close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
స్విగ్గీ... తెలుగు యువకుడి కల!

అంకుర సంస్థల ప్రపంచంలో భారతీయ యువత దూసుకుపోతున్న వార్తలెన్నో చదువుతున్నాం. వాటిలో కొన్ని యూనికార్న్‌(100 బిలియన్‌ డాలర్ల)స్థాయిని అందుకుంటున్నాయి. అయితే ఆయా సంస్థల వ్యవస్థాపకుల్లో తెలుగువాళ్ల పేర్లు కనిపించేది అరుదు. ఆ లోటుని తీరుస్తున్నాడు ఫుడ్‌ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి. ‘స్విగ్గీ’ని ఫుడ్‌ డెలివరీకి మారుపేరుగా మార్చేసిన శ్రీహర్ష ప్రస్థానమిది...
న జీవితాన్ని తీర్చిదిద్దడంలో పర్యటనలది చాలా ముఖ్యమైన పాత్ర అని చెబుతాడు శ్రీహర్ష. బిట్స్‌ పిలానీలో చదివేటప్పుడు ఫొటోగ్రఫీ క్లబ్‌లో చేరిన హర్ష... ఆ సమయంలో ఏటా దేశంలోని వివిధ ప్రాంతాలకు పర్యటనలకు వెళ్లేవాడు. ‘ఆ అనుభవంతో ఎన్నో నేర్చుకునేవాణ్ని. అప్పుడే పర్యటనల్ని నా జీవితంలో భాగం చేసుకోవాలనుకున్నా. దక్షిణాసియా, దక్షిణ అమెరికాల్లోనూ పర్యటించా. అయితే నన్ను పూర్తిగా మార్చింది మాత్రం పోర్చుగల్‌ నుంచి టర్కీ వరకూ 4000కి.మీ. మేర చేసిన ఐరోపా పర్యటన’ అని చెబుతాడు. ఆ దారిలో సైకిల్‌మీద ప్రయాణించడం ప్రపంచంలోనే అద్భుతమైన పర్యటన అని పుస్తకాలూ, స్నేహితులద్వారా తెలుసుకున్న హర్ష... ఆ అనుభూతిని పొందాల్సిందే అనుకున్నాడు. ‘అక్కడ ఎంత నెమ్మదిగా పర్యటిస్తే అంత బాగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఆరు నెలలపాటు సాగిన ఆ పర్యటనలో మూడు నెలలపాటు సైకిల్‌మీదే ప్రయాణించాను. నిజానికి ఆ పర్యటన రెండో రోజే కష్టంగా అనిపించింది. ఎత్తైన కొండలు ఉండే దారిలో పైకి సైకిల్‌మీద వెళ్లడం కష్టంగా అనిపించేది. ఈ విషయమే చెబితే... ‘పైకి వెళ్లేటపుడు ఏదైనా వాహనంలో వెళ్లు. కిందకు వచ్చేటపుడు సైకిల్‌ మీద రా’ అని సలహా ఇచ్చాడు ఆ పర్యటన గురించి చెప్పిన ఫ్రెండ్‌. ఆ సలహా పాటిస్తూ పర్యటనని కొనసాగించా. నా స్లీపింగ్‌ బ్యాగు, టెంటూ, బట్టలూ అన్నీ సైకిల్‌మీద పెట్టుకుని ప్రయాణించా’నని చెప్పే హర్ష... అక్కడ ప్రకృతిని ఆస్వాదించడంతోపాటు యోగి తరహా జీవనశైలికి అలవాటు పడ్డాడనంటాడు. ఓర్పు, సహనం అనుభవమయ్యాయనీ, పరిమిత వనరులతో జీవించడం తెలుసుకున్నాననీ... అవన్నీ వ్యాపార ప్రస్థానంలో ఉపయోగపడ్డాయనీ చెబుతాడు.

విజయవాడ కుర్రాడు...
హర్ష పుట్టి పెరిగింది విజయవాడలో. తండ్రి వ్యాపారి, వీరికో రెస్టరెంట్‌ ఉంది. తల్లి డాక్టర్‌, సొంత క్లినిక్‌ నడుపుతారు. బిట్స్‌ పిలానీలో బీటెక్‌(ట్రిపుల్‌ఈ)తోపాటు ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ(ఫిజిక్స్‌)చేశాడు. స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు నందన్‌రెడ్డి హర్షాకి బిట్స్‌లోనే పరిచయం. తను హర్షాకు రెండేళ్ల జూనియర్‌. ఫొటోగ్రఫీ క్లబ్‌లో సభ్యుడు. ‘బిట్స్‌లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌కు వెళ్లలేదు. ఏ ఉద్యోగంలో చేరాలన్న విషయంలో స్పష్టత రాలేదప్పటికి. తర్వాత ఎంబీఏ కోసం ఐఐఎమ్‌ కలకత్తాలో చేరా’నని చెప్పే హర్షా... ఆ రెండేళ్లలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయంటాడు. ప్లేస్‌మెంట్‌ కమిటీలో సభ్యుడిగా ఉంటూ వందల కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల్ని చూపే బాధ్యతనీ తీసుకున్నాడు. మరోవైపు తనూ ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ‘నాకు మ్యాథ్స్‌ అంటే ఇష్టం. ఫైనాన్స్‌లో వాటి వినియోగం ఎక్కువగా ఉంటుందని లండన్‌ కేంద్రంగా పనిచేసే ఒక ట్రేడింగ్‌ కంపెనీలో చేరా.  అక్కడ ఏడాదిపాటు పనిచేశా’ అని చెబుతాడు హర్ష.

‘బండిల్‌’గా మొదలు...
మొదట్నుంచీ సొంతంగా ఏదైనా చేయాలనేది హర్షా ఆలోచన. ఈ విషయంలో అమ్మానాన్నలే స్ఫూర్తిగా చెబుతాడు. తెలుగు యువకుడు ఫణీంద్ర శర్మ నెలకొల్పిన ‘రెడ్‌బస్‌’ విజయం హర్షాని ఇంటర్నెట్‌ ఆధారిత అంకుర సంస్థల గురించి ఆలోచించేలా చేసింది. యూకే నుంచి తిరిగి వస్తున్నపుడే ఏదైనా స్టార్టప్‌లో సహ వ్యవస్థాపకుడిగా చేరడం, లేదంటే సంస్థని ఏర్పాటుచేయడం... వీటిలో ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. లండన్‌లో ఉన్నపుడే నందన్‌తో తరచూ మాట్లాడేవాడు. తను అప్పటికి ఓ స్టార్టప్‌లో పనిచేసేవాడు. హర్షా ఇండియా తిరిగొస్తే ఇద్దరూ కలిసి పనిచేయాలనుకున్నారు. ‘మొదట పర్యాటక సంస్థ గురించి ఆలోచించా. అయితే ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లాంటి ఈ-కామర్స్‌ సంస్థలు బాగా రాణిస్తున్నాయనీ, కానీ వాటికి లాజిస్టిక్స్‌(వస్తువుల సరఫరా) సమస్య ఉందనీ గమనించాం. ఆ సమస్యని తీర్చేలా ఓ కొరియర్‌ సంస్థని పెట్టాలనుకున్నాం’ అని చెప్పే హర్షా... 2013 ప్రారంభంలో నందన్‌తో కలసి బెంగళూరులో ‘బండిల్‌’ అనే కొరియర్‌ సంస్థని పెట్టాడు. టెక్నాలజీ తయారీని ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారు. బండిల్‌ సేవలు మొదలుపెట్టిన సమయానికి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సొంత కొరియర్‌ విభాగాల్ని ఏర్పాటుచేసుకున్నాయి. మరికొన్ని సంస్థలు వీరి సేవల వినియోగానికి ముందుకొచ్చాయి. కానీ అక్కడ ఎదుగుదల ఉండదనిపించి కొద్ది నెలల్లోనే బండిల్‌ సేవల్ని నిలిపేశారు. అయినా ‘బండిల్‌’ ద్వారా తక్కువ ఖర్చుతోనే చాలా పాఠాలు నేర్చుకున్నామంటాడు హర్ష. ఈసారి ప్రజలతో నేరుగా సంబంధం ఉండే వ్యాపారంలోకి దిగాలనుకున్నారు. సహ వ్యవస్థాపకుడిగా టెక్నాలజీ నైపుణ్యం ఉన్న వ్యక్తిని చేర్చుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో స్నేహితులద్వారా రాహుల్‌ జైమిని పరిచయం అయ్యాడు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకుని మింత్రాలో పనిచేసేవాడు రాహుల్‌. నగరాల్లో దేన్నైనా, ఏ మూలకైనా స్వల్ప వ్యవధిలో అందించే నెట్‌వర్క్‌ ఏర్పాటుచేయాలనేది వీరి కొత్త ఆలోచన. ‘అప్పటికి బ్యాచిలర్స్‌ కావడంతో చాలా వరకూ హోటల్స్‌ నుంచి పార్శిళ్లు తెప్పించుకునేవాళ్లం. కొన్ని మంచి హోటళ్లకు పార్శిల్‌ విభాగం ఉండేది కాదు. కొందరు కనీసం రూ.500 విలువచేసే ఆర్డర్‌ ఇవ్వాలని చెప్పేవారు. ఈ అనుభవంతో ఫుడ్‌ డెలివరీలోకి అడుగుపెట్టాలనుకున్నాం. మా కొత్త సంస్థకు స్విగ్గీ అని పేరుపెట్టాం’ అని చెబుతాడు హర్ష.
ప్రారంభం నుంచీ స్విగ్గీలో కనీస మొత్తంలో ఆర్డర్‌ చేయాలనే నియమం పెట్టలేదు. అలాగే ఆర్డర్‌ని 30 నిమిషాల్లో అందించాలనే టార్గెట్‌ నిర్దేశించుకున్నారు. ‘నగరాల్లో ఉండే ట్రాఫిక్‌కు అది పెద్ద సవాలే. అల్ట్రా లోకలైజేషన్‌ విధానంలో ఇది సాధ్యమవుతుంది. అంటే అమ్మకందారు, కొనుగోలుదారు భౌగోళికంగా దగ్గరగా ఉండాలి. యువత ఎక్కువగా ఉండే బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో 2014 ఆగస్టులో మా సేవల్ని ప్రారంభించాం. 20 రెస్టరెంట్ల మెనూ వివరాల్ని మా వెబ్‌సైట్లో పెట్టాం. అయిదుగురు డెలివరీ పార్ట్‌నర్లని నియమించుకుని, ఆ రెస్టరెంట్ల దగ్గర పాంప్లెట్లు పంచాం. మొదటి రెండు రోజులూ పదివరకూ ఆర్డర్లు వచ్చాయి. దీని గురించి తమ ఆఫీసుల్లో చెప్పమని ఫ్రెండ్స్‌కి మెయిల్స్‌ పెట్టాం. ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసే ఒక ఫ్రెండ్‌ తమ సంస్థ ఉద్యోగుల వెబ్‌సైట్లో స్విగ్గీ గురించి చెప్పడంతో మా గురించి చాలామందికి తెలిసింది. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. మావల్ల రెస్టరెంట్ల వారికి కొత్త కస్టమర్లు రావడంతో వాళ్లు కూడా ఆసక్తి చూపేవారు. కొన్నిసార్లు నేనుకూడా ఆర్డర్లని డెలివరీ చేసేవాణ్ని. దీనివల్ల ఆ చెయిన్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నా. నందన్‌, నేనూ మార్కెటింగ్‌లోనూ, కస్టమర్‌ రిలేషన్స్‌ పనుల్లోనూ బిజీగా ఉంటే రాహుల్‌ కోడింగ్‌ రాసేవాడు. ఒకసారి ఆప్‌ వచ్చాక మాకు డిమాండ్‌ బాగా పెరిగింది’ అని స్విగ్గీ ప్రారంభ రోజుల్ని గుర్తుచేసుకుంటాడు హర్ష.
2015 జనవరిలో మొదటిసారి ఫండింగ్‌ కోసం ప్రయత్నించింది హర్షా బృందం. ‘డోమినోస్‌ కస్టమర్లలో రెస్టరెంట్‌కి వచ్చేవాళ్లూ ఉంటారు. ఇంటికి తెప్పించుకునేవాళ్లూ ఉంటారు. హోటళ్ల సంగతి చూస్తే వెళ్లి తినేవాళ్లే తప్ప, ఆహారాన్ని ఇంటికి తెప్పించుకునేవాళ్లు తక్కువ. మేం రెండో అంశంమీద దృష్టి పెట్టి. ప్రతి హోటల్‌నీ డోమినోస్‌ ఔట్‌లెట్‌గా మార్చాలను కుంటున్నాం... అని పెట్టుబడిదార్లకు చెప్పేవాణ్ని. అప్పటికే కొద్దిమంది కస్టమర్లు వారంలో రెండుమూడు సార్లు మా సైట్‌కి వచ్చి ఆర్డర్లు ఇస్తుండేవారు. దాన్ని రిటెన్షన్‌ అంటారనీ, బ్రాండ్‌మీద నమ్మకానికి అదో కొలబద్ద అనీ వాళ్లతో మాట్లాడాకే తెలిసింది’ అని చెబుతాడు హర్ష. యాక్సెల్‌, ఎస్‌ఏఐఎఫ్‌ పార్ట్‌నర్స్‌... లాంటి ఫండింగ్‌ సంస్థలు మొదటిసారి చర్చల్లోనే సుమారు రూ.1000 కోట్లు అందించాయి. ఆ తర్వాత 2-3 వందల మంది ఉద్యోగుల్ని చేర్చుకున్నారు. పిలానీ మిత్రులూ, ఎంబీఏ సహాధ్యాయులకు సమాచారం ఇచ్చి కొత్తవాళ్లని నియమించుకునేవాళ్లు.

వేగవంతమైన యూనికార్న్‌!
పుస్తకాలు ఎక్కువగా చదువుతాడు హర్ష. అందువల్ల కొత్త అవకాశాలతోపాటు సమస్యలకు పరిష్కారాలూ కనిపిస్తుంటాయంటాడు. సీనియర్లతో, స్నేహితులతో తరచూ మాట్లాడుతూ రాబోయే మార్పుల గురించి తెలుసుకుంటాడు. వాటికి తగ్గట్టు ప్రణాళికలు రచిస్తాడు. ‘అలా ఆలోచించే 2017లో క్లౌడ్‌ కిచెన్లు ఏర్పాటుచేశాం. ఎవరైనా కొత్తగా హోటల్‌ పెట్టాలంటే కష్టం. బదులుగా వారి ఉనికి లేని ప్రాంతాల్లో మేం వారికి కొంత స్థలం ఇచ్చి మాద్వారా ఆన్‌లైన్‌ ఆర్డర్లు మాత్రం తీసుకునేలా క్లౌడ్‌ కిచెన్లు ఏర్పాటుచేయించాం. దీనివల్ల మాతోపాటు హోటళ్లవాళ్లకూ, వినియోగదారులకూ లాభమే. క్లౌడ్‌ కిచెన్స్‌ ఏర్పాటుచేశాక ఆ విభాగంలోనే కొత్తగా 200 బ్రాండ్లు వచ్చాయి’ అని చెబుతాడు హర్ష. 2018లో 1.3బిలియన్‌ విలువ సంపాదించి... టెక్‌ రంగంలో ఆ సమయానికి అత్యంత వేగంగా ఎదిగిన యూనికార్న్‌(వంద బిలియన్‌ డాలర్ల విలువ)గా గుర్తింపు సాధించింది స్విగ్గీ. వేటినైనా సరఫరా చేసేందుకు అవసరమైన టెక్నాలజీ ఉంది స్విగ్గీకి. కాబట్టి విభిన్న రంగాలకు వీరి సేవల్ని విస్తరిస్తున్నారు. పండ్లూ కూరగాయలూ, కిరాణా సరకులు, పాలు లాంటి నిత్యావసరాల సరఫరా విభాగాల్లో సేవలు అందిస్తోంది స్విగ్గీ. సూపర్‌డైలీ, ఇన్‌స్టామార్ట్‌ లాంటి ఆప్‌లు వీరికి చెందినవే. ఇంజినీరింగ్‌, ఆటోమేషన్‌, డేటా సైన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, పర్సనలైజేషన్‌ ద్వారా సేవలు అందించే తీరులోనూ చాలా మార్పు తీసుకొచ్చారు. వాటి కారణంగానే పోటీదారులకంటే త్వరత్వరగా ముందుకు వెళ్లగలిగింది స్విగ్గీ.
‘నాయకుడంటే జట్టులో స్ఫూర్తి నింపాలి. నమ్మకంగా ముందుకు నడిపించాలి’ అని చెప్పే హర్ష.. కొవిడ్‌ లాంటి ఆపత్కాలంలోనూ కంపెనీని ముందుండి నడిపిస్తున్నాడు. 2020 ప్రారంభం నాటికి రోజుకు 15 లక్షలకుపైగా ఆర్డర్లు స్విగ్గీకి వచ్చేవి. గతేడాది కొవిడ్‌ ప్రారంభంలో అవి 15 శాతానికి పడిపోగా, ఇప్పుడు 70-80 శాతం వరకూ పూర్వస్థాయిని చేరుకోగలిగారు. విలువల పరంగా టాటాలే స్ఫూర్తి అని చెప్పే హర్ష... ‘దేశంలో గొప్ప ఇంటర్నెట్‌ సేవల కంపెనీ’గా ఎదగాలనేది తమ లక్ష్యమని చెబుతాడు.

శ్రీమంతుల జాబితాలో...

తాజా లెక్కల ప్రకారం స్విగ్గీ విలువ దాదాపు రూ.35వేల కోట్లు.
* 500 నగరాల్లో లక్ష రెస్టరెంట్లతో భాగస్వామ్యం ఉంది.
* రెండు లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్స్‌ ఉన్నారు.
* రూ.1400 కోట్ల విలువైన సంపదతో గతేడాది హ్యూరన్‌  యువ శ్రీమంతుల జాబితా(స్వశక్తి)లో చోటు సంపాదించాడు శ్రీహర్ష.
* స్విగ్గీలో హర్షాకు 5.82 శాతం, నందన్‌కు 2.63, రాహుల్‌కి 2.10 శాతం చొప్పున వాటాలున్నాయి. రాహుల్‌ గతేడాది స్విగ్గీని వదిలి అంకుర సంస్థ ‘పెస్టో టెక్‌’లో సహ వ్యవస్థాపకుడిగా చేరాడు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు