close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మచ్చ

- అప్పరాజు నాగజ్యోతి

పనంతా అయ్యాక పడగ్గదిలో నడుంవాల్చిన ప్రియకి మూగన్నుగా నిద్రపడుతుండగానే, హాల్లోనుండి పెద్దగా అరుపులూ, కేకలూ వినిపించడంతో కంగారుగా లేచి హాల్లోకి వెళ్లింది.
ఆవేశంతో రొప్పుతున్న భర్తా, తలొంచుకుని నిలబడ్డ కొడుకూ... అదీ అక్కడ ఆమెకి కనిపించిన దృశం!
ఎర్రగా కందిపోయిన కొడుకు చెంపలని చూసి విస్తుపోతూ ‘‘ఏమిటి హర్షా, ఎన్నడూ లేనిది పిల్లాడిపై చేయి చేసుకున్నారు? అసలేమైంది...’’ అని ఆమె అంటుండగానే ‘‘ఏం జరిగిందో నీ సుపుత్రుడినే అడుగు’’ అనేసి విసురుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు భర్త.
ప్రశ్నార్థకంగా కొడుకువైపు చూస్తే, కోపంలో తనూ తండ్రికి తీసిపోడన్నట్లుగా రోషంగా గదిలోకి వెళ్లిపోయి, ధడాల్న తలుపులు మూసుకున్నాడు భవిత్‌.
ఏం చేయాలో పాలుపోక, అక్కడే హాల్లోని సోఫాలో కూర్చుండిపోయిన ప్రియ కొద్దిసేపటి తర్వాత లేచి వంటింట్లోకి వెళ్లి భర్తకిష్టమైన అల్లం టీ తయారుచేసి తీసుకుని పడగ్గదిలోకి వెళ్లింది.
మంచంమీద వెల్లకిలా పడుకుని కణతలు రుద్దుకుంటూ, తీవ్రమైన ఆలోచనలో ఉన్న హర్ష, భార్య అడుగుల శబ్దానికి తలెత్తాడు. ‘‘ఇప్పుడు నన్నేమీ అడగొద్దు, ప్రియా, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్‌ ప్లీజ్‌!’’
భర్త మాటలకి మౌనంగా టీ కప్పుని టేబుల్‌పైన పెట్టి, చల్లారకుండా కప్పుపైన మూతని పెట్టి, తలుపులని దగ్గరగా వేసేసి తిరిగి వంటింట్లోకి వెళ్లి, పెద్దగ్లాసుడు పాలలో బూస్ట్‌ని కలిపి గ్లాసు తీసుకుని కొడుకు గదిలోకి వెళ్లింది ప్రియ.
గదిలోకి అడుగుపెడుతున్న తల్లిని చూస్తూనే ‘‘నాకేం వద్దుపో’’ అంటూ ఆమెపై అంతెత్తున ఎగిరాడు భవిత్‌.
కొడుకు కోపం తాటాకు మంటలాంటిదని తెలుసు కాబట్టి వెళ్లిపోకుండా, అక్కడే మంచానికి రెండోచివర మౌనంగా కూర్చుంది. కొద్దిక్షణాల తర్వాత మెల్లిగా వచ్చి, తన ఒళ్లో తల పెట్టుకున్న కొడుకు తలపై ఆప్యాయంగా చేయి వేసింది.
‘‘అసలేం జరిగింది నాన్నా?’’
‘‘అమ్మా, నా స్నేహితులందరిముందూ నా చెంపలు రెండూ వాయించి, నా షర్టుకాలర్‌ పట్టుకుని ఈడ్చుకొచ్చి కారులో పడేశారమ్మా నాన్న. నాకెంత అవమానంగా ఉందో తెలుసా! రేపటినుండి నేనే మొహం పెట్టుకుని కాలేజీకి వెళ్లాలి? నువ్వే చెప్పమ్మా’’ చిన్నపిల్లాడిలా వెక్కిళ్లు పెట్టాడు భవిత్‌.
కొడుకు మాటలకి నివ్వెరపోయింది ప్రియ. ఎందుకంటే, భర్త స్వతహాగా సౌమ్యుడు, అతనికి అంత త్వరగా కోపం రాదు.
‘‘నాన్నకి అంత కోపం తెచ్చే పని నువ్వేం చేశావో ముందది చెప్పు.’’
తల్లి మాటలకి ఒక్కక్షణం తడబడ్డాడు భవిత్‌.
‘‘నేనేం చేయలేదమ్మా! చాలా చిన్న విషయానికి నాన్నకి పిచ్చికోపమొచ్చేసింది.’’
‘‘ముందర విషయం చెప్పు. అది చిన్నదో, పెద్దదో తర్వాత తెలుస్తుంది’’ కాస్త కరుగ్గా అంది ప్రియ.
‘‘రోజూలాగే ఈ వేళా, మా కాలేజ్‌ దగ్గర నన్ను దింపేసి వెళ్లిపోయారు నాన్న. అది చూసి అప్పుడే బైకులపై వచ్చిన మా క్లాస్‌మేట్స్‌ రోహన్‌, వాడి స్నేహితులూ ‘భవిత్‌ ఈజ్‌ స్టిల్‌ ఎ స్కూల్‌ బాయ్‌’ అంటూ నన్ను హేళన చేశారు. వాళ్ల మాటలకి నాకు బాగా కోపమొచ్చింది. ‘నేనేం పిల్లాణ్ణి కాదు, పెద్దవాడినే’ అంటూ వాళ్లతో దెబ్బలాటకి దిగాను. ‘ఓహో, అలాగైతే బైకుమీద క్లాక్‌టవర్‌ దాకా నాకంటే వేగంగా వెళ్లు, అప్పుడు ఒప్పుకుంటాం’ అంటూ నాతో పందెం కట్టాడమ్మా రోహన్‌. దాంతో నాకు పౌరుషమొచ్చి వెంటనే నా ఫ్రెండ్‌ సిద్దూగాడి బైకుని తీసుకుని, నూట ఇరవై స్పీడ్‌లో వెళ్లి రోహన్‌ కంటే రెండు నిమిషాల ముందే క్లాక్‌టవర్‌ చేరుకున్నాను. అదే సమయానికి ఏదో పనిపైన అక్కడికి వచ్చిన నాన్న నన్ను చూశారు. నేనేదో తప్పు చేసినట్టుగా అక్కడే నా స్నేహితులందరి ముందూ నాపైన చేయి చేసుకున్నారమ్మా నాన్న. ఆయనలా చేయడం ఏమైనా బావుందా? నువ్వే చెప్పు’’ కొడుకు చెప్పింది వింటూనే ఆవేశం పట్టలేకపోయిన ప్రియ వెంటనే అతని రెండు చెంపలూ వాయించింది.
బిత్తరపోయాడు భవిత్‌!
ఆ తర్వాత విసురుగా మంచం పైనుండి లేచి ‘‘ఎదిగిన కొడుకుపైన చేయి చేసుకోకూడదన్న జ్ఞానం నాన్నకే కాదు, నీకూ లేదన్నమాట. నా ఫీలింగ్స్‌కి విలువ లేని ఈ ఇంట్లో ఇంక ఒక్కక్షణం కూడా ఉండను’’ అంటూ గట్టిగా అరిచేసి పెద్ద పెద్ద అంగలతో పరిగెత్తుతున్నట్టే బైటకి నడిచాడు.
తను పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతున్న కొడుకుని చూసి, కోపంలో వాడేమైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనన్న భయంతో ‘హర్షా, ఇలా రండి’ అంటూ పెద్దగా కేకేసింది ప్రియ.
హాల్లోకి వచ్చిన హర్ష, విషయం వినగానే గబగబా బైక్‌ తీసుకుని వెతుక్కుంటూ వెళ్లాడు.
తండ్రీకొడుకుల కోసం ఎదురుచూస్తూ పోర్టికోలోనే పచార్లు చేస్తున్న ప్రియ మనసులో ఒకటే కలవరపడుతోంది.
కొద్దిసేపటి తర్వాత భర్త ఒక్కడే ఇంటికి తిరిగి రావడంతో ఆమె ఆందోళన మరింత అధికమయ్యింది.
‘‘చుట్టుపక్కల ఎక్కడా వాడు కనిపించలేదు ప్రియా. వాడి స్నేహితులందరికీ ఫోన్‌ చేశాను. వాళ్లెవరి ఇళ్లకీ రాలేదన్నారు’’ భర్త మాటలకి సోఫాలోనే కూలబడిపోయి ఏడవడం మొదలెట్టేసింది ప్రియ.
‘‘ఊరుకో ప్రియా, కోపం తగ్గగానే వాడే ఇంటికొచ్చేస్తాడు’’ అంటూ భార్యకి ధైర్యం చెప్పాడు హర్ష.
కానీ అతననుకున్నట్టుగా ఇంటికి తిరిగి రాలేదు భవిత్‌.
కొడుకుమీద బెంగతో ఆ తల్లిదండ్రులకి ఆ రాత్రి నిద్ర కరువైంది. ఏ కొద్దిక్షణాలో కునుకు తీసినా, ఆ కలతనిద్రలో అన్నీ పీడకలలే!

* * *

ఎన్నడూ లేనిది అర్థరాత్రిదాటాక ఒంటరిగా వచ్చి తన ఇంటితలుపులు కొట్టిన మనవడిని చూస్తూనే ఏదో జరిగిందని అర్థం చేసుకుంది భవిత్‌ అమ్మమ్మ.
మనవడిని మాటల్లో పెట్టి మెల్లిగా విషయం తెలుసుకున్నాక ‘‘చిన్నా, నీ మూడ్‌ బాగయేందుకు నేనొక చక్కటి కథ చెబుతాను వింటావా?’’ అనడిగింది.
చెప్పమన్నట్టుగా తలూపాడు భవిత్‌.
సందర్భోచితంగా అప్పటికప్పుడు మంచి కథలని అల్లటం ఆవిడకి వెన్నతోపెట్టిన విద్య. అందుకే ఆవిడ చెప్పే కథలంటే చిన్నా పెద్దా అంతా చెవి కోసుకుంటారు.
‘‘అప్పట్లో ఓ మారు ఏం జరిగిందంటే...’’ అంటూ మొదలెట్టింది ఆ పెద్దావిడ.

* * *

సిటీ శివార్లలోని రిసార్ట్‌లో కొత్తసంవత్సరం పార్టీ జరుగుతోంది.
బిజినెస్‌ టైకూన్‌లైన మధుకర్‌, ఈశ్వర్‌లు బార్‌కౌంటర్‌ వద్ద విస్కీ తాగుతుంటే, వారి భార్యలైన జయంతీ, మంజులలు మూలనున్న ఒక టేబుల్‌ వద్ద కూర్చుని భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నారు.
ఒంటికి బాగా నప్పే ఆధునికమైన డ్రెస్సు వేసుకుని, చలాకీగా తిరుగుతున్న సుమని చూసి ‘‘జయంతీ, సుమ బుట్టబొమ్మలా భలే ముద్దొస్తోంది, నా దిష్టే తగిలేట్టుంది. పదహారేళ్లు నిండాయి కదూ తనకి! ఆడపిల్లలు ఇలా చూస్తుండగానే అలా పెద్దయి పోతారు’’ అంది మంజుల.
‘‘నిజమే మంజూ, కానీ ఈ టీనేజ్‌ ఉందే, చాలా ప్రమాదకారి. ఈ వయసు పిల్లలంతా కూడా వాళ్లు చెప్పిందే కరెక్ట్‌ అంటారు. మన అనుభవంతో మనం చేప్పేదేదీ వాళ్లు వినిపించుకోరు. సుమకి సినిమాల్లో నటించాలని ఒకటే ఆరాటం. ఎప్పుడూ అద్దం ముందే ఉంటుంది. లేదంటే నేను నిద్రపోతున్న సమయం చూసుకుని మెల్లిగా నా స్కూటీ తీసేసుకుని రోడ్డు మీదకి దూసుకుపోతుంది. పద్దెనిమిదేళ్లు నిండకుండా డ్రైవింగ్‌ చేయడం తప్పని నేనెంత చెప్పినా నామాట ఖాతరు చేయదు పైగా సినిమాల్లో చేరాలంటే అన్నీ వచ్చి ఉండాలంటూ నాకే ఎదురుక్లాసులు తీసుకుంటుంది’’ అంది జయంతి.
‘‘ఆడపిల్లలని కొంచెమన్నా అదుపులో పెట్టగలమేమోగానీ మగపిల్లలతో అస్సలు పడలేం జయంతీ. వాళ్లసలు ఇంట్లో ఉండేదే తక్కువ! మా వినీత్‌నే చూడు, పట్టుమని పదినిమిషాలైనా ఇంట్లో ఉండడు. ఎప్పుడూ ఫ్రెండ్స్‌, ఫుట్‌బాల్‌. వీటికి తోడు కార్లంటే పిచ్చి క్రేజ్‌ వాడికి! నేనొద్దన్నా ఈయన దగ్గరుండి మరీ వాడికి కారు డ్రైవింగ్‌ నేర్పించారు. పదిహేడేళ్లు నిండలేదు, అప్పుడే కారు తీసుకుని రోడ్డెక్కేస్తాడు. వాడు ఇంటికి క్షేమంగా తిరిగొచ్చేదాకా నా గుండె దడదడలాడుతూనే ఉంటుందంటే నమ్ము!’’

* * *

పక్కనే ఉన్న మరో టేబుల్‌ వద్ద డిన్నర్‌ చేస్తున్న వినీత్‌, సుమలు వాళ్ల వయసుకి తగ్గ కబుర్లు చెప్పుకుంటున్నారు.
‘‘వినీత్‌, పార్టీ బోర్‌గా ఉంది కదూ’’
‘‘యా సుమా. ఇట్స్‌ వెరీ బోరింగ్‌. నో డాన్స్‌, నో మ్యూజిక్‌, నో డీజే. ఛ, అందుకే ఈ ఓల్డ్‌ పీపుల్‌ పార్టీలకి నేనసలు రానన్నాను అమ్మ బలవంతపెడితే రావలసి వచ్చింది.’’
‘‘నేనూ డిటో! పోనీ సరదాగా, అలా బైటకి వెళ్దామా? మా డ్రైవర్‌ని పిలవనా?’’
‘‘డ్రైవర్‌ దేనికి? నాకు కారు నడపడం బాగా వచ్చు. నా స్నేహితులూ నేనూ ఎప్పుడు కారు పందెం వేసుకున్నా గెలుపు నాదే తెలుసా!’’ గర్వంగా కాలరెగరేస్తూ చెప్పాడు వినీత్‌.
‘‘నిజమా?’’ ఆశ్చర్యంతో సుమ కళ్లు పెద్దవయ్యాయి.
‘‘ఏం, నమ్మడం లేదా? అయితే పదా, నువ్వే స్వయంగా చూద్దువుగానీ, డాడీకి మస్కా కొట్టి కారు తాళాలు తెచ్చుకుందాం పద’’ అంటూ లేచిన వినీత్‌ వెనకే నడిచింది సుమ.

* * *

కావలసినవన్నీ ప్లేట్లలో ఒకేసారి వడ్డించేసుకుని వచ్చి భార్యల పక్కన కూర్చున్న మధుకర్‌ ఈశ్వర్‌లకి తమవైపే వస్తున్న వినీత్‌, సుమలు కనిపించారు.
‘‘మీ వినీత్‌ బాగా పొడవయ్యాడురా! అన్నట్లు వాడి ఫుట్‌బాల్‌ ప్రాక్టీసు ఎలా నడుస్తోంది?’’
‘‘ఫుట్‌బాల్‌ అంటే వాడికి ప్రాణం మధూ! రోజూ గ్రౌండ్‌కి వెళ్లి ప్రాక్టీసు చేస్తుంటాడు. వాడి కాలేజీ టీమ్‌కి వాడే కెప్టెన్‌’’ తనకంటే పొడవుగా ఎదిగిన కొడుకుని ముచ్చటగా చూసుకుంటూ గర్వంగా చెప్పాడు ఈశ్వర్‌.
వస్తూనే ‘‘హాయ్‌ అంకుల్‌’’ అంటూ ఈశ్వర్‌ని పలకరించింది సుమ.
‘‘హాయ్‌ బ్యూటీక్వీన్‌, అందాల పోటీకి ఇప్పటినుండే సిద్ధమవుతున్నట్టున్నావు?’’
‘‘ఎస్‌ అంకుల్‌, కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌వాళ్లు చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నా’’
‘‘ఆల్‌ ద బెస్ట్‌. అన్నట్టు ఏమిటీ ఇద్దరూ కూడబలుక్కునట్టు వచ్చారు. ఏదైనా గూడు పుఠాణీ చేస్తున్నారా?’’ అనడిగాడు ఈశ్వర్‌.
‘‘అదేం లేదు డాడీ. పార్టీ బోరింగ్‌గా ఉంది, మీ కారుతాళాలిస్తే అలా ఒక రౌండ్‌ కార్లో బయటకి వెళ్లి వస్తాం, ప్లీజ్‌’’ అంటూ రిక్వెస్ట్‌ చేశాడు వినీత్‌.
‘‘సరే, త్వరగా వచ్చేయాలి మరి. ఎక్కువ దూరం వెళ్లకండి’’ అంటూ ఈశ్వర్‌ తన జేబులో నుండి కారుతాళాలని తీసివ్వబోతుండగా ‘‘వద్దండీ, వాడింకా మైనర్‌, ఒంటరిగా కారు నడపడం అంత మంచిదికాదు, అందులోనూ చీకట్లో’’ అంటూ భర్తను వారించింది మంజుల.
అది వింటూనే ‘‘మమ్మీ, నేనేం చిన్న పిల్లాడ్ని కాను’’ అంటూ రోషంగా తలెగరేశాడు వినీత్‌.
‘‘మంజూ, నీవన్నీ అనవసరమైన భయాలే! వాడు నా కొడుకు, కారుని బ్రహ్మాండంగా నడుపుతాడు. నాదీ గ్యారెంటీ’’ భార్యకి హామీ ఇస్తూ కారుతాళాలని కొడుకు చేతికిచ్చాడు ఈశ్వర్‌.

* * *

ఇద్దరూ కారులో కూర్చున్నాక కారుని స్టార్ట్‌ చేసి ముందుకురికించాడు వినీత్‌. పంచకళ్యాణిలా వేగంగా వెళ్తోంది కారు.
‘‘వావ్‌ వినీత్‌, ఏమో అనుకున్నాగానీ సూపర్‌గా ఉంది నీ డ్రైవింగ్‌. ఈ వేసవి సెలవుల్లో నాకూ నేర్పించవూ ప్లీజ్‌’’
సుమ మాటలకి వినీత్‌ ఛాతీ పెద్దదైంది. కారు ఆక్సిలరేటర్‌ని మరింత బలంగా నొక్కాడు.
రెండు చిన్నరోడ్లని దాటిన తర్వాత మెయిన్‌ రోడ్డెక్కింది కారు. అక్కడా వేగాన్ని ఏమాత్రం తగ్గించకుండా పోనిస్తున్నాడు వినీత్‌. అంతలో, అకస్మాత్తుగా వీళ్ల కారుని దాటుకుంటూ వేగంగా వెళ్లిందొక ఎర్రరంగు లేటెస్ట్‌ మోడల్‌ కారు. ఆ కారులోని కుర్రాళ్లు వెనక్కి తిరిగిచూస్తూ బొటనవేలుని కిందకి పెట్టి వీళ్లని వెక్కిరించడంతో వినీత్‌ మొహం కందగడ్డలా అయింది.
‘‘వాళ్లు మా క్లాస్‌మేట్‌ రాహుల్‌, వాడి స్నేహితులు. కాలేజీక్కూడా వాడు కారులోనే వస్తాడు. వాడి బాబాయ్‌ లోకల్‌ ఎంఎల్‌ఏకి దగ్గరి బంధువులే. అందుకే వాడికి అంత ఫోజు! ఎలాగైనా సరే ఈవేళ వాళ్ల కారుని మనం ఓవర్‌టేక్‌ చేయాలి వినీత్‌. కారు స్పీడు పెంచు కమాన్‌’’ అంది సుమ వాళ్ల నవ్వులకి ఒళ్లుమండుతుండగా.
సుమ మాటలకి ఉత్సాహం తన్నుకురాగా, కారు వేగాన్ని అమాంతం వందకి పెంచి, నాలుగేనాలుగు నిమిషాల్లో రాహుల్‌ కారుని ఓవర్‌టేక్‌ చేశాడు వినీత్‌.
అది చూసి కుర్రాళ్లకి పౌరుషం పొడుచుకొచ్చేసింది. మరో మూడు నిమిషాల్లో వాళ్ల కారు వీళ్ల కారుని ఓవర్‌టేక్‌ చేసింది. అలా రెండుకార్లూ ఒకదానితో ఒకటి పోటీపడుతూ సిటీపరిధిలోకి వచ్చాయి.
అక్కడ ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడడంతో మొదట కారు ఆపాడు వినీత్‌. అయితే, రాహుల్‌ కారు మాత్రం సిగ్నల్‌ని ఖాతరు చేయకుండా ముందుకి వెళ్లిపోవడాన్ని చూసి పంతంగా తనూ కారుని ముందుకురికించాడు. రెండు కార్ల నంబర్లనీ నోట్‌ చేసుకున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌, వైర్లెస్‌లో మెసేజ్‌ని పంపి అందరినీ అప్రమత్తం చేశాడు. దాంతో తర్వాతి సిగ్నల్‌ వద్ద పోలీసులు కాపలాకాసి, చేతులని అడ్డంపెట్టినా లెక్కచేయకుండా రెండుకార్లూ ముందుకి దూసుకుపోవడంతో ఇద్దరు కానిస్టేబుల్స్‌ని వెంటబెట్టుకుని ఆ ఏరియా ఎస్‌ఐ వీళ్లకారు వెనకాలే జీపులో బయల్దేరాడు.
తమని వెంబడిస్తున్న పోలీసుజీపుని చూసి బెదిరిపోయిన వినీత్‌ కంగారులో స్టీరింగుని బలంగా కుడివైపుకి తిప్పడంతో అదే సమయానికి ఆవైపున వేగంగా వెళ్తున్న ఇసుకలారీని గుద్దుకుని, రోడ్డుకి పక్కనే పల్లంలోకి జారి పల్టీలు కొట్టి ఆగింది కారు.
వెనకాలే వస్తున్న పోలీసులు నుజ్జునుజ్జైన కారుని చూసి, వెంటనే అంబులెన్స్‌కి ఫోన్‌ చేశారు.
ఈలోగా డ్రైవింగ్‌సీట్‌లో ఉన్న వినీత్‌ జేబులని వెదికిన ఎస్‌ఐకి అతని సెల్‌ఫోన్‌ దొరకడంతో, అందులో ‘డాడీ’ అన్న పేరుతో ఉన్న నంబర్‌కి ఫోన్‌ చేశాడు.

* * *

ఫోన్‌లో విషయం వింటూనే హుటాహుటిన ప్రమాదం జరిగిన చోటుకి భార్యలతో సహా బయల్దేరారు ఈశ్వర్‌, మధుకర్‌లు. దారిపొడవునా కంటికీమింటికీ ఏకధారగా రోదిస్తూనే ఉన్నారు జయంతీ, మంజులలు.
‘‘వాడికసలు కారు డ్రైవింగే నేర్పించొద్దని నేను నెత్తీనోరూ మొత్తుకున్నా వినలేదు. ఈవేళ వాడిచేతికి కారుతాళాలివ్వద్దని వారించినా నా మాట వినలేదు మీరు. అంతా నా ఖర్మ’’ కొడుకునే తలచుకుంటూ కుమిలిపోతోంది మంజుల.
‘‘పోలీసులు చిన్న ప్రమాదమనే చెప్పారు. పిల్లలకి ఏమీ జరిగుండదులే మంజూ’’ అంటూ భార్యని ఓదార్చసాగాడు ఈశ్వర్‌. ప్రమాదం జరిగిన చోటుకి అంబులెన్స్‌ వచ్చిన సమయానికే వీళ్లంతా చేరుకున్నారు. అక్కడ రక్తం ఓడుతున్న దేహాలతో స్పృహలోలేని పిల్లలని చూసి తల్లులిద్దరూ కుప్పకూలి పోయారు. పిల్లల పరిస్థితి చూసి తండ్రులిë్ద]రి గుండెలూ బేజారైపోయాయి. అంబులెన్స్‌ వెనకే అంతా ఆస్పత్రికి బయల్దేరారు.

* * *

ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో సుమకీ, వినీత్‌కి ముందుగా ప్రథమచికిత్స చేసి ఆపైన ఆపరేషన్‌ థియేటర్‌ని సిద్ధం చేయసాగారు హాస్పిటల్‌ స్టాఫ్‌.
పిల్లలిద్దరికీ విపరీతమైన రక్తస్రావం జరగడంతో వీలైనన్ని బాటిల్స్‌ రక్తాన్ని సిద్ధం చేసుకోమని డాక్టర్లు చెప్పగా ఆ పనిమీద ఉన్నాడు మధుకర్‌. మైనర్‌ కుర్రాడి చేతికి కారుతాళాలిచ్చి రోడ్డుపైకి పంపినందుకుగానూ ఈశ్వర్‌పైన పోలీసులు కేసు పెట్టడంతో పోలీస్‌స్టేషన్‌ చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతున్నాడు ఈశ్వర్‌.
ఒంటినిండా కట్లతో ఆస్పత్రి బెడ్డుకి అతుక్కుపోయిన పిల్లలని చూస్తూ తల్లడిల్లిపోయారు జయంతీ, మంజులలు.
కారు స్టీరింగ్‌వీల్‌ ముందరున్న జాగాలో చిక్కుకుపోయిన వినీత్‌ కుడికాల్లో ఎముకలు బాగా చిట్లిపోయాయి. ఆ కాలు కోలుకునేందుకు ఎంతలేదన్నా ఏడాదిపైనే పడుతుందనీ, ముందు ముందు ఆ కాలితో ఫుట్‌బాల్‌, క్రికెట్‌ వంటి ఆటల జోలికెన్నడూ వెళ్లకూడదనీ డాక్టర్లు గట్టిగా చెప్పారు. దాంతో వినీత్‌ ఫుట్‌బాల్‌ భవిష్యత్తు శాశ్వతంగా మూసుకుపోయింది. కారు విండ్‌ షీల్డ్‌ విరిగి, ఆ గాజుముక్కలన్నీ సుమ ఒళ్లంతా గుచ్చుకోవడమే కాకుండా, ఆమె చేతివేళ్ల ఎముకలు కూడా విరిగాయి. డాక్టర్లు ఆపరేషన్లు చేసి అవన్నీ సరిచేశాక, ఆమె పూర్తిగా కోలుకునేందుకు చాలాకాలం పట్టింది. గాజుపెంకులు గుచ్చుకుని వికృతంగా మారిన తన మొహాన్ని అద్దంలో చూసుకోగానే పిచ్చిపట్టినదానిలా వెర్రికేకలు పెట్టిన సుమ చానాళ్లపాటూ తనలో తానే కుమిలిపోతూ, మెల్లిమెల్లిగా డిప్రెషన్‌లో కూరుకుపోయింది. అందాలరాణి కిరీటాన్ని గెలుచుకుని సినిమారంగాన్ని ఏలాలన్న కూతురి ఆశలన్నీ తన కళ్లముందే నీరుగారిపోవడం చూసి ఆ తల్లి కుంగిపోయింది. కాస్మొటిక్‌ సర్జరీలు చేసి సుమ ముఖానికి ఒక మోస్తరు ఆకారాన్ని తెచ్చేందుకు డాక్టర్లకి దాదాపు రెండేళ్లు పట్టింది. అయితే, ఎంత ప్రయత్నించినా నుదుటిపైన లోతుగా గుచ్చుకున్న గాజుపెంకు వలన ఏర్పడిన ఒక పెద్ద మచ్చని మాత్రం మాన్పలేకపోయారు డాక్టర్లు. బహుశా ఆ పిల్లలు చేసిన ఆ తప్పు తిరిగి మరెన్నడూ వారి జీవితాల్లో పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలనే, భగవంతుడు ఆ మచ్చని అలా సుమ నుదుటన ఉంచేశాడేమో మరి! శారీరకబాధలు ఒకవైపేతే, మరోవైపు ‘మైనర్‌పిల్లల చేతుల్లో కారు స్టీరింగ్‌ని పెట్టి వాళ్ల ఉజ్వల భవిష్యత్తుని కాలరాచిన కన్నతండ్రి’ అంటూ పత్రికల్లోనూ, టీవీఛానళ్ల లోనూ జరిగిన ఉదంతాన్నంతా కళ్లకి కట్టినట్టుగా పదేపదే చూపించడంతో వాళ్లు వీధిలో తలెత్తుకోలేకపోయారు. పరువు ప్రతిష్ఠలు పోయి నలుగురిలోనూ పలుచనయ్యారన్న బెంగతో మానసికంగా కృంగిపోయి, ఎరిగినవాళ్లకీ మొహం చూపించ లేక వ్యాపారాలన్నీ మూసేసి, ఆస్తులన్నీ అమ్మేసి వాళ్లంతా ఆ ఊరుని విడిచిపెట్టవలసి వచ్చింది. అలా ఆ ఒక్క సంఘటన ఇరు కుటుంబాలనీ అల్లకల్లోలానికి గురి చేసింది’’ అంటూ కథని ముగించిందావిడ.

* * *

అమ్మమ్మ చెప్పిన కథని విన్నాక చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు భవిత్‌.
ఎప్పట్లాగా ఈ కథ అమ్మమ్మ ఊహల్లోంచి వచ్చింది కాదనీ, తన తల్లిదండ్రుల జీవితాల్లో జరిగిన వాస్తవమనీ అతనికి అర్థమయింది. ఎందుకంటే, కథ చివర్లో అమ్మమ్మ వర్ణించిన ఆ మచ్చని తల్లి నుదుట అతను రోజూ చూస్తూనే ఉన్నాడు. తల్లి అందాన్నంతా కప్పేసేలా ఉండే ఆ మచ్చని గురించి భవిత్‌ ఎన్ని మార్లడిగినా ప్రియ మొహం మ్లానం అయ్యేది.
మనవడి మనసులో అంతర్మథనం మొదలైందని అర్థమయ్యాక ‘‘భవిత్‌, ఇంతదాకా నేను చెప్పింది మీ అమ్మానాన్నల జీవితంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటనేనని నీకర్థమై ఉంటుంది. నీ వయసు ఈరోజుకి సరిగ్గా పదహారేళ్ల నాలుగు నెలలు, అవునా? పద్దెనిమిదేళ్లు నిండకుండా వాహనాలని నడపడం నేరమన్న చట్టాన్ని విస్మరించి, చదువుకున్న తల్లిదండ్రులే గొప్పకోసమో లేదా తోటివారితో పోటీ పెట్టుకునో పిల్లల చేతికి వాహనాల పగ్గాలనందిస్తే జరిగే అనర్థాలని మేము ప్రత్యక్షంగా చూశాం, అనుభవించాం. అదే పొరపాటుని నువ్వు పునరావృతం చేస్తుంటే మీ అమ్మానాన్నలు నిన్ను దండించకుండా శభాష్‌ అంటూ మెచ్చుకుని మేకతోలు కప్పాలా? నువ్వే చెప్పు’’ అంటూ మనవడిని నిలదీసింది జయంతి.
అపరాధభావంతో తలదించుకున్నాడు భవిత్‌.

‘‘జీవితాలను అతలాకుతలం చేసేందుకు ఒక్క చిన్నపొరపాటు చాలని అర్థమయింది కదా! కాబట్టి ఇకనైనా ఇటువంటి తప్పిదాలు చేయకు. పద, నిన్ను మీ ఇంట్లో దిగబెడతాను. ఇప్పటికే మీ అమ్మానాన్నలు కంగారుపడు తుంటారు’’ అని జయంతి అంటుండగానే అప్పుడే అక్కడికి వచ్చారు హర్షిత్‌ ప్రియలు.
వాళ్లని చూస్తూనే భయంతో అమ్మమ్మ వెనకాల చేరబోతున్న భవిత్‌ చేతిని గట్టిగా పట్టుకుని, మంచంపైన కూర్చోబెట్టి తనూ కొడుకు పక్కనే కూర్చున్నాడు హర్ష.
‘‘చూడరా, నీమీద బెంగతో మీ అమ్మ ఒక్క రాత్రికే ఎంతలా కుంగిపోయిందో! నువ్విక్కడికి వచ్చినట్టుగా మీ అమ్మమ్మ మాకు ఫోన్‌ చేసి చెప్పాకే మా మనసులు కుదుటపడ్డాయి. ఆగలేక వెంటనే బయల్దేరి వచ్చేశాం.’’
అప్పటికే తను చేసిన పనిలోని అనౌచిత్యాన్ని అర్థం చేసుకున్న భవిత్‌, తండ్రి మాటలకి సిగ్గుతో తలదించుకున్నాడు.
‘‘చూడు నాన్నా, ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులో చేస్తేనే అందం, ఆనందం! నీకు పద్దెనిమిదేళ్లు నిండాక నేనే బైక్‌ కొనిపెడతాను. దగ్గరుండి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇప్పిస్తాను సరేనా! అందాకా ఇలా బైకుల జోలికీ, కార్లజోలికీ వెళ్లనని నాకు మాటివ్వు’’ కొడుకు భుజంమీద చేయివేసి అనునయంగా చెప్పాడు హర్షిత్‌.
‘‘అలాగే నాన్నా, ఇంకెప్పుడూ అలా చెయ్యను’’ అంటూ వెంటనే తండ్రి చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాడు భవిత్‌. కొడుకు మాటలకి ఆ తల్లిదండ్రుల వదనాలు వికసించాయి, వాళ్ల మనసులు తేలికపడ్డాయి.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు