close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Inspirational Stories: మీ సేవలకు సలామ్‌!

కొందరంతే... ఎదుటివారి కష్టాన్ని తమదిగా భావిస్తారు. వారికి మేలు చేయడంలోనే తృప్తి ఉందనుకుంటారు. ఇక్కడున్న వ్యక్తులు అలాంటి నిస్వార్థ సేవల్నే అందిస్తున్నారు.


ఒక్కడు 70 మందిని పంపాడు...

సిలూ నాయక్‌... ఉదయం అయిదింటికే నిద్రలేచి అయిదున్నరకల్లా గ్రౌండ్‌కి చేరుకుంటాడు. భద్రతా దళాల్లో చేరాలనుకునే యువతకు అక్కడ దాదాపు రెండు గంటలు శరీర దారుఢ్యంపైన శిక్షణ ఇస్తాడు. మళ్లీ సాయంత్రం 6-8 వరకూ రాత పరీక్షకు అవసరమైన పాఠాల్ని చెబుతాడు. మధ్యలో అతడు చేసే పని ఏంటంటే... వ్యవసాయం. అవును, నిజం. భద్రతా దళాల్లో చేరి కుటుంబానికి ఆసరాగా ఉండాలనేది సిలూ లక్ష్యం. అందుకు అవసరమైన శిక్షణ తీసుకున్నాడు కూడా. అయితే అతడి ఎత్తు(168 సెం.మీ.) సిలూకి సమస్య అయింది. భద్రతా దళాల్లో చేరడానికి 169 సెం.మీ. కనీస ఎత్తు ఉండాలనేది నిబంధన. దాంతో అతడు ఎంత శ్రమించినా ఎంపిక కాలేకపోయాడు. రాష్ట్ర పోలీసు విభాగంలోని ‘ఒడిశా ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌’లో చేరే అవకాశం వచ్చింది. కానీ అక్కడ జీతం చాలా తక్కువ. అందుకే ఊళ్లో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ డ్రైవర్‌గానూ పనిచేస్తున్నా. అదే సమయంలో కొందరు యువకులు తమకు మార్గనిర్దేశం చెయ్యమని సిలూ దగ్గరకు వస్తుండేవారు. తన కలను వాళ్ల రూపంలోనైనా నెరవేర్చుకోవచ్చని శిక్షణ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు సిలూ. మూడేళ్లుగా ఈ శిక్షణ ఇస్తున్నాడు. 300 మందికి శిక్షణ ఇవ్వగా 70 మంది వరకూ వివిధ సర్వీసులు పొందారు. సిలూ ఇదంతా ఉచితంగానే చేస్తున్నాడంటే నమ్మగలరా!


నగలు తాకట్టు పెట్టి!

కొవిడ్‌ కారణంగా చిన్న కుటుంబాలూ ఆర్థికంగా తలకిందులవుతున్నాయి. అలాంటిది 23 మంది పిల్లలున్న ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పేదేముంది. బెంగళూరుకు చెందిన శివాజీ లాజరస్‌, ప్రేమ 2010లో ‘మిరాకిల్‌ మన్నా చిల్డ్రన్స్‌ హోమ్‌’ని మొదలుపెట్టారు. వీరి బంధువుల్లో ఒక వ్యక్తి తన భార్యనీ, ముగ్గురు పిల్లల్నీ వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ముగ్గురు పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి తమ కూతురితోపాటు వాళ్ల బాగోగుల్నీ చూడ్డం మొదలుపెట్టారు. తర్వాత ఎక్కడ అనాథ బాలలు కనిపించినా వాళ్లకు ఆశ్రయమిచ్చి చదివించేవారు. ప్రస్తుతం ఈ హోమ్‌లో 7-18 మధ్య వయసు పిల్లలు 23 మంది ఉన్నారు. శివాజీ కారు డ్రైవర్‌. ప్రేమ గృహిణి. వీళ్లమ్మాయి గ్రేసీ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. కొవిడ్‌ కారణంగా గతేడాది శివాజీ, గ్రేసీలు ఉద్యోగాలు కోల్పోయారు. దానికితోడు గతంలో ఆర్థికసాయం చేస్తూ వచ్చిన దాతలూ చేతులెత్తేయ డంతో చిల్డ్రన్స్‌ హోమ్‌ నడవడం కష్టంగా మారింది. పిల్లలకు దుస్తులూ, ఆహారం లాంటి అవసరాలతోపాటు వాళ్లుండే హోమ్‌కి అద్దె, స్కూల్‌ ఫీజులు మొదలైనవాటికి ఏడాదికి రూ.22 లక్షలు ఖర్చవుతుంది. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో తాము పొదుపు చేసుకున్న మొత్తాన్నీ, ఆ తర్వాత తమ నగల్లో కొన్నింటిని అమ్మడంతోపాటు మరి కొన్నింటిని తాకట్టు పెట్టగా వచ్చిన అయిదు లక్షల రూపాయల్ని హోమ్‌ కోసం ఖర్చు చేశారు. కానీ కరెంటు బిల్లు, ఇంటి అద్దె, స్కూల్‌ ఫీజులు బకాయిపడ్డారు. క్రౌడ్‌ ఫండింగ్‌ చేసే వెబ్‌సైట్లలో తమ సమస్య గురించి ఇటీవల చెప్పగా దాతలు ముందుకు వచ్చి రూ.50 లక్షలు అందించారు. వీటితో రెండేళ్లపాటు ఎలాంటి ఇబ్బందీ లేకుండా హోమ్‌ని నడపగలమని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు శివాజీ.


సేవలోనూ కలిసే అడుగులు...

హైదరాబాద్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌, మనోజ్‌కుమార్‌ కవలలు. వీరి రూపురేఖలే కాదు, ఆలోచనలూ ఒక్కటే. నగరంలోని మల్కాజిగిరి ప్రాంతంలో ఉండే ఈ సోదరులు... చిన్నప్పుడు, స్కూల్‌ దారిలో ఆకలితో అలమటిస్తున్న వ్యక్తుల్ని చూస్తే తమ లంచ్‌ బాక్సుల్ని ఇచ్చి ఆకలి తీర్చేవారు. వీరి తండ్రి వెంకటనారాయణరెడ్డి పోలీసు శాఖలో ఉద్యోగి. తల్లి మంగమ్మ గృహిణి. వారి అనుమతితో 2012లో డిగ్రీ చదువుతున్నపుడే ‘రాజమాత ఫౌండేషన్‌’ను ఏర్పాటుచేసి దానిద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంస్థలో ప్రస్తుతం మూడు వేల మంది వాలంటీర్లు ఉన్నారు. వీరంతా విరాళాలు అందిస్తూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనోజ్‌ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా, ఉదయ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయ్‌ జీతం మొత్తం ఫౌండేషన్‌కే అందిస్తాడు. ఉప్పల్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, బంజారాహిల్స్‌... ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తూ ఎవరైనా కనిపిస్తే ఆహారాన్ని అందిస్తారు. మానసిక దివ్యాంగుల్ని హాస్పిటల్‌లో చేర్పించి మామూలు వ్యక్తులుగా మార్చుతారు. గాయాలతో ఎవరైనా కనిపిస్తే ప్రాథమిక చికిత్స చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తారు. రక్తదానం చేస్తారు. వివిధ రకాలుగా ఇప్పటివరకూ వేలమందికి సాయపడ్డారు. అనాథ శవాలకు అంత్యక్రియలూ చేస్తుంటారు. వీరి సేవల్ని మెచ్చి టాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ రామ్‌లక్ష్మణ్‌ ఓమ్నీ వ్యాన్‌ను అందించారు. నటుడు సోనూసూద్‌ వీళ్ల సేవల్ని కొనియాడారు. చదువు విజ్ఞానాన్నీ, ఎన్‌ఎస్‌ఎస్‌ శిక్షణ సామాజిక బాధ్యతనీ నేర్పిందని చెప్పే ఈ సోదరులు... సాయం అవసరమైనవారు ‘రాజమాతఫౌండేషన్‌.ఆర్గ్‌’ను సంప్రదించవచ్చని చెబుతారు.

- ఎల్లయ్యోల ప్రభాకర్‌, హైదరాబాద్‌ సిటీ డెస్క్‌
Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు