close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Book Reviews: గానగంధర్వుడి జీవితం 

ఆబాలగోపాలాన్నీ తన పాటలతో అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితంలోని వివిధ పార్శ్వాల గురించి తెలుసుకోవాలనుకునే వారికోసం రచయిత గతంలో తాను రాసిన ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అన్న పుస్తకానికి బాలూ అనుమతితో మరింత సమాచారాన్ని చేర్చి, అకస్మాత్తుగా ఆయన పోవడంతో ఆ వివరాలనూ జతచేసి తెచ్చిన పుస్తకమిది. ఘంటసాలకు బాలూ ట్రాక్‌ పాడిన సందర్భం, ఓ హీరోయిన్‌ బాలూ పేరుమీద ప్రారంభించిన అభిమానసంఘం, బాలూ కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెట్‌ టీమ్‌... లాంటి విశేషాలే కాదు, ఆయన సినిమా తీసి చేయి కాల్చుకున్న వైనం, స్నేహితుడి మూలంగా సమస్యలనెదుర్కోవడం... లాంటివీ ఉన్నాయి. - శ్రీ

మన బాలూ కథ
రచన: భాస్కరుని సత్య జగదీష్‌
పేజీలు: 281; వెల: రూ. 350/-
ప్రతులకు: ఫోన్‌- 8712153417


మధ్యతరగతి జీవితం

అమ్మ, నాన్న, ఇల్లాలు, ఊరు... ఇలా ఒక్కో అంశంపై కథలు రాసి పుస్తకాలు తెచ్చిన రచయిత మూడు దశాబ్దాల్లో రాసిన కథల బృహత్‌ సంపుటమిది. ఇందులోని పలు కథలకు మధ్యతరగతి జీవితమే కేంద్రం. ఆధునిక కుటుంబ బంధాలు, వైద్యుల వ్యాపార దృక్పథం, సినీరంగ మాయాజాలం... ఇలా సమకాలీన ఇతివృత్తాలను ఆసక్తికరంగా మలిచారు. నత్తిని ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకున్న విద్యార్థి కథ ‘ముత్యమంతా పలుకు’. చిన్న ప్రోత్సాహం ఎంతటి బలాన్నీ, స్ఫూర్తినీ ఇస్తుందో చెప్తుంది. పారిశుద్ధ్య కార్మికుల జీవన శైలిని ప్రభావశీలంగా చిత్రించిన రచన ‘చీపురు’. ‘సూపర్‌ కిడ్‌’ కథ పిల్లల మీద మితిమీరిన ఒత్తిడి తెచ్చే తల్లిదండ్రులపై విమర్శ. పురుషాధిక్యతను తగ్గించుకున్న భర్తలూ, బతికున్నపుడు తండ్రిని నిర్లక్ష్యం చేసి, కర్మకాండను ఘనంగా జరిపే కొడుకులూ, కష్టాలకోర్చి జీవనపోరాటం చేసే యువతులూ.. ఈ సంపుటంలో తారసపడతారు. కథల పేర్లు విభిన్నంగా, ఆసక్తి కరంగా ఉన్నాయి. - సీహెచ్‌.వేణు

కథమానం భవతి (నూటొక్క కథలు)
రచన: కె.వి.నరేందర్‌
పేజీలు: 706; వెల: రూ.900/-
ప్రతులకు: ఫోన్‌- 8179306464


అలనాటి కథలు

ఈతరం పిల్లలకు చందమామ లాంటి పత్రిక లేని లోటును కొంతవరకూ తీరుస్తాయి ఈ పుస్తకాలు. 1970-2012 మధ్యలోని చందమామల్లో ‘వసుంధర’ రాసిన కథలను ఆకర్షణీయమైన చిత్రాలతో సహా రెండు సంపుటులుగా ప్రచురించారు. ఒక్కో సంపుటిలోనూ యాభయ్యేసి కథలున్నాయి. ఎందుకూ పనికిరాని రంగడి వల్ల దేశానికి వానల్లేకుండా పోయిన కథ ‘అపాత్రుడికి వరం’, దేశభక్తీ రాజద్రోహం లాంటి మాటలు సందర్భాన్ని బట్టి ఎలా మారిపోతాయో చెబుతూ రాజుకున్న యుద్ధకాంక్షని వదిలించిన మంత్రి కథ ‘అర్థం లేని మాటలు’, గొప్ప పనులకన్నా వ్యక్తులకు పనికొచ్చే పనులు చేసినప్పుడే పాలకులకు వచ్చే ‘గుర్తింపు’... ఇలా కథలన్నీ నేటి సమాజానికీ వర్తిస్తాయి, ఆకట్టుకుంటాయి.  - పద్మ

చందమామ కథలు 1, 2
రచన: వసుంధర,
పేజీలు: ఒక్కోటీ 144; వెల: రూ.300/-
ప్రతులకు: ఫోన్‌- 0866 2439464


ఆగ్రహానందాల పదచిత్రాలు!

‘ఇక్కడ ఊరూ బయలూ ఒకటే/మేత తెచ్చుకోడానికెళ్లి పశువులకి బలి అవుతారు’ - హాథ్రాస్‌ హత్యాచార దుర్ఘటన తెలిసినవాళ్లకి ఈ కవితలో ఆవేశం అర్థమవుతుంది. అటు ఊరిలోనూ ఇటు బయల్లోనూ భద్రతలేని అమానవీయతకి అద్దం పట్టిన కవిత. ఇందులో భావుకుల ఎదని కేరింతలు కొట్టించే చక్కటి పదచిత్రాలూ ఉన్నాయి. ‘తొలి ఉషస్సు, చీకటి నవ శిశువు/పెంచి మళ్ళీ దానికివ్వడమే పగటి పని’ వంటి ఉపమానాలు ‘ఆహా’ అనిపిస్తాయి. ‘జడలో ముద్దబంతి/ వెనుక వైపు పూచిన/ ఆమె మరో ముఖం’ వంటి చిట్టి కవితా విన్యాసాలు ఆహ్లాదపరుస్తాయి. అటు ఆగ్రహం, ఇటు ఆహ్లాదం ఆ రెండింటితోపాటూ ‘వేల్లాడే గూడులో నీళ్ళాడే పక్షి/ స్థిరనివాసం కోరుకోదు’ వంటి తాత్వికతా పిల్లగాలిలా పలకరిస్తుంది. - అంకిత

అలలు (కవి తలపోతలు)
రచన: నిజం
పేజీలు: 192; వెల: రూ. 125/-
ప్రతులకు: ఫోన్‌- 9848351806


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు