ఇది... ఆయమ్మల కాలేజీ..! - Sunday Magazine
close

ఇది... ఆయమ్మల కాలేజీ..!

ఆ కాలేజీలో చదివిన ప్రతి విద్యార్థికీ కోర్సు పూర్తయ్యేసరికి ఆరు ఉద్యోగాలు సిద్ధంగా ఉంటాయి. జీతం ఏడాదికి కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. వసతి, భోజనం... బోనస్‌లు అదనం. ఇంతకీ ఆ ఉద్యోగం ఏంటంటారా... సెలెబ్రిటీలూ బిలియనీర్ల పిల్లలకు ఆయాలుగా ఉండడం. ఆ శిక్షణ ఇచ్చేందుకే ఇంగ్లండ్‌లో ప్రత్యేకంగా ఓ కాలేజీ ఉంది.

బ్రిటన్‌ యువరాణి కేట్‌మిడిల్‌టన్‌- మొదటి బిడ్డ ప్రిన్స్‌ జార్జ్‌ను కన్నప్పుడు బాబు బాధ్యతల్ని తన తల్లికే అప్పగించాలనుకుందట. కానీ కాబోయే యువరాజు ఆలనా పాలనా చూడటం అంటే మామూలు విషయం కాదు. బ్రిటిష్‌ యువరాజుకి ఉండాల్సిన అత్యుత్తమ అర్హతలన్నిటినీ అతడు బాల్యం నుంచే నేర్చుకునేలా చూడాలి. బయటికెళ్లినప్పుడు బాబుకి ఎలాంటి హానీ జరగకుండా కవచంలా ఉండాలి... ఇలాంటి బాధ్యతలూ సవాళ్లూ మరెన్నో... అందుకే, రాజరికపు నియమాలను అనుసరించి కేట్‌ తన ఆలోచనను విరమించుకుని స్పెయిన్‌కు చెందిన మారియాబొరల్లాను ఆయాగా నియమించుకుంది. అలా వచ్చిన మారియా ఆ తర్వాత పుట్టిన షార్లెట్‌, లూయీలను కూడా చూసుకుంటూ మంచి ఆయాగా పేరు తెచ్చుకుంది. రాజ ప్రాసాదంలో ఆయాగా చేరడానికి ఆమెకున్న ప్రధాన అర్హత ఏంటంటే... ఇంగ్లండ్‌లోని నార్లండ్‌ కాలేజీలో చదవడమే.

ఇలాంటి కాలేజీ ఇదొక్కటే...

120ఏళ్ల చరిత్ర ఉన్న నార్లండ్‌ కళాశాల కేవలం ఆయాలకే శిక్షణ ఇస్తుంది. పిల్లలను చూసుకునేందుకు అధికారిక శిక్షణ ఏదీ లేదని గ్రహించిన ఎమిలీ వార్డ్‌ అనే ఆమె దీనికి అంకురార్పణ చేసిందట. ఇది ప్రపంచంలోనే గొప్ప నానీ ట్రెయినింగ్‌ స్కూలు. ఇక్కడ నాలుగేళ్ల కోర్సులో సంపన్నులూ ప్రముఖుల పిల్లలను పెంచేందుకు అవసరమైన పూర్తి శిక్షణను ఇస్తారు. పిల్లల సైకాలజీ గురించీ క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లను ఎలా సముదాయించాలి, వారి అల్లరినీ కోపతాపాలనూ అదుపులో ఉంచడం... లాంటి ఎన్నో విషయాలను నేర్పిస్తారు. ప్రముఖుల పిల్లలంటే బయటికి వెళ్లినప్పుడు మీడియా వాళ్లూ ఇతరులూ చుట్టుముడుతుంటారు. కిడ్నాప్‌ల భయమూ ఉంటుంది. రాజులూ దేశాధ్యక్షుల పిల్లలకైతే టెర్రరిస్టుల దాడుల ప్రమాదమూ ఎక్కువే. ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడటంతోపాటు, వస్తే ఎదుర్కొనేందుకు యుద్ధవిద్యల్లోనూ శిక్షణ తీసుకుంటారు ఆయమ్మలు. సురక్షిత డ్రైవింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, వ్యక్తిగత రక్షణ, ప్రాథమిక చికిత్స, వంట, పార్టీల నిర్వహణ, అలంకరణ... ఇలా చెప్పుకుంటూ పోవాలేగానీ నార్లండ్‌ విద్యార్థులు ఎన్నో విషయాలు ప్రయోగాత్మకంగా నేర్చుకుంటారు. అన్నట్లూ నార్లండ్‌ ఆయాలు బహుభాషా కోవిదులు కూడా. మారియాకు ఆరు భాషలు తెలుసట. కాబోయే బ్రిటన్‌ యువరాజులూ, యువరాణికి ఆ భాషలనూ నేర్పిస్తోందట. నార్లండ్‌లో శిక్షణ ఇంత గొప్పగా ఉంటుంది కాబట్టే ప్రతి విద్యార్థికీ చదువు పూర్తయ్యేసరికి కనీసం ఆరు ఉద్యోగావకాశాలు సిద్ధంగా ఉంటాయట. ఏడాదికి రూ.కోటి నుంచి రెండు కోట్ల జీతం ఇవ్వడానికైనా బిలియనీర్లు వెనకాడరట. భోజన వసతి సౌకర్యాలూ ఉచితమే. బోనస్‌లూ ఖరీదైన కానుకలతో పాటు, విలాసవంతమైన
పర్యటనలకూ తీసుకెళ్తారు.

అడ్మిషన్‌ దొరకడం కష్టమే

నార్లండ్‌ కాలేజీలో చదువు కూడా ఖరీదైనదేనండోయ్‌. ఏడాదికి వసతి లేకుండా కేవలం ఫీజే 20వేల డాలర్లు (సుమారు రూ.15లక్షలు). అడ్మిషన్‌ దొరకడమూ కష్టమే. ఏటా కేవలం 250 మంది మాత్రమే చదివే అవకాశం ఉంటుంది మరి. ఇక, పసి పిల్లలను చూసుకోవడం అంటే సహనం, ప్రేమ, బాధ్యతతో కూడిన వ్యవహారం. ప్రముఖుల ఇళ్లలో ఉండాలంటే నిజాయతీ, పద్ధతి, సృజన కూడా ప్రధానమే. అందుకే, ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి, ఈ అర్హతలు ఉంటేనే అడ్మిషన్‌ ఇస్తారు. ఇంగ్లండ్‌తో పాటు, అమెరికా, చైనా, అరబ్బు దేశాల ప్రముఖులూ రాజ కుటుంబాలూ హాలీవుడ్‌ సెలెబ్రిటీలూ ఈ ఆయాలను ఎక్కువగా నియమించుకుంటున్నారు.

‘కరీనా కపూర్‌ కొడుకు తైమూర్‌ అలీఖాన్‌ని చూసుకుంటున్న ఆయమ్మకు నెలకు రూ.లక్షన్నర జీతమట’... ఇదే మాట కరీనాని అడిగితే పిల్లలు సంతోషంగా, భద్రంగా ఉండడం కంటే ఎక్కువేముందీ... అందట. మామూలు ఆయాకే లక్షల్లో ఇస్తున్నారంటే అన్ని రకాలుగా శిక్షణ తీసుకున్న నార్లండ్‌ ఆయాలకు కోట్లల్లో జీతం ఇవ్వడంలో ఆశ్చర్యం ఏముందీ...


రోల్స్‌ రాయిస్‌... అందరికి అమ్మరు

నిజమే... ‘మాకు డబ్బు కన్నా కారే ముఖ్యం’ అనే ప్రమాణాన్ని మొదటినుంచీ పాటిస్తున్న రోల్స్‌రాయిస్‌ సంస్థ అడిగిన వాళ్లందరికీ తమ కారును అమ్మదు. కారును బుక్‌చేసుకున్న కస్టమరు వ్యక్తిగత ప్రొఫైల్‌, సమాజంలో అతని స్థాయి, దాన్ని నడపబోయే డ్రైవరు వివరాలు... ఇలా అన్నింటినీ చూస్తుంది. అందుకే ఈ కారు కొనాలంటే డబ్బుతోపాటూ అదృష్టం కూడా ఉండాలని అంటారు. సాధారణంగా కార్లన్నీ కొన్ని ప్రాథమిక రంగులూ, వాటి షేడ్లలోనే ఉంటాయి. కానీ రోల్స్‌ రాయిస్‌ మాత్రం 44,000 షేడ్స్‌లో వస్తుంది. అంతేనా, ఎవరైనా వినియోగదారుడు ఒక రంగును వేయించుకుంటే దాన్ని అతని పేరుమీద రిజిస్టర్‌ చేస్తుంది. ఒకవేళ ఇంకెవరైనా ఆ రంగును వేయించుకోవాలని ఆశపడితే రిజిస్టర్‌ అయిన కారు ఓనరు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అనుమతి లభించాక ఏదో ఒక షోరూంలో రంగును మార్పించుకోవచ్చనుకుంటే పొరపాటే. సదరు వినియోగదారుడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. సంస్థే తమ ఉద్యోగిని వాళ్లుండే చోటుకు పంపి రంగు వేయిస్తుంది. ఇక, ఈ కారును బాగా గమనిస్తే... దీనిపైన చాలా సన్నని గీత ఉంటుంది. సంస్థ ఆ గీత గీయాలని నిర్ణయించుకున్నప్పటినుంచీ మార్క్‌ కోర్ట్‌ అనే వ్యక్తే ఆ పని చేస్తున్నాడట. ఒకప్పుడు వీధి గోడలపైన బొమ్మలు వేసిన మార్క్‌కోట్‌ రోల్స్‌రాయిస్‌ కంపెనీలో చేరాక ఆ గీత గీయడం తప్ప మరో పని చేయడట. పైగా కారు మొత్తం తయారయ్యాక మాత్రమే ఆ గీతను గీస్తారు కాబట్టి మార్క్‌ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడట. ఇందుకోసం అతను ఉడుత వెంట్రుకలతో స్వయంగా బ్రష్‌ను తయారుచేసుకుని మరీ వాడతాడు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే రోల్స్‌రాయిస్‌ అంటే... అంత క్రేజ్‌ మరి!


క్లబ్‌హౌస్‌... మాటల అడ్డా!

ఇన్‌స్టాలో ఫొటోలు చూసిచూసి, వాట్సాప్‌లో మెసేజ్‌లు చదివిచదివి బోర్‌కొట్టేసిందా? ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌లలో వీడియోలూ నచ్చట్లేదా?  అయితే ఆడియో మాత్రమే ఉండే కొత్త సోషల్‌ మీడియా వేదిక ‘క్లబ్‌హౌస్‌’ మీ ఫోన్లో ఉండాల్సిందే!

రోనా కారణంగా గతేడాది మార్చి నుంచి ‘ఎక్కడివాళ్లు అక్కడే గప్‌చుప్‌’ అన్నట్టున్నాయి పరిస్థితులు. మనిషి సంఘజీవి. తినకుండా అయినా ఓ పూట ఉండగలడేమోగానీ, మాట్లాడకుండా ఓ గంట ఉండలేడు. సరిగ్గా అప్పుడే ‘మాట్లాడుకుందాం రండి’ అంటూ... ఓ కొత్త అవకాశం కల్పించింది క్లబ్‌హౌస్‌ ఆప్‌. మిగతా సోషల్‌ మీడియా వేదికల మాదిరిగా ఇక్కడ రాతలు ఉండవు, సెల్ఫీ ఫోజులకీ, వీడియోల్లో తైతక్కలకూ చోటు లేదు. ‘ఇవేమీ లేకుండా మరెలా’ అంటే వర్చువల్‌గా అంతా ఒకచోట చేరి మాట్లాడుకోవడమే! పాల్‌ డేవిసన్‌, రోహన్‌ సేథ్‌ క్లబ్‌హౌస్‌ని తీసుకొచ్చారు. అమెరికాలో ఐఓఎస్‌మీద ప్రారంభమైన ఈ ఆప్‌ తర్వాత ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లోనూ వచ్చింది. మొదట్లో దీన్ని వినియోగించాలంటే ప్రత్యేకమైన ఆహ్వానం ఉండాలన్న నియమం ఉండేది. ఒక్కో సభ్యుడూ గరిష్ఠంగా అయిదుగురికి ఆహ్వానం పంపే అవకాశం ఉండేది. సహజంగానే మిగతావారికి ఆసక్తి పెరుగుతుంది కదా. దాంతో క్లబ్‌హౌస్‌ సభ్యత్వానికి మంచి డిమాండ్‌ ఉండేది. ఇప్పుడు ఆ నియమం లేదు.

ఎలా పనిచేస్తుందంటే...

ప్లేస్టోర్‌, ఆప్‌స్టోర్‌నుంచి క్లబ్‌హౌస్‌ ఆప్‌ని డౌన్‌లౌడ్‌ చేసుకున్నాక వివరాలన్నీ నమోదు చేసుకోవాలి. వాటిలో ఇష్టాల్ని తెలపాలి. తర్వాత వినియోగదారులు ఆ ఆప్‌లో మోడరేటర్‌, స్పీకర్‌, లిజనర్‌... పాత్రలు పోషించాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో గ్రూప్‌లు ఉన్నట్టు ఇక్కడ రూమ్స్‌ ఉంటాయి. ఆప్‌లో ఉన్నవారెవరైనా ఈ రూమ్స్‌ ఏర్పాటుచేయొచ్చు. ప్రతి రూమ్‌కీ ప్రత్యేకంగా పేరు ఉంటుంది. దాన్నిబట్టి అందులో ఏ విషయాలు చర్చిస్తారో అర్థమవుతుంది. సంగీతం, సినిమా, సాహిత్యం, వర్తమాన అంశాలు, క్రీడలు, గార్డెనింగ్‌, అంతరిక్షం... ఇలా  వివిధ అంశాలపైన లైవ్‌లో మాట్లాడతారు. ఏదైనా అంశం గురించి ఆప్‌లో సర్చ్‌ చేసినపుడు ఈ రూమ్స్‌ వివరాలు సర్చ్‌ రిజల్ట్స్‌లో కనిపిస్తాయి. నచ్చిన వాటిని ఎంపికచేసుకుని అందులోకి వెళ్లి వినొచ్చు. ఒక తరగతి గదిలో, కాన్ఫ్‌రెన్స్‌ హాల్లో కొంతమంది కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది ఇక్కడ వాతావరణం. కొన్ని రూమ్స్‌లో ఒకరే ప్రసంగిస్తే మిగతావారు వింటుంటారు. కొన్నింట్లో బృంద చర్చలు జరుగుతుంటాయి. ఈ ప్రసంగాలూ, చర్చలన్నీ లైవ్‌లోనే జరుగుతాయి. రూమ్‌ నిర్వహణ హక్కులు దాని సృష్టికర్త అయిన మోడరేటర్‌కు ఉంటాయి. రూమ్‌లోకి వెళ్లినవారు ఏదైనా చెప్పాలనుకుంటే హ్యాండ్‌ రైజ్‌ సింబల్‌ చూపించాలి. అయితే, అవకాశం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు రూమ్‌ నిర్వాహకుడికి ఉంటుంది. ఒక్కో రూమ్‌లో గరిష్ఠంగా ఎనిమిదివేల మంది ఒకేసారి భాగం కావొచ్చు. ఒకప్పుడు ఈ సంఖ్య చేరడం కష్టమనుకునేవారు. కానీ ఇప్పుడు ‘రూమ్‌లో ఖాళీలేదు’ అన్న మెసేజ్‌ వస్తోంది. ఏ రూమ్‌లోనైనా నచ్చినంత సేపు ఉండొచ్చు. నచ్చకపోతే బైబై చెప్పేసి ఇంకో రూమ్‌కి వెళ్లొచ్చు.

నేటితరం వినడానికంటే మాట్లాడ్డానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి పాడ్‌కాస్ట్‌లే నిదర్శనం. కేవలం ఆడియో మాత్రమే ఉండేట్టు ఫేస్‌బుక్‌లోనే ‘ఆడియో రూమ్స్‌’ వచ్చాయి. ట్విటర్‌ మాత్రం ప్రత్యేకంగా స్పేసెస్‌ ఆప్‌ తెచ్చింది. సూటిగా సుత్తిలేకుండా, కళ్లకు భారం లేకుండా ఉండటంతో ఈ విభాగానికి డిమాండ్‌ పెరుగుతోంది. యువతతోపాటు వివిధ రంగాల్లోని ప్రముఖులు ఇప్పటికే క్లబ్‌హౌస్‌లో రూమ్స్‌ తెరిచి అభిప్రాయాల్నీ, పాఠాల్నీ చెబుతున్నారు. ఇక్కడ కొత్త ఇన్‌ఫ్లుయర్స్‌ పుడుతున్నారు. ఇది గమనించి ఇతర సోషల్‌ మీడియా వేదికల నుంచీ ఇన్‌ఫ్లుయర్లూ, సెలెబ్రిటీలూ ఇక్కడకు వస్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లో రూమ్‌ నిర్వాహకులు డబ్బులు చెల్లించే వారికే ప్రత్యేక లింకుద్వారా రూమ్‌లోకి వచ్చేలా అనుమతి ఇస్తూ ఆదాయం సంపాదిస్తున్నారు. గాయకులూ, విషయ నిపుణులకు ఇక్కడ మంచి డిమాండ్‌ ఉంటోంది.

డీజే... అంత్యాక్షరి!

క్లబ్‌హౌస్‌ భారత్‌కు వచ్చాక డౌన్‌లోడ్లు బాగా పెరిగాయి. ప్రస్తుతం క్లబ్‌హౌస్‌కి భారత్‌నుంచే సగంకంటే ఎక్కువ డౌన్‌లోడ్లు వస్తున్నాయి. మన దగ్గర స్థానిక భాషల్లో నిర్వహించే రూమ్‌లు బాగా పెరిగాయి. కొందరైతే రాత్రింబవళ్లు అదే పనిమీద మాట్లాడుతూ, వింటూ ఉండిపోతున్నారు. ఇక్కడే డీజే నైట్‌లూ, అంత్యాక్షరి లాంటి కార్యక్రమాలూ జరుగుతున్నాయి. ఇంకొందరు దీన్నో డేటింగ్‌ ఆప్‌గానూ ఉపయోగిస్తున్నారు. కొందరైతే ఇక్కడ బాతాఖానీ కొడుతున్నారు. విశ్లేషకులు చెప్పేదేంటంటే... చాలామంది ఇక్కడ ఒక విషయం కోసమని వచ్చి అనవసర విషయాల్లో తలదూరుస్తూ సమయం వృథా చేస్తున్నారని. మీరు అలా కావద్దు సుమా!


మీకు తెలుసా!

క్రీ.పూ.490లో పర్షియన్ల మీద యుద్ధంలో తాము గెలిచామని చెప్పడానికి ఫిలిప్పిడెస్‌ అనే గ్రీకు వార్తాహరుడు ఏథెన్స్‌ నుంచి మారథాన్‌ నగరానికి 40కి.మీ. దూరం ఎక్కడా ఆగకుండా పరుగెత్తి వార్త అందించగానే కుప్పకూలి ప్రాణం వదిలాడట. అతడి గౌరవార్థం లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నింగ్‌కి మారథాన్‌ అని పేరు పెట్టారు.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న