కాలేజీ చూడనివాళ్లే కానీ.. - Sunday Magazine
close

కాలేజీ చూడనివాళ్లే కానీ..

మన విద్యాసంస్థల్లో ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం... ‘ఇన్నోవేషన్‌’. విద్య అన్నది కేవలం బట్టీపట్టి పరీక్షలు రాయడానికి మాత్రమే కాదు... సరికొత్త వస్తువులు కనిపెట్టడానికి కూడా అని నేటి మేధావివర్గం భావిస్తోంది. కానీ ఈ ముగ్గురికీ అలాంటి సంగతులేవీ తెలియవు... అసలు వీళ్లు ఏ కాలేజీ గడపా తొక్కనివాళ్లు. అయితేనేం, సామాన్యుల కోసం చక్కటి ఆవిష్కరణల్ని రూపొందిస్తున్నారు. ఇంటాబయటా మంచి గుర్తింపు సాధిస్తున్నారు...


గంధం కోసం..!

వేసవి వస్తే చాలు మన ఆలయాల్లోని స్వామివార్లకి చందన సేవ చేస్తారు. దేవుని సేవే అయినా చాలా శ్రమతో కూడిన పని ఇది. ఇద్దరు ముగ్గురు కలిసి రోజంతా గంధపు చెక్కల్ని అరగదీస్తే కానీ తర్వాతి రోజు స్వామివారికి చాలినంత చందనలేపనం అందదు. గుడిలో వీటిని తయారుచేసేవారి శ్రమని చూశాకే వాళ్ల కష్టం తీర్చడం కోసం ఓ యంత్రం కనిపెట్టాలనుకున్నాడు సుభాష్‌ జపత్‌. మహరాష్ట్రలోని జలగావ్‌ ప్రాంతం ఆయనది. ఏడో తరగతి తర్వాత చదువు మానేసి మావయ్య దగ్గర లారీల రిపేరింగ్‌ నేర్చుకుని సొంత వర్క్‌షాపు పెట్టాడు. పనిలోపనిగా గ్రామీణుల కోసం స్థానికంగా దొరికే వస్తువులతోనే వాళ్లకి అవసరమైన రకరకాల ఉపకరణాలు తయారుచేసి ఇస్తుండే వాడు. ఆ క్రమంలో ఆయన రైతుల కోసం చేసిన సరికొత్త పిచికారీ యంత్రానికి నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌(ఎన్‌ఐఎఫ్‌) అవార్డూ దక్కింది. ఆ నేపథ్యంతోనే ఆలయాల కోసం గంధం తీసే యంత్రాల ఆవిష్కరణకి నడుంబిగించాడు. దక్షిణభారతదేశంలో ఇడ్లీపిండి తయారీకి వాడే వెట్‌గ్రైండర్‌లని ఆధారంగా చేసుకుని... నెలరోజుల్లోనే గంధం యంత్రాన్ని ఆవిష్కరించాడు! మొదట స్థానిక ఆలయాలే వీటిని తీసుకున్నాయి. తర్వాత్తర్వాత మహారాష్ట్రలోని పండరీపురం, గుజరాత్‌లోని ద్వారక, తమిళనాడులోని పలు వైష్ణవాలయాలు వీటిని కొనడం మొదలుపెట్టాయి. దాంతో సుభాష్‌ ఆర్థిక పరిస్థితీ మెరుగైంది. ఆ ఉత్సాహంతోనే ఒకప్పుడు తాను కనిపెట్టిన యంత్రాలని ఇకపైన భారీ ఎత్తున చేసి గ్రామీణులకి అందిస్తానంటున్నాడు... ఇందుకోసమే, తన 75 ఏళ్ల వయసులో- ‘ఇన్వెంటో ప్రొసెసింగ్‌ టూల్స్‌’ అనే సంస్థనీ ప్రారంభించాడు.


తక్కువ ధరకే ఎయిర్‌ ప్యూరిఫయర్‌!

తౌటి భూమయ్య చారిది నిజామాబాద్‌ పట్టణం. పదో తరగతితోనే చదువు మానేసినా ఆయనకి సైన్స్‌పైన ఆసక్తి తగ్గలేదు! తన కులవృత్తయిన బంగారు నగల పనిచేస్తూనే సైన్స్‌ మ్యాగజైన్‌లు తెప్పించుకుని చదువుతుండేవాడు. చుట్టూ ఉన్న వస్తువులతోనే ప్రయోగాలేవో చేస్తుండేవాడు. ఫలితంగా పదేళ్లకిందట సరికొత్త పవన విద్యుత్తు పంఖా(విండ్‌మిల్‌)ని కనిపెట్టాడు. సాధారణంగా ఓ పెద్ద టేబుల్‌ ఫ్యాన్‌లా పనిచేసే పవన విద్యుత్తు పంఖాలు... కనీసం అరవై కిలోమీటర్ల వేగంతో గాలివీస్తేకానీ తిరగవు. కానీ భూమయ్య కనిపెట్టిన పంఖా తిరగేసిన సీలింగ్‌ ఫ్యాన్‌లా పనిచేస్తూ ఆరేడు కిలోమీటర్ల గాలివేగమున్నా విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. అంటే, అది పర్వత ప్రాంతాల్లోనే కాకుండా ఎక్కడైనా పనిచేస్తుందన్న మాట. ఈ ఆవిష్కరణ కోసం ఆయనకి రాష్ట్రపతి అవార్డు కూడా దక్కింది. ఆ ప్రోత్సాహంతో అతితక్కువ ధరతో ఎయిర్‌ప్యూరిఫయర్‌ని కనిపెట్టాడు భూమయ్య. మామూలు ప్యూరిఫయర్‌లు చుట్టూ ఉన్న కాలుష్యాన్ని పీల్చుకుని దాన్ని ఓ ప్రత్యేక వస్త్రంతో వడకడితే... భూమయ్య కనిపెట్టిన ప్యూరిఫయర్‌ నీటి సాయంతో కాలుష్యకారకాలని వడపోస్తుంది. మన చుట్టూ ఉన్న సాధారణ వస్తువులతోనే తయారుచేస్తున్నందువల్ల భూమయ్య రెండున్నరవేలకే దీన్ని ఇస్తామంటున్నాడు (మార్కెట్లో ఉన్న వాటి ధర కనీసం పాతికవేలు ఉంటుంది). భూమయ్య ఎయిర్‌ ప్యూరిఫయర్‌ తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ గుర్తింపుని  కూడా అందుకుంది!


పాడైన బైకుతో...

పొలంలో బైకు తోలుతున్నాడేమిటా... అనిపిస్తుంది దూరం నుంచి ప్రతాప్‌ మడి దున్నడం చూసినవాళ్లకి. దగ్గరకెళితేకానీ తెలియదు అది బైకు విడిభాగాలతో చేసిన చిన్నసైజు ట్రాక్టర్‌ అని. ఒడిశా అంగుల్‌ జిల్లా చెండిపడా బ్లాక్‌లోని పుట్టగడ కుగ్రామం ప్రతాప్‌ది. చిన్నప్పుడే సాగు వైపు వచ్చి చదువుకి స్వస్తి చెప్పాడు. పొలంలో ఆరుగాలం శ్రమిస్తేకానీ ఏడాదికి సరిపడా ఆహారధాన్యం దక్కని బీద రైతు కుటుంబం అతనిది. మడి దున్నడానికి ఎద్దుల్నీ అద్దెకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఓ స్థాయిలో ఆ ఖర్చూ భారమై ఏం చేయాలో పాలుపోని సందర్భంలోనే అతనికి బైకు-ట్రాక్టర్‌ ఐడియా వచ్చింది. ఓ మెకానిక్‌ దగ్గర బైకు ముందుభాగం, ఇంజిన్‌లని కొని వాటికి మరికొన్ని పరికరాలని జోడించి... ఈ ట్రాక్టర్‌ని కనిపెట్టాడు. ఈ సరికొత్త ట్రాక్టర్‌ తొలి ఏరువాకలోనే పెద్ద విజయం సాధించడం మాత్రమే కాదు... పుట్టగడలోని పెద్ద రైతుల దృష్టినీ ఆకర్షించింది. దాంతో, వాళ్లకీ ఇలాంటి ట్రాక్టర్‌లని చేసివ్వడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు కేవలం వ్యవసాయంపైన మాత్రమే ఆధారపడిన ప్రతాప్‌ కుటుంబం... ఇప్పుడు ట్రాక్టర్‌లతో కాస్తోకూస్తో ఆదాయాన్ని కళ్లచూస్తోంది. ప్రతాప్‌ గురించి విన్న చెండిపడా బ్లాక్‌ అధికారులూ... అతని ఆవిష్కరణని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళతామంటూ ముందుకొస్తున్నారు!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న