close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పూలవేజుకు... మగువ సొగసు..!

ఇంటి అలంకరణలో ఎన్ని అత్యాధునిక ట్రెండ్‌లు వచ్చినా మన సంప్రదాయం కలగలిసిన కళాకృతులు తెచ్చే అందం మాత్రం చాలా ప్రత్యేకం. ఇక, చక్కగా అలంకరించుకున్న భారతీయ మగువల ముఖంలో కనిపించే కళే వేరు. అందుకే, అందమైన అతివలూ రాజసం ఉట్టిపడే మగమహారాజుల త్రీడీ ముఖాలతో వస్తున్న పెద్ద పెద్ద వేజులు ఇప్పుడు ఇంటికి కొత్త కళను తెచ్చిపెడుతున్నాయి.

చూడగానే అందంగా ఆహ్లాదంగా కనిపించడానికి వేజుల్లో రంగు రంగుల పూలను అమర్చుతుంటాం. అయితే, చిన్న వేజుల్లో పువ్వుల్ని గుత్తుగా పెడితే వాటికింద ఉన్న వేజ్‌ అంతగా కనిపించదు. కాబట్టి, ఆ వేజులకి అందంతో పెద్దగా పనిలేదు. కానీ పూలతో పాటు వేజుని కూడా ఓ కళాకృతిలా అమర్చాలనుకునేవారు ఇంచు మించు టేబుల్‌ అంత ఎత్తులో ఉండే కూజా వేజుల్ని తెచ్చి పెడుతుంటారు. మట్టి, పింగాణీ, ఫైబర్‌లతో చేసిన ఈ పెద్ద కూజాలు ఇన్నాళ్లూ రకరకాల ప్రింట్లూ పెయింటింగులతో వచ్చేవి. అవీ అందంగానే ఉండేవి కానీ మరీ చూడగానే కళ్లప్పగించేసే అంత ప్రత్యేకంగా ఉన్నవైతే అరుదే. కొత్తగా వస్తున్న ఈ త్రీడీ ఫేస్‌ వేజ్‌లు మాత్రం అందుకు భిన్నం. వీటిని చూస్తే ఎవరైనా మనసుపారేసుకోవాల్సిందే.
‘అబ్బ ఎంత బాగుందో’ అంటూ దగ్గరికెళ్లి మళ్లీ మళ్లీ చూడాల్సిందే.

అచ్చం బొమ్మలానే...
పెద్ద పెద్ద కళ్లూ చూడచక్కని ముఖంతో నిండుగా అలంకరించుకున్న అతివలూ... ధైర్యం నిండిన కళ్లు, బుర్ర మీసాలూ, తలపాగాలతో భారతీయత కొట్టొచ్చినట్లు కనిపించే మగమహారాజుల రూపాలతో చేసిన టెర్రకోట కళాకృతులు మామూలుగానే బాగా ఆకట్టుకుంటాయి. అందుకే, చాలామంది వాటిని ఇష్టంగా ఇంట్లో అలంకరించుకుంటారు. అయితే, అటు బొమ్మ ఇటు వేజు రెండూ ఒకేదాన్లో కనిపించేలా రూపొందుతున్నవే త్రీడీ ఫేస్‌ వేజులు. నిజంగా అది బొమ్మేనేమో అనిపించేలా మట్టి, ఫైబర్‌లతో చేసిన కూజాల పైన వేరు వేరు ముఖాకృతులను రూపొందించడం వీటి ప్రత్యేకత. ఇంకా చిత్రం ఏంటంటే కొన్ని కూజాలమీదున్న బొమ్మలకు మేలిముసుగుని నిజమైన వస్త్రంతో తయారుచేసి అంటిస్తారు. ఇలాంటివైతే నిజంగానే అక్కడ అమ్మాయి కూర్చుని ఉందా అనేంత భ్రమ కలిగిస్తాయి. ఇక, వీటిలో రంగు రంగుల్లో విరబూసిన సహజమైన లేదా కృత్రిమ పూల కొమ్మల్ని అలంకరిస్తే ఇంకెంత సొగసుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పేదేముందీ...

ఇవి వేరు వేరు ఆన్‌లైన్‌ దుకాణాల్లో దొరుకుతున్నాయి. మీకూ కావాలంటే ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు.


‘మహా’ భారత్‌ చూద్దాం రండి!

కశ్మీర్‌ నుంచి తమిళనాడు వరకూ అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి గుజరాత్‌ వరకూ దేశ వైవిధ్యాన్ని ప్రతి భారతీయుడూ చూసి తీరాల్సిందే! అయితే అది అందరికీ సాధ్యం కాదుగా! అందుకే భారతదేశ విశిష్టతను షార్ట్‌ఫిల్మ్‌ల రూపంలోనైనా ప్రతి ఒక్కరికీ చూపాలనుకున్నారు దర్శకుడు భరత్‌ బాల. అందుకోసం ఆయన మొదలు పెట్టిన ప్రాజెక్టు ‘వర్చువల్‌ భారత్‌’.
భారతదేశం స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు చేసుకున్న వేళ ఏఆర్‌ రెహమాన్‌తో కలిసి ‘వందే మాతరం’ ఆల్బమ్‌ను తీసుకొచ్చిన దర్శకుడు భరత్‌ బాల. వాణిజ్య ప్రకటనల రూపకర్తగా ఈయనకు మంచి పేరుంది. హిందీ, తమిళ భాషల్లో రెండు సినిమాలూ తీశారీయన. బాల తండ్రి భరత్‌ స్వాతంత్ర సమరయోధుడు. తండ్రినుంచి దేశభక్తినీ వారసత్వంగా అందుకున్న బాల... ఆ దిశగా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుంటారు. వృత్తిలో భాగంగా దేశం నలుమూలలా పర్యటిస్తుంటారు. ఆ అవకాశం అందరికీ రాదు కాబట్టి ప్రతి రాష్ట్రంవారికీ దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయం, కళలువంటి అంశాలతోపాటు అసామాన్య వ్యక్తుల గురించి చెప్పాలన్న ఆలోచన ఆయనకు వచ్చింది. ఈ అంశాల్ని పది నిమిషాల లోపు నిడివి ఉండే వీడియోల రూపంలో చూపాలనుకున్నారు. అయిదేళ్లలో వెయ్యి షార్ట్‌ఫిల్మ్‌లు తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటి చిత్రీకరణ మాత్రం సినిమా స్థాయిలో ఉండాలనుకున్నారు.

స్నేక్‌ బోట్‌తో మొదలు...
కేరళ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది బ్యాక్‌ వాటర్స్‌... స్నేక్‌ బోట్‌ పోటీలు. వాటి గురించి బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని అంశం ఏంటంటే... అందులో పాల్గొనే వాళ్లు క్రీడాకారులు కాదు. రైతులూ, మత్య్సకారులూ, ఉపాధ్యాయులూ, చిరు వ్యాపారులూ... ఇలా వివిధ వృత్తులకు చెందిన వాళ్లు ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ, ఈ పోటీల్లో పాల్గొంటారు. తమ సంప్రదాయాన్ని బతికించుకోవాలనే తపన తమను ఈ పోటీల్లో పాల్గొనేలా చేస్తుందంటారు వాళ్లంతా. ‘తాళం’ పేరుతో తన మొదటి షార్ట్‌ఫిల్మ్‌ దీనిపైనే తీశారు బాల. దీన్లో రెహమాన్‌ వ్యాఖ్యాతగా కనిపించడం విశేషం. యూట్యూబ్‌-వర్చువల్‌ భారత్‌ ఛానెల్‌-లో ‘తాళం’ వీడియోకి అరకోటికిపైనే వ్యూస్‌ రావడం గమనార్హం.
పంజాబ్‌లోని భైనీ సాహిబ్‌ గ్రామంలో బాలబాలికలందరూ తప్పనిసరిగా సంగీతంలో శిక్షణ తీసుకుంటారు. సంగీతం వారి జీవితంలో ఎలా భాగమైందీ, దానివల్ల వారి జీవితాలు ఎలా మెరుగైందీ ఆ గ్రామస్తులు చెప్పే కథ వినాలంటే వర్చువల్‌ భారత్‌ చూడాల్సిందే. అలాగే- మహారాష్ట్రలో బామ్మలకు చదువుచెప్పే బడి, ఆ రాష్ట్రంలో మిరాజ్‌ పట్టణంలో తరాలుగా తంబురాలు తయారుచేస్తున్న కుటుంబాలూ, ఛత్తీస్‌గఢ్‌లో ఒంటినిండా రాముడి పేరు పచ్చబొట్టు పొడిపించుకునే రామ్‌నామీ తెగ, ఒడిశాకు చెందిన ఆదివాసీ కవి పద్మశ్రీ హల్దార్‌ నాగ్‌, చెన్నైలో గాంధేయవాది విశ్వనాథన్‌ జయరామన్‌... ఇలా ప్రతి భారతీయుడూ తెలుసుకోవాల్సిన వాస్తవ గాథలెన్నో ఇక్కడ కనిపిస్తాయి. ప్రస్తుతం ఉన్న సంప్రదాయాలతోపాటు గతంలో ఉన్న వాటినీ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు బాల. అలాంటిదే కేరళకు చెందిన గిరిజన తెగల వివాహ సంప్రదాయం గురించి చెప్పే ‘ముధువా కల్యాణం’ షార్ట్‌ఫిల్మ్‌.

డిజిటల్‌ మ్యూజియం
2019 నుంచి ఇప్పటివరకూ 40 షార్ట్‌ఫిల్మ్‌లను యూట్యూబ్‌లో పెట్టారు. 300 వరకూ అంశాలకు సంబంధించి రచన పూర్తయినా లాక్‌డౌన్‌, కరోనా కారణంగా వాటి చిత్రీకరణ ఆలస్యమవుతోంది. ‘ఇండియా ఒకప్పటిలా లేదు, దేశం చాలా మారిపోయింది. మనం గర్వంగా చెప్పుకోదగ్గ అంశాలేవీ ఇప్పుడు లేవని చాలామంది మాట్లాడుతుంటే వారికి ఎలా సమాధానం చెప్పగలనా అని ఆలోచించా. కొన్నాళ్ల కిందటే ఈ ఆలోచన వచ్చినా డిజిటల్‌ విప్లవం వచ్చాకే ఆ పని మొదలుపెట్టగలిగా’నంటారు బాల. ఈ వీడియోల ద్వారా వినోదం, విజ్ఞానం పంచడంతోపాటు దేశభక్తిని పెంపొందించాలనేది బాల ఉద్దేశం.. వీటిలో కొన్ని కథల్ని మనలో కొందరు ఇదివరకే విని ఉంటారు లేదా చదివి ఉంటారు. కానీ వాటిని వినూత్నంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు బాల. ‘దేశం గురించి నిరంతరం తెలుసుకుంటూ ఆ కథల్ని అందరికీ తెలియజేస్తుంటేనే నాకు సంతృప్తి’ అని చెప్పే బాల... ‘వర్చువల్‌ భారత్‌’- భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఓ వర్చువల్‌ మ్యూజియం కానుందంటారు.


ప్లేటులో వంట... ఆపైన మంట..!

పొయ్యిలో మంట పెట్టి వంట చెయ్యడం తెలిసిందే. మరి, వండిన పదార్థాలను ప్లేటులో వడ్డించాక ఆపైన మంట పెట్టడం గురించి విన్నారా..? పెద్ద పెద్ద రెస్టరెంట్లలో ఈమధ్య వంటకాలను ఇలా వినూత్నంగా వడ్డించి అతిథులను ఆకట్టుకుంటున్నారులెండి.

ఒకప్పుడు ఫ్యాషన్‌, ట్రెండ్‌... అంటే దుస్తులూ యాక్సెసరీలూ నగలే గుర్తుకొచ్చేవి. ఇప్పుడేమో వంటకాలూ ఆ లిస్టులోకి చేరాయి. తింటే నిమిషాల్లో ప్లేటు ఖాళీ అయిపోతుందని తెలిసినా వాటిని పెళ్లి కూతుర్ని ముస్తాబు చేసినట్లు చేస్తున్నారు మరి. కొన్ని రెస్టరెంట్లలో అయితే, ఇలా కూడా చేస్తారా... అన్నంత వినూత్నం గానూ అతిథుల ముందు వంటకాలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే ఇలా ప్లేటులో మండుతున్న వంటల్ని వడ్డించడం ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీన్నే ‘ఫైర్‌ ఆన్‌ ది ప్లేట్‌ ఫ్లేమ్‌బే’ అంటున్నారు. స్టార్‌ షెఫ్‌ల వంటల షోల్లో పొయ్యి మీదున్న పాన్‌లో మంటలు రావడం చూస్తుంటాం కదా... దీన్నే ఫ్లేమ్‌బే అంటారు. ఈ పదానికి ఫ్రెంచ్‌లో ‘మంట పెట్టింది’ అని అర్థం. వంటకానికి ప్రత్యేకమైన రుచీ ఆకర్షణీయమైన రంగూ వచ్చేందుకు పొయ్యిమీది నుంచి దించేముందు పాన్‌లో కొన్ని సెకన్లపాటు మండించడం ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడేమో ఏకంగా అతిథుల ముందు వడ్డించిన ప్లేట్లలోనే ఫ్లేమ్‌బేని ప్రదర్శిస్తున్నారు.

అన్ని రకాల వంటలకూ...
ఒకప్పుడు కేవలం పాశ్చాత్య వంటకాల్లో కొన్నిరకాలనే ఈ తరహాలో చేసేవారు. ఈమధ్య డెజర్ట్‌ల దగ్గర్నుంచి గులాబ్‌ జామూన్‌లూ ఐస్‌క్రీమ్‌లూ దోసెలూ చికెనూ మటనూ... ఇలా అదీ ఇదీ అని తేడా లేకుండా అన్నింటికీ ఫ్లేమ్‌బే టచ్‌ ఇస్తున్నారు. మన దగ్గర కూడా పెద్ద రెస్టరెంట్లలో చాకొలెట్‌ బాల్‌ ఫ్లేమ్‌బే బాగానే ప్రాచుర్యం పొందింది. దీనికోసం... డెజర్ట్‌ ఉన్న చాకొలెట్‌ బాల్‌ని అతిథుల ముందు ఉంచి దానికి మంట పెడతారు. అది నెమ్మదిగా కరిగి, సర్‌ప్రైజింగ్‌గా లోపల ఉన్న పుడ్డింగ్‌ కనిపిస్తుంది. ఇలా ప్లేటులోని ఆహార పదార్థాలను మండించడానికి ఎక్కువగా- కొద్దిపాటి ఆల్కహాల్‌ని ఉపయోగిస్తుంటారు. అలా వద్దు అనుకునేవారికోసం నూనెను మండించీ ఫ్లేమ్‌బే ప్రదర్శన ఇస్తారు. వంటకాలను ఆకర్షణీయంగా అలంకరించడం అందరికీ తెలిసిందే కదా. ఇంకాస్త కొత్తగా అతిథులను ఆకట్టుకుందామని మొదలు పెట్టిందే ఈ ఫైర్‌ ఆన్‌ ది ప్లేట్‌. ఏమైనా, ప్లేటులో ఆహారాన్ని మండించడం అంటే వెరైటీగా అనిపిస్తోంది కదూ..!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు