close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ramzan Special Recipes: ఇఫ్తార్‌కు పోషకాల విందు

ముస్లింలు కఠిన ఉపవాసం చేసే రంజాన్‌ మాసం ఇది. ఈ సమయంలో వాళ్లకు పోషకాలు అందాలంటే... ఇఫ్తార్‌ విందులో ఇలాంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

దహీ కబాబ్‌

కావలసినవి: నీళ్లు పూర్తిగా వడకట్టిన పెరుగు: ముప్పావు కప్పు, పనీర్‌ తురుము: ఒకటింబావుకప్పు, జీడిపప్పు పలుకులు: టేబుల్‌స్పూను, ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు, అల్లం ముద్ద: ఒకటిన్నర చెంచా, పచ్చిమిర్చి ముద్ద: అరచెంచా, గరంమసాలా: ఒకటింబావు చెంచా, కొత్తిమీర తరుగు: మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, బ్రెడ్‌పొడి: అరకప్పు, సెనగపిండి: మూడుటేబుల్‌స్పూన్లు, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం: పెరుగును ఓ గిన్నెలో తీసుకోవాలి. ఇందులో సెనగపిండి, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి పావుగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని కబాబ్‌ ఆకృతిలో చేసుకుని సెనగపిండిలో దొర్లించాలి. ఇదేవిధంగా అన్నీ చేసుకుని రెండు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే సరి.


డ్రై ఫ్రూట్స్‌ గుజియా

కావలసినవి: మైదా: రెండుకప్పులు, చక్కెర: టేబుల్‌స్పూను, పాలపొడి: టేబుల్‌స్పూను, ఇన్‌స్టంట్‌ ఈస్ట్‌: చెంచా(బజార్లో దొరుకుతుంది), బేకింగ్‌పౌడర్‌: చెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా. పాకంకోసం: చక్కెర: రెండు కప్పులు, నీళ్లు: కప్పు, నిమ్మరసం: చెంచా. ఫిల్లింగ్‌కోసం: అన్నిరకాల డ్రైఫ్రూట్స్‌ పలుకులు: అరకప్పు, వెన్న: పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా.
తయారీ విధానం: ముందుగా పాకం పట్టుకోవాలి. స్టౌమీద ఓ గిన్నెపెట్టి పాకం కోసం పెట్టుకున్న పదార్థాలను అందులో వేసుకోవాలి. చక్కెర కరిగి లేత పాకం వస్తున్నప్పుడు దింపేయాలి. అదేవిధంగా స్టఫింగ్‌కోసం పెట్టుకున్న పదార్థాలను కూడా ఓ గిన్నెలో వేసి అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో మైదా, చక్కెర, పాలపొడి, ఈస్ట్‌, బేకింగ్‌పౌడర్‌, ఉప్పు తీసుకుని అన్నింటినీ కలుపుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీళ్లు పోస్తూ దోశపిండిలా చేసుకుని గంటసేపు నాననివ్వాలి. ఇప్పుడు స్టౌమీద పాన్‌పెట్టి దానిపైన మైదా మిశ్రమాన్ని చిన్న దోశలా వేసుకోవాలి. ఒకవైపు పూర్తిగా కాలాక తీసేయాలి. దీనిపైన డ్రైఫ్రూట్స్‌ మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి అంచుల్ని జాగ్రత్తగా మూసేయాలి. ఇదేవిధంగా అన్నింటినీ చేసుకుని రెండుమూడు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఆ తరువాత అన్నింటినీ చక్కెర పాకంలో  ముంచి తీస్తే సరిపోతుంది.


కీమా కిచిడీ

కావలసినవి:బాస్మతీ బియ్యం: రెండు కప్పులు, పెసలు: కప్పు, మిరియాలు: ఎనిమిది, లవంగాలు: ఎనిమిది, దాల్చినచెక్క: మూడు ముక్కలు, పసుపు: అరచెంచా, జీలకర్ర: అరచెంచా, ఉప్పు: తగినంత, కీమా: అరకేజీ, ఉల్లిపాయలు: మూడు పెద్దవి, టొమాటోలు: నాలుగు (గుజ్జులా చేసుకోవాలి), బంగాళాదుంపలు: నాలుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు: రెండు చెంచాలు, నూనె: రెండు కప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద: మూడు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి ముద్ద: రెండు చెంచాలు, కారం: చెంచా, దనియాలపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాలపొడి: అరచెంచా, ఎండుమిర్చి: మూడు.
తయారీ విధానం: బియ్యాన్ని గంటముందు నానబెట్టుకోవాలి. కీమాను కడిగి పెట్టుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి ముప్పావుకప్పు నూనె వేసి బంగాళాదుంపల్ని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌ని స్టౌమీద పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయముక్కలు, కీమా వేయించి, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, పసుపు, దనియాలపొడి, మిరియాలపొడి, కారం, ఎండుమిర్చి వేయాలి. అన్నీ వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద, టొమాటో గుజ్జు వేసి మూత పెట్టాలి. కీమా ఉడికి ఈ మిశ్రమం కూరలా తయారయ్యాక నానబెట్టుకున్న పెసలు, బియ్యం వేసి ఐదు కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. మూడు కూతలు వచ్చాక దింపేసి... వేయించుకున్న బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని పైన అలంకరించి వడ్డించాలి.


చికెన్‌ పకోడా

కావలసినవి: చికెన్‌: పావుకేజీ, ఉప్పు: తగినంత, కారం: ఒకటిన్నర టేబుల్‌స్పూను, పసుపు: పావుచెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: పావుచెంచా, మిరియాలపొడి: పావుచెంచా, గరంమసాలా: అరచెంచా, కొత్తిమీర తరుగు: కొద్దిగా, నిమ్మరసం:
టేబుల్‌స్పూను, మైదా: రెండున్నర టేబుల్‌స్పూన్లు, మొక్కజొన్నపిండి: రెండున్నర టేబుల్‌స్పూన్లు, గుడ్డు: ఒకటి, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం: ఓ గిన్నెలో చికెన్‌ముక్కల్ని తీసుకోవాలి. ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని అన్నింటినీ బాగా కలిపి అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత చికెన్‌ ముక్కల్ని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు