close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Special Cakes: బిర్యానీ, ఇడ్లీ, దోసె... అన్నీ కేకులే!

‘అబ్బ... బిర్యానీ, అందులో చికెన్‌ ముక్కలూ చూస్తుంటే ఎంత నోరూరిపోతుందో...’ అని కుర్రాళ్లంటే... ‘నా ఫేవరెట్‌ టిఫిన్‌ నూడుల్సే’ అంటారు చిన్నారులు. ‘ఆ అందులో ఏముందిరా... వేడి వేడి ఇడ్లీల్లో నెయ్యీ కొబ్బరి చట్నీ వేసుకుని తింటుంటే... నోట్లో ఇట్టే కరిగిపోదూ’ అంటారు బామ్మలు. ఇలాంటి వారికోసమే ఇప్పుడు కేకులు కూడా బిర్యానీ, ఇడ్లీ, దోసె, కేఎఫ్‌సీ చికెన్‌... లాంటి రూపాల్లో వచ్చేస్తున్నాయి. అసలు విషయం చెప్పలేదు కదూ... ఇక్కడున్నవన్నీ అవే.

దైనా వేడుకను ఆనందంగా జరుపుకోవాలన్నా... సంతోషకరమైన సందర్భాన్ని పండుగలా సెలబ్రేట్‌ చేసుకోవాలన్నా కేకు ఉండాల్సిందే. కేరింతలు కొడుతూ దాన్ని కొయ్యాల్సిందే. మరి, ఆ వేడుకకు సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మన సంతోషానికి గుర్తుగా తెచ్చే ఆ కేకు కూడా ఆ స్థాయిలోనే అందరినీ ఆకట్టుకునేలా ఉంటే బాగుంటుంది కదా. బాగు అంటే అందంగా ఉండడం మాత్రమే కాదండోయ్‌... ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్లలో పెడితే దానికి అందరూ లైక్‌లూ కామెంట్లూ పెట్టేంత ప్రత్యేకంగా ఉండాలి. అలా చాలా కొత్తగా క్రేజీగా మన అభిరుచి కూడా కలిసేలా రూపొందిస్తున్నవే ఈ బిర్యానీ, థాలీ, బ్రేక్‌ఫాస్ట్‌, స్నాక్స్‌ కేకులు.

ఎంత గొప్ప కళో..!
కొందరు బిర్యానీ అంటే ప్రాణం పెట్టేస్తారు. మరికొందరు వారానికోసారైనా కేఎఫ్‌సీ చికెన్‌ తినాల్సిందే అంటారు. ఇంకొందరు ఉదయం టిఫిన్‌ అంటే ప్రతిరోజూ దోసె ఉన్నా తినేంత ఇష్టం అంటారు. అలాగే స్వీట్లు, సమోసా... ఇలా ఒక్కొక్కరూ ఇష్టంగా తినే రుచులు కొన్ని ఉంటాయి.
అలాంటప్పుడు పుట్టినరోజు, పెళ్లిరోజు, లేదూ ఇంకేదైనా వేడుక చేస్తున్నప్పుడు వారికి నచ్చిన వంటకంలానే ఉండే కేకుని ఎదురుగా పెడితే ఎంత ఆశ్చర్యపోతారో, ఇంకెంత సంబరపడిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక, అచ్చం ఆయా వంటకాల్లా ఉన్న కేకుల్ని చూస్తే ‘ఇది కేకా..?’ అని అవాక్కవడం అతిథుల వంతు. అందుకే, ఈ తరహా బిర్యానీ, నూడుల్స్‌, ఇడ్లీ, దోసె కేకులు ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందాయి. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా నిపుణులైన బేకర్స్‌ ఈ తరహా కేకుల్ని తయారు చేస్తున్నారు. దీనికోసం ముందుగా కేకుని కావాల్సిన ఆకారంలో చేసి దానిమీద ఐసింగ్‌తోనే ఈ రూపాలన్నిటినీ వచ్చేలా చేస్తారు.
ఉదాహరణకు బిర్యానీ కేకునే తీసుకుంటే కేకు చుట్టూ పంచదార పేస్టుతో గిన్నె ఆకారం వచ్చేలా చేస్తారు. తర్వాత అది సహజమైన గిన్నెలా ఉండేలా తినే రంగులు అద్దుతారు. అలాగే పైనకనిపించే తెలుపు, పసుపు రంగుల్లోని బిర్యానీ మెతుకుల్నీ విడిగా చేస్తారు. చికెన్‌ లెగ్‌పీస్‌లనూ, జీడిపప్పూ ఉల్లిపాయలాంటి వాటినీ పంచదార పేస్టుతోనే చేసి, ఆపైన ఎడిబుల్‌ రంగులతో అవి సహజమైన వాటిలా కనిపించేలా రంగులద్దుతారు. మొత్తంగా చెప్పాలంటే ఇదంతా బేకర్స్‌ చేతులు చేసే అద్భుతమనే చెప్పాలి. ఎంతక్రేజీగా ఉన్నాయో కదూ..!


 

బొమ్మరిళ్లకూ... లైట్లు వచ్చేశాయ్‌..!

పిల్లలకు ఓ ఇంటి బొమ్మనూ కారు బొమ్మనూ కొనిచ్చినప్పటికన్నా తమ చేత్తో తామే బుల్లి ఇల్లు కట్టుకుంటే, కారు తయారుచేస్తే ఎక్కువగా సంతోషపడతారు. అందుకే వారికోసం అమ్మానాన్నలు రకరకాల బిల్డింగ్‌ బ్లాక్‌లు కొనిస్తుంటారు. కానీ ఆ బుడతలు అక్కడితో ఆగుతారా... ‘నాన్నా నా ఇంటికి కరెంటు లేదేంటీ...’ అని అడుగుతారు. అవునుమరి, పిల్లల ఇళ్లల్లో మాత్రం లైట్లు ఉండొద్దా... ఏంటీ..? ఆ సౌకర్యాన్ని కల్పించేందుకే ఇప్పుడు వేరు వేరు కంపెనీలు ‘లైట్‌ అప్‌ కిట్‌’లను అమ్ముతున్నాయి.
ఇంతకుముందు బిల్డింగ్‌ బ్లాక్‌లు అంటే... వాటితో ఏదో వచ్చిన బొమ్మ చేసుకునేలా ఉండేవి. కానీ తర్వాత్తర్వాత ఎన్నో కొత్త మోడళ్లు రావడం మొదలుపెట్టాయి. లెగో కంపెనీ ‘లెగో క్రియేటర్‌ ఎక్స్‌పర్ట్‌ సిరీస్‌’ పేరుతో రకరకాల ఇళ్లూ చారిత్రక భవనాలూ కాఫీ షాపులూ కార్లూ బస్సులూ బైక్‌లలాంటి వాహనాలను రూపొందించేలా లెగో బ్రిక్‌లను తయారుచేయడంతో, క్రమంగా ఇతర సంస్థలూ ఆ బాట పట్టాయి. అంటే జీపు బొమ్మ కావాలంటే ఆ సెట్‌ లెగోలను కొంటే వాటితో పిల్లలే స్వయంగా జీపుని తయారు చేసుకోవచ్చు. అలాగే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌, బస్సు, పెంకుటిల్లు... ఇలా దేన్నైనా వాళ్లే లెగో బ్రిక్‌లతో కట్టుకోవచ్చు. ఇవి చూడ్డానికి నిజమైన టాయ్‌ హౌస్‌లూ బొమ్మల్లానే ఉంటాయి. అంటే అటు పిల్లలు సృజనాత్మకతతో ఇల్లు కట్టడం నేర్చుకుంటారు, ఇటు వాటితో మామూలు బొమ్మల్లానే ఆడుకుంటారు. ఈ తరహా బిల్డింగ్‌ బ్లాక్‌లకు క్రేజ్‌ పెరగడంతో వీటిలో లైట్లు అమర్చేందుకే ప్రత్యేకంగా కొన్ని వ్యాపార సంస్థలు పుట్టుకొచ్చాయిప్పుడు. లైట్‌ మై బ్రిక్స్‌, బ్రిక్‌ లూట్‌, బ్రిక్స్‌మ్యాక్స్‌... లాంటి కంపెనీలు అలాంటివే.

చూడ్డానికీ బాగుంటాయి
కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా లెగో క్రియేటర్‌ ఎక్స్‌పర్ట్‌ సిరీస్‌లో ఉండే ప్రతి మోడల్‌ బిల్డింగ్‌కీ విడిగా లైట్‌ అప్‌ కిట్‌లను తయారుచేస్తాయి. అంటే మన దగ్గర ఓ ఇల్లు లెగో సెట్‌ ఉంటే దాని పేరు వాటి సైట్‌లలో టైప్‌ చేస్తే దానికి సరిగ్గా సరిపోయేలా లైట్‌ అప్‌ కిట్‌ దొరుకుతుంది. ఇంట్లో ఎక్కడ లైట్లు ఉంటే బాగుంటుందో ముందే చూసి, అక్కడ అమరే ఆకారాల్లో లైట్‌ బ్రిక్‌లను తయారుచేస్తారు కాబట్టి వీటిని పిల్లలైనా సులభంగా అమర్చేసుకోవచ్చు. మరికొన్ని కంపెనీలు ఏ బిల్డింగ్‌ బ్లాక్‌ సెట్‌లకైనా సరిపోయేలా లైట్‌ అప్‌ మోడళ్లను తయారుచేస్తున్నాయి. లైట్‌అప్‌ కిట్‌లలో సన్నటి వైర్లతో వచ్చే బ్రిక్‌ లైట్లను బిల్డింగ్‌ బ్లాక్స్‌ కట్టేటప్పుడే అందులో భాగంగా అమర్చేసుకోవచ్చు. కాబట్టి వీటి వైర్లు బయటకు కనిపించవు. వీటిని ఎలా అమర్చాలో వివరిస్తూ వీడియోలూ ఉంటాయి. ఇలా వైర్లు ప్లగ్‌లో గుచ్చేవి కాకుండా రీఛార్జబుల్‌ బ్యాటరీలు ఉండి, దేనికదే చిన్న చిన్న లైట్‌ బ్రిక్‌లలానూ వీధి లైట్లూ సిగ్నల్‌ లైట్ల ఆకారంలో విడిగా కూడా దొరుకుతాయి. వాటిని కావల్సిన బిల్డింగ్‌ సెట్‌కి అమర్చుకోవచ్చు. లైట్‌ అప్‌ కిట్‌లలో సౌండ్‌ సిస్టమ్‌ ఉండేవీ ఉంటాయి. అదండీ సంగతి... ఇలా లెగో ఇళ్లలో లైట్లు ఉంటే పిల్లలు మరింత సరదాగా ఆడుకుంటారు. పైగా రాత్రిపూట అవి ఇంటికి అలంకరణగా ఆకర్షణీయంగానూ కనిపిస్తాయి. బాగున్నాయి కదూ..!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు