాయకురాలు నాగమ్మ వారసులుగా ఆత్మగౌరవం, ముక్కు సూటితనం, ధైర్యసాహసాలున్న స్త్రీలు తారసపడతారు. పిల్లలను బతికించుకోడానికి ప్రాణాలకు తెగించి బాంబులు తీసుకుపోతూ పోలీసులకు పట్టుబడ్డ నాగలక్ష్మి, మగపెత్తనాన్ని ధిక్కరించిన కోటేశ్వరి, బతుకుబాటలో ఎదురుదెబ్బలను ధీమాగా ఎదుర్కొన్న నాగమల్లేశ్రి, కష్టజీవులకు అండగా నిలిచిన రాజ్యలక్ష్మి... మనసుల్లో నిలిచిపోతారు. షేర్‌ ఆటోల జోరు నేపథ్యంలో అల్లిన కథ ‘గుండె గూడు రిక్షా’. పాత్రల పేర్లూ, సంఘటనలూ, యాసా పల్నాడువే అయినప్పటికీ మానవ సంవేదన, స్పందనలు ప్రాంతాలకు అతీతమని ఈ కథలు నిరూపిస్తాయి.

- సీహెచ్‌.వేణు

పల్నాడు కథలు
రచన: సుజాత వేల్పూరి
పేజీలు: 179; వెల: రూ. 225/-
ప్రతులకు: ఫోన్‌- 7093800303


సినిమా వేడుకల పుస్తకం

సినిమాల సమాచారాన్ని అవి జరుపుకున్న శతదినోత్సవాలు, స్వర్ణోత్సవాల్లాంటి వేడుకల నేపథ్యంలో రాసిన పుస్తకం ఇది. 470 సినిమాల అధికారిక విజయోత్సవాలను నమోదు చేశారు. 1981లో ఒక్క జనవరి నెలలోనే ఐదు సినిమాలు శతదినోత్సవాలు జరుపుకుంటే; 1986, 87 రెండేళ్లలో ఏకంగా యాభైకి పైగా చిత్రాలు ఆ ఘనత సాధించడం విశేషం. ఫొటో స్టూడియో నిర్వహించే రఘుపతి వెంకయ్య సినిమాను ప్రదర్శించిన తొలి తెలుగువాడిగా చరిత్రకెక్కిన వైనం, తొలి చిత్రాల కబుర్లు, నంది బహుమతుల సంగతులు తదితర విశేషాలెన్నిటినో పొందుపరిచారు. నాటి పోస్టర్లూ, నటీనటుల చిత్రాలతో సినీ అభిమానులను అలరిస్తుంది.  

-శ్రీ

వెండితెర వైభవం
రచన: ఆకురాతి శేషాచలం
పేజీలు: 624; వెల: రూ. 600/-
ప్రతులకు: ఫోన్‌- 8125482489


ఉత్కంఠభరితం

అందగత్తె అయిన గ్లోరీ మోడలింగ్‌తోనూ చిన్న ఉద్యోగాలతోనూ కాలం గడుపుతుంటుంది. పైలట్‌గా చేసే హేరీ ఆమె జీవితంలోకి అడుగుపెడతాడు. ఉద్యోగం కోల్పోయి, కట్టుకథలతో కాలక్షేపం చేసే అతణ్ణి చూసి అభద్రతకు లోనవుతుంది గ్లోరీ. చిన్నదో పెద్దదో కష్టపడి పని చేసుకోవాలి కానీ చెడ్డ   పనులు చేయకూడదని చెప్పే ఆమె కూడా తప్పనిసరి పరిస్థితుల్లో హేరీ ప్లానులో ఇరుక్కుంటుంది. విమానాన్ని హైజాక్‌ చేయడం ద్వారా వజ్రాలు దొంగిలించి వాటితో జీవితమంతా హాయిగా గడపొచ్చని అతడు వేసిన ప్రణాళిక వారి జీవితాలను ఏ మలుపు తిప్పిందో చెబుతుంది ఈ జేమ్స్‌ హాడ్లీ చేజ్‌ రచన. అనువాదం చదివిస్తుంది.  

- పద్మ

వజ్రాల వేట
అనువాదం: టెంపోరావు
పేజీలు: 192; వెల: రూ.150
ప్రతులకు: ఫోన్‌- 9866115655


కథల వ్యథలు

‘వేరే ప్రాంతాల్లో కరువు పిలిస్తే పలుకుతాది, రాయలసీమలో పిలవకున్నా వస్తాది’ అనే నానుడి అక్కడి తరతరాల దుస్థితికి అద్దం పడుతుంది. ఏడు దశాబ్దాల రాయలసీమ గ్రామీణ జీవనానికీ, పెను విషాదానికీ అద్దం పట్టిన 46 కథల సంకలనమిది. దుర్భిక్షం చేసిన విలయతాండవాన్ని మూడు తరాల ప్రముఖ రచయితలు ప్రతిభావంతంగా కథలుగా మలిచారు. కరువు కల్లోలాన్ని బలంగా చిత్రించిన ‘గంజి కోసరం’ మనసులను కదిలిస్తుంది. సొంతూరును వదిలి వెళ్ళిన కొడుకుల గురించి ఆరాటపడే తండ్రి వేదన ‘ఇక్కడ మేమంతా క్షామం’. ప్రకృతి ప్రకోపానికి తోడు భూస్వామ్యవ్యవస్థ పేద ప్రజలను పెట్టిన క్షోభను ఈ కథలు విస్తృతంగా, లోతుగా చిత్రించాయి. 1921లోనే రాయలసీమ కరువు దుస్థితిని రికార్డు చేసిన చింతా దీక్షితుల ‘సుగాలీ కుటుంబం’ కథను అనుబంధంగా చేర్చారు.  

- వంశీ

రాయలసీమ కరువు కథలు
సంపాదకుడు: డా.ఎం.హరికిషన్‌
పేజీలు: 400; వెల: రూ.300/-
ప్రతులకు: ఫోన్‌: 98490 65280


బుక్‌ షెల్ఫ్‌

కవిగా నా తొలి అడుగులు
రచన: తుమ్మ జనార్దన్‌(జాన్‌)
పేజీలు: 106; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9440710501

అమృతోపనిషత్తులు
రచన: యం.వి. నరసింహారెడ్డి
పేజీలు: 344; వెల: రూ. 200/-
ప్రతులకు: ఫోన్‌- 040 27563236

అభ్యుదయోద్యమ పాట(ఒక విశ్లేషణ)
రచన: వేల్పుల నారాయణ; పేజీలు: 57; వెల: రూ. 50/-
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌

తిత్లీ (సీతాకోకచిలుక); మందారం కథలు
రచన: దారం గంగాధర్‌; పేజీలు: 72; వెల: రూ. 120/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

బాలసాహితీ సూచి; సంపాదకులు: డాక్టర్‌ రావి శారద
పేజీలు: 742; వెల: రూ. 650/-
ప్రతులకు: ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం

యక్షప్రశ్నలు; రచన: కప్పగంతు వెంకట రమణమూర్తి
పేజీలు: 26; వెల: రూ. 35/-; ప్రతులకు: ఫోన్‌- 9246165059


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న