ఆలోచింపజేసే కథలు - Sunday Magazine
close

ఆలోచింపజేసే కథలు

పుస్తకంలోని 22 కథానికల్లో ఎక్కువ భాగం నాలుగు దశాబ్దాల క్రితం రాసినవి. నాటి సమాజ స్థితి గతులకి అద్దం పడుతూనే మానవ సంబంధాలను విశ్లేషించిన విధానం కథల పఠనీయతను పెంచింది. జీతం పెంచమంటే సర్దుకుపొమ్మనే యజమాని పై అధికారులకు తన చేతులమీదుగానే వందల్లో లంచాలు ఇప్పిస్తుంటే ఆ గుమస్తా ఏం చేశాడో చెప్పే కథ ‘సంపాదన’. స్నేహితుడి చేత ‘ఒరేయ్‌’ అని ఆత్మీయంగా పిలిపించుకోవటానికి రాజారావు ఏకంగా గుండెనొప్పి నాటకమే ఆడాల్సి వచ్చిన పరిస్థితి సమాజంలోని అసమానతలనూ అధికారం తాలూకు అహాన్నీ ప్రస్తావిస్తుంది.కరెంటు షాకుకి గేదెని పోగొట్టుకున్న నరసయ్య ‘పరిహారం’ కోసం ఉద్యోగం వదులుకోవాలో, ఉద్యోగం కోసం అన్యాయాన్ని సహించాలో తెలియక తల్లడిల్లుతాడు. ప్రకృతిని విధ్వంసం చేస్తే ఎలా గుణపాఠం చెబుతుందో ‘చేను-చేప’ వివరిస్తుంది. కథావస్తువులన్నీ ఆలోచింపజేస్తాయి.

- పద్మ

పరిహారం మరికొన్ని కథానికలు

రచన: బాలం వెంకట్రావు
పేజీలు: 166; వెల: రూ. 80/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


జ్ఞాపకాల ఖజానా

కథల్లా సాగే ఈ కబుర్లన్నీ రచయిత్రి బాల్య జ్ఞాపకాలు. పాఠకులనీ చేయిపట్టి తీసుకెళ్లి తాను పుట్టి పెరిగిన ప్రాంతాల్నీ కలుసుకున్న మనుషుల్నీ నేర్చుకున్న విషయాల్నీ కళ్లముందు చూపిస్తారు. ఆరుగురు అక్కయ్యలూ ఒక అన్నయ్య తర్వాత పుట్టినందుకు తనని తాను ‘టోకెన్‌ నంబర్‌ ఎనిమిది’ అని చెప్పుకునే రచయిత్రి- అలా పుట్టడం వల్ల ముందువారినుంచి నేర్చుకోవటానికి ఎంతో అవకాశం దొరికిందని సంతోషిస్తారు. అమ్మానాన్నల పెంపకంలో నేర్చుకున్న వ్యక్తిత్వ వికాస పాఠాల సారాన్ని అప్పజెబుతారు. జ్ఞాపకాల్లోంచి నెమ్మదిగా ఆ అనుభవాలు తనని ఎలా తీర్చి దిద్దాయో తెలిపే కథల్లోకి వెళ్తారు. భర్త ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఏం చూసిందీ, ఎవరెవరిని కలిసిందీ, వారినుంచీ ఏమి నేర్చుకున్నదీ... కాస్త హాస్యం మేళవించి చెప్పే తీరు ఆకట్టుకుంటుంది.  

  - సుశీల

టోకెన్‌ నంబర్‌ ఎనిమిది

రచన: వసుధారాణి
పేజీలు: 213; వెల: రూ. 200/-
ప్రతులకు: ఫోన్‌- 9959839446


పీడితుల కథ

స్వాతంత్య్రానికి పూర్వం నాటి పేదల జీవితాలను ఇతివృత్తాలుగా తీసుకుని రచనలు చేసిన ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ ప్రఖ్యాత నవల ‘కూలీ’. పొలమంతా భూస్వామి ఆక్రమించగా తల్లిదండ్రులిద్దరూ కన్నుమూస్తారు. అనాధగా మిగిలిన మునూని మేనమామ పట్నంలో నౌకరుగా పెడతాడు. ఆ పసివాడు పడే తిప్పలూ, డబ్బున్నవాళ్ల కాఠిన్యం... పాఠకులను కంటతడి పెట్టిస్తాయి. కార్మికుడిగా, రిక్షాకూలీగా రకరకాల అవతారాలెత్తిన మునూ చివరికి ఏమయ్యాడన్నదే కథ. నాటి సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ సాగే కథనం, పాత్రల మనస్తత్వాల చిత్రణ... అనువాదంలోనూ సహజంగా ఒదిగి ఆసక్తిగా చదివిస్తాయి.    

  - శ్రీ

కూలీ,

అనువాదం: అవసరాల సూర్యారావు
పేజీలు: 344; వెల: రూ. 325/-
ప్రతులకు: ఫోన్‌- 9866115655


ఆ దృశ్యం వెనక...

మన చుట్టూ జరుగుతున్న అంశాలన్నింటినీ కవితలుగా మలిచాడు కవి! ‘శిలల జున్నుముక్కల్ని పేర్చుకొని/కంకర పుట్నాల్ని నంజుకొని/ రాతిపొడి తూకాల్ని లేపుతుంటం’ అంటూ కొండలపైన జరుగుతున్న దాడిని దుయ్యబడతాడు. సర్కారే భూముల్ని కార్పొరేట్లకి దోచిపెట్టడాన్ని ‘పక్షి ముసుగేసుకుని ఎగిరే లోహ విహంగాలకు/పంటపొలాల్ని ఇంత తెలివైన/మోపుగడ తారని ముందెన్నడూ ఊహించలేదు’ అంటూ అద్భుతమైన ఊహాచిత్రాన్ని ముందుంచుతాడు. ఇన్ని ఉన్నా- కవి గుండెకి అద్దంపట్టేవి స్త్రీ మూర్తుల గురించిన కవితలేనని చెప్పాలి. ముఖ్యంగా ‘అన్నిసార్లూ కష్టాలే మనల్ని కరగదీస్తాయని చెప్పలేం/ దేవతలు గూడా సమయానుసారంగా/మనల్ని ఏడిపించగలుగుతారు’ అంటూ ముగిసే కవితలోని దృశ్యాల్ని కన్నీళ్లతో తప్ప దాటి రాలేం! 

- అంకిత

నీడల దృశ్యం (కవిత్వం)
రచన: ఏనుగు నరసింహారెడ్డి
పేజీలు: 128; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9848787284


బుక్‌ షెల్ఫ్‌

అగ్రరాజ్యంగా భారతదేశం

రచన: ప్రొఫెసర్‌ తెన్నేటి జయరాజు
పేజీలు: 464; వెల: రూ. 350/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు

వినిర్మాణం (తెలంగాణ అస్తిత్వ నిర్మాణ వ్యాసాలు)

రచన: డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి
పేజీలు: 428; వెల: రూ. 400/-
ప్రతులకు: ఫోన్‌-9885682572

శ్రీరమణ ఉవాచ

సంకలనం: దోనెపూడి బాల వెంకటేశ్వర అవధాని, దోనెపూడి రేణుక
పేజీలు: 157; వెల: రూ. 75/-
ప్రతులకు: ఫోన్‌- 9891229917

ఆ 15 రోజులు...

1-15 ఆగస్టు 1947 కీలక పరిణామాల కథనం
రచన: ప్రశాంత్‌ పోల్‌
అనువాదం: విశ్వ సంవాద్‌ కేంద్ర
పేజీలు: 128; వెల: రూ. 140/-
ప్రతులకు: ఫోన్‌- 9121548857

శ్రీ శివ సహస్రనామ స్తోత్రము(సంగ్రహ వ్యాఖ్యతో)

వ్యాఖ్య: చావలి ఆంజనేయ మూర్తి
పేజీలు: 96; వెల: రూ.60/-
ప్రతులకు: ఫోన్‌- 9441170455

వన్నూరమ్మ చరిత్ర

(ఎదురులేని పాలెగత్తె)
రచన: బొమ్మిశెట్టి రమేష్‌
పేజీలు: 163; వెల: రూ. 250/-
ప్రతులకు: ఫోన్‌- 9848373736

కాకర్త్య గుండన (చారిత్రక కల్పన)

రచన: నేతి సూర్యనారాయణ శర్మ
పేజీలు: 257; వెల: రూ. 250/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

స్వాత్మసుఖి(శ్రీ రమణుల ‘ఉన్నది నలువది’పై ఆంగ్ల వ్యాఖ్యానమునకు అనువాదం)

తెలుగు: దోనెపూడి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
పేజీలు: 264; వెల: రూ.120/-
ప్రతులకు: ఫోన్‌- 9891229917

లోపల మనిషి చెప్పిన గొల్ల రామవ్వ కథ; పి.వి.నరసింహారావు కథపై అభిప్రాయ మాలిక
సంకలనం: డా।।పి.చిరంజీవిని కుమారి, దాట్ల దేవదానం రాజు
పేజీలు: 104; వెల: రూ. 120/-
ప్రతులకు: ఫోన్‌- 9848160230

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న