close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రమణులు మెచ్చే రాళ్లగాజులు..!

అమ్మాయిలకు ఎన్ని రకాల ఆభరణాలున్నా ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది. అయితే ఎంత ఇష్టం ఉన్నా అచ్చంగా బంగారంతో చేసిన నగలు ధరించడం ఈ తరం వాళ్లకి అంత నచ్చడం లేదు. ఎందుకంటే ధగధగలాడే ఎంబ్రాయిడరీ బ్లౌజులకి దీటుగానే ఆభరణాలూ ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఈమధ్య ఆ నగలన్నీ కూడా రత్నాలతో అందంగా మెరుస్తున్నాయి. అందులోభాగంగానే గాజులూ రంగు రంగుల రాళ్లతో గలగలలాడుతున్నాయి.

‘వసుకో ఈ గాజులూ చూసుకో నీ సొగసులు ఏ వయసుకాగాజులూ... ఏడు వారాలకూ గాజులు...’ అంటూ ఇల్లిల్లూ తిరిగే గాజుల కిష్టయ్యలూ వాటిని అంతే ఇష్టంగా చేతుల నిండుగా వేయించుకునే అమ్మాయిలూ ఇప్పుడు కనిపించకపోవచ్చు. కానీ మగువలకి గాజుల మీద ఎప్పటికీ మోజు తీరదన్నది నిజం. అందుకు నిదర్శనమే సరికొత్త మోడళ్లలో వస్తోన్న ఈ రాళ్ల గాజులు.
అవునుమరి, ఈ తరం అమ్మాయిలకు చేతులకు నిండుగా గాజులేసుకునే అలవాటు పోయిందనే చెప్పాలి. అలాగని గాజులేసుకోవడం మానేశారనీ అనలేం. పండగలూ సంప్రదాయ పెళ్లి వేడుకల సమయంలో ఆడపిల్లలూ ముత్తైదువులూ నిండుగా మట్టిగాజుల్ని వేసుకుంటూనే ఉన్నారు. కానీ రోజువారీ వేసుకునే వాటిల్లో మాత్రం సాదా బంగారు గాజులదే హవా. హారాలూ నెక్లెసులూ వంటి నగల్లో అక్కడక్కడా రాళ్లు పెట్టి చేయించుకున్నా గాజుల్ని మాత్రం ఎక్కువమంది అచ్చంగా బంగారంతోనే రకరకాల డిజైన్లలో చేయించుకునేవారు. మహా అయితే అక్కడక్కడా కొంతమంది ఎనామిల్‌ పెయింట్‌తో చేసినవి వేసుకునేవారు. కానీ ఇప్పుడా ట్రెండ్‌ మారుతూ వస్తోంది. మెడలో ధరించే నగలే కాదు, చేతికి వేసుకునే గాజులు కూడా రాళ్ల మెరుపులతో ఉంటే మరింత గ్రాండ్‌గా ఉంటుందన్న ఉద్దేశంతో రాళ్ల గాజులు చేయించుకునే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జరీదారాలతో మెరిసే పట్టుచీరలూ రాళ్లతో చేసిన ఎంబ్రాయిడరీ బ్లౌజులమీదకి సాదా బంగారు గాజులు మరీ సింపుల్‌గా ఉంటాయి. అదే రాళ్లతో చేసిన గాజులయితే చక్కగా మ్యాచవ్వడమే కాదు, అందంగా మెరుస్తుంటాయి. అందుకే ఇప్పుడు వేడుకలకీ పండగలకీ ధరించే పట్టుచీరలూ లెహంగాల మీదకి కెంపులూ, పచ్చలూ, నీలాలూ, వజ్రాలూ, అన్‌కట్సూ, తెల్లరాళ్లూ... ఇలా భిన్న రంగుల రత్నాలు పొదిగిన బంగారు గాజుల్ని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

ఎన్ని రకాల డిజైన్లో..!
అలాగని రాళ్లను చొప్పించి గాజుల్ని తయారుచేయడం మరీ కొత్త ట్రెండ్‌ అని చెప్పలేం. ఒకప్పుడు కూడా రాళ్ల గాజులు ఉండేవి. కానీ అప్పట్లో ఎక్కువగా కెంపులూ పచ్చలను మాత్రమే- అదీ ఒకటీ రెండు డిజైన్లలోనే పొదిగేవారు. కానీ ఇప్పుడలా కాదు, హారాలూ నెక్లెసుల్లో ఎన్ని రకాల డిజైన్లయితే ఉన్నాయో వాటిన్నింటినీ రాళ్లగాజుల్లోనూ చొప్పిస్తున్నారు. అచ్చంగా ఒకే రకమైన రత్నంతోగానీ రెండు మూడు రంగుల రాళ్లతోగానీ చేయించుకునేవాళ్లు కొందరైతే, నవరత్నాలనీ కలిపి చేయించుకునేవాళ్లు మరికొందరు. దానికితోడు పెళ్లి నగల్లో భాగంగా ఆయా సెట్స్‌కి మ్యాచయ్యేలా టెంపుల్‌, నక్షీ, పచీ, కుందన్‌ వర్కుల్లోనూ రాళ్ల గాజుల్ని చేస్తున్నారు డిజైనర్లు. వీటిల్లోనూ కొన్ని సన్నగా ఉంటే, మరికొన్నింటిని వెడల్పాటి కడాల్లా చేస్తున్నారు. వాటిల్లో పొదిగే రాళ్లను రకరకాల రేఖాగణిత ఆకారాల్లో చిన్నా పెద్దా సైజుల్లో కత్తిరిస్తున్నారు. దాంతో ఒక్కో గాజూ ఒక్కో డిజైన్‌లా కనిపిస్తోంది.

సాధారణంగా పంజాబీ అమ్మాయిలు పెళ్లిలో ఏనుగు దంతంతో చేసినవి వేసుకుంటే, చిన్న గవ్వలు, ఎర్ర పగడాలతో చేసిన గాజుల్ని చేతులకు వేసుకోవడం బెంగాలీల సంప్రదాయం. మనదగ్గర మాత్రం ఎంత సంపన్నులైనా లెక్క ప్రకారం 21, 22 చొప్పున గాజుల్ని వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సిరిసంపదలకోసం ఎరుపూ శుభం కలగాలనీ సంతానంతో వర్థిల్లాలని ఆకుపచ్చా ఆనందంగా జీవించేందుకు పసుపూ కొత్త జీవితానికి గుర్తుగా తెలుపూ సంసార జీవితం బాగుండాలని కోరుతూ నారింజా... ఇలా రంగురంగుల మట్టి గాజుల్ని కలగలిపి వేసి వాటి మధ్యలో బంగారు గాజుల్ని వేయడం వాడుకలో ఉండేది. సాధారణంగా పెళ్లి చీరలు కూడా ఆయా రంగుల్లోనే ఉండటంతో ఆ గాజులూ వాటిమీదకు చక్కగా మ్యాచయిపోయేవి. అయితే ఇప్పుడు స్థోమతను బట్టి పెళ్లిగాజుల్ని సైతం ఆయా రంగుల్లోని ఖరీదైన రాళ్లతోనే సెట్స్‌లా చేయించడం విశేషం. వీటి మధ్యలో ఎక్కడైనా ఒకటో రెండో మట్టిగాజుల్ని వేస్తున్నారు. ఏది ఏమైనా రాళ్ల గాజుల అందానికి మరేవీ
సాటిరావన్నది నిజం. అసలే తామరతూడుల్ని తలపించే కోమలమైన అమ్మాయిల చేతులకి ఈ బంగారు రాళ్ల గాజులు వేసుకుంటే ఎవరైనా కళ్లప్పగించాల్సిందే మరి!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు