close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పూరీ పోయె... ఆలూ వచ్చె!

చిన్న చిన్న పూరీలను చేసి, అందులో చింతపండు నీళ్లూ, చాట్‌ వేసి అమ్మే పానీ పూరీని తలుచుకుంటేనే పిల్లలూ పెద్దలక్కూడా నోటిలో నీళ్లూరిపోతాయి. అందుకే, ప్రాంతాలతో సంబంధం లేకుండా గప్‌చుప్‌, గోల్‌గప్పా, పుచ్కా, పానీపూరీ... లాంటి రకరకాల పేర్లతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఈ స్ట్రీట్‌ ఫుడ్‌. ఈమధ్య దీన్లో ఓ కొత్త ట్రెండ్‌ పుట్టుకొచ్చింది. అదే ఆలూ గప్పా. అంటే పూరీకి బదులు బంగాళాదుంపని ఉడికించి, దానిమధ్యలో గుజ్జు తీసి అందులో చాట్‌ని వేస్తారన్నమాట. కోల్‌కతాలో మొదలైన ఈ ట్రెండ్‌ అలా అలా మిగిలిన చోట్లకూ పాకేస్తోంది.


కలుపు మొక్కలకు ఇక మంటే!

కొన్ని రకాల రసాయనాలు వాడకపోతే కలుపు మొక్కలు పోవు. వాడితే భూమి కలుషితమై ఆ రసాయనాలు గాల్లోకీ పంట మొక్కల ద్వారా మనం తినే ఆహారంలోకి కూడా చేరతాయి. దీనికి పరిష్కారంగానే ఈమధ్య ‘ఫ్లేమ్‌ వీడింగ్‌’ పద్ధతి ప్రాచుర్యంలోకొస్తోంది. దీన్లో భాగంగా మంటను ఎగజిమ్మే ప్రోపేన్‌ ట్యాంకులు ఉండే మెషీన్లను ట్రాక్టర్లకు అమర్చుతారు. పంట వేసేముందు పొలంలో ఈ ట్రాక్టర్లతో వెళ్తే ఎగసిపడే ఆ మంటలు కలుపు మొక్కల్ని మాడిపోయేలా చేస్తాయి. తర్వాత అవి మట్టిలో కలిసిపోయి ఎరువుగానూ ఉపయోగపడతాయి. పెరట్లోని కలుపు మొక్కల్ని చంపేందుకు చేత్తో పట్టుకుని మండించే ‘ఫ్లేమ్‌ వీడర్‌’లను కూడా తయారుచేస్తున్నారు.


సెలవుకోసం నాలుగుసార్లు పెళ్లి!

‘పెళ్లిక్కూడా పట్టుమని పదిహేను రోజులు సెలవు ఇవ్వడం లేదురా... ఆఫీసులో’ అంటూ బాధపడేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ ‘తప్పనప్పుడు ఏం చేస్తాం’ అని సరిపెట్టుకుపోతారు. తైవాన్‌కి చెందిన ఆ వ్యక్తి మాత్రం అలా అనుకోలేదు. తైపీలోని ఓ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేసే అతడి పెళ్లికి బ్యాంకు వాళ్లు కేవలం ఎనిమిది రోజులే వేతనంతో కూడిన సెలవు ఇవ్వడానికి ఒప్పుకున్నారట. అంతకు మించి ఇవ్వడానికి ససేమిరా అన్నారట. దాంతో ఆ వ్యక్తి మొదట పెట్టిన సెలవు గడువు ముగిసేలోపు భార్యకు విడాకులిచ్చి మరుసటి రోజు ఆమెనే పెళ్లి చేసుకుని మళ్లీ సెలవుకి ధరఖాస్తు చేసుకున్నాడు. అలా ఒకసారీ, రెండుసార్లూ కాదు, 32 రోజుల సెలవు కోసం 37 రోజుల్లో ఏకంగా మూడుసార్లు విడాకులు ఇచ్చి నాలుగుసార్లు ఆమెనే మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. చివరిసారి విషయం బ్యాంకు వాళ్లకి తెలియడంతో ‘సెలవు ఇవ్వడం’ కుదరదన్నారట. కానీ మనవాడు ఊరుకోలేదు. స్థానిక కార్మిక చట్టం ప్రకారం ఉద్యోగి పెళ్లికి 32 రోజుల వేతన సెలవుల్ని ఇవ్వాల్సి ఉండగా, తను పనిచేసే కంపెనీ దాన్ని పాటించడంలేదంటూ కోర్టుకెక్కాడు. దాంతో కోర్టు ఆ బ్యాంకు వారిని మందలించడంతో పాటు జరిమానా కూడా విధించింది.


ఆ లుంగీ... లక్ష రూపాయలట..!

మామూలుగా లుంగీల ధర అయిదువందల రూపాయల్లోపే ఉంటుంది. కానీ హైదరాబాద్‌లోని బార్కాస్‌ గ్రౌండ్‌కి దగ్గర్లోని మార్కెట్‌కి వెళ్తే మాత్రం అరలక్ష, లక్ష పలికే లుంగీలను కూడా చూపిస్తారు. వీటిలో ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకునే జవేరా దునియా, జవేరా బార్కాస్‌, టిబా, అట్లాస్‌... ఇలా రకరకాలు ఉంటాయి. ఒకప్పుడు హైదరాబాద్‌ని పాలించిన నిజాంలు అరబ్బు దేశాల నుంచీ సైనికుల్ని తీసుకొచ్చి తమ సేనలో చేర్చుకున్నారు. అప్పట్లో ఆ అరబ్‌, యెమెన్‌ మిలటరీ స్థావరాల బారక్‌లు చార్మినార్‌కు దక్షిణం వైపు ఉండేవట. అదే తర్వాత బార్కాస్‌గా మారింది. నిజాంల పాలన ముగిసినా అరబ్బులు ఇక్కడే స్థిరపడిపోయారు. కానీ వారి సంప్రదాయాలను మాత్రం వదల్లేదు. అందులో భాగమే అరబ్బులు ప్రత్యేకంగా ధరించే ఈ లుంగీలు. ప్రాచీన సంప్రదాయ మగ్గాల మీద ఇరవై అంచెలుగా నేసే బార్కాస్‌ లుంగీలు ఎంత మెత్తగా పలుచగా ఉంటాయంటే వీటిని చేతి ఉంగరం నుంచి ఒక మడతగా బయటకు లాగేయవచ్చని పేరుంది. డిజైన్లు కూడా మన దగ్గర దొరికే వాటికి భిన్నం. వీటిలో రూ.1500 నుంచి ఎనిమిది వేల వరకూ ఉండే లుంగీలు ఎక్కువ అమ్ముడుపోతాయి. ఇంకా ఖరీదైన వాటికి మాత్రం రంజాన్‌ సీజనులోనే బాగా గిరాకీ. పండుగ సమయంలో కుటుంబసభ్యులకూ బంధువులకూ కానుకలుగా ఇచ్చేందుకు వీటిని కొంటుంటారట.

- కుంభోజు రమేశ్‌, న్యూస్‌టుడే, చార్మినార్‌
Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు