close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇదేం ‘చెత్త’ పగరా నాయనా!

మీరు ఎన్నో భయంకరమైన పగల గురించి వినుంటారు. కానీ న్యూయార్క్‌లో ఒకాయన పగ గురించి వింటే మాత్రం నవ్వొచ్చేస్తుంది. ఇంతకీ ఆ కథేంటంటే... ఎడ్వర్ట్‌ పాటన్‌, చెరిల్‌ పాటన్‌ అనే జంట న్యూయార్క్‌లో ఉంటోంది. మూడేళ్లుగా రోజూ వాళ్ల ఇంటి లాన్లో వాడేసిన కాఫీ కప్పులు, టిష్యూలు కనిపించేవి. మొదట్లో ‘ఎవరో పొరపాటున వేసుంటార్లే’ అనుకున్నారు. తర్వాత రోజూ ఒకే సమయంలో, ఒకే దగ్గర చెత్త పడటం చూసి, ‘చుట్టుపక్కల వాళ్లెవరైనా కావాలనే ఇలా చేస్తున్నారేమో పట్టుకుందాం’ అని అక్కడ ఓ సీసీ కెమెరాను ఉంచారు. ఎవరో కారులో వచ్చి చెత్త వేస్తున్నట్లు కెమెరాలో కనిపించింది కానీ ఆ కారు నెంబరు అందులో కనిపించలేదు. ఈసారి పక్కింటి వాళ్ల సాయంతో కాపు కాచి, చెత్త వేస్తున్న వ్యక్తి కారు నెంబరు సంపాదించి పోలీసులకు ఇచ్చారు. తీరా ఆయన ఎవరో తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు. ఎందుకంటే ఆ చెత్త వేసిన వ్యక్తి వయసు 76 ఏళ్లు. అతని పేరు లారీ పోప్‌. అతను చెరిల్‌తో కలిసి గతంలో ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పని చేసేవాడు. అప్పుడు ఇద్దరి మధ్యా జరిగిన చిన్న గొడవను మనసులో పెట్టుకుని ఇలా చేశాడట. ఈ విషయం విన్నవారంతా ‘ఇలా కూడా పగ తీర్చుకుంటారా...!’ అని ఆశ్చర్యపోతున్నారు!


వెరైటీ టీ... వెయ్యి రూపాయలు!

పాలు, టీ పొడి, చక్కెర కలిపి తయారుచేసిన చాయ్‌తో పాటు గ్రీన్‌ టీ, లెమన్‌ టీ... ఇలా నాలుగైదు రకాల టీలు అన్నిచోట్లా దొరికేస్తాయి. అందులో ప్రత్యేకత ఏముందనుకున్న పార్థ ప్రతిమ్‌ గంగూలీ ఏకంగా 115 విభిన్న రుచుల్లో చాయ్‌ని తయారుచేసి అమ్ముతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కోల్‌కతాలోని ముకుంద్‌పూర్‌లో రోడ్డు పక్కనే టీ స్టాల్‌ నడుపుతున్న పార్థ ఇదివరకు ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేసేవాడు. టీ అంటే ఉన్న ఇష్టంతో ఈ వ్యాపారంలో దిగాడు. అందరికన్నా భిన్నంగా ఉండాలనే కోరికతో దేశవిదేశాల్లో దొరికే వైట్‌ టీ, హైబిస్కస్‌, లావెండర్‌, యెర్బా, చాకొలేట్‌, జపనీస్‌ వైట్‌ లీఫ్‌ టీ... ఇలా ఎన్నో రుచుల చాయ్‌లతో ఈ టీ స్టాల్‌ నడుపుతున్నాడు. ధర 12 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకూ ఉంటుంది. వెరైటీ టీలు ఇష్టపడేవారు ఇక్కడకొచ్చి లొట్టలేసుకుంటూ నచ్చిన టీలు తాగేసి వెళుతుంటారట.


బర్త్‌డే జాక్‌పాట్‌!

పుట్టిన రోజుకు వచ్చిన బహుమతుల్ని చూసి ఆనందించడం మామూలే. కానీ అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఎలిజబెత్‌ కొకర్‌ అనే ఆవిడ మాత్రం ఏకంగా ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయింది. ఎందుకంటే ఆమె జాక్‌పాట్‌ కొట్టేసింది మరి! అసలు ఏం జరిగిందంటే... ఎలిజబెత్‌ పుట్టినరోజుకు ఆమె సోదరుడు ఓ లాటరీ టికెట్‌ను కొని బహుమతిగా ఇచ్చాడు. తీరా చూస్తే దానికి 5,000,00 డాలర్ల (దాదాపు నాలుగు కోట్ల రూపాయలు) జాక్‌పాట్‌ తగిలింది. ఇంకేముంది... ఈ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైన ఎలిజబెత్‌ వచ్చిన డబ్బులతో సోదరుడికి మంచి బహుమతి కొనిస్తానంటూ ఆనందంగా చెబుతోంది.


‘నిజాయతీ’ దుకాణం!

క్కడ తోటలో పండించిన తాజా కూరగాయలూ, పండ్లూ ఉంటాయి. దేని ఖరీదు ఎంతో తెలుపుతూ ధరల పట్టీ ఉంటుంది. పక్కనే డిజిటల్‌ పేమెంట్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ‘ఇప్పుడు ఏ దుకాణంలోనైనా ఇలాగే ఉంటుంది. ఇందులో ఏముంది విచిత్రం’ అనుకుంటున్నారా? అసలు విషయం ఏమంటే... ఈ కూరగాయల దుకాణంలో అమ్మే వ్యక్తి ఎవరూ ఉండరు. ఎవరైనా తమకు కావాల్సిన కూరగాయల్ని తీసుకుని డబ్బులు అక్కడ ఉంచి వెళ్లిపోవచ్చు. ‘ఈ దుకాణమేదో బాగుందే. ఇంతకీ ఎక్కడుంది?’ అంటారా... జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌ అనే ఊళ్లో. ‘నిజాయతీ’ పేరుతో మల్లారెడ్డి అనే రైతు తన తోట పక్కనే ఏర్పాటు చేసిన దుకాణం ఇది. ఈ కొత్తవిధానం చాలామందికి నచ్చి కూరగాయలూ, పండ్లూ తీసుకుని డబ్బులు అక్కడ పెట్టి వెళుతున్నారట. ఐడియా అదిరింది కదూ..!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు