close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
దేవుడు వడ్డించిన విస్తరి

- సింహప్రసాద్‌

‘‘నే ను పరాజితని. నాకు బతకాలని లేదు. జీవితమంటే విరక్తి పుట్టింది. అందుకే నిద్ర మాత్రలు మింగాను. దయచేసి మీ మీ చెత్త ప్రశ్నల్తో నన్ను హింసించకండి. మళ్లీ మళ్లీ చంపకండి. మీకో నమస్కారం!’’
దుఃఖం, ఆవేశం, కోపం ముప్పేటగా వెల్లువెత్తగా ఆసుపత్రి అంతా ప్రతిధ్వనించేలా అరిచాను.
బాధగా చూస్తూ మా ఆయన రవి... కళ్లు తుడుచుకుంటూ అమ్మ.. సానుభూతిగా చూస్తూ నాన్న... బిక్కు బిక్కుమని చూస్తూ ఏడుపు దిగమింగుతూ మా చిన్నారి వంశీ!
కళ్ళు మూసుకున్నాను.
అన్ని మాత్రలు మింగినా ఎందుకు చావలేదో! బతికినందుకు ఇప్పుడు వీళ్లంతా జాలి చూపులతో పొడిచి చంపేస్తున్నారు! ఆ పోలీసులు సరే సరి.
‘పెద్ద కారణమేం లేదు మొర్రో’ అని గొంతు చించుకున్నా వినరే! బతకాలనిపించక ఆత్మహత్యకి ప్రయత్నించానంటే నమ్మరే! గృహహింసా, అక్రమ సంబంధాలా, వరకట్న వేధింపులా, ఆర్థిక సమస్యాలా... ఏది కారణమంటూ పిచ్చి ప్రశ్నలతో చంపేశారు!
నా మానాన నేను చచ్చే హక్కు కూడా నాకు లేదా? వీళ్ళందర్నీ సంతృప్తి పరిచే బాధా, సమస్యా ఉంటేనే చావాలా? వీళ్ళకి అర్థం కాని సమస్య ఎవరికీ ఉండకూడదా? ఏం జనమో ఏం పాడో!
నాలో నేను కుతకుత ఉడికిపోతుంటే, ‘‘పోలీస్‌ వారి మాటలు నిన్ను బాగా గాయపరిచినట్టున్నాయి. వాళ్ల అనుభవం వాళ్లది. అవన్నీ మర్చిపోయి నిశ్చింతగా పడుకో. మనసు కుదుటపడుతుంది’’ నాన్న అన్నారు తల నిమురుతూ.
తర్వాత అందర్నీ గదిలోంచి తీసుకుపోయారు. గాఢంగా నిట్టూర్చాను.
కాసేపటికి మా వారు లోపలికి వచ్చారు. ‘‘శిరీ, మన పై అంతస్తులో ఉండే ఆనంద్‌ గారూ, ఆయన భార్యా నిన్ను చూడాలని వచ్చారు. పంపనా?’’
‘‘వద్దొద్దు. వాళ్ళ ముఖం చచ్చినా చూడను’’
‘‘మన ఇరుగూ పొరుగూ...’’
‘‘గాడిద గుడ్డేం కాదూ!’’ అసహనంతో అరిచాను.
అదోలా చూసి వెళ్ళిపోయాడు రవి.
ఆనంద్‌... అవును, ఈ ఆనందే నా పరాజయ పరంపరకి ఆద్యుడు!
అతడు ఓ పెళ్లిలో నన్ను చూసి ఇష్టపడ్డాడు. బంధుమిత్రుల ద్వారా పెళ్లి ప్రసక్తి తెచ్చాడు. అమ్మానాన్నా, ‘బంగారం లాంటి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది’ అని పొంగిపోయారు.
అందం, ఆస్తి, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. నిజమే. కానీ నేను 5’4’’ అయితే, అతడు 5’5’’. విడివిడిగా చూస్తే నా కన్నా కొద్దిగా పొట్టిగా అన్పిస్తాడు. నేను చేసుకునే వాడు కనీసం 5’10’’ ఉండాల్సిందేనని తెగేసి చెప్పాను.
ఎవరెంత చెప్పినా వినిపించుకోలేదు.
డిగ్రీ పూర్తవుతూనే రవితో పెళ్లయ్యింది. అతడేకంగా 5’11’’. బావుంటాడు. పైగా బ్యాంకులో ఉద్యోగం!
పెళ్లిలో అందరూ నా అదృష్టానికి ఏడ్చి పోయారు. అప్పుడు నేను అనుభవించిన గర్వానుభూతి ఇప్పటికీ నాకు గుర్తే!
రవి, ‘రాముడు మంచి బాలుడు’ కోవలోని వాడు. దేనికీ అడ్డు చెప్పడు. నేను ఆడింది ఆట, పాడింది పాటయ్యింది. జీతం మొత్తం తెచ్చి నాచేతిలో పోసి, తన ఖర్చుకి తీసుకునే వాడంటే ఎవరూ నమ్మరు గానీ, అది నిజం.
మాకు వంశీ పుట్టాడు. తొలి కాన్పులోనే మగపిల్లాడు పుట్టినందుకు మా అత్తగారూ, మావయ్యగారూ నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. మావారు సరే సరి, పచ్చల నెక్లెస్‌ బహూకరించారు!
అంతా హ్యాపీ హ్యాపీగా సాగిపోతోంది. కానీ... మా పై వాటాలో ఉండే ఆవిడ ఏదో ఉద్యోగం వెలగబెడుతోంది. రోజూ ఇస్త్రీ నలగని చీర కట్టుకుని టింగు రంగా అంటూ స్కూటీ మీద ఆఫీసుకెళ్లేది.
ఆమెను చూస్తుంటే నాకేదో చేదుగా అన్పించేది.
‘‘నేనూ ఉద్యోగం చెయ్యాలి’’ అనుకుని చాలా దరఖాస్తులు పెట్టాను గాని అదేంటో ఒక్కరూ ఇంటర్వ్యూకి కూడా పిలవలేదు!
వంశీకి మూడేళ్లు రాగానే వాడిని నర్సరీలో చేరుద్దామని దగ్గర్లోని స్కూలుకెళ్ళాను. ప్రిన్సిపాల్‌ నా చదువు గురించి తెలుసుకుని, ‘‘మీరిక్కడ టీచర్‌గా చేరకూడదూ? మీ అబ్బాయికి సగం ఫీజు మినహాయింపూ లభిస్తుంది’’ అన్నారు.
ఎగిరి గంతేశాను.
‘‘నీకు ఇబ్బంది ఉండదంటే చేరు’’ అన్నాడు రవి.
‘‘మీరెంత మంచివారండీ’’ అమాంతం వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాను.
రోజుకో చీర కట్టుకుంటూ హుందాగా ఫోజుకొడుతూ ఉద్యోగానికి వెళ్తున్నాను.
కొద్ది రోజుల్లోనే స్కూల్లో నాకు చక్కని గుర్తింపు వచ్చింది. నేను బోధించే విధానం అందరికీ నచ్చింది. 7, 8 తరగతులకు చెప్పమన్నారు. జీతం పది వేలకు పెంచారు. నా మెడ నిటారుగా అయింది!
తోటి టీచర్లు జ్యూయలరీ షాప్‌లోని బంగారు నగల స్కీంలో చేరుతుంటే నేనూ చేరాను. ఆ నెల జీతమంతా తొలివాయిదాగా కట్టేశాను. పెద్ద మొత్తం అయ్యాక స్కూల్లో ఎవరికీ లేని, కొనలేని వజ్రాల దుద్దులు కొనుక్కోవాలన్నది నా డ్రీమ్‌...!
అదే సంగతి రవికి చెప్పాను. ‘‘నీ ఇష్టం’’ అన్నాడు.
అమ్మకు చెప్పగా, ‘‘అల్లుడు శ్రీరామ చంద్రుడేనే’’ అని మురిసిపోయింది.
మా స్కూల్లో అమృతలత కొత్తగా చేరింది. బీటెక్‌ చదివి టీచర్‌ జాబ్‌కి వచ్చిందని తెలిసి నమ్మలేకపోయాను. ‘‘బ్యాక్‌ లాగ్‌ బాపతేమో’’ అనుకుని జాలి పడ్డాను.
రెండో రోజునే నన్ను వెతుక్కుంటూ వచ్చింది.
‘‘మీ గురించి టీచర్లూ, విద్యార్థులూ చాలా గొప్పగా చెబుతున్నారు. మీరు అనుసరించే పద్ధతులు నాకు నేర్పరూ’’ అంది.
నా చెల్లెలే అడుగుతున్నట్టు భావించి చెప్పాను.
‘‘మొదట- పాఠాన్ని కొన్ని భాగాలుగా విభజించుకోవాలి. ఎందుకు, ఎలా, ఏమిటి లాంటి ప్రశ్నలు మనకి మనమే వేసుకుని జవాబులు సిద్ధం చేసుకున్నాకే క్లాస్‌ రూమ్‌లో అడుగు పెట్టాలి. విద్యార్థి కొచ్చే సందేహాలన్నీ ముందే ఊహించి తయారవుతాం గనుక,  పిల్లల్ని బాగా ఆకట్టుకోగలుగుతాం’’
‘‘మీరు జీనియస్‌’’ పొగిడేసింది. ‘‘శిరీష గారి శిష్యురాల్ని’’ అని స్కూల్లో అందరికీ చెప్పేది కూడా.
మెల్లగా, నాలాగే చెబుతోందన్న పేరు తెచ్చుకుంది. నా భుజాలు పొంగాయి. అదంతా నా చలవేగా!
కానీ తొందరగానే పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. అమృతలత భౌతిక శాస్తాన్న్రి బోధిస్తుంది. అది ఎవరికీ కొరుకుడు పడదు. విద్యార్థులకు అర్థమయ్యీ కానట్టు ఉంటుంది. కానీ ఆమె చక్కగా చెబుతోంది. ఇంతవరకూ ఆమెలా ఆసక్తికరంగా అర్థమయ్యే రీతిలో ఎవరూ చెప్పలేదనే పేరు తెచ్చుకుంది. నన్ను దాటేస్తుందేమోనన్న అనుమానం, ఆపై అసహనం నాలో పెరగసాగాయి.
అదృష్టవశాత్తు ఒక రోజున మిఠాయి డబ్బాతో వచ్చింది. ‘‘జాబ్‌కి రాజీనామా ఇస్తున్నాను. మీ వల్లే చాలా కొత్త సంగతులు నేర్చుకోగలిగాను. థాంక్స్‌’’
గుండెల మీంచి టన్ను బరువు దిగి పోగా, ‘‘పెళ్లి కుదిరిందా’’ సంబరంగా అడిగాను.
‘‘ఇదివరకే క్యాంపస్‌ సెలక్షన్‌ వచ్చింది. పోస్టింగ్‌ ఇవ్వడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఈలోగా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవచ్చని ఈ స్కూల్లో చేరాను’’
అభినందించడం మరిచిపోయాను.
వెంటనే నాన్నకి ఫోన్‌ చేసి, ‘‘నాకు ఎంసెట్లో ర్యాంక్‌ రాలేదని డిగ్రీలో చేర్చేశారు గానీ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ ఎందుకు ఇప్పించలేదు? రెండో ప్రయత్నంలో మంచి ర్యాంకు తెచ్చుకుని బీటెక్‌ చదివేదాన్ని. ఇప్పుడు గొప్పగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయ్యేదాన్ని’’ కోపంగా అన్నాను, కాదు అరిచాను.
‘‘అప్పుడు మళ్లీ చదవలేనని గొడవ చేశావు కదే’’
‘‘అలాగని వదిలేస్తారా? చెవులు మెలిపెట్టి బుద్ధి చెప్పి ఉంటే ఇప్పుడీ చెత్త ఉద్యోగం చేయాల్సి వచ్చేదే కాదు!’’ ఉక్రోషపడ్డాను.
ఎందుకో ఆ తర్వాత నాలో యాంత్రికత వచ్చేసింది. ఉద్యోగం విసుగ్గా ఉంది. ఛార్మ్‌ కనిపించకుండా పోయింది.
ఆవాళ నేను టీవీ చూస్తూ ఉంటే, రవి వంశీని చదివిస్తున్నాడు.
హఠాత్తుగా టీవీ తెరమీద ప్రత్యక్షమైంది ప్రీతి.

నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ‘‘ఇదిగో ఇలా రండి. ఈ ప్రీతి నా ఫ్రెండ్‌ ఆండీ. హైస్కూల్లో నా క్లాస్‌మేట్‌ తానెంతో అందగత్తెనని గర్వం లెండి. సినిమా తారని అవుతానని ఎగిరేది.
కడకి టీవీలోకొచ్చి పడిందన్నమాట పాపం!’’ ఎగ్జైట్‌ అవుతూ చెప్పాను.
‘‘అందంగా బావుంది. పైకొస్తుంది’’
ముఖం చిట్లించాను. ‘‘ఇప్పుడు కాస్త కండ పట్టిందిగాని అప్పట్లో పీక్కు పోయిన ముఖంతో ఎండు నక్కలా వుండేది! అంతా నన్ను స్కూల్‌ బ్యూటీ అనేవారు. అబ్బాయిలు నా వెంట ఇంటి దాకా వచ్చేవారు తెలుసా? నేను గట్టిగా ప్రయత్నించి ఉంటే ఏకంగా సినిమా హీరోయిన్నే అయ్యేదాన్ని’’ అన్నాను.
‘‘తప్పకుండా అయ్యుండేదానివి’’ అంటూ ఇబ్బందిగా నవ్వాడు రవి.
ఆ నెల ఆఖరుకే మా పై పోర్షన్‌ ఖాళీ అవడంతో ఆనంద్‌ వాళ్ళు అద్దెకు దిగారు. అతడు నన్ను గుర్తుపట్టాడో లేదో తెలీదు గాని నేను గుర్తుపట్టాను. అతడి భార్య రమ ఒక మోస్తరుగా ఉంది. నా ముందు దిగదుడుపేననిపించి సంతోషపడ్డాను. పాపం పెళ్ళై ఐదేళ్లయినా వారికి పిల్లలు పుట్టనే లేదట!
రమ మా ఇల్లు చూసి ముచ్చట పడిపోయింది. ‘‘భలే చక్కగా సర్దుకున్నారే’’ అంది. వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించింది.
ఆదివారం సాయంత్రం రవీ, నేనూ వంశీని తీసుకుని వెళ్ళాం.
ఏదో పచ్చని లోకంలో అడుగు పెట్టినట్టుగా అనిపించింది. ఇంటి చుట్టూ రకరకాల ఆకారాల్లో కుండీలు, వాటిల్లో ఎన్నో రకాల పూల మొక్కలూ, బుల్లి పొదలు!
‘‘వావ్‌’’ అన్నాడు రవి. సంబరంతో చిందేశాడు వంశీ.
లోపలికి వెళ్ళాం. ఆమె పియానో వాయిస్తోంటే అతడు ఆదమరచి వింటున్నాడు.
‘‘మీకు పియానో వాయించడం వచ్చా!’’ అబ్బురపడ్డాను.
‘‘మావారు నేర్పారు’’
‘‘ఓ గ్రేట్‌!’’ రవి ఆనంద్‌ని అభినందిస్తూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. ముఖం ముడుచుకున్నాను.
ఇంటికి వచ్చాక, ‘‘మీరు పాటలు పాడటం నేర్చుకోండి. కాలేజీ రోజుల్లో పాడేవాడినని చెప్పారుగా. ప్రతివారికీ ఏదో ఒక కళ ఉండాలండీ’’ క్లాసు పీకాను.
‘‘నా బిజీ తెలుసుగా’’
‘‘అలా కాదు. వెంటనే ప్రాక్టీసు మొదలెడతానని ప్రామిస్‌ చెయ్యండి’’
రవి అయిష్టంగానే చేసినా నాకెంతో సంతృప్తిగా అనిపించింది.
కాలం కుంటుతూ నడుస్తూ నడుస్తూ నిన్న అమాంతం నన్ను అగాథంలోకి తోసేసింది.
ఆనంద్‌కి తాసిల్దార్‌గా ప్రమోషన్‌ వచ్చిందట. నోరు తీపి చేసి చెప్పింది రమ. నాకది పరమ చేదుగా అనిపించింది. మింగలేకపోయాను.
అన్యమనస్కంగా ఫేస్‌బుక్‌ తిరగేస్తుంటే న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌లో, అద్భుత కట్టడాల పక్కన నిలబడి తీసుకున్న అమృతలత ఫోటోలు వరుసగా ప్రత్యక్షమయ్యాయి. వాళ్ల కంపెనీ వాళ్లు తనని అమెరికా పంపారట!
నా దగ్గర మెలుకువలు నేర్చుకున్నామె ఇప్పుడు అమెరికాలో! నేనింకా ఆ డొక్కు ఉద్యోగంలోనే ముక్కుతూ మూలుగుతూ!
మనస్సు భగ్గుమంది.
రవి బ్యాంకు నుంచి వస్తూనే ‘‘నీకో గుడ్‌ న్యూస్‌ శిరీ’’ అన్నాడు.
‘‘మీకు మేనేజర్‌గా ప్రమోషనొచ్చింది కదూ?’’ చేటంత మొహం చేసుకుని అడిగాను.
‘‘క్యాషియర్ని. ఒక్క జంపుతో ఆ సీట్లో కెళ్ళి పడలేను గాని, నీ ఫ్రెండ్‌ ప్రీతి సినిమా హీరోయిన్‌గా బుక్కయ్యిందోయ్‌’’ అన్నాడు.
గుండెల మీంచి గూడ్స్‌ ట్రైన్‌ దూసుకెళ్లినంత బాధ కలిగింది.
కూలబడి పోయాను. తుఫానులో సర్వం కోల్పోయిన భావన. ఘోరంగా ఓడిపోయానన్న ఫీలింగ్‌.... నా మీద దాడి చేసి నిర్దాక్షిణ్యంగా తొక్కిపారెయ్యసాగాయి!
అంతా... అంతా... బాగున్నారు. సుఖ సంతోషాల్లో మునిగితేలుతున్నారు. వారిది ఆశించినవన్నీ అందుకునే మహా అదృష్టం. అందుకే అన్నిటా పైపైకి దూసుకుపోతున్నారు!
నేను మాత్రం- అవును, ఈ భూ ప్రపంచంలో నేనొక్కదాన్నే- ఎదుగూ బొదుగూ లేకుండా మరుగుజ్జులా అణగారి పోతున్నాను. అంతకంతకూ పాతాళంలోకి కూరుకుపోతున్నాను!
ఏమీ సాధించలేని ఈ బతుకెందుకు? నిస్సారమైన ఈ జీవితం ఎందుకు?
నా మీద నాకే రోత పుట్టింది. ఒక భోగం, ఒక వైభోగం లేకుండా బతికేస్తున్నా. నాదీ ఒక బతుకేనా?!
డిప్రెస్‌ అయ్యాను. రుచీపచీ లేని నా బతుకు మీద ఏవగింపు కలిగింది! అసహ్యం వేసింది! ఈ జీవితాన్ని ముగించెయ్యడమే మంచిదని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాను.
రవి వంశీని పార్కుకు తీసుకెళ్లాడు.
రెండు, మూడు మందుల షాపులకెళ్ళి, నిద్ర మాత్రలు కొనుక్కొచ్చి మింగేశాను.
ఇక ‘ప్రాణం’ హాయిగా ఉంటుందనుకుంటే డాక్టర్లు బతికించి చచ్చారు!
కళ్ళ నుంచి ధారలు కడుతున్న కన్నీటిని తుడవడానికి చేతులు రాలేదు. అన్నిటా నాదే పై చేయి కావాలనుకునేదాన్ని. కనీసం ఆత్మహత్యా ప్రయత్నంలోనూ గెలవలేక, దారుణంగా ఓడిపోయాను!
ఇంతటితో దీనికి ముగింపు రాదు. రేపూ ఎల్లుండీ ఆవలెల్లుండీ కూడా ఓడిపోతూనే ఉంటాను! ఇక బతుకంతా నిరాశా నిస్పృహే! కన్నీటి మడుగే!
నాలో నేను మౌనంగా కుళ్ళి కుళ్ళి ఏడ్చాను!
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ‘ఇరుగుపొరుగు వారి చూపుల బాణాలను ఎదుర్కోవడం ఎలాగా’ అని మథన పడుతోంటే, ‘‘నాలుగు రోజులు మా ఇంట్లో ఉంటుంది’’ అని చెప్పి తీసుకెళ్లారు నాన్న.
మూడు రోజులు ప్రశాంతంగా గడిచాయి. నాలుగో రోజున నా ఎదుటి కొచ్చి కూర్చున్నారు నాన్న.
‘‘ఏం జరిగింది? ప్రాణం తీసుకోవాల్సినంత కష్టం, నష్టం నీకేమొచ్చాయి? అన్నీ ఉన్న నిండు జీవితాన్ని ఎందుకు, అర్ధాంతరంగా అంతం చేసుకోవాలనుకున్నావు?’’ ఆవేదనతో రగిలిపోతూ అడిగారు.
చివ్వున కోపం పొడుచుకొచ్చింది. ‘‘మీకు పప్పూ అన్నమే పరమాన్నంగా అనిపించి సంతృప్తి పడగలరు. కానీ నాకు బిర్యానీ కావాలి. చికెన్‌ జాయింట్లు కావాలి. పిజ్జాలు, బర్గర్లు, రసగుల్లాలు అన్నీ కావాలి!’’
‘‘నా అనుమానమే నిజమైందన్నమాట. చూడు శిరీషా! చిన్నప్పట్నుంచీ కూడా ఇతరులతో పోల్చుకోవడం నీ అలవాటు. పెద్దయ్యాక పెద్దరికం వస్తుందనుకున్నాను... అవగాహన పెరుగుతుందనుకున్నాను...’’
‘‘అసలేం జరిగిందో మీ ఊహకు కూడా అందదు నాన్నా. నేను కాదన్న వాడు గొప్ప అధికారి అయ్యాడు. నా శిష్యురాలు అమెరికాలో షికార్లు చేస్తోంది. నా ఫ్రెండ్‌ సినిమా రంగాన్ని ఏలబోతోంది. నేను మాత్రం కాళ్లీడ్చుకుంటూ ఇంకా ఇంకా నడుస్తూనే ఉన్నాను. వాళ్లంతా నా మీంచి, నన్ను తొక్కుకుంటూ వెళ్లి స్వర్గ సౌఖ్యాలనుభవిస్తుంటే నేనీ నరక కూపంలో మగ్గి పోతున్నాను! నిలువునా కాలిపోతున్నాను!’’ బిగ్గరగా ఏడ్చాను.

‘‘పెళ్ళైన ఐదేళ్ల లోపల సొంత ఇల్లూ, సొంత కారూ ఉండాలనుకున్నాను. నా భర్త ఆఫీసర్‌ స్థాయిలో ఉండాలని ఆశించాను. కానేమయ్యింది... బిడ్డ తల్లిగా మిగిలి పోయాను! ఇది నేను కోరుకున్న జీవితం కానే కాదు’’ వెక్కిళ్లతో అక్కసుగా అన్నాను.
నివ్వెరపోయారు నాన్న. ‘‘ఆనందం- భౌతిక వస్తువులూ, సంపద ద్వారానే లభిస్తుందన్న భ్రమలో ఉన్నావు నువ్వు.’’
‘‘మెట్ట వేదాంతపు కబుర్లొద్దు నాన్నా. నిజం చెప్పండి. ఈ ఆనంద్‌, ఆ అమృతలత, ప్రీతి విజేతలు కాదా? నేను పరాజితురాల్నీ, శాపగ్రస్తురాల్నీ కాదా? ఈ జీవితంలో నేను రాణించలేనని రూఢి అయ్యిందా లేదా? గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి’’ కన్నీళ్లు చిప్పిల్లుతుంటే గొంతు పెంచి నిలదీశాను.
‘‘నీది ఓటమి కాదు తల్లీ. అసూయ వల్ల వచ్చిన అసంతృప్తి. నీది కొని తెచ్చుకున్న బాధ, విరక్తి,  ఆవేదన. సంతృప్తిని మించిన సంపద లేదని నువ్వు గ్రహించలేక పోతున్నావు. ఆత్మతృప్తి లేనప్పుడు సగం నగరాన్ని కొనేసినా మిగతా సగం కొనలేక పోయానే అన్న వేదన నిత్యం వేధిస్తూనే ఉంటుంది!’’
‘‘మాట మార్చొద్దు. నేనేమీ బడికెళ్తున్న పసిదాన్ని కాదు, మీ నీతి పాఠాలకు తలాడించడానికి’’ నిటారుగా కూర్చుంటూ అన్నాను.
‘‘నువ్వు చెప్పిన ముగ్గురూ ఎంతో సంతోషంగా ఉన్నారనుకుంటున్నావు. వారి స్థితిని గొప్పగా ఊహించుకొని, వారితో పోల్చుకుని ఆత్మన్యూనతతో కృంగి పోతున్నావు. కానీ వాస్తవంలో వారి పరిస్థితులేమిటో, వారిని బాధిస్తున్న సమస్యలేంటో, వెంటాడుతున్న అశాంతీ, అభద్రతా ఏంటో నీకు తెలీదు కదా!’’
‘‘తెలియంది నాక్కాదు. మీకు. ఎప్పటికీ వాళ్లు పెద్ద గీతే. నేను చిన్న గీతే!’’ విసురుగా నిర్లక్ష్యంగా అన్నాను.
‘‘మనిషి వాస్తవంలో వర్తమానంలో జీవించాలి. ఊహల్లో కలల్లో కాదు! జీవితంలో శూన్యత లేకుండా చేసుకోవడమే జీవన సాఫల్యం!’’ అంటూ లేచి, హాల్లో కెళ్ళి, వార్తాపత్రిక తెచ్చి ‘‘ఇది చూడు’’ అన్నారు నాన్న.
మొదటి పేజీలో ప్రీతి ఫొటో! గత రాత్రి ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందిట!
‘‘మై గాడ్‌. దానికంత ఖర్మేం వచ్చింది?’’
‘‘అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. చూడమ్మా, మన జీవితం దేవుడు వడ్డించిన విస్తరి. మనకు దక్కిన దానితో తృప్తిపడాలి. దేవుడు నీకు ఏలోటూ చెయ్యలేదు... మంచి భర్తనూ బిడ్డనూ ఇచ్చాడు. కళ్లూ, కాళ్లూ, చేతులూ, మెదడూ ఇచ్చాడు. ఇంతకంటే ఐశ్వర్యాలేముంటాయి చెప్పు? వాటిని సద్వినియోగం చేసుకోవాలి, సోపానాలుగా మలచుకోవాలి తప్ప బూడిదలో పోసిన పన్నీరు చెయ్యకూడదు. ఉన్నదానితో తృప్తిపడుతూ ఉన్నత స్థాయి సాధించడానికి కృషి చేయాలి. అంతేకానీ పక్క విస్తరిలోని పదార్థాలను చూసి మన విస్తరి మీద ఉమ్మి వేసుకోకూడదు. కాళ్లకు ఖరీదైన చెప్పులు లేవని ఏడవడం కాదు, అసలు కాళ్లే లేనివాళ్లని చూడు. ఇప్పటికైనా విజ్ఞత తెచ్చుకో. సంతృప్తితో బతకడం నేర్చుకో. నీ వాళ్లూ, ఈ సమాజం, ఆ దేవుడూ మెచ్చేలా నీ జీవితాన్ని అర్థవంతం చేసుకో. పరిపూర్ణంగా జీవించు. మధ్యలో పోవడం కాదు, పోయేక కూడా బతికి ఉండటమే జీవిత పరమార్థం!’’
నా అజ్ఞానం, భ్రమా పొరలు పొరలుగా విడిపోతుంటే, నా ఈర్ష్య, అసూయ, అల్పభావనల తెరలూ పరపరమని చిరిగి పోతుంటే, అసంతృప్తి మెల్లగా అడుగంటుతోంటే... నన్ను నేను కొత్తగా కనుక్కున్నట్టు, సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ఆనందోద్విగ్ననయ్యాను.
‘‘సారీ నాన్నా! సారీ దేవుడూ!’’

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు