అనాథల ‘పుణ్యక్షేత్రం’..! - Sunday Magazine
close

అనాథల ‘పుణ్యక్షేత్రం’..!

ఒంటి మీద స్పృహ ఉండదు. ఆకలిదప్పులూ అర్థం కావు. స్థిమితం లేని మనసో... సత్తువ లేని శరీరమో... వారిని చేతకానివారిని చేసి రోడ్డున పడేస్తే చెత్తకుప్పల దగ్గర దొరికిందే తింటూ చీకిపోయిన దుస్తుల్లో తిరిగే ఆ అభాగ్యులను చీదరించుకుంటుంది సమాజం. కానీ ఒకప్పుడు వారూ ఏ ఇంట్లోనో కలల పంటలే అయ్యుంటారు... అమ్మఒడిలో ఆడుకునే ఉంటారు. నాన్న చేయి పట్టుకుని నడిచే ఉంటారు. విధి వక్రించి నేడు వీధిపాలైన ఆ అమాయక ప్రాణుల్ని ఆదరించి అక్కున చేర్చుకుంటోంది ఓ అనాథాశ్రమం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఉన్న ఈ ఆశ్రమాన్ని నెలకొల్పింది శంకర్‌ అయితే, అతనికి అన్నివిధాలా అండగా నిలుస్తున్నారు ఎందరో మనసున్న మంచి మనుషులు!

పాతికేళ్ల క్రితం..పెదనాన్న కొడుకు... దాదాపు తన ఈడు వాడే... ఆడుకుందామని దగ్గరికి వెళ్తే అందకుండా పరుగెత్తాడు. ఎటువెళ్లాడా అని జాగ్రత్తగా చూసుకుంటూ వీధిలోకి వెళ్లాడు శంకర్‌. అక్కడ వేరే పిల్లలంతా తన అన్నని రాళ్లేసి కొట్టడం, పిచ్చోడంటూ వెక్కిరించడం చూసి పదేళ్ల శంకర్‌ మనసు చివుక్కుమంది. పరుగెత్తుకెళ్లి అతడిని చెయ్యి పట్టుకుని ఇంట్లోకి లాక్కొచ్చాడు. ఇవాళంటే తను ఉన్నాడు కాబట్టి వారి నుంచి అన్నని కాపాడగలిగాడు. మంచీ చెడూ ఏమీ తెలియని ఆ అమాయకుడిని రోజూ ఎవరు కాపాడతారు... తన అమ్మానాన్నల లాగే పెద్దమ్మా పెదనాన్నలు కూడా పగలంతా పనులకు వెళ్లిపోతారు కదా, మరెలా...

చిన్నారి శంకర్‌ మనసులో ఏ మూలో గూడుకట్టుకున్న ఆ భయం కొన్నేళ్లకి నిజమే అయింది. ఇంట్లోవారు ఏమరుపాటుగా ఉన్నప్పుడు బయటకు వెళ్లిపోయిన సోదరుడు ఓ ప్రమాదంలో ప్రాణం కోల్పోయిన విషయం తెలిసి శంకర్‌ కదిలిపోయాడు. అలాంటివాళ్లని కనిపెట్టుకుని ఉండటానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన మరింత బలంగా మనసులో నాటుకుపోయింది.

నాలుగేళ్ల క్రితం...

విదేశాల నుంచి విశిష్ట అతిథులు కొందరు హైదరాబాద్‌ నగరంలో ఓ సమావేశానికి వస్తున్నారు. వారికి ఆహ్వానం పలకడానికి అందంగా అలంకరించిన నగర వీధుల్లో అడుక్కునేవాళ్లూ అభాగ్యులూ కన్పిస్తే బాగుండదు. అందుకే కనిపించిన వారిని కనిపించినట్లు వ్యాన్‌లో ఎక్కించి నగరం బయటకు తరలించుకెళ్లారు అధికారులు. ఆ పనిలో అధికారులకు తోడుగా నిలిచి ఆ అభాగ్యులకు నీడనిచ్చే పనిని భుజాన వేసుకున్నాడు శంకర్‌. చిన్న చిన్న పిల్లలు, ముసలివాళ్లు... రకరకాల కారణాలతో రోడ్డున పడి బిచ్చమెత్తుకు బతుకుతున్న ఎందరికో కౌన్సెలింగ్‌ ఇచ్చి తిరిగి క్షేమంగా కుటుంబాలకు అప్పజెప్పాడు. కానీ... ఎవరూ లేనివాళ్లూ, ఉన్నా చెప్పలేని బుద్ధిమాంద్యులూ, వెళ్లడానికి ఇష్టపడని శారీరక వికలాంగులూ... వారందరి సంగతీ..?

వారిని తాను నిర్వహిస్తున్న ‘అనాథాశ్రమం’లో ఉంచుకున్నాడు. ఒక్క హైదరాబాద్‌ నగరం నుంచే కాదు, ఓసారి విజయవాడ నుంచీ కూడా రెండొందల మందిని పంపించారట అధికారులు.ఇక, బస్టాండ్‌లో కన్పించారనీ, రైల్వే స్టేషన్లో ఉంటే తీసుకొచ్చామనీ... వెంటపెట్టుకొచ్చి చేర్పించేవారు కొందరైతే, ఫలానా ఫుట్‌పాత్‌ మీద ఓ ముసలాయన పడివున్నాడు, తీసుకెళ్లండి ప్లీజ్‌... అంటూ ఫోన్‌ చేసి చెప్పేవారు మరి కొందరు. శంకర్‌ ఎవరినీ కాదనడు. తానే వెళ్లి ఆటోలో ఆశ్రమానికి తీసుకొస్తాడు. ఎందుకంటే- అది రేకుల షెడ్డే అయినా చీదరింపులూ ఛీత్కారాలూ లేకుండా వారిని ప్రేమగా అక్కున చేర్చుకుంటుంది. భద్రమైన నీడనీ కడుపు నిండా తిండినీ కంటినిండా నిద్రనీ అందిస్తుంది.

ఆ ఆశ్రమం... చిన్నప్పుడు సోదరుడిని చూసి శంకర్‌ మనసులో మెదిలిన ఆలోచనకు ఆచరణ రూపం. పదేళ్ల క్రితం ప్రారంభించిన ఆ ఆశ్రమంలో ఇప్పుడు దాదాపు 600 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందీ అంటే- మన చుట్టూ ఉన్న మంచి మనుషుల వల్లేనంటాడు శంకర్‌.

పేద కుటుంబం

సంకల్పం బలంగా ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదంటారు పెద్దలు. గట్టు శంకర్‌ది అలాంటి సంకల్పమే. అతడిది సంస్థాన్‌ నారాయణపురం. అమ్మానాన్నా కూలిపని చేసి పిల్లల్ని బడికి పంపేవారు. శంకర్‌కి ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లు. పదో తరగతితో చదువాపేసిన శంకర్‌ అందరూ పనులు వెతుక్కుంటూ ముంబయి వెళ్తుంటే తానూ వెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు కూలి పనిచేశాడు. కొంతకాలం ట్రావెల్‌ ఏజెన్సీలో పనిచేశాడు. అప్పటికి కాస్త నగరంలో బతకడానికి కావలసిన నైపుణ్యాలు అలవడ్డాయి. ధైర్యం చేసి సొంతంగా బస్సు టికెట్లమ్మే ట్రావెల్‌ ఏజెన్సీ పెట్టుకున్నాడు. భవన నిర్మాణ రంగంలోనూ పనిచేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడడమే కాక కుటుంబానికి చేదోడయ్యాడు. పదమూడేళ్లపాటు అక్కడ ఉన్నాక వ్యాపారాన్ని తమ్ముడికి అప్పజెప్పి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చేశాడు శంకర్‌. పెళ్లి చేసుకుని టీవీ షోరూం పెట్టుకుని హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. నిర్మాణ రంగంలోనూ పనులకు కాంట్రాక్టులు తీసుకుంటూ కొందరికి ఉపాధి కల్పిస్తున్నాడు. అలాంటి సమయంలో రోడ్డు మీద ఒక ముసలమ్మని చూడగానే మళ్లీ చిన్ననాటి ఆలోచన గుర్తొచ్చింది. తన సంపాదనతో అదనంగా నలుగురికి తిండి పెట్టలేనా అనుకున్నాడు. నగరానికి కాస్త దూరంగా అయితే బాగుంటుందని చౌటుప్పల్‌లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఆమెను తీసుకెళ్లి అందులో ఉంచి ఆలనా పాలనా చూసుకోవడం మొదలెట్టాడు. ఆ తర్వాత చౌటుప్పల్‌ ఊళ్లో తిరిగి చూస్తే మతిస్థిమితం లేకుండా రోడ్లమీద తిరుగుతున్నవారు పది మంది దాకా కన్పించారు శంకర్‌కి. కొన్నాళ్లు వాళ్లని గమనించి అందరూ అనాథలేనని తేలగానే తీసుకొచ్చి ఆ ఇంట్లోనే ఉంచాడు. ధైర్యం చేసి తీసుకొచ్చాడు కానీ ఇల్లు సరిపోయేది కాదు. పెద్ద ఇల్లు కోసం వెతికితే అద్దె చాలా చెప్పేవారు. అప్పుడే దగ్గర్లో రేకుల షెడ్డు ఒకటి ఖాళీగా కనిపించింది. దాని యజమాని చంద్రశేఖర్‌ అనాథల కోసం అని అడగగానే ఉచితంగానే వాడుకోమన్నాడు. మూడేళ్లు అందులోనే ఆశ్రమం నిర్వహించాడు శంకర్‌. పగలంతా అక్కడే ఉండి వారికి కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటుచేస్తూ రాత్రికి ఇంటికి చేరేవాడు. అతడు చేస్తున్న ఈ పని గురించి పేపర్లో వార్త రావడంతో అది చూసి కొందరు దుస్తులు, బియ్యం, పప్పులు లాంటివి తెచ్చివ్వడం మొదలెట్టారు. అలా సహాయం వెతుక్కుంటూ రావడం చూసేసరికి శంకర్‌కి ఇంకా ధైర్యం వచ్చింది. ఇక, ఖర్చులకు ఏమాత్రం సంకోచించకుండా ఎక్కడ అనాథలు కనపడినా తీసుకువచ్చేవాడు. కన్నబిడ్డలు ఎలాంటివారైనా అమ్మానాన్నలు కళ్లలో పెట్టుకుని చూసుకున్నట్లు వీరినీ అలా చూసుకోవాలనుకున్న శంకర్‌ తన ఆశ్రమానికి ‘అమ్మానాన్నా అనాథల పుణ్యక్షేత్రం’ అని పేరుపెట్టుకున్నాడు.  

మొదట బాధపడినా...

కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్న కొడుకు భార్యాభిడ్డలతో సుఖంగా ఉండక లేనిపోని బాధ్యత నెత్తినేసుకోవడం తల్లిదండ్రులకు మింగుడు పడలేదు. ‘ఎందుకొచ్చిన సేవ... సంపాదించిందంతా ఇట్లా ఖర్చు చేస్తే రేపు నీ పిల్లలేమవుతారు...’ అంటూ అభ్యంతరం చెప్పారు. ‘మీకు నేను కాకపోతే ఇంకా ఇద్దరు కొడుకులున్నారు, కూతురుంది. కానీ వీళ్లందరికీ ఎవరూ లేరు. వారు దిక్కులేని చావు చావకుండా గౌరవంగా బతికేలా చూడడం నాకిష్టమైన పని. దయచేసి అభ్యంతరం చెప్పకండి, వాళ్లకి కాస్త అన్నం పెట్టడం వల్ల నాకు వచ్చే నష్టం ఏమీలేదని’ అమ్మానాన్నలకు నచ్చజెప్పుకున్నాడు శంకర్‌. అయినా వాళ్లు రాజీపడడానికి కాస్త సమయం పట్టింది. శంకర్‌కి ముగ్గురు పిల్లలు. ముంబయిలోనూ ఇక్కడా చేస్తున్న పనుల ద్వారా కుటుంబ పోషణకు సరిపోను ఆదాయం వచ్చే మార్గం ఏర్పాటుచేశాడు. తను మాత్రం ఆశ్రమ నిర్వహణకే పూర్తి సమయం వెచ్చిస్తున్నాడు. భార్యా పిల్లలూ కూడా సెలవున్నప్పుడు ఆశ్రమానికి వచ్చి అక్కడివారితో గడుపుతుంటారు. కొన్నాళ్లు  ఆశ్రమం గురించి తరచూ పత్రికల్లో టీవీల్లో రావడమూ మంచి పని చేస్తున్నాడని అందరూ మెచ్చుకోవడమూ చూశాక అతని తల్లిదండ్రులూ సంతోషించారు.

పునర్జన్మ

2012లో అప్పటి నల్గొండ జిల్లా కలెక్టర్‌ ముక్తేశ్వరరావు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇరవై మంది దాకా మానసిక వికలాంగులైన అనాథలను తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్పించారు. ‘పునర్జన్మ’ పేరుతో నిర్వహించిన ఆ కార్యక్రమంలో అపరిశుభ్రంగా ఉన్న వారందరికీ జుట్టు కత్తిరించి, శుభ్రంగా స్నానం చేయించి, శుభ్రమైన దుస్తులు ఇచ్చి కడుపు నిండా తిండి పెట్టారు. వైద్యులతో పరీక్షలు చేయించి అవసరమైనవారికి మందులు ఇప్పించారు. ఇక అప్పటినుంచి ఎవరైనా తీసుకొచ్చేదాకా చూడడం ఎందుకనుకున్న శంకర్‌ తానే స్వయంగా ఒక్కో జిల్లా ఎంచుకుని అక్కడ నిస్సహాయ పరిస్థితుల్లో కన్పించినవారిని ఆశ్రమానికి చేర్చేవాడు. పోలీసు అధికారులు కూడా తమ దృష్టికి వచ్చిన వాళ్లను తీసుకొచ్చి ఇక్కడే అప్పజెప్పేవారు.

నాలుగేళ్ల క్రితం హైదరాబాదులో జీహెచ్‌ఎంసీ, జైళ్లశాఖతో కలిసి నగరంలో భిక్షాటన చేస్తున్న దాదాపు రెండు వేలమందిని సమీకరించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్‌ వాళ్లలో చిన్నపిల్లలూ వృద్ధులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబాలకు అప్పజెప్పే బాధ్యత తీసుకున్నాడు. చాలామంది కుటుంబాలు ఉన్నా రోడ్డున పడి అనాథల్లా బతుకుతున్నారంటాడు శంకర్‌. అలా బిచ్చమెత్తుకుంటున్న ఒక ముసలాయనను ఆశ్రమానికి తీసుకెళ్లిన సంగతి తెలిసి అతని కొడుకూ కోడలూ వెతుక్కుంటూ వచ్చారట. ‘మీరుండగా ముసలాయన ఎందుకు అడుక్కుంటున్నాడు’ అని అడిగితే- తండ్రీకొడుకులు ఎవరి కారణాలు వాళ్లు చెప్పారట. ప్రేమలేక కాదు, పేదరికం కొందరిని కఠినాత్ములుగా మారుస్తుందంటాడు శంకర్‌. ఇంకెప్పుడూ ఇలా విడిచిపెట్టొద్దు అని చెప్పి కాగితం మీద సంతకం చేయించుకుని, పంపించారట. అలా చాలామంది చిన్నపిల్లల్ని కూడా తల్లిదండ్రులకు అప్పగించారు. మళ్లీ అడుక్కోడానికి పంపిస్తే కేసు పెట్టి జైల్లో పెడతామని బెదిరిస్తే తర్వాత పిల్లల్ని బడికి పంపించడం మొదలెట్టారని సంతోషంగా చెబుతాడు. మరి కొందరైతే సంవత్సరాల తర్వాత కన్పించిన తమ కుటుంబసభ్యుడిని చూసి ఎంతో ఆనందించి, మీ రుణం తీర్చుకోలేమంటూ తోచిన విరాళం ఇచ్చి తమవారిని తీసుకెళ్తుంటే- తాము పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిన అనుభూతి కలుగుతుందని చెబుతాడు శంకర్‌. మానసిక వికలాంగులైన అనాథల గురించి శంకర్‌కి సమాచారం ఇవ్వాలనుకుంటే 8686474474, 8686434434 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.

పొరుగు రాష్ట్రం నుంచి..

ఒకసారి విజయవాడ పురపాలక కమిషనర్‌ శంకర్‌ని పిలిపించి 200 మంది అనాథల్నీ ఖర్చుల కోసం కొంత డబ్బునీ కూడా అప్పజెప్పారట. ఇలా ఎక్కడెక్కడినుంచో వచ్చి ఇక్కడ ఆశ్రమంలో చేరినవారిలో దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల వారూ ఉన్నారనీ,  వాళ్లు ఇక్కడి జీవితానికి అలవాటు పడి కాస్త కోలుకున్నాక వారి వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తామనీ చెబుతాడు శంకర్‌. ఆశ్రమంలో పనులన్నీ చేయడానికి దాదాపు నలభైమంది దాకా సిబ్బందిని నియమించాడు. ఆ సిబ్బంది- వారిని మాటల్లో పెట్టి వివరాలు తెలుసుకుంటారు. అడ్రసు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇస్తారు. అలా ఇప్పటివరకూ కొన్ని వందల మందిని ఇళ్లకు చేర్చగలిగారు. తమ వాళ్లు ఇక్కడ ఉన్నారని సమాచారం తెలిసినా కొందరు స్పందించరు, అలాంటివాళ్లను బలవంతం చేయరు. మతిస్థిమితం లేనివారు చాలావరకూ వారికి తెలియకుండానే ఇళ్లకు దూరంగా వెళ్లిపోవడం వలన ఆ తర్వాత వెతికినా ప్రయోజనం లేక అనాథలుగా మిగిలిపోతున్నారంటాడు శంకర్‌. సమాజం వారిని వెలివేసి, చీదరించుకోవడం చూసి వారు మరింతగా బెదిరిపోయి ఎవరికీ కనపడకుండా దాక్కునే ప్రయత్నాలు చేయడం, ఆ క్రమంలో ప్రమాదాలకు లోనై గాయాలతోనే నానాయాతన పడుతూ ఏ మూలో పడివుండడం పరిస్థితిని మరింతగా దిగజారుస్తుందని అంటాడతను. ఏది తినొచ్చో ఏది తినకూడదో తెలియక దొరికింది తినడం వల్ల ఆశ్రమంలో చేరేసరికి కొందరికి కిడ్నీలు పాడవటం లాంటి సమస్యలూ ఉంటున్నాయట. ఆశ్రమానికి దగ్గరగా ఉన్న కామినేని ఆస్పత్రి అవసరమైనవారికి ఎలాంటి చికిత్సనైనా ఉచితంగా చేస్తోంది. ఎక్కువ మంది మానసిక వైకల్యం ఉన్నవారు కాబట్టి వారానికి ఒకసారి హైదరాబాద్‌ నుంచి మానసికవైద్యులు వచ్చి చూసి వెళతారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఉంచి చికిత్స చేయిస్తారు. ప్రపంచమంతటా ప్రతాపం చూపిన కరోనా ఈ అభాగ్యులనూ వదల్లేదు. దాదాపు వందమంది దానిబారిన పడగా వారిని విడిగా ఉంచి జాగ్రత్తగా చూసుకుంటూ చికిత్స అందించడంతో అందరూ కోలుకోవడం విశేషం.

మంచి మనసులే అండ

వైకల్యంతోనో అనారోగ్యంతోనో ఉన్నవారు ఇంట్లో ఒక్కరు ఉంటేనే చూసుకోవడం కష్టమవుతున్న ఈ రోజుల్లో అలాంటి వందల మందిని ఒక్కచోట చేర్చి శంకర్‌ అయినా అతడి సిబ్బంది అయినా ఎలా చూసుకుంటున్నారు... ఖర్చులు ఎలా భరిస్తున్నారు... ఈ విషయమే శంకర్‌ని అడిగితే మన చుట్టూ మంచి మనుషులకు కొదవ లేదంటాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో విరాళాలు అందుతున్నాయంటాడు.

ఆశ్రమంలో ఉన్నవారికి రోజూ రెండు పూటలా భోజనం పెడతారు. ఒకసారి అల్పాహారం ఇస్తారు. అందుకుగాను ప్రధానంగా రోజుకు 250 కిలోల బియ్యం, 125 కిలోల కూరగాయలు, 30 కిలోల కందిపప్పు... అవసరమవుతాయి. కొందరు దాతలు కుటుంబసభ్యుల పుట్టినరోజనో, పెళ్లిరోజనో, తల్లిదండ్రుల వర్ధంతి అనో ఆశ్రమంలో అన్నదానం చేస్తుంటారు. కొందరేమో నగదు రూపంలో విరాళాలు ఇస్తుంటారు. అవి కాకుండా అధికారుల సాయంతో కొంతమందికి ఆధార్‌ కార్డులు తీయించి వాటి ఆధారంగా రేషను, పింఛన్లు వచ్చే ఏర్పాటు చేయడంతో అవి కొంతవరకూ ఉపయోగపడుతున్నాయి. ముక్తేశ్వరరావు కలెక్టర్‌గా ఉన్నప్పుడే 2015లో మరో దఫా ‘పునర్జన్మ’ కార్యక్రమం నిర్వహించి 200 మందిని ఆశ్రమంలో చేర్చినప్పుడు ప్రభుత్వం తరఫున కొంత భూమిని ఇచ్చారట. దాంట్లోనే రేకుల షెడ్లు నిర్మించి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు శంకర్‌. అయితే స్థలాన్ని ఇంకా ఆశ్రమం పేరున రిజిస్టర్‌ చేయలేదు. ప్రస్తుతానికి కింద చాపలూ దుప్పట్లూ వేసి పడుకోబెడుతున్నారు. వంట, భోజనశాల శుచిగా ఉండేలా చూసుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 16 నుంచి 80 ఏళ్ల వరకూ మొత్తం 600 మంది ఉన్నారు. వారిలో 150 మంది మహిళలు. రోజూ ఒకరిద్దరైనా కొత్తవారు చేరుతూనే ఉంటారు. పోలీసులతో పాటు సఖి కేంద్రం వాళ్లు కూడా తమ దృష్టికి వచ్చినవారిని ఇక్కడికే పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశ్రమాన్ని ఇంకా విస్తరించక తప్పదు. అందుకని అన్ని సౌకర్యాలతో ఆశ్రమానికి పక్కా భవనం నిర్మించాలన్నది శంకర్‌ కల. ఐదు నుంచి పదివేల మందికి సరిపోయేలా లక్ష చదరపు అడుగులతో కట్టాలని ప్లాను కూడా సిద్ధం చేసుకున్నాడు. అంత పెద్ద భవనం కట్టాలంటే ఖర్చు చాలానే అవుతుందనీ, అయితే ఇప్పటికే కొందరు గదులు కట్టిచ్చి ఇస్తామని తనకు వాగ్దానం చేశారనీ, తలా ఒక చేయీ వేస్తే అదేం పెద్ద పని కాదనీ, తనకా నమ్మకం ఉందనీ అంటాడు శంకర్‌. ‘డొనేట్‌కార్ట్‌’ అనే సోషల్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ వెబ్‌సైట్‌ ఆశ్రమాన్ని సందర్శించి విరాళాలు సేకరించడానికి తమ వెబ్‌సైట్‌లో పేజీ ప్రారంభించింది. నిత్యావసరాలూ, అంబులెన్స్‌ సౌకర్యమూ ఏర్పాటుచేయడానికి ప్రారంభించిన ఈ పేజీలో దాదాపు 73 లక్షల విలువ చేసే విరాళాలు సమకూరాయి. వాటి నుంచి గత రెండు నెలలుగా నిత్యావసరాలను పంపిస్తోంది సంస్థ.

ఆస్తి రాసిచ్చి...

చౌటుప్పల్‌ సమీపంలోని ఆరె గూడెం గ్రామానికి చెందిన కట్టా బాలమ్మకి పిల్లలు లేరు. భర్త మరణించాడు. ఎనిమిది పదులు నిండిన వయసులో పట్టించుకునేవారు లేక ఒంటరిగా ఇబ్బంది పడుతున్న ఆమె తనకున్న 13ఎకరాల పొలాన్నీ అనాథాశ్రమానికి రాసిస్తాననీ మంచి ఆశ్రమం ఎక్కడ ఉందో కనుక్కోమనీ సోదరుడిని కోరింది. ఆయన సూచనతో తన తదనంతరం ఆస్తి అంతా ‘అమ్మానాన్నా అనాథల పుణ్యక్షేత్రాని’కి చెందేలా రాసిచ్చిన ఆమె తను కూడా వచ్చి ఆశ్రమంలోనే అందరితో కలిసి ఉంటోంది. కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని ఆమె అలా ఇచ్చేయడం చూస్తే దేవుడు ఎక్కడో లేడు... ఈ మనుషుల్లోనే ఉన్నాడనిపిస్తుంది అంటాడు శంకర్‌.

డబ్బుదేముంది ఎవరైనా ఇస్తారు కానీ, సొంతమనుషులే అలాంటివారిని భారంగా భావిస్తున్న రోజుల్లో... తమకు ఏమీకాని, ఎవరో తెలియనివారిని ఆదరించి అక్కున చేర్చుకోవడానికి ఎంత పెద్ద మనసు ఉండాలీ...బొమ్మల్లా చెప్పినట్లు చేయడం తప్ప తిరిగి కృతజ్ఞతైనా చెప్పలేని ఆ నిస్సహాయులను కంటికి రెప్పలా కాపాడటానికి ఎంత ఓర్పూ సహనం కావాలీ...అవి పుష్కలంగా ఉండబట్టే శంకర్‌ వారందరికీ అమ్మానాన్నా కాగలిగాడు... ఇంకెందరికైనా తన ఆశ్రమంలో చోటిస్తానంటున్నాడు..!

సహకారం: దత్తురెడ్డి, ఈనాడు, యాదాద్రి భువనగిరి.

ఫొటోలు: సుబ్రహ్మణ్యం

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న