ఈ చెక్క బంగారం కన్నా ఖరీదు..! - Sunday Magazine
close

ఈ చెక్క బంగారం కన్నా ఖరీదు..!

ఏ మొక్క లేదా చెట్టుకైనా తెగులు వస్తే అది ఎందుకూ పనికిరాదు. కానీ ఆ చెట్టుకి ఫంగస్‌ సోకితే మాత్రం అది అద్భుతంగా పరిమళిస్తుంది. అందుకే అది బంగారం, వజ్రం కన్నా అధిక ధర పలుకుతుంది. అదే అగర్‌వుడ్‌ ఉరఫ్‌ జిగురుకలప. ఇంతకీ చెట్టేమిటీ... ఫంగస్సేమిటీ... పరిమళమేంటీ... ఖరీదేంటీ... తెలుసుకోవాలనుకుంటున్నారా..!

గర్‌వుడ్‌... దీనే అగరు, గవురు, ఊద్‌... ఇలా రకరకాలుగా పిలుస్తారు. అగరు అనే సంస్కృత పదం నుంచి వచ్చిందే అగర్‌వుడ్‌. వేల సంవత్సరాల నుంచీ వాడుతోన్న దీన్ని ‘వుడ్‌ ఆఫ్‌ ద గాడ్స్‌’ అనీ అంటారు. నాణ్యమైన అగరుచెక్క నుంచి తీసిన గాఢ తైలం ఖరీదు కిలో 70 లక్షల రూపాయల పైనే. అందుకే దీన్ని ‘ద్రవ బంగారం’ అనీ అంటారు.

ఎందుకంత ధర?

చెక్క అన్నారు కదాని ఇదేదో చెట్టు కాండం అనుకునేరు... ఇదో రకం జిగురు కలప. సాధారణంగా ఏ చెక్కమీదైనా ఫంగస్‌ చేరితే పాడవుతుంది. కానీ అక్వలేరియా జాతి చెట్లకి జంతువులూ పక్షుల వల్ల గాట్లు ఏర్పడినప్పుడు చీమలు దాన్ని తొలిచి ఆహారంగా సేకరించిన ఫియాలొఫొరా పారాసిటికా అనే ఫంగస్‌నుగానీ ఇతర బ్యాక్టీరియానిగానీ లోపలకు తీసుకువెళతాయి. ఆ క్రమంలో చీమల నుంచి కారే లాలాజలం వల్ల చెట్టు దెబ్బతింటుంది. అప్పుడు చెట్టు తనను తాను రక్షించుకునే క్రమంలో జిగురుని ఉత్పత్తిచేస్తుంది. అది లోపల గట్టిపడి చెక్కతో కలిసిపోయి పరిమళిస్తుంది. అదే అగర్‌వుడ్‌... అరుదైన జిగురు కలప. అత్యంత ఖరీదైనది. 

అదే ఫంగస్‌ చేరని కలపకి ఎలాంటి సుగంధం ఉండదు. ఆ ఫంగస్‌ వల్లే చెట్టు కాండంలోని భాగం గోధుమ నుంచి ముదురు గోధుమా నలుపూ రంగుల్లోకి మారుతుంది. ఎంత నల్లగా మారితే అంత నాణ్యమైనది. అలా కావడానికి 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇప్పుడు కృత్రిమ పద్ధతుల్లో ఫంగస్‌ని చొప్పించడంతో ఏడెనిమిదేళ్లలోనే అగర్‌వుడ్‌ వస్తోంది. లోపలకు పురుగు చేరిందన్నదాని గుర్తుగా ఆకులు పసుపురంగులోకి మారడంతోపాటు బెరడు, కాండాలకు పగుళ్లు రావడం, చెట్టుని తడితే బోలు శబ్దం రావడం... ఇలా మొత్తంగా చెట్టు జబ్బుచేసినట్లవుతుంది. అప్పుడు దాన్ని నరికి చెక్కను సేకరిస్తారు.

ఎక్కడెక్కడ?

అక్వలేరియా జాతికి చెందిన ఈ చెట్లకు పుట్టిల్లు మనదేశŸమే. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికీ వీటి పెంపకం ఎక్కువే. అక్కడినుంచే ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. ఈ చెట్లలోని అన్ని భాగాలనూ ఆయుర్వేదంలోనూ వాడతారు. ‘మెటీరియా మెడికా’ గ్రంథాన్ని రచించిన డియోస్కార్డెస్‌ ఈ చెక్కను మరిగించిన కషాయం తాగినా నమిలినా నోరు తాజాగా ఉండడంతోపాటు పొట్ట సమస్యలూ తగ్గుతాయని పేర్కొన్నాడు. ఇక, ఇది లేని పరిమళ పరిశ్రమని ఊహించలేం. ఊద్‌గా పిలిచే దీని తైలం, ఖరీదెక్కువ కావడంతో అన్ని రకాల సెంట్లలోనూ బేస్‌నోట్‌గా మాత్రమే వాడతారు. అచ్చంగా ఊద్‌ తైలంతో చేసిన పరిమళాలూ ఉంటాయి. కానీ ఈ అత్తర్ల వాడకం అరబ్‌ దేశాల్లోనే ఎక్కువ. ఈ వాసనకి మరే వాసనా సాటి రాదన్న కారణంతో అతిథి మర్యాదలో భాగంగానూ ఈ చెక్కముక్కల్ని ధూపంగా వేస్తారట. ముందుగా పొగ మొదలై, ఆ తరవాత ఓ రకమైన తియ్యని వాసన గదంతా పరచుకుని, సాంత్వన కలిగిస్తుందట. ఈ చెట్లు అంతరించి పోతుండటంతో వాటి విలువని గుర్తించి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక, కేరళ, గుజరాత్‌కు చెందిన రైతులు గత కొన్నేళ్లుగా దీనిమీద దృష్టి సారించగా, ఇప్పుడిప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ దీన్ని పెంచుతున్నారు. నిజానికి ఇవి చల్లని వాతావరణంలోనే పెరుగుతాయి. కానీ శ్రీగంధం, మలబారు వేప మధ్యలో వేస్తే మన దగ్గరా పెంచవచ్చట.

సహజంగా సేకరించిన అగర్‌వుడ్‌ అరుదు కాబట్టి అది కిలో 75 లక్షల రూపాయలు వరకూ ఉండేది. ఫంగస్‌ను చొప్పించే ప్రక్రియ రావడంతో నాణ్యతను బట్టి 2 నుంచి రూ.15 లక్షల వరకూ పలుకుతోంది. దీన్నుంచి ఆవిరి పద్ధతిలో తీసిన ఊద్‌ తైలం ధర 60-75 లక్షలు. అందుకే సరైన పద్ధతిలో పెంచితే ఎకరాకు పదేళ్లలో కోటి రూపాయల వరకూ ఆదాయం వస్తుందనీ, అంటే- ఏడాదికి పది లక్షల ఆదాయం పొందవచ్చనేది ఓ అంచనా.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న