ఈ స్వామికి సొరకాయలే ముడుపులు! - Sunday Magazine
close

ఈ స్వామికి సొరకాయలే ముడుపులు!

సాధారణంగా ఆలయాల్లో రాముడూ, కృష్ణుడూ, వేంకటేశ్వరస్వామీ, శివుడూ... తదితర దేవుళ్లు దర్శనమిస్తే ఈ క్షేత్రంలో ఓ యోగి సొరకాయల స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఈ స్వామికి సొరకాయల్ని ముడుపులుగా చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరతాయనేది భక్తుల నమ్మకం. శారీరక-మానసిక అనారోగ్యాలను నయం చేసే ఈ స్వామి ఇక్కడ జీవసమాధి అయినట్లు చెబుతారు.

సొరకాయల స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్‌ తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన పుత్తూరులోని నారాయణవనంలో ఉంది. ఊరూ, పేరూ తెలియని ఓ స్వామి ఈ ప్రాంతంలో సంచరించి భక్తుల అనారోగ్యాలను నయం చేసే ధన్వంతరిగా గుర్తింపు పొందాడనీ... ఆయనే సొరకాయల స్వామి అనీ చెబుతారు. సుమారు 300 సంవత్సరాలకు పైగా జీవించిన ఈ స్వామి అభాగ్యులకు అండగా, ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా నిలిచాడని అంటారు. ఈ యోగి కాలధర్మం చెంది 119 ఏళ్లు గడుస్తున్నా భక్తులు ఇప్పటికీ ఈ స్వామిని అంతే శ్రద్ధగా పూజించడం విశేషం. తన వెంట ఎప్పుడూ సొరకాయను పెట్టుకుని తిరగడం, సొరకాయ బుర్రతోనే భిక్షాటన చేయడం వల్ల ఆ స్వామికి ఈ పేరు వచ్చిందట.

స్థలపురాణం
పద్మావతీ దేవి వేంకటేశ్వరస్వామికి కల్యాణం అయిన ప్రాంతం నారాయణవనం. సుమారు 1875లో సొరకాయల స్వామి తిరుమలకు వెళ్తూ ఈ నారాయణవనానికి వచ్చి ఇక్కడే ఉండిపోయాడని స్థానికులు చెబుతుంటారు. అయితే ఎక్కడి నుంచి వచ్చాడనేది ఎవరికీ తెలియదు. సొరకాయను భుజానికి తగిలించుకుని, వెంట రెండు శునకాలతో సొరకాయ డొప్పను పాత్రగా చేసుకుని భిక్షాటన చేస్తూనే ఆ ఊరిప్రజలకు ఉండే అనారోగ్యాలనూ పసుపు, వేప, మరికొన్ని ఔషధాలతోనూ నయం చేసేవాడట. ఒకప్పుడు ఈ ప్రాంతంలో చేతబడులూ, క్షుద్రపూజలూ జరిగేవనీ.. ఈ స్వామి అవి జరగకుండా ఉండేందుకు ఊరివాళ్లలో చైతన్యం తెచ్చాడనీ అంటారు. అందుకే మానసిక రుగ్మతలు ఉన్నవారిని ఇప్పటికీ ఈ ఆలయానికి తీసుకొస్తారట. అలా తిరుగుతూనే 1903 శ్రావణమాసం శుద్ధ పంచమి లేదా గరుడపంచమి రోజున జీవసమాధి అయ్యాడట. తరువాత ఊరివాళ్లే జీవసమాధి అయిన చోట ఆలయం నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు.

ఆరని ధుని
సొరకాయస్వామిని ఆరాధ్యదైవంగా కొలిచే నారాయణవనం చుట్టుపక్కల ప్రజలు.. తమకు పుట్టే పిల్లలకు స్వామి పేరు పెట్టుకుంటారు. స్వామి జీవసమాధి అయిన రోజునుంచీ నేటి వరకూ ఆ సమాధి ఎదురుగా అగ్నిగుండం అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉండటం విశేషం. ఇందుకు అవసరమైన సామగ్రిని భక్తులే ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తారు. ఈ ధుని నుంచి వచ్చే విభూతిని రోగాలను నయం చేసే ఔషధంలా వాడతారు భక్తులు. అదేవిధంగా దుష్టశక్తులు ఆవహించిన వారినీ, మానసిక రుగ్మతలున్నవారినీ అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ ఆలయంలో రాత్రి 10-12 గంటల సమయంలో జరిగే బుట్ట పూజలో కూర్చోబెట్టినా... ఆ రెండు రోజులు ఆలయంలో నిద్రించినా నయం అవుతుందని భక్తుల నమ్మకం. ఆ సమయాల్లో ఈ పూజలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌తోపాటూ తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో స్వామి విగ్రహంతోపాటూ ఆయన దివ్య సమాధినీ దర్శించుకోవచ్చు. అదేవిధంగా ఆ స్వామి ఉపయోగించిన కర్ర, సొరకాయ బుర్ర, పాదరక్షలూ, వస్త్రాలూ, ఇత్తడి బిందెలూ ఈ ఆలయంలోనే భక్తుల సందర్శనార్థం ఉంచారు. 

ఎలా చేరుకోవచ్చు
తిరుపతికి సరిగ్గా 40 కి.మీ. దూరంలో ఉంటుందీ ఆలయం. తిరుపతి వరకూ రైల్లో లేదా విమానంలో చేరుకుంటే... అక్కడి నుంచి బస్సులూ ప్రైవేటు వాహనాల ద్వారా పుత్తూరుకు వెళ్లాలి. పుత్తూరు నుంచి నారాయణవనంలోని ఆలయం అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

- జి.మాణిక్యం, న్యూస్‌టుడే నారాయణవనం

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న